విక్రమ్ మూవీ రివ్యూ: కమల్ హాసన్ యాక్షన్ సినిమా ఎలా ఉంది?

ఫొటో సోర్స్, facebook/LokeshKanagarajOff
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
కమల్ హాసన్ సినిమా అంటే కచ్చితంగా కొన్ని నమ్మకాలు పెట్టుకొని వెళ్లొచ్చు.
కమల్ లోని నటుడ్ని మరో కోణంలో చూసే అవకాశం దక్కుతుందన్న భరోసా ఉంటుంది. కొత్త తరహా కథేదో చెబుతాడన్న ధీమా కలుగుతుంది. సాంకేతికంగానూ.. కమల్ ఓ కొత్త సినిమా చూపించబోతున్నాడన్న ఆశ చిగురిస్తుంది. వీటిలో ఏదో ఓ అంశంలో కమల్ మెప్పిస్తాడు. సినిమా ఆర్థిక జయాపజయాలు పెద్దగా పట్టించుకోని హీరో... కమల్! తనకు ఓ కొత్త తరహా ప్రయత్నం అనిపిస్తే చాలు.. చేసేస్తాడు. అందుకే కమల్ నుంచి కొత్త కథల్ని, సినిమాల్నీ చూసే అవకాశం దక్కుతోంది.
కమల్ ఇప్పుడు మరో విభిన్న యత్నంతో వచ్చాడు.. అదే..`విక్రమ్`. `ఖైది`తో ఒక్కసారిగా అందరినీ షాక్‌కి గురి చేసిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి ఈ విక్రమ్ ఎలా ఉన్నాడు? కమల్ లోని కొత్త నటుడ్ని చూసే అవకాశం మళ్లీ దక్కిందా? ఖైదితో తనపై పెరిగిన అంచనాల భారాన్ని... లోకేష్ అందుకొన్నాడా?
హత్యలు... శోధన
గొలుసు హత్యల పరంపరతో ఈ సినిమా మొదలైంది. సిటీలో వరుసగా పోలీస్ అధికారులు హత్యకు గురవుతుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇదో తలనొప్పి వ్యవహారంలా మారుతుంది.
పోలీసుల్నే చంపేస్తున్నారన్న విషయం బయటకు తెలిస్తే... శాంతిభద్రతలకు మరింత విఘాతం. అందుకే... అండర్ కవర్ ఏజెంట్ అమర్ (ఫహద్ ఫాజిల్)ని రంగంలోకి దింపుతారు అధికారులు. అమర్ ఈ కేసుని పూర్తిగా స్టడీ చేస్తూ.. మూలాల్లోకి వెళ్లిపోతాడు. ఆ క్రమంలో చనిపోయిన కణ్ణన్ (కమల్ హాసన్) గురించి ఆసక్తికరమైన విషయాలు వరుసగా తెలుస్తుంటాయి.
సంతానం (విజయ్ సేతుపతి) అనే డ్రగ్ మాఫియా డాన్‌కీ, ఈ వరుస హత్యలకూ ఏదో ఓ సంబంధం ఉందన్న విషయం అర్థమవుతుంది. అంతేకాదు... విక్రమ్ అనే కొత్త పేరు కూడా బయటకు వస్తుంది. ఇంతకీ విక్రమ్ ఎవరు? ఈ హత్యలకూ విక్రమ్‌కూ ఏమైనా సంబంధం ఉందా? అనేది మిగిలిన కథ.

ఫొటో సోర్స్, facebook/LokeshKanagarajOff
రెండు వేల కోట్ల డ్రగ్స్...దాన్ని అందుకోవడానికి ప్రయత్నించే ఓ ముఠా, పోలీసులు, దాందా.. మర్డర్లూ.. ఇలా పూర్తిగా క్రైమ్ జోనర్‌లో సాగే కథ ఇది. ఓ సీరియస్ నోట్ తోనే, ఆసక్తికరంగా కథ మొదలవుతుంది.
సినిమా మొదలైన తొలి పది నిమిషాల్లోనే కణ్ణన్ (కమల్) చనిపోతాడు. హీరో క్యారెక్టర్ ని ముందే చంపేసి, ఆ తరవాత కథ మొదలెట్టడం.. కొత్త తరహా ఆలోచన. కణ్ణన్ గురించి తెలుసుకోవడానికి అమర్ చేసే ప్రయత్నాలు, కణ్ణన్ గురించి ఒక్కో విషయం రివీల్ అవ్వడం.. ఇవన్నీ బాగా కుదిరాయి.
మెల్లగా సంతానం (విజయ్ సేతుపతి) పాత్ర ఎంటర్ అవుతుంది. ముగ్గురు హేమా హేమీల్ని తెరపై చూడడం ప్రేక్షకులకు పండగలాంటి సీన్. అయితే.... తొలి సగంలో.. కమల్ పెద్దగా కనిపించడు. కథని నడిపించే బాధ్యత పూర్తిగా ఫాజిలే తీసుకొంటాడు.
విశ్రాంతి ఘట్టానికి ఓ ఊపు వస్తుంది. విక్రమ్ క్యారెక్టర్ రివీల్ అవ్వడం... మంచి మాస్ ఎలిమెంట్. దానికి ముందు తీర్చిదిద్దిన పోరాట ఘట్టం, ఛేజింగ్ రసవత్తరంగా సాగాయి. మధ్యలో ఫాజిల్ కథ ఒకటి సమాంతరంగా సాగుతుంటుంది. తనకో ప్రేమ కథ ఉంది. దాన్ని చాలా డీసెంట్ గా ప్రజెంట్ చేశారు.
ద్వితీయార్థం.. కుదుపుల మయం
సెకండాఫ్‌లో ఎత్తులూ, పల్లాలూ ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు చప్పగా సాగితే, ఇంకొన్ని మాస్ ని ఉర్రూతలూగిస్తాయి. ఖైదీ రిఫరెన్సులు ఈ సినిమాలో ఎక్కువగా కనిపించాయి. బహుశా.. ఆ సినిమా క్రేజ్ ని ఇందులోనూ వాడుకోవాలని లోకేష్ భావించి ఉండొచ్చు. అది మంచి స్ట్రాటజీనే. కానీ.. కొన్నిసార్లు అనవసరంగా ఖైదీని గుర్తు చేశారనిపిస్తుంది.
మిషన్ గన్ తో.. హీరో దడ దడలాడించడం, బిరియానీ వంటకం, ఖైదీలోని.. లారీని చూపించడం, ఖైదీలోని ఓ కీలకమైన సీన్ చూపిస్తూ.. `ఢిల్లీ` (ఖైదీలో హీరో పేరు)ని గుర్తు చేయడం... ఇవన్నీ.. రిఫరెన్సులే. కొన్ని చోట్ల పేలాయి. ఇంకొన్ని చోట్ల... అసలు ఖైదీ రిఫరెన్స్ అనేదే తెలియకుండా పాసైపోయాయి.
ఏజెంట్.. టీనా ఎపిసోడ్ మాత్రం ఎవ్వరూ ఊహించనిది. ధియేటర్లో... మంచి ఊపు తీసుకొచ్చే సీన్ అది. ఇలాంటి ట్విస్టులు ఇంకొన్ని ఉన్నా.. టీనా ఎపిసోడే హైలెట్ అయ్యింది. ఫస్టాఫ్ లో యాక్టివ్ గా కనిపించిన ఫాజల్ పాత్రని.. సెకండాఫ్‌లో స్థబ్దుగా మార్చేశారు. క్లైమాక్స్ లో అయినా ఆ పాత్ర యాక్టివ్ అయితే బాగుండేది. కానీ.. కమల్ ని ఎలివేట్ చేయడానికి అన్నట్టు ఫాజల్ సైలెంట్ అయిపోయాడు.
సంతానం పాత్రలో ముందున్న ఫోర్సు తరవాత కనిపించలేదు. పతాక సన్నివేశాల్లో తను కూడా రెగ్యులర్ విలన్ అయిపోయాడు. చివర్లో సూర్య వచ్చి మెరిసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
మహిళా పాత్రలు ఈ సినిమాలో రెండు మాత్రమే కనిపిస్తాయి. టీనా పాత్ర గుర్తుండిపోతుంది. ఫహద్ ప్రేయసి కథ... హృదయానికి హత్తుకుంటుంది. `నువ్వేం చేస్తావ్ అని అడిగిన రోజున.. నీ జీవితంలో నేను ఉండను` అని ఆ పాత్రతో చెప్పించడం, ఆ పాత్రని అలానే ముగించడం ఆకట్టుకుంటాయి.

ఫొటో సోర్స్, facebook/LokeshKanagarajOff
ముగ్గురూ ముగ్గురే..
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్.. ముగ్గురూ మేటి నటులే. వాళ్లని ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం చాలా తక్కువ సార్లు వచ్చింది. కానీ ఎవరి స్థాయిలో వాళ్లు అద్భుతంగా రాణించారు.
కమల్ ఫస్టాఫ్ లో కనిపించలేదన్న లోటు... సెకండాఫ్ లో తీర్చేశాడు. ఈ వయసులోనూ యాక్షన్ సన్నివేశాల్లో తను కనబరిచిన ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేం.
ఫహద్ సిన్సియర్ ఆఫీసరుగా మెప్పించాడు. ఫస్టాఫ్ లో తనే హీరో.
సంతానం పాత్రలో విజయ్ తొలి సన్నివేశాల్లో విజృంభించాడు. కానీ ఆ తరవాత.. రొటీన్ విలన్ గా మారిపోయాడు.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా అనిరుథ్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాయాజాలం చేశాడు.
యాక్షన్ ఎపిసోడ్లకు భారీగా ఖర్చు పెట్టారు. ద్వితీయార్థం మొత్తం యాక్షన్ ఎపిసోడ్ల హవానే.
లోకేష్ కనగరాజ్ ప్రతిభ ఖైదీతో తెలిసిపోయింది. తన మార్క్ అక్కడక్కడా కనిపించింది. అయితే అది సరిపోలేదు. ఇంకా ఏదో కావాలన్న అసంతృప్తి ఈ సినిమా చూసిన ప్రేక్షకుడికి కలుగుతుంది. ముగ్గురు మేటి నటులు, లొకేష్ లాంటి దర్శకుడు కలిస్తే... ఖైదీ లాంటి అద్భుతాన్ని ఆశిస్తారంతా. కానీ.. ఈసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వలేదు. అక్కడక్కడా కొన్ని మాస్ ఎలివేషన్లు, ట్విస్టులు మినహాయిస్తే... విక్రమ్ లో వింతలూ విడ్డూరాలూ ఏం కనిపించవు. కమల్ హాసన్ ఫ్యాన్స్ అయితే.. ఓసారి నిరభ్యంతరంగా చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర కొరియాలో కోవిడ్ మిస్టరీ, అసలు ఏం జరుగుతోంది
- టర్కీ దేశం పేరును ‘తుర్కియా’గా ఎందుకు మార్చారు?
- టీటీడీ: తిరుమలలో పూర్తిస్థాయి ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి.. భక్తులు, వ్యాపారులు ఏమంటున్నారు?
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. లోక్‌సభలో బిల్లు పెట్టిన రోజు ఏం జరిగింది? ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పాత్ర ఏంటి?
- కాలి బొటనవేలు రూ. 30 లక్షలు - జింబాబ్వే పేదలు వేళ్లను అమ్ముకుంటున్నారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














