North Korea: ఉత్తర కొరియాలో కోవిడ్ మిస్టరీ - మందులు లేవు, మరణాలూ లేవు.. కిమ్ ప్రభుత్వం చెబుతున్నది నిజమేనా

ఫొటో సోర్స్, Korean Central Television
- రచయిత, జీన్ మెకెంజీ, హోసు లీ, రియాలిటీ చెక్ టీం
- హోదా, బీబీసీ న్యూస్
తమ దేశంలో కరోనావైరస్ తొలి కేసు నమోదైందని ఉత్తర కొరియా ప్రకటించి మూడు వారాలైంది. అప్పటినుంచీ వైరస్ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
అయితే, చాలా విషయాలు నేటికీ అంతుచిక్కడం లేదు. ఉత్తరకొరియాలో ఏం జరుగుతోందో బయట ప్రపంచానికి తెలియడం లేదు.
ఉత్తర కొరియాలో నివసిస్తున్న కొందరితో మాట్లాడిన వారి నుంచి బీబీసీ వివరాలు సేకరించింది. అందుబాటులోనున్న సమాచారాన్ని కూడా పరిశీలించింది.
ఏం జరుగుతోంది?
కిమ్ హ్వాంగ్ సన్ ఫోన్ మోగినప్పుడు సియోల్‌లోని తన ఇంటి వంటగదిలో ఉన్నారాయన. చైనాకు చెందిన ఓ మధ్యవర్తి సాయంతో తన కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడగలిగారు.
ఉత్తర కొరియా నుంచి హ్వాంగ్ సన్ బయటపడి ఇప్పటికి పదేళ్లు గడుస్తోంది. కానీ, ఆయన ఇద్దరు పిల్లలు, మనవళ్లు, 85ఏళ్ల ఆయన తల్లి ఇంకా అక్కడే ఉంటున్నారు. వారు అక్కడి నుంచి బయటపడతారని ఆయనకు ఎలాంటి ఆశా లేదు.
ఇలా రహస్యంగా ఫోన్లలోనే ఆయన వారితో మాట్లాడుతున్నారు. ఫోన్లలో ఆయన ఎక్కువ ప్రశ్నలు కూడా అడగరు. ఎందుకంటే ఎవరైనా వింటారనే భయం ఆయన్ను వెంటాడుతుంటుంది. ఎప్పుడూ చాలా మితంగానే ఆయన మాట్లాడతారు. ఫోన్ సంభాషణను ఐదు నిమిషాలకు మించకుండా ఆయన జాగ్రత్త పడుతుంటారు.

ఫొటో సోర్స్, KCTV
ఉత్తర కొరియా ప్రభుత్వం విడుదలచేసిన సమాచారం ప్రకారం.. వైరస్ ప్రతి ప్రావిన్స్‌లోనూ చాలా వేగంగా విస్తరిస్తోందని తెలుస్తోంది.
‘‘చాలా మందికి జ్వరం వచ్చిందని వారు నాకు చెప్పారు’’ అని హ్వాంగ్ సన్ చెప్పారు. ‘‘అక్కడ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నట్లు అనిపించింది. అందరూ జ్వరం తగ్గించే మందుల కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ, వారికి ఏమీ దొరకడం లేదు’’అని ఆయన వివరించారు.
ఎంత మంది మరణించారు? అనే ప్రశ్నను ఆయన ధైర్యం చేసి అడగలేకపోయారు. మరణాల గురించి అడిగారని ఎవరైనా వింటే దీన్ని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లుగా భావించే అవకాశముంది. ఫలితంగా ఆయన కుటుంబ సభ్యుల ప్రాణాలకే ముప్పు.
అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం.. 15 శాతం జనాభాకు జ్వరం లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ పరీక్షలు సరిగా నిర్వహించడం లేదు. దీంతో జ్వరం బట్టే కేసుల సంఖ్యను లెక్కించాల్సి ఉంటుంది.
దేశంలో ఔషధాల కొరత ఉందనే విషయాన్ని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా అంగీకరించారు. తమ దగ్గరున్న ఔషధాలను పంచిపెట్టాలని సైన్యానికి కూడా ఆయన సూచించారు.

ఫొటో సోర్స్, KCTV
ఎవరి దగ్గరా లేవు
ఉత్తర కొరియాలోని ఆసుపత్రులు, ఫార్మసీలలో ఏళ్ల నుంచి ఔషధాలు లేవని హ్వాంగ్ సన్ చెప్పారు.
అక్కడ వైద్యులు మందుల చీటీలు మాత్రమే రాస్తారు. మందులను కొనుక్కునే బాధ్యత రోగులపైనే ఉంటుంది. స్థానిక మార్కెట్లలోనో లేదా కొందరి ఇళ్లకు వెళ్లో రోగులు మందుల కోసం ప్రయత్నిస్తారు.
‘‘ఆపరేషన్ కోసం మత్తుమందు అవసరం అయితే, మీరు మార్కెట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మందు దొరికితే దాన్ని తెచ్చుకుని ఆసుపత్రిలో ఇవ్వాలి’’అని ఆయన చెప్పారు. కానీ, ఇప్పుడు మార్కెట్లలో ఎలాంటి ఔషధాలూ అందుబాటులో లేవని ఆయన వివరించారు.
‘‘దేవదారు చెట్ల ఆకులను నీళ్లలో మరగబెట్టి తాగాలని ప్రభుత్వం సూచిస్తోంది’’ అని తన కుటుంబ సభ్యులు చెప్పినట్లు ఆయన వివరించారు. ఉప్పు నీళ్లను నోటిలో పుక్కలించాలని ప్రభుత్వ టీవీ ఛానళ్లలోనూ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, NK News
మందులు లేనప్పుడు ఇంతే
‘‘వారి దగ్గర మందులు లేనప్పుడు ఇలానే జరుగుతుంది. వారు సంప్రదాయ విధానాల వైపు చూస్తున్నారు’’అని డాక్టర్ నాగి షఫీక్ చెప్పారు.
ఉత్తర కొరియాలోని గ్రామాల్లో యూనిసెఫ్ తరఫున 2001 నుంచి ఆయన పనిచేస్తున్నారు. 2019లో ఆయన చివరిసారిగా ఉత్తర కొరియాకు వెళ్లారు. అప్పటికే అక్కడ మందుల కొరత ఉందని ఆయన చెప్పారు. ‘‘అప్పట్లో చాలా కొంచెం మందులే వారి దగ్గర ఉండేవి’’అని ఆయన వివరించారు.
దాదాపు ఔషధాలన్నింటినీ చైనా నుంచే దిగుమతి చేసుకుంటారు. అయితే, గత రెండేళ్లుగా సరిహద్దులను మూసివేయడంతో మందుల సరఫరాకు అంతరాయం కలిగింది.
ఉత్తర కొరియా నుంచి తప్పించుకుని వచ్చి దక్షిణ కొరియాలో తలదాచుకుంటున్న వారికి సోకీల్ పార్క్ సాయం చేస్తున్నారు. ఆయన కూడా ఉత్తర కొరియాలో మందులు అయిపోతున్నాయని విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘అక్కడ మందులు చాలా కొంచెం మాత్రమే ఉన్నాయి. వాటికి భారీ ధరను వసూలు చేస్తున్నారు’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
దేశం మొత్తం లాక్‌డౌన్
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి మొదలైందని ప్రకటించిన రోజే దేశం మొత్తం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. చాలా మందికి ఆహారం కూడా అందుబాటులో లేదు. కొంతమంది మాత్రం తమ ఇళ్లను వదిలి పంట పొలాల్లో పనిచేసేందుకు అనుమతిస్తున్నారు.
దక్షిణ కొరియా సరిహద్దుల వెంబడి ఉత్తర కొరియాలోని ప్రాంతాలపై తీసిన చిత్రాలను దక్షిణ కొరియా వార్తా సంస్థ ఎన్‌కే న్యూస్ ప్రచురించింది. దీనిలో లాక్‌డౌన్ విధించిన తర్వాత కూడా కొందరు వ్యవసాయ కూలీలు పొలాల్లో పనిచేస్తూ కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Planet Labs
అయితే, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండే ప్యాంగ్యాంగ్ లాంటి ప్రాంతాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు.
దక్షిణ కొరియాలో డైలీ ఎన్‌కే వెబ్‌సైట్‌ను లీ సంగ్ యంగ్ నడుపుతున్నారు. ఆయనకు ఉత్తర కొరియాలో కొంత మందితో పరిచయాలున్నాయి.
చైనా సరిహద్దుల్లోని హ్యాన్‌సన్ నగరంలో మే నెలలో పది రోజులపాటు ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత చాలామంది ప్రజలు ఇళ్లలోనే కూప్పకూలినట్లు ఆయన చెప్పారు. ఆహారంలేక ప్రజలు చిక్కిపోయి కదలలేని పరిస్థితికి వచ్చినట్లు ఆయన తెలిపారు.

ఇప్పటివరకు కేవలం 70 మరణాలు మాత్రమే అధికారికంగా ప్రకటించారు. అంటే ఉత్తర కొరియా కోవిడ్ మరణాల రేటు 0.002 శాతంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ.
‘‘సరైన ఆరోగ్య వ్యవస్థ లేదు. వ్యాక్సీన్లు కూడా వేయడంలేదు. ఈ నంబర్లు అసలు నమ్మేలా ఉన్నాయా?’’అని మార్టిన్ విలియమ్స్ అన్నారు. ఆయన ఉత్తర కొరియా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు.
‘‘ఒకవైపు కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు మరణాల సంఖ్య అసలు పెరగడం లేదు. కేసులు విపరీతంగా పెరిగిన రెండు, మూడు వారాల తర్వాత కూడా మరణాల సంఖ్య పెరుగుతుందని కోవిడ్-19 వ్యాప్తిని పరిశీలిస్తే తెలుస్తుంది. కాబట్టి ఉత్తర కొరియా విడుదల చేస్తున్న మరణాల సంఖ్య తప్పు’’అని ఆయన అన్నారు.
‘‘జాతీయ స్థాయిలో అక్కడ తప్పులు చూపిస్తున్నారు. అందుకే స్థానిక అధికారులు కూడా నోరు విప్పడం లేదు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందేమోనని వారు భయపడుతున్నారు’’అని ఆయన వివరించారు.
అంతర్జాతీయ సాయం కోసం..
గత వారంలో కొత్తగా నమోదైన కరోనావైరస్ కేసులు తగ్గుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీనిపై ప్రభుత్వ వార్తా పత్రికలో ఒక సంపాదకీయాన్ని కూడా ప్రచురించారు. కోవిడ్-19 వ్యాప్తిని అధికారులు అడ్డుకోగలిగారని దీనిలో పేర్కొన్నారు.
అయితే, ‘‘పరిస్థితులు ఏమీ మెరుగుపడలేదు. ఇవి నానాటికీ దారుణంగా మారుతున్నాయి’’అని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఎమర్జెన్సీ ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ ఆందోళన వ్యక్తం చేశారు. డేటాను పరిశీలించేందుకు ఉత్తర కొరియా అనుమతించడం లేదని ఆయన అన్నారు. కేసుల విషయంపై తమకు ఎలాంటి స్పష్టతాలేదని పేర్కొన్నారు.
వ్యాక్సీన్లు పంపిస్తామని మళ్లీమళ్లీ చెబుతున్నప్పటికీ ఉత్తర కొరియా స్పందించడంలేదని ఆయన వెల్లడించారు. వ్యాక్సీన్ల కోసం చైనాపైనే వారు పూర్తిగా ఆధారపడుతూ ఉండొచ్చని అన్నారు.
చైనా నుంచి రెండింతలు
మార్చి నుంచి ఏప్రిల్ మధ్య చైనా నుంచి ఉత్తర కొరియాకు దిగుమతులు రెండింతలు పెరిగాయని కస్టమ్స్ డేటా చెబుతోంది.
రెండేళ్లపాటు సరిహద్దులను మూసివేసిన తర్వాత మళ్లీ ఈ ఏడాదే సేవలను ప్రారంభించారు. గత నెలల్లో ఔషధాల దిగుమతులు భారీగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఏప్రిల్‌లో చైనా నుంచి ఉత్తర కొరియా వెయ్యి వెంటీలేటర్లు దిగుమతి చేసుకుంది. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలైన తర్వాత ఉత్తర కొరియా వెంటీలేటర్లు దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి.
చైనా డేటాలో వెంటీలేటర్లు అంటే ఆక్సిజన్ చికిత్స అందించే చిన్నచిన్న వైద్య పరికరాలు కూడా ఉంటాయి.
మరోవైపు జనవరి నుంచి ఏప్రిల్ మధ్య 90 లక్షల మాస్క్‌లను ఉత్తర కొరియా దిగుమతి చేసుకుంది.
ఏప్రిల్ 17న సాయం కోసం ఏడు రవాణా విమానాలను చైనాకు ఉత్తర కొరియా పంపినట్లు దక్షిణ కొరియా ప్రభుత్వ సమాచారం వెల్లడిస్తోంది.
ఉపగ్రహాల డేటా పరిశీలించినప్పుడు మే 24న ఏయిర్ కోర్యో రవాణా విమానాలు ప్యాంగ్యాంగ్ విమానాశ్రయంలో కనిపించాయి. అయితే, ఇవి కొన్ని రోజుల ముందు చైనాలోని షెన్యాంగ్ విమానాశ్రయంలో కనిపించాయి.
సముద్రంలోనూ
ప్యాంగ్యాంగ్‌కు దక్షిణాన ఉండే నంపో పోర్టుకు కూడా మే 13న వైద్య సాయం వచ్చినట్లు దక్షిణ కొరియాలోని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
పోర్టు ప్రాంతంలో భారీగా నౌకలు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు కూడా వెల్లడిస్తున్నాయి. అయితే, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? వీటిలో ఏమున్నాయి? లాంటి విషయాలు తెలియడం లేదు.
కరోనావైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత తన కుటుంబంతో మాట్లాడటం చాలా కష్టమవుతోందని హ్వాంగ్ సన్ చెప్పారు. ఫోక్ సిగ్నల్స్ తరచూ జామ్ అవుతున్నాయని ఆయన అంటున్నారు. తన స్నేహితులు కూడా తమ కుటుంబాలతో మాట్లాడేటప్పుడు ఇదే సమస్య వస్తోందని ఆయన చెప్పారు.
85ఏళ్ల తన తల్లికి ఏమవుతుందోనని ఆయన ఆందోళనతో ఉన్నారు. ఆమె కోసం ఆయన దేవుడికి ప్రార్థిస్తున్నారు. తన కుటుంబానికి సాయం అందాలని వేడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- Fake Currency notes: నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలా.. ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి
- Service Charge: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీ అంటే ఏంటి? బలవంతంగా వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
- ‘ఒక అమ్మాయి పరువు కోసం’ 200 ఏళ్లుగా నిర్మానుష్యంగా ఉంటున్న ఎడారి గ్రామం.. ఏం జరిగిందంటే..
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- అంబేడ్కర్ పుట్టిన గడ్డపై ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినప్పుడు ఎందుకంత హింస చెలరేగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














