ఉత్తర కొరియా లాక్‌డౌన్: కోవిడ్ మహమ్మారి విజృంభణ.. మహా విపత్తుగా ప్రకటించిన కిమ్‌ జోంగ్ ఉన్

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, KCTV / AFP

ఫొటో క్యాప్షన్, కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కిమ్ జోంగ్ ఉన్ టీవీల్లో మాస్కుతో కనిపించింది లేదు
    • రచయిత, థామ్ పూల్, రాబర్ట్ గ్రీనాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

గత రెండున్నరేళ్లుగా తమ దేశంలో కోవిడ్ కేసులు లేవని ఉత్తర కొరియా చెబుతూ వచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

ఈ వారంలో కరోనావైరస్ కేసులు నమోదైనట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. ఆ దేశం కరోనా కేసులను అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి.

కరోనావైరస్ ప్రపంచాన్ని కబళిస్తోందని తెలియగానే, నార్త్ కొరియా దాని సరిహద్దులను మూసివేసింది. నిజంగానే, ఆ దేశం వైరస్ దాడి నుంచి తప్పించుకుందని కొందరు విశ్వసిస్తున్నారు.

ఇప్పుడు, ఉత్తర కొరియాలో కోవిడ్ ఇంఫెక్షన్లు బయటపడడంతో అక్కడి అధికారులు దాని నియంత్రణకు నడుం బిగించారు.

ఇది తమ దేశానికి దాపురించిన "మహా విపత్తు" అని ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. నార్త్ కొరియా ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి విపత్తు రాలేదని అన్నారు. జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ ప్రకటించారు.

ప్రపంచంలో కరోనావైరస్ బారిన పడని ప్రాంతం లేదు. ఎవరెస్ట్ శిఖరంపై, అంటార్కిటికాలో కూడా కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

కోవిడ్‌ను కట్టడి చేయడంలో అన్ని దేశాలు ఇంచుమించు ఒకే రకమైన జాగ్రత్తలు తీసుకున్నాయి. తీవ్రతలో వ్యత్యాసాలు ఉన్నా, అనుసరించిన మార్గాలు ఒకటే. వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, టెస్టింగ్, భౌతిక దూరం పాటించడం, ప్రయాణాలపై పరిమితులు మొదలైనవి అమలుచేశాయి.

ప్రస్తుతం నార్త్ కొరియాలో కోవిడ్ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. అసలే ఆ దేశపు వ్యవహారాలన్నీ రహస్యంగా ఉంటాయి. లోపలి నుంచి వివరాలు బయటకు రానివ్వరు.

మరో పక్క, కోవిడ్ అక్కడ పెను విపత్తును సృష్టించే అవకాశాలు ఉన్నాయని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

"ఎంతమంది చనిపోతారోనని భయంగా ఉంది" అని ఒక నిపుణుడు బీబీసీతో చెప్పారు.

ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రాజధాని ప్యాంగ్యాంగ్‌లో చాలావరకు విదేశీ పర్యటకులను అనుమతించట్లేదు.

బలహీనమైన ఆరోగ్య రక్షణ వ్యవస్థ

నార్త్ కొరియాకు కోవిడ్‌ను ఎదుర్కోవడానికి సరైన ఆయుధాలు లేవు. ఇదే ఆ దేశం ముందున్న అతి పెద్ద సవాలు.

ఆ దేశ ప్రజలు వ్యాక్సీన్లు తీసుకోలేదు. దేశంలో కేసులు అతి తక్కువ ఉన్నాయని భావిస్తున్నారు కాబట్టి ఎక్కువమంది ప్రజలు వైరస్‌కు ఎక్స్‌పోజ్ కాలేదని భావించవచ్చు. అలాంటప్పుడు వారికి కోవిడ్ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులలో ఆస్పత్రిలో చేరే రోగుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా ఉండవచ్చు.

టెస్టింగ్ కూడా తక్కువగానే జరుగుతోంది. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు నార్త్ కొరియా 64,000 టెస్టులు జరిపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

అదే దక్షిణ కొరియాలో టెస్టింగ్, ట్రేసింగ్ ప్రధాన వ్యూహంగా కోవిడ్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ దేశంలో సుమారు 17.21 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.

కరోనావైరస్‌పై యుద్ధంలో గణాంకాలు, లెక్కలు ప్రభుత్వాలకు ప్రధాన సాధనాలుగా పనికొచ్చాయి. నార్త్ కొరియాలో అవీ సరిగా లేవు.

ఉత్తర కొరియాలో సుమారు 5 లక్షల పేరు తెలియని జ్వరాలు ప్రబలి ఉన్నాయని శనివారం ప్రభుత్వ మీడియా తెలిపింది. కోవిడ్ కేసులను గుర్తించడంలో ఆ దేశం తడబడుతోందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ కావచ్చు. అంతే కాకుండా, మహమ్మారి విజృంభించేందుకు సిద్ధంగా ఉందనడానికి ఇదొక సూచనగా కనిపిస్తోంది.

అభివృద్ధి చెందిన, ధనిక దేశాల్లో కూడా ఆరోగ్య రక్షణ వ్యవస్థలు కోవిడ్ ధాటికి తట్టుకుంటాయో, లేదోనని భయపడ్డారు. అలాంటిది ఉత్తర కొరియాకు పెను ముప్పు పొంచి ఉందనే చెప్పవచ్చు.

ఉత్తర కొరియాలో "ఆరోగ్య రక్షణ వ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఉంది" అని ఉత్తర కొరియా వ్యవహారాలను పర్యవేక్షించే ఎన్జీవో లూమెన్ వ్యవస్థాపకులు జియున్ బేక్ అన్నారు.

"వ్యవస్థ జీర్ణావస్థలో ఉంది. ప్యాంగాంగ్‌లో నివసిస్తున్న 20 లక్షల మందిని మినహాయిస్తే, దేశంలోని మెజారిటీ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సదుపాయాలు లేవు" అని ఆమె అన్నారు.

ఐవీ ఫ్లూయిడ్స్ కోసం బీరు సీసాలు, తుప్పు పట్టేవరకు ఇంజెక్షన్ సూదులను ఉపయోగిస్తారని అక్కడి నుంచి పారిపోయినవారు చెబుతారు.

ఇక మాస్కులు, శానిటైజర్ల విషయానికొస్తే, "అవి ఎంత తక్కువ స్థాయిలో అందుబాటులో ఉంటాయో మనం ఊహించవచ్చు" అని బేక్ అన్నారు.

వీడియో క్యాప్షన్, ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ కన్నా ఆయన సోదరి 'కిమ్ యో జోంగ్' మరీ డేంజరా?

లాక్‌డౌన్ ఫలిస్తుందా?

ఇప్పటికిప్పుడు ఉత్తర కొరియా ముందున్న ఉపాయం లాక్‌డౌన్.

దీంతో "ప్రజా ఉద్యమాలను మరింత తీవ్రంగా అణచివేస్తారు" అని బేక్ అంచనా వేశారు.

మహమ్మారిపై చైనా చేసిన పోరాటాన్ని "చూసి నేర్చుకోవాలని" కిమ్ జోంగ్ ఉన్ అన్నారు.

చాలా దేశాలు కరోనావైరస్‌తో కలిసి జీవించేందుకు సిద్ధపడిపోయాయి. కానీ, చైనా మాత్రం జీరో కోవిడ్ పాలసీకి కట్టుబడి ఉంది. వైరస్‌ను తమ దేశం నుంచి పూర్తిగా తరిమికొట్టేవరకూ విశ్రమించేదే లేదని శపథం పట్టింది. షాంఘై లాంటి పెద్ద నగరాల్లో కూడా ప్రజలను ఇళ్లకే పరిమితం చేసే నిబంధనలు అమలులో ఉన్నాయి.

దీనివల్ల, షాఘైలో ప్రజలు ఆహారం, మందులు అందట్లేదని వాపోతున్నారు. లాక్‌డౌన్ వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ప్రభుత్వాన్ని విమర్శస్తున్నారు. చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు మెదపడం అరుదే.

నార్త్ కొరియాలో కూడా ఇలాంటి కఠిన నిబంధనలను అమలులోకి తెస్తే, పరిస్థితులు దారుణంగా మారుతాయని, ఆహారం, మందుల కొరత షాంఘై కన్నా ఘోరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎంత కఠిన నిబంధనలు విధించినప్పటికీ ఒమిక్రాన్ వేరియంట్‌ను ఆపడం కష్టమే.

"షాంఘైలో ఒమిక్రాన్‌ను ఆపడం ఎంత కష్టమైందో చూడడండి. పైగా, వాళ్లు చేయాల్సినవన్నీ చేస్తున్నారు" అని హాంకాంగ్ యూనివర్సిటీలో ఎపిడెమియాలజిస్ట్ ప్రొఫెసర్ బెన్ కౌలింగ్ అన్నారు.

"నార్త్ కొరియాలో దీన్ని ఆపడం చాలా కష్టం. ఈ క్షణం నాకు చాలా ఆందోళనగా ఉంది" అని ఆయన అన్నారు.

ఉత్తర కొరియా దీర్ఘకాలంగా ఆహార ఉత్పత్తి సమస్యలతో సతమతమవుతోంది. 1990లలోనూ, ఇప్పుడూ దారుణమైన కరువు అనుభవిస్తోంది. దేశంలోని 2.5 కోట్ల జనాభాలో 1.1 కోటి జనాభా పోషకాహార లోపంతో ఉన్నారని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అంచనా వేసింది.

పాతబడిన వ్యవసాయ పద్ధతులతో, దేశానికి సరిపడనంత పంట పండించలేక చతికిలబడింది. ఇక వ్యవసాయదారులు పొలాలకు వెళ్లి పనిచేయలేకపోయే సమస్య మరింత తీవ్రం అవుతుంది.

ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, కోవిడ్, కరువు పరిస్థితులను మరింత తీవ్రం చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి

సహాయం అందుతుంది, ఉత్తర కొరియా ఒప్పుకుంటే..

గతంలో చైనా, డబ్ల్యూహెచ్ఓ కూడా నార్త్ కొరియాకు వ్యాక్సీన్ల రూపంలో సహాయం అందించడానికి ముందుకొచ్చాయి. కానీ, ఆ దేశం దాన్ని తిరస్కరించింది.

అయితే, ఇప్పుడు కిమ్, చైనాను చూసి నేర్చుకోవాలని అనడంతో, ఆయన మనసు మారిందేమో అనిపిస్తోంది.

"చైనా సహాయం కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారని నాకు అనుమానం. చైనా తప్పకుండా చేయగలిగినంత సహాయం చేస్తుంది. నార్త్ కొరియా స్థిరంగా ఉండడం చైనాకు ముఖ్యం" అని లండన్‌లోని ఎస్ఓఏఎస్ యూనివర్సిటీలో కొరియన్ స్టడీస్ లెక్చరర్ ఓవెన్ మిల్లర్ అభిప్రాయపడ్డారు.

అయితే, ఇతర రకాలైన బయట సహాయాన్ని నార్త్ కొరియా అంగీకరించకపోవచ్చు. అంటే 1990లలో అనేక సహాయక సంస్థలు అండగా నిలిచాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉత్తర కొరియా కోరుకోకపోవచ్చని ఓవెన్ మిల్లర్ అన్నారు.

నార్త్ కొరియాలో ఆరోగ్య సంక్షోభం వచ్చినా, అంతర్జాతీయ సంబంధాల విషయంలో తన వైఖరిని మార్చుకుంటుందని ప్రస్తుతానికి అనిపించట్లేదు.

ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్ష తలపెట్టే అవకాశం ఉందని అమెరికా, దక్షిణ కొరియా ఇప్పటికే హెచ్చరించాయి. తమ దేశ జనాభా దృష్టి మళ్లించడానికి ఆ దేశం ఇలాంటి చర్యలకు పూనుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

కిమ్, తమ దేశ ప్రజలను కూడగట్టి, వారు పడుతున్న కష్టాలకు ఇదీ కారణమని చెప్పేందుకు కోవిడ్ పరిస్థితిని ఉపయోగించుకోవచ్చు.

దీనర్థం, వారికి మరింత ఒంటరితనం, మరింత బాధ.

"నిజంగా వాళ్లకు ఒకే ఒక పరిష్కారం ఉంది. వ్యాక్సీన్లు దిగుమతి చేసుకుని త్వరత్వరగా ప్రజలందరికీ అందించాలి" అని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లోని యూఎస్ నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌లో వ్యాక్సీన్ నిపుణుడు పీటర్ హోటెజ్ అన్నారు.

"ఉత్తర కొరియాకు సహాయం అందించేందుకు ప్రపంచం సిద్ధంగా ఉంది. కానీ, దాన్ని అందుకునేందుకు వాళ్లు సిద్ధంగా ఉండాలి" అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, చరిత్రలో 70 ఏళ్ల పాటు సాగిన ఆ యుద్ధంలో ఇప్పటికీ విజేతలెవరో తేలలేదు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)