అంబేడ్కర్ పుట్టిన గడ్డపై ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినప్పుడు ఎందుకంత హింస చెలరేగింది?

ఫొటో సోర్స్, OTHER
- రచయిత, మయూరేష్ కొణ్ణూర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురం నగరంలో వారం క్రితం హింస, దహనాలు జరిగాయి. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టడంతోపాటూ అయిదు బస్సులను కూడా తగలబెట్టారు. వాహనాలు ధ్వంసం చేశారు. రాళ్లు రువ్వారు. హింసాత్మకంగా మారిన నిరసనలను అదుపు చేయడానికి పోలీసులు బలప్రయోగం చేయాల్సి వచ్చింది. అమలాపురం అంతటా 144 సెక్షన్ అమలు చేయాల్సి వచ్చింది.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కోనసీమ జిల్లా పేరుకు బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నిర్ణయించడంతో ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడమే ఈ హింసకు కారణం.
ఈ హింస, మహారాష్ట్రలో 44 ఏళ్ల క్రితం ఒక యూనివర్సిటీ పేరు మార్చిన సందర్భంగా జరిగిన ఘర్షణలను గుర్తు చేస్తోంది.
ఆ సమయంలో మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అప్పుడు కూడా డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ పేరు గురించే వివాదం తలెత్తింది. కారణం అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక యూనివర్సిటీకి అంబేడ్కర్ పేరు పెట్టాలనుకుంది.
మరాఠ్వాడా యూనివర్సిటీకి డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ పేరు పెట్టాలనే నిర్ణయం తర్వాత జరిగిన ఈ అల్లర్లు ఇప్పటికీ మహారాష్ట్ర సామాజిక చరిత్రకు ఒక గాయంగా మిగిలిపోయాయి. బీఆర్ అంబేడ్కర్ ఇదే యూనివర్సిటీలో చదువుకున్నారు. ఇక్కడే పట్టభద్రులయ్యారు. తన రాజకీయ కెరీర్ నిర్మించుకున్నారు. సామాజిక ఉద్యమం నడిపారు. ఇదే ఆయన చివరి మజిలీ కూడా అయ్యింది.

ఫొటో సోర్స్, LOKESH GAVATE
1978లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలు కావడానికి మరో 16 ఏళ్లు పట్టింది. చివరకు అది 1994లో అమలైంది. యూనివర్సిటీ మొత్తం పేరును మార్చలేకపోయినా, దానికి బీఆర్ అంబేడ్కర్ పేరును జోడించారు. ఇప్పుడు దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీ అని పిలుస్తున్నారు.
మొత్తానికి సమాజంలోని అన్ని వర్గాలూ ఆ పేరును అంగీకరించాయి. కానీ, దాని వెనుక హింసాత్మక కథ కూడా నిలిచిపోయింది. 1978లో మరాఠ్వాడాలోని అగ్రవర్ణాల వారు దళితులపై దాడులు చేశారు. ఆ దాడుల్లో చాలా మంది చనిపోయారు, ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వందల మంది ఉపాధి కోల్పోయారు.
1978 జులై 27న ఏం జరిగింది?
రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా మరాఠ్వాడా యూనివర్సిటీ పేరును డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ యూనివర్సిటీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఇదంతా జరిగింది. 1978 జులై 27న తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. సాయంత్రం యూనివర్సిటీ పేరు మారుస్తున్నారనే విషయం తెలియగానే, మరాఠ్వాడాలోని చాలా ప్రాంతాల్లో హింస మొదలైంది. నాందేడ్, పర్భానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం తీవ్రంగా కనిపించింది.
పేరు మార్చిన తర్వాత ప్రారంభమైన ఈ అల్లర్లు కులాల గొడవలుగా మారిపోయాయి. ఆ ప్రాంతంలో అగ్రవర్ణాలుగా చెబుతున్న వారికి, వెనుకబడిన జాతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. మొదట చెలరేగిన అల్లర్లు రెండు నెలల వరకూ ఉన్నాయి. ఆ సమయంలో నష్టం తీవ్రంగా జరిగింది. కానీ తర్వాత ఏడాది ఏడాదిన్నర వరకూ ఆ ప్రాంతంలో చిన్న చిన్న అల్లర్లు జరుగుతూనే వచ్చాయి. ఆ అల్లర్ల గాయాలు మానడానికి ఎన్నో ఏళ్లు పట్టింది.
సీనియర్ జర్నలిస్ట్ నిశికాంత్ భాలెరావ్ ఆ సమయాన్ని గుర్తు చేసుకున్నారు.
అసెంబ్లీలో సాయంత్రం నాలుగు గంటలకు తీర్మానం ఆమోదించారు. దాని గురించి మొదటి వార్త 7 గంటలకు ప్రాంతీయ బులెటిన్ ద్వారా ప్రజలకు తెలిసింది. వెంటనే నిరసనలు మొదలయ్యాయి. ఔరంగాబాద్ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులు డైలీ మరాఠ్వాడా కార్యాలయం బయట కూడా ఆందోళనలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
నిశికాంత్ భాలేరావ్ ఆ సమయంలో రాజకీయ ఘటనలు, కులాల అణచివేత గురించి రిపోర్టింగ్ చేస్తున్న యువ జర్నలిస్ట్.
ఆయన డైలీ మరాఠ్వాడా ఎడిటర్ అనంతరావ్ భాలేరావ్ కుమారుడు. ఆ ప్రాంతంలో ఈ వార్తా పత్రిక ప్రభావం చాలా ఉండేది. నిశికాంత్ తండ్రి యూనివర్సిటీ పేరు మార్చడాన్ని వ్యతిరేకించేవారు. కానీ ఆయన స్వయంగా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇచ్చినా, పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనల్లో కూడా పాల్గొన్నారు.
మరాఠ్వాడా ముక్తి సంగ్రామ్ ఈ ప్రాంతీయ గుర్తింపును మరింత తీవ్రంగా మార్చింది. యూనివర్సిటీ పేరులో ఆ గుర్తింపు కనిపించేది. కానీ అక్కడ కులాలు, సామాజిక విభజన అనే ఒక బలమైన ప్రభావం ఉండేది. అది ఈ నిరసనలను హింసాత్మకంగా మార్చింది.
మరాఠ్వాడా యూనివర్సిటీకి అంబేడ్కర్ పేరు పెట్టడానికి డిమాండ్లు చాలా ఏళ్లనుంచీ వస్తూనే ఉన్నాయి. మరాఠ్వాడా, ఔరంగాబాద్‌లతో అంబేడ్కర్‌కు ప్రత్యేక బంధం ఉంది. అంబేడ్కర్ సామాజిక మార్పు తీసుకురావడానికి మొట్టమొదట 1950లో ముంబయిలోని సిద్ధార్థ్ కాలేజీ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీకి పునాదులు వేశారు. తర్వాత 1952లో ఆయన ఔరంగాబాద్‌లో మిలింద్ కాలేజీని స్థాపించారు. మరాఠ్వాడా, దగ్గర్లోని విదర్భ ప్రాంతంలో వేలాది దళిత విద్యార్థులకు మిలింద్ కాలేజీలో అడ్మిషన్లు తీసుకున్నారు.
ఆ సమయంలో ఔరంగాబాద్.. మరాఠ్వాడా దళిత విద్యార్థుల ఉద్యమ భూమిగా మారింది. మరాఠ్వాడాలో సామాజిక, రాజకీయ, విద్యా జగత్తులో అంబేడ్కర్ ఉద్యమం ఒక బలమైన శక్తిగా మారింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఈ వర్గాల నుంచి మరాఠ్వాడా యూనివర్సిటీ పేరు మార్చాలనే డిమాండ్ వెల్లువెత్తింది.
శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి దూరమై 1978లో ప్రోగ్రెసివ్ డెమాక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) ప్రభుత్వం ఏర్పాటు చేయడం వరకూ ఈ డిమాండుపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించిన పీడీఎఫ్ ప్రభుత్వం జులై 27న ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేసింది.
ప్రభుత్వ నిర్ణయం ప్రకటన తర్వాత కొన్ని గంటల్లోపే మరాఠ్వాడా ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. సమూచే ప్రాంతంలో కులాల మధ్య అల్లర్లు మొదలయ్యాయి. దళిత కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం మొదలెట్టారు. శరద్ పవార్ మరాఠీలో రాసిన తన ఆత్మకథ 'లోక్ మాఝే సంగతి'(ప్రజా సంఘం)లో దీని గురించి వివరించారు.
1978 జులై 27న జరిగిన ఆ ఘటనల క్రమాన్ని శరద్ పవార్ తన పుస్తకంలో వివరంగా రాశారు.
తీర్మానానికి తుది అనుమతి ఇవ్వడానికి కేబినెట్ సమావేశం జరుగుతున్నప్పుడే మరాఠ్వాడా ప్రాంతంలో ఉద్రిక్తతలు జరుగుతున్నాయని వార్తలు రావడం మొదలైంది. దళితులపై దాడులు మొదలయ్యాయి. వారి ఇళ్లు తగలబెడుతున్నారు.
పోచీరామ్ కాంబ్లే అనే ఒక దళిత యువకుడిని హత్య చేశారు. పేరుమార్పు నిరసనలు, ఆ తర్వాత రోజుల్లో జరిగిన ఇలాంటి ఘటనల్లో మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పోచీరామ్ మాతంగ కులానికి చెందినవారు. ఆయన గ్రామ ఉప సర్పంచిగా ఉన్నారు. పార్లమెంటులో తీర్మానం ఆమోదించిన తర్వాత దళిత కుటుంబాలు దీపావళిలా వేడుక జరుపుకున్నాయి. దాంతో ఆగ్రహించిన అగ్ర వర్ణాలవారు హింసామార్గాన్ని ఎంచుకున్నారు. నిప్పు పెట్టడం మొదలెట్టారు. అలాంటి ఒక ఘటనలోనే అల్లరి మూకలు పోచీరామ్ కాళ్లూ చేతులూ నరికి అతడిని సజీవంగా దహనం చేశాయి.

ఫొటో సోర్స్, EPA
ప్రాణాలు పోయాయి, ఇళ్లు తగలబెట్టారు
హింస చాలా రోజులపాటు కొనసాగుతూనే ఉంది. హింసకు పాల్పడే గుంపులు తలపడ్డాయి. హింసాత్మక ఘటనలు జరుగుతున్న చోట పోలీసులు లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. దళితులపై జరిగిన దారుణాలు, వారికి జరిగిన నష్టానికి సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయి. దీనిపై ఎన్నో కమిటీలు వేశారు. నిజ నిర్ధారణ కమిటీలను రంగంలోకి దించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల గురించి రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక బృందాన్ని పంపించింది.
విద్యార్థులు, అధ్యాపక సంఘాలు, ట్రేడ్ యూనియన్లతో ఏర్పడిన సంఘం 'అణచివేతల వ్యతిరేక వేదిక' కూడా ఇలాగే ఒక రిపోర్ట్ సిద్ధం చేసింది. ఈ నివేదిక ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో 1979 మే నెలలో ప్రచురితమైంది. మరాఠా ప్రాంతంలో పర్యటన తర్వాత సిద్ధం చేసిన ఈ రిపోర్ట్ ఆ సమయంలో క్షేత్ర స్థాయిలో వాస్తవాలను వెల్లడిస్తుంది.
ఈ నివేదికలో "గ్రామాల్లో దళితులకు వ్యతిరేకంగా హింస చాలా రూపాల్లో జరిగింది. ప్రజల హత్యలు జరిగాయి. మహిళలపై అత్యాచారాలు, వేధింపులు జరిగాయి. గుడిసెలు తగలబెట్టారు. వస్తువులు దోచుకున్నారు. నిరాశ్రయులైన దళితులు గ్రామం నుంచి పారిపోవాల్సి వచ్చింది. వారి బావులను కలుషితం చేశారు. పశువులను చంపేశారు. వారికి పనులు ఇవ్వడం కూడా ఆపేశారు. ఇవన్నీ 67 రోజులపాటు కొనసాగాయి. బాధితులకు పౌర హక్కుల ప్రకారం తగిన భద్రత కల్పించలేదు" అని చెప్పారు.
మరాఠ్వాడాలోని మొత్తం 9 వేల గ్రామాల్లో 1200 గ్రామాలు ఈ హింసకు ప్రభావితం అయ్యాయని ఆ నివేదికలోనే చెప్పారు. నాందేడ్, పర్భానీ, బీడ్ జిల్లాలు హింసకు ప్రభావితమయ్యాయి. ఆ సమయంలో దాదాపు ఐదు వేల మంది నిరాశ్రయులయ్యారు. 2500 దళిత కుటుంబాలు మనోబలం కోల్పోయాయి. వారు అత్యంత దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. రెండు వేల మంది ఇళ్లు వదిలి అడవుల్లోకో, లేదంటే పట్టణాలవైపో పారిపోవాల్సి వచ్చింది. ఆకలితో పస్తులు ఉన్నప్పటికీ హింసకు భయపడి దళిత కుటుంబాలు తమ గ్రామాలవైపు తిరిగి వెళ్లలేదు.
నిజామ్ కాలం నుంచీ మరాఠ్వాడాలో భూస్వామ్య వ్యవస్థ కొనసాగుతోంది. దళితులు ఆ వ్యవస్థలో అట్టడుగు స్థాయిలో ఉండేవారని నిశికాంత్ భాలేరావ్ చెప్పారు.

ఫొటో సోర్స్, AMOL LANGAR/BBC
మరాఠ్వాడా ఎందుకు, దళితులే ఎందుకు?
మరాఠ్వాడా అల్లర్ల గురించి ఎప్పుడు చర్చ జరిగినా ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఆ అల్లర్ల సమయంలో జీవించి ఉన్నవారు, వాటిలో పాల్గొన్నవారు, ఈ చీకటి అధ్యాయం గురించి అధ్యయనం చేస్తున్న వారంతా ఒక విషయాన్ని నమ్ముతారు. హింసకు కారణం అంబేడ్కర్‌గా పేరు మార్చడం వల్ల కాదు, దళిత సముదాయంలో ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల ఇది జరిగిందని నమ్ముతారు.
ఆ సమయంలో మరాఠ్వాడా జనాభా 80 లక్షలు. అందులో దాదాపు 16.25 శాతం షెడ్యూల్ కులాల వారు ఉండేవారు.
2018లో బీబీసీకి రాసిన ఆర్టికల్‌లో జర్నలిస్టు, రచయిత శ్రీకాంత్ భరాడే ఈ విధంగా అన్నారు. ''స్వాతంత్యానికి ముందు నుంచే చాలా దళిత కుటుంబాలు జీవనోపాధి కోసం వలస వెళ్తున్నాయి. డాక్టర్ అంబేడ్కర్ నాయకత్వం వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ వేగవంతమైంది. నగరాల్లో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగ్గా అందడంతో ఇది క్రమంగా సంప్రదాయక గ్రామాల నిర్మాణాన్ని దెబ్బ తీసింది.
వ్యవసాయ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం అయింది. జమీందారులకు కూలీలు దొరకడం కష్టమైంది. 1956లో అంబేడ్కర్‌తో పాటు చాలామంది దళితులు బౌద్ధమతంలోకి మారిపోయారు. మొదట సంప్రదాయ వృత్తులను వదిలిపెట్టిన దళితులు తర్వాత తమ మతాన్ని కూడా మార్చుకున్నారు. అప్పటివరకు అణగారినట్లు ఉన్న దళితులు గౌరవాన్ని కోరుకోవడం మొదలైంది. దీంతో దళితులు తమ గుర్తింపును మరిచిపోయి అహంకారంగా ప్రవర్తిస్తున్నట్లు ఉన్నతవర్గాల ప్రజలు భావించారు.''
ఉన్నతవర్గాల కులాలకు, దళితులకు మధ్య ఉద్రిక్త వాతావరణం స్పష్టంగా కనిపించేది. ఇరు వర్గాలకు చెందిన విద్యార్థులు మరాఠ్వాడాలో తీవ్ర ఆందోళనకు దిగారు. ఆ ప్రాంతంలో పరిస్థితుల్ని సాధారణ స్థితికి రావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పేరు మార్పు నిర్ణయాన్ని నిలిపేయాల్సి వచ్చింది.
తన జీవిత చరిత్రలో శరద్ పవార్ ఇలా రాశారు. ''ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆక్రోశంగా ఉన్న యువకుల ముందు జిల్లా స్థాయి, క్షేత్రస్థాయి నేతలందరూ వెనక్కి తగ్గారు. ప్రతీ దళిత కుటుంబానికి భద్రత కల్పించడం ఆచరణాత్మకంగా అసాధ్యంగా మారుతోంది. యూనివర్సిటీ పేరు మార్చే క్రమంలో ప్రజల ప్రాణాలు పోవడం మాకు ఇష్టం లేదు. యువకులకు నచ్చజెప్పడంలో వారిని శాంతించేలా చేయడంలో మేం విఫలం అయ్యాం. చివరకు పేరు మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.''

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ పరిణామాలు, మరాఠ్వాడాలో శివసేన ఆవిర్భావం
నామాంతర్ (పేరు మార్పు వ్యతిరేక) ఉద్యమం, దాని తర్వాత కుల విభజనతో మరాఠ్వాడా రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఈ కాలంలో ఏర్పడిన రాజకీయ పగుళ్లు దశాబ్దాల తర్వాత కూడా కనిపించాయి. కానీ, ఈ సమయంలోనే శివసేన రావడం, రాజకీయంగా బలంగా చెప్పుకోదగ్గ పరిణామం. ఇక్కడ శివసేన ఎంతగా బలపడిందంటే, ఇప్పుడు మరాఠ్వాడాను శివసేన కంచుకోటగా పిలుస్తున్నారు.
శివసేన, దాని నాయకుడు బాలాసాహెబ్ థాక్రే బహిరంగంగా పేరుమార్పును వ్యతిరేకించారు. దీంతో మరాఠ్వాడాలోని దళితేతర సమాజంలో ఆయన పాపులర్ అయ్యారు.
సీనియర్ జర్నలిస్టు ప్రకాశ్ అకోల్కర్ తన పుస్తకం జై మహారాష్ట్రలో ఇలా రాశారు. "1978 తర్వాత తొలి ఏడు నుంచి ఎనిమిదేళ్లపాటు పేరు మార్పు గురించి శివసేన పట్టించుకోలేదు. అయితే, మరాఠ్వాడాలో శివసేన తన పునాదిని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్న సమయంలోనే పెద్ద సంఖ్యలో హిందువులు పేరు మార్పుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు.
"1974 వర్లీ అల్లర్లు అప్పటికే శివసేన దళిత వ్యతిరేక వైఖరిని స్పష్టం చేశాయి. ఈ కారణంగానే మరాఠ్వాడాలోని రైతులు, విద్యార్థులు శివసేన వైపు సులభంగా ఆకర్షితులు అయ్యారు. యూనివర్సిటీ పేరు మార్పును వ్యతిరేకించడం ద్వారా మరాఠ్వాడాలో శివసేనను సులభంగా బలోపేతం చేసుకోవచ్చని ఠాక్రే గ్రహించారు. దీని తర్వాత ఆయన పేరు మార్పు వ్యతిరేక ఉద్యమాన్ని, దళితుల పట్ల తన వ్యతిరేకతను మరింత తీవ్రం చేశారు.
ఈ ప్రాంతంలోని ధనిక రైతులకు అనేక ఇతర సమస్యలపై కూడా శివసేన మద్దతుగా నిలిచిందని ప్రకాశ్ అకోల్కర్ తన పుస్తకంలో రాశారు. 1985-86లో నిరుద్యోగం సమస్య తీవ్రంగా మారింది. అదే సమయంలో దళితుల ఆధీనంలోని బంజరు భూముల సమస్య కూడా తలెత్తింది. ఇటువంటి భూములపై దాడికి మద్దతు తెలిపిన శివసేన, దళితుల పంట పొలాలను కూడా ద్వంసం చేసింది. ఈ సందర్భంగా దళితుల ఇళ్లను తగులబెట్టిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి.
1985 నుంచి హిందుత్వ ఎజెండా కూడా బలపడుతోంది. దళిత వ్యతిరేక ఎజెండాతో మరాఠ్వాడాలో శివసేన వేగంగా పుంజుకుంది. ఇది శివసేనకు రాజకీయంగా ఎంతగానో లాభదాయకంగా మారింది. 1995లో బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, కేవలం మరఠ్వాడా ప్రాంతం నుంచే 15 మంది శివసేన ఎమ్మెల్యేలు గెలిచారు. ఠాక్రే, పేరు మార్పును వ్యతిరేకించడం కూడా దీనిక ఒక కారణంగా చెబుతారు.
ఎట్టకేలకు,1994లో యూనివర్సటీ పేరు మార్చినప్పుడు నాందేడ్‌లో బాలా సాహెబ్ ఠాక్రే మాట్లాడుతూ...'' మీ ఇంట్లో తినడానికి తిండి లేనప్పుడు, మీకు యూనివర్సిటీ అవసరం ఏంటి?'' అని అన్నారు.

ఫొటో సోర్స్, HTTP://WWW.BAMU.AC.IN/
చివరకు పేరును జోడించారు...
రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పేరు మార్చాలనే డిమాండ్ విరమించుకున్నప్పటికీ, అది పూర్తిగా చల్లారలేదు.
1992 అల్లర్ల తర్వాత శరద్ పవార్ తిరిగి కాంగ్రెస్‌లో చేరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక, యూనివర్సిటీ పేరు మార్చాలనే డిమాండ్ 1994లో మళ్లీ మొదలైంది.
పవార్, ఈ అంశంపై రాజకీయ మద్దతును కూడగట్టం మొదలు పెట్టారు. అప్పడు యూనివర్సిటీ పేరు మార్చడానికి బదులుగా పేరును పొడిగించాలనే సూచనలు వచ్చాయి.
అప్పుడు రెండు వర్గాల భావనలను గౌరవించేలా ''డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం'' అనే కొత్తపేరును ప్రతిపాదించారు. దీనితో పాటు మరాఠ్వాడాలోని నాందేడ్‌లో 'స్వామి రామానంద తీర్థ్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం' అనే పేరుతో మరో యూనివర్సిటీని స్థాపించారు.
పేరు జోడించడం గురించి 1994 జనవరి14న తుది ప్రకటన వెలువడింది. ఈసారి ఎలాంటి వ్యతిరేకత రాలేదు.
ఇవి కూడా చదవండి:
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- IPL 2022 GT vs RR: గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌లో విజేతగా నిలిచేదెవరు
- భారత్-నేపాల్ మధ్య ఒక నది ఎలా చిచ్చు పెడుతోంది
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
- ఆసియా దేశాలు ఆహార ఎగుమతులను ఎందుకు నిలిపేస్తున్నాయి? దీనిని ఫుడ్ నేషనలిజం అంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













