టీటీడీ: తిరుమలలో పూర్తిస్థాయి ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి.. భక్తులు, వ్యాపారులు ఏమంటున్నారు?

- రచయిత, ఎన్ తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
తిరుమలలో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణ కాలుష్యం అవుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్లాస్టిక్‌ని పూర్తిస్థాయిలో నిషేధించింది. భక్తులెవరూ ప్లాస్టిక్ కవర్లలో వస్తువులు కొండపైకి తీసుకురాకూడదని విజ్ఞప్తి చేసింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చింది.
2020 జనవరిలోనే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కవర్లను టీటీడీ నిషేధించినా అది ఒక్కసారిగా అమల్లోకి రాలేదు. క్రమక్రమంగా వీటికి భక్తులు అలవాటు పడ్డారు. వాటిస్థానంలో టీటీడీ జలప్రసాదాన్ని ఏర్పాటు చేయడంతో పాటు గాజు సీసా వాటర్ బాటిళ్ల అమ్మకాలను ప్రోత్సహించారు. ప్లాస్టిక్ కవర్ల స్థానంలో బయోడీగ్రేడబుల్ కవర్లు, స్వామివారి ప్రసాదాలకు క్లాత్ కవర్లను తీసుకువచ్చింది. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధానికి శ్రీకారం చుట్టింది.
టీటీడీ ఇన్‌చార్జి ఈఓ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్యాపారులతో అనేకసార్లు సమావేశాలు జరపామని, సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరామని టీటీడీ ఎస్టేట్ అధికారి మల్లికార్జున బీబీసీతో చెప్పారు.
''తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ దశలవారీగా నిర్ణయం తీసుకున్నాం. మొదటి దశలో వాటర్ బాటిల్స్ లాంటివి బ్యాన్ చేశాం. దాదాపుగా సంవత్సరం నుంచి ఈ వాటర్ బాటిల్స్ పైన ఎన్‌ఫోర్స్ చేస్తూ ఎవరూ కూడా వాటర్ బాటిల్స్ తీసుకురాకూడదు అని చెప్పాము. అందరికీ కూడా అవగాహన కల్పించిన తర్వాత, వాటిని తీసుకు రాకూడదు అని నిషేధించాం. యాత్రికులు దీన్ని అర్థం చేసుకొని వాటిని తీసుకు రావడం లేదు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లేస్ లో గాజు వాటర్ బాటిల్ దొరుకుతున్నాయి. ప్రతి ముఖ్యమైన కూడళ్లలో టీటీడీ జల ప్రసాదం అందజేస్తోంది. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం దిశలో పయనించాలనే ఉద్దేశంతో రెండవ దశలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో ఉన్న హాకర్స్, హోటళ్లు, షాపులు, మఠాలు.. అందరికీ జనవరిలోనే చెప్పాము. మూడు నెలల సమయం కూడా ఇచ్చాము. తిరిగి ఒక నెల మినహాయింపు కూడా ఇచ్చాము. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలి.. దానికి ప్రత్యామ్నాయంగా వేరే ఏమైనా ప్యాకింగ్ చూసుకోవాలని కూడా చెప్పాం. మే 31న మీటింగ్ పెట్టి తిరుమలలో ఉన్న స్థానికులు అందరికీ చెప్పాం. జూన్ 1 నుంచి ప్లాస్టిక్ కవరింగ్ ఉన్నది ఏవీ కూడా కొండ పైకి తీసుకు రాకూడదు అని చెప్పాము. వారి దగ్గర ఉన్న వస్తువులను కూడా డిస్పోజ్ చేస్తున్నారు'' అని మల్లికార్జున చెప్పారు.

తిరుమలలో రోజుకు 2.6 టన్నుల డ్రై వేస్ట్
స్వామివారి దర్శనానికి వెళ్లడానికి తిరుమలో మగవాళ్లు ఎక్కువగా పంచలు వాడతారు. అవి ప్లాస్టిక్ కవర్ ప్యాకింగ్ లో ఉంటాయి. చిన్న పిల్లల బొమ్మలు ప్లాస్టిక్ కవరు ప్యాకింగ్ లో వస్తాయి. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని పంచలు, బొమ్మలు, ప్లాస్టిక్ షాంపూ పొట్లాలు ప్లాస్టిక్ కవర్ ప్యాకింగ్ తో వచ్చే ఏ ఇతర వస్తువులు కూడా విక్రయించరాదని, ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని వ్యాపారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
''ఈ ప్లాస్టిక్ అంతా భూమిలో కలిసి పోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. దీనివల్ల పర్యావరణం కాలుష్యం అవుతుంది. బొమ్మలు పైన కవర్స్‌తో వస్తున్నాయి. ఆ బొమ్మలు చిన్న పిల్లలకి ఇచ్చినప్పుడు ఆ కవరు తీసి ఎక్కడపడితే అక్కడ రోడ్డుపై పడేస్తున్నారు. ఇలాంటి వాటి ప్యాకింగ్ మార్చుకోవాలని చెప్పాం. తిను బండారాలకు సంబంధించి ప్లాస్టిక్ కవర్ ప్యాకింగ్ లో ఉన్న వాటిని కూడా నిషేధించాము. వీటి పైన ఉన్న కవరు చాలా మందంగా ఉంటుంది. షాంపూలను కూడా నిషేధించాం. వీటిని విరివిగా వాడడం వల్ల తిరుమలలో ప్రతి రోజూ డ్రై వేస్ట్ 2.6 టన్నులు వస్తోంది. అందులో ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటోంది. పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా ఉండాలనే ఉద్దేశంతో తిరుమలలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. భక్తులు సహకరించాలి''అని మల్లికార్జున చెప్పారు.
ప్లాస్టిక్ బ్రష్ కవర్స్, షాంపు, తినుబండారాలు.. ఇలా ప్రతి వస్తువు పైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. ఆ కవరు ప్యాకింగ్ మార్చుకోవాలని, దీనికోసం ఇప్పటి నుంచి నిఘా పెంచితే.. కొన్నాళ్ళకు పూర్తిగా ప్లాస్టిక్ నిషేదించవచ్చని మల్లికార్జున చెప్పారు.
''ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులు తీసుకు వచ్చి తిరుమలో వేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పేపర్ కప్స్ ఉన్నాయి. వీటిని వాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హోటల్స్‌కు సంబంధించి కూడా మార్పులు వస్తున్నాయి. గాజు వాటర్ బాటిల్ కాస్ట్ 25 మాత్రమే.. తొలుత 55 రూపాయలు తీసుకుంటారు. తర్వాత బాటిల్ తిరిగి ఇచ్చేస్తే 30 రూపాయలు వెనక్కు ఇచ్చేస్తారు. వీటిపై బోర్డులు ప్రదర్శించాలని చెప్పాము. ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా పాటించాలి. అలా పాటించని వారికి జరిమానాలు వేస్తాం. ఒకటి రెండు సార్లు అదే కంటిన్యూ అయితే ఆ షాపులు సీజ్ కూడా చేస్తాం. మనమందరం బాధ్యతతో ఆలోచించి, పర్యావరణం కోసం మారాలి''అని మల్లికార్జున అన్నారు.

అమలు చేయడంలో సమస్యలు..
దీనిపై యాత్రికులు, స్థానికులు, వ్యాపారుల వాదన మరోలా ఉంది. టీటీడీ అచరణ సాధ్యమైనవి చేసినప్పుడు సహకరించామని, పూర్తి స్థాయి ప్లాస్టిక్ నిషేధం ఆచరణ సాధ్యం కాదని తిరుమల స్థానికుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ గిరి బీబీసీతో అన్నారు.
''టీటీడీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కవర్స్ బ్యాన్ చేసినప్పుడు సహరించాము. ఇప్పుడు ప్లాస్టిక్ పూర్తి స్థాయిలో బ్యాన్ అంటే.. ముడిసరుకులపై ప్లాస్టిక్ తొలగించాలంటే సాధ్యం కాదు. ఇక్కడ పంచలు ఎక్కువగా వాడతారు. వాటిపై కవర్ తీసేస్తే మాసిపోతాయి. ఎవరూ కొనరు. వాటికి అట్టప్యాకింగ్ అంటే మళ్లీ ధర పెరిగిపోతుంది. మట్టిగాజులు అయితే పేపర్లో చుట్టి ఇస్తాము. పాలిష్ వేసిన వాటికి కవర్ లేకపోతే వాటి పాలిష్ పోతుంది. బొమ్మలు లాంటివి కొన్నవారు ఇంటికి తీసుకు వెళతారు తప్ప ఇక్కడ వాడరు. ఎక్కడో చైనాలో తయారయ్యే వస్తువు కవర్ లేకుండా ఎలా వస్తుంది. అలాంటి వాటిని రీ ప్యాకింగ్ చేయాలంటే మాకు సాధ్యం కాదు. షాంపూలు, నూనేలు, కర్పూరం, కలకండ లాంటివి కవర్ లేకుండా ఎలా వస్తాయి. ఇలాంటి వాటన్నిటికీ వేరే ప్యాకింగ్ అంటే.. అలా తయారీదారుల దగ్గర నుంచే రావాలి. అది సాధ్యమా. ప్లాస్టిక్‌పై పూర్తిస్థాయి బ్యాన్ పెట్టడంవల్ల కొనే భక్తులపై కూడా భారం పడుతుంది. దీనిపై టీటీడీ పునరాలోచించుకోవాలని కోరతాం''అని గిరి అన్నారు.
అయితే అలిపిరి నుంచే భక్తుల దగ్గరున్న ప్లాస్టిక్ వస్తువులపై నిషేధాన్ని అమలు చేస్తోంది టీటీడీ. దీంతో చంటిబిడ్డలు మొదలు వృద్ధుల వరకూ ఘాట్‌రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు గొంతు తడుపుకోవడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడిందని కొందరు భక్తులు చెబుతున్నారు. కొంతమందికి ఘాట్‌రోడ్డు ప్రయాణం పడక వాంతులవుతుంటాయి. అలాంటివాళ్లు నోరు కడుక్కుని, నీళ్లు తాగాలనుకుంటారు. వారు తమతో తెచ్చుకున్న నీటిని, కూల్ డ్రింకులను కూడా టీటీడీ సిబ్బంది తీసేయడంతో ఇబ్బంది పడుతున్నారు. భక్తులనుంచి వాటర్ బాటిళ్లు తీసుకుని, వాటిలోని నీటిని పారబోసి బాటిళ్లను అక్కడినుంచి తరలించడానికి టీటీడీ పారిశుధ్య సిబ్బందిని కూడా నియమించింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఉన్న అన్ని తనిఖీ కేంద్రాల్లో వాటర్‌బాటిళ్ల గుట్టలే కన్పించాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లోనూ వాటర్ బాటిళ్లను భక్తులనుంచి టీటీడీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే వారికి దారిమధ్యలో అక్కడక్కడా కొళాయిల్లో తాగునీళ్లు లభిస్తాయి కాబట్టి పెద్దగా సమస్య ఉండదు.
పంచాయతీ, రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కలిసి తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నాయి. దీనిపై టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ బీబీసీతో మాట్లాడారు.
''తిరుమలకు ప్రతినిత్యం లక్షమంది వరకు భక్తులు వస్తుంటారు. ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు పడితే పర్యావరణం పాడవుతుంది. అందుకని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. రానున్న తరాలకి పర్యావరణాన్ని అందించాలంటే కృత్రిమంగా తయారయ్యే ప్లాస్టిక్‌ను విడనాడాలి. తిరుమలలో ఉన్న వ్యాపారస్తులు, ఇక్కడికి వచ్చే భక్తులు దీన్ని అర్థం చేసుకుని సహకరిస్తే తప్ప ఇది సాద్యం కాదు. మా వైపునుంచీ వైడ్ క్యాపెయినింగ్ తీసుకుంటాం. వ్యాపారులు దీన్ని అదనుగా తీసుకుని ధరలు పెంచుతున్నట్టు మాకు సమాచారం అందుతుంది. ఎక్కడైనా భక్తులను దోపిడీ చేస్తుంటే మేం అరికడతాం. అలిపిరి చెక్ పాయింట్ దగ్గరే తనిఖీలు చేసి ప్లాస్టిక్ తీసేసి భక్తులను కొండపైకి పంపుతున్నాం''అని నరసింహ కిషోర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- జానీ డెప్-అంబర్ హెర్డ్: మాజీ భార్యపై కేసు గెలిచి, నష్టపరిహారంగా రూ. 80 కోట్లు పొందిన హాలీవుడ్ నటుడు
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. లోక్‌సభలో బిల్లు పెట్టిన రోజు ఏం జరిగింది? ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పాత్ర ఏంటి?
- కాలి బొటనవేలు రూ. 30 లక్షలు - జింబాబ్వే పేదలు వేళ్లను అమ్ముకుంటున్నారా
- పెద్ద నోట్లను రద్దు చేసి ఆరేళ్లయినా ఇంకా నకిలీ కరెన్సీ ఎందుకు ఉంది
- నడుము నొప్పి వస్తోందా? క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు
- ఆస్ట్రేలియా: చేతిలో ఖురాన్ పట్టుకుని ప్రమాణ స్వీకారం చేసిన తొలి ముస్లిం మహిళా మంత్రి ఎవరు?
- కేరళ: ఇద్దరు లెస్బియన్ ముస్లిం అమ్మాయిల సహజీవనానికి అనుమతిచ్చిన కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















