ఆస్ట్రేలియా: చేతిలో ఖురాన్ పట్టుకుని ప్రమాణ స్వీకారం చేసిన తొలి ముస్లిం మహిళా మంత్రి ఎవరు?

ఫొటో సోర్స్, Matt Jelonek
ఆస్ట్రేలియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. కొత్త మంత్రివర్గానికి చెందిన 23 మంది మంత్రులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 10 మంది మహిళలున్నారు.
యూత్ అఫైర్స్ మంత్రి ఆనీ అలీ, పరిశ్రమల శాఖ మంత్రి ఎడ్ హుసిక్ ఆస్ట్రేలియాలో తొలి ముస్లిం మంత్రులు. ఆస్ట్రేలియాలో తొలి ముస్లిం మహిళా మంత్రి ఆనీ అలీ ఖురాన్‌ను చేతిలో పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు.
ఆస్ట్రేలియాలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో స్థానిక స్వదేశీ సమాజానికి చెందినవారు, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. దీంతో, ఈ ప్రభుత్వం దేశ చరిత్రలోనే విభిన్నమైన ప్రభుత్వంగా నిలిచింది.
పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి పార్లమెంటుకు ఎన్నికైన ఆనీ అలీ లేబర్ పార్టీలో కార్యకర్తగా పని చేసేవారు. ఆ తర్వాత ఆమె పార్టీ యూనియన్ లో సభ్యురాలిగా పని చేసి, ప్రస్తుతం మంత్రిగా ఎన్నికయ్యారు.
ఆమె ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. "నా జీవితపు ప్రణాళికలో మంత్రిగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు" అని అన్నారు.
డాక్టర్ అలీ అంతకు ముందు ఆస్ట్రేలియాలో తొలి ముస్లిం మహిళా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె తొలి ముస్లిం మహిళా మంత్రి అయ్యారు.
అలీ పెర్త్ సరిహద్దుల్లో ఉన్న కోవన్ స్థానానికి ఎన్నికయ్యారు. ఈ ప్రాంతానికి ఆస్ట్రేలియా తొలి మహిళా పార్లమెంట్ సభ్యురాలు ఎడిత్ కోవన్ పేరు పెట్టారు.
ఆనీ అలీ ఈజిప్టులో పుట్టారు. ఆమెకు రెండేళ్లు ఉండగానే ఆమె కుటుంబం సిడ్నీకి నైరుతిలో ఉన్న చిప్పింగ్ నార్టన్‌కు వలస వెళ్లారు.

ఫొటో సోర్స్, Jenny Evans
2020లో ఆనీ అలీ గృహ హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం జరగాలని డిమాండ్ చేస్తూ తనకు జరిగిన గృహ హింస గురించి ప్రస్తావించారు.
"నేను చాలా ఓపికగా ఉన్నాను. నాతో నేను గడిపాను. నాకు తగిలిన గాయాలకు మందు పూసుకుంటూ నా నొప్పిని దాచుకున్నాను. నేను నిశ్శబ్దంగా ఉన్నాను. నేను చాలా కాలం పాటు నిశ్శబ్దంగా ఉన్నాను. నొప్పిని, విచారాన్ని భరించాను. నా పిల్లల తండ్రితో బాధలు అనుభవించిన తర్వాత ఆయనను వదిలిపెట్టి బయటకు రావడం నేను తీసుకున్న కఠినమైన నిర్ణయం" అని ఆమె మీడియాతో చెప్పారు.
55 సంవత్సరాల ఆనీ అలీ రాజకీయాల్లోకి రాక ముందు ప్రొఫెసర్‌గా, విద్యావేత్తగా పని చేశారు. ఆమె తీవ్రవాదం పై పరిశోధన చేశారు.
పిల్లలు తీవ్రవాదం వైపు వెళ్లడం పట్ల ఆమె చేసిన పరిశోధన గుర్తించాల్సిన అంశం.
ఆమెకు ఎడిత్ కోవన్ యూనివర్సిటీ నుంచి పీ.హెచ్ డి డిగ్రీ సంపాదించారు. ఆమె రాజకీయాల్లోకి రాక ముందు పశ్చిమ ఆస్ట్రేలియా పరిపాలనా విభాగంలో కీలకమైన పదవులు నిర్వహించారు.
ఆనీ అలీ జీవితం స్ఫూర్తిదాయకం. ఆమె కొంతకాలం ఒంటరిగా పిల్లలను పెంచుతూ, అతి తక్కువ వేతనానికి కూడా పని చేశారు.
ఆనీ అలీకి ఫ్యాషన్ అంటే మక్కువ. ఆమె మోడల్ గా క్యాట్ వాక్ కూడా చేశారు.
ఆనీ అలీ తండ్రి టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ చదివారు కానీ, ఈ రంగంలో ఆయనకు ఉద్యోగం రాలేదు. ఆయన బస్ డ్రైవర్‌గా పని చేసేవారు.

ఫొటో సోర్స్, Jenny Evans
2.5 కోట్ల జనాభాతో కూడిన ఆస్ట్రేలియాలో సుమారు 6లక్షల మంది ముస్లింలు ఉన్నారు.
ఆనీ అలీ మంత్రి కావడం పట్ల ఆస్ట్రేలియాలోని ముస్లిం సమాజం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఆమె విజయాన్ని అభినందిస్తూ ఆస్ట్రేలియా ఫెడరేషన్ ఆఫ్ ఇస్లామిక్ కౌన్సిల్ ఆమెకు లేఖ రాసింది.
ఆస్ట్రేలియాలోని ముస్లింలు అత్యున్నత స్థానాలకు ఎదగడం ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపిస్తోందని ఇస్లామిక్ కౌన్సిల్ అధికారి కేర్ ట్రాడ్ అన్నారు.
"ఆస్ట్రేలియాలోని ముస్లిం యువత సమాజానికి సేవ చేసేందుకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఒక అవకాశంగా చూసేందుకు అలీ విజయం తోడ్పడుతుంది" అని ఆమె అన్నారు.
ముస్లింలు కూడా సమాజంలో ముఖ్యమైన భాగమని ఆస్ట్రేలియాలో ప్రజలకు ఈ విజయం సందేశాన్నిస్తుందని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆసియా దేశాలు ఆహార ఎగుమతులను ఎందుకు నిలిపేస్తున్నాయి? దీనిని ఫుడ్ నేషనలిజం అంటారా?
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











