Q4 GDP: భారత ఆర్థిక వృద్ధికి బ్రేకులు వేసిన అధిక ధరలు, ఒమిక్రాన్ - భవిష్యత్తులో మరిన్ని గండాలు తప్పవా

2021-22 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 4.1శాతంగా నమోదైంది

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్, 2021-22 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 4.1శాతంగా నమోదైంది
    • రచయిత, అర్చనా శుక్లా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ధరల పెరుగుదల, ఒమిక్రాన్ వేవ్ నిబంధనల కారణంగా 2021-2022 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు మందగించింది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం 2022 జనవరి నుంచి మార్చి వరకు (2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం - Q4) జీడీపీ వృద్ధిరేటు 4.1 శాతంగా నమోదైంది.

అంతకుముందు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం(2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం - Q3)లో ఇది 5.3 శాతంగా ఉంది.

2022 జనవరి నుంచి మార్చి వరకు త్రైమాసికంలో ఆర్థిక మందగమనానికి అధిక ధరలు ఒక కారణంగా తెలుస్తోంది. ద్రవ్యోల్బణం వరుసగా నాలుగు నెలలపాటు 6 శాతంగా నమోదైంది.

యుక్రెయిన్ - రష్యా యుద్ధంతో సప్లయ్ చైన్‌కు అంతరాయాలు కలగడంతో ధరలు పెరిగాయి. వస్తువులు, సేవలపై పెరిగిన భారం ప్రజల ఖర్చు చేసే సామర్థ్యాన్ని దెబ్బతీసింది.

2021-2022 ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతంగా ఉంది. ఇది ప్రభుత్వం వేసిన అంచనా 8.9 శాతానికి కాస్త తక్కువగా ఉంది. అంతకుముందు 2020-21 ఆర్థిక సంవత్సరం ఆర్థిక వృద్ధి 6.6 శాతంగా నమోదైంది.

నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, PMO INDIA

2021-2022 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో తయారీ రంగంలో కార్యకలాపాలు బాగా తగ్గాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొరత కారణంగా ఉక్కు, ప్లాస్టిక్‌, ఇతర పరిశ్రమల ఇన్‌పుట్ ధరలు పెరుగుతున్నాయి.

చిన్న, సూక్ష్మ పరిశ్రమల లాభాలు హరించుకుపోతున్నాయని ముంబయి శివార్లలో కిచెన్ సామగ్రి తయారు చేసే చిన్న తరహా ఫ్యాక్టరీని నడుపుతున్న కాంతిలాల్ ప్రేమ్‌జీ మారు బీబీసీతో అన్నారు. తాను కూడా చాలా నష్టపోయానని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, బందరు లడ్డూ ఇలా చేస్తారా

కాంతిలాల్ తన ఫ్యాక్టరీలో ఉపయోగించే ఉక్కు కొనడానికి గత సంవత్సరం కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పెరిగిన ప్యాకేజింగ్, రవాణా ఖర్చులతో ఆయన తన వ్యాపారాన్ని నిర్వహించలేకపోతున్నారు.

"మేం పూర్తి 8 గంటల షిఫ్టులో పని చేయలేకపోతున్నాం. కొన్ని యంత్రాలను నిలిపివేశాం. మా సిబ్బందిలో కొంతమందిని తీసేయాల్సి వచ్చింది'' అని అన్నారాయన.

వృద్ధిరేటు

ఫొటో సోర్స్, COPYRIGHTNURPHOTO

అత్యధిక సంఖ్యలో శ్రామికులు ఉండే వ్యవసాయ రంగం నిలకడగా ఉంది. జనవరి-మార్చి త్రైమాసికంలో 4.1 % వృద్ధిని సాధించింది. అయితే, ఎరువులు, అనూహ్య వాతావరణ పరిస్థితులు, ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ వంటి సేవలు, కాంటాక్ట్ ఇంటెన్సివ్ రంగాల వృద్ధి నాలుగో త్రైమాసికంలో 5.3 శాతంగా నమోదైంది. గత త్రైమాసికంలో ఇది 6.3 శాతంగా ఉంది.

రిటైల్ ద్రవ్యోల్బణం 8 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఎక్కువగా ఇంధన ధరల పెరుగుదల కారణంగా ప్రైవేట్ వినియోగాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. పెరుగుతున్న ధరలను నిరోధించడానికి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. రానున్న త్రైమాసికాల్లో వడ్డీ రేట్లు మరిన్నిసార్లు పెరిగే అవకాశం ఉంది.

రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా రోజువారీ వినియోగ వస్తువులు, సేవల ధరలు పెరుగుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వృద్ధిపై కూడా కారు మబ్బులు కమ్ముతున్నాయి. మోర్గాన్ స్టాన్లీ భారత ఆర్థిక వృద్ధి అంచనాను 7.9% నుంచి 7.6%కి తగ్గించింది.

ఒమిక్రాన్ వేవ్ నిబంధనలు కూడా వృద్ధి రేటుపై ప్రభావం చూపాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒమిక్రాన్ వేవ్ నిబంధనలు కూడా వృద్ధి రేటుపై ప్రభావం చూపాయి

వృద్ధికి ఊతమిచ్చేందుకు భారత్‌కు కొత్త పెట్టుబడులు అవసరమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. భారతదేశం తన సంస్కరణ పథాన్ని తిరిగి గాడిన పెట్టాల్సిన అవసరం ఉందని అబ్జర్వేటరీ గ్రూప్ సీనియర్ అనలిస్ట్ అనంత్ నారాయణ్ బీబీసీతో అన్నారు.

"భారతదేశం 7% నుండి 8% స్థిరమైన వృద్ధి పథంలోకి ప్రవేశించకపోవడానికి ఎటువంటి కారణం లేదు. ఈ దేశంలో పెట్టుబడులను ప్రయత్నించడానికి, వేగంగా అమలు చేయడానికి అనేక ప్రణాళికలు ఉన్నాయి. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విద్యుత్ మొదలైన వాటి మూలధన వ్యయంపై ప్రభుత్వం మునుపటి కంటే చాలా ఎక్కువ డబ్బును కేటాయించింది. దురదృష్టవశాత్తు సంస్కరణల అమలులో మన ట్రాక్ రికార్డ్ దయనీయంగా ఉంది'' అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, భూపాలపల్లి: స్వీపర్ కుమారుడు కలెక్టర్ పదవి సాధించాడు

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల, అనిశ్చిత పరిస్థితులు కూడా ప్రైవేటు పెట్టుబడుల అనుకూలంగా లేకపోవడానికి కొంత వరకు కారణమని కేర్ రేటింగ్స్ లో చీఫ్ ఎకనమిస్ట్ గా పని చేస్తున్న రజనీ సిన్హా అన్నారు.

‘‘ అంతర్జాతీయంగా కూడా ఆర్థిక మందగమనం భారత ఎగుమతుల మీద ప్రభావం చూపి ఉండవచ్చు’’ అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)