Sweet Potato: పాతకాలం చిలగడదుంపలు ఫాస్ట్‌ఫుడ్ ఎలా అయ్యాయి? జపనీయులు ఎందుకంత ఇష్టంగా తింటారు?

ఫొటో సోర్స్, Supawat Bursuk/Getty Images
- రచయిత, రస్సెల్ థామస్
- హోదా, బీబీసీ ట్రావెల్
పొయ్యి మీద నుంచి అప్పుడే తీసిన వేడివేడి చిలగడ దుంపలను తింటుంటే కలిగే ఆ ఆనందమే వేరు. యాకి-ఇమోగా పిలిచే ఈ శతాబ్ధాల నాటి తిండంటే చాలామందికి ఎంతో ఇష్టం.
పాత కాలపు పద్ధతుల్లో ఉండే వీధి వ్యాపారుల వద్ద గానీ, ఆధునిక 'ఇమోలో' గర్ల్స్, బాయ్స్ వద్ద నుంచిగానీ చాలామంది ఇష్టంగా కొంటుంటారు. కాల్చిన చిలగడ దుంపలోయ్( "యాకి- ఇమో') అంటూ వీధి వ్యాపారి వేసే ఒక్క కేక టోక్యో శివారులోని కాంక్రీటు భవనాల మధ్య ప్రతిధ్వనిస్తుంది.
ఓ చిన్న కెయి ట్రక్ నుంచి యాకి- ఇమో అంటూ రికార్డు చేసిన పాట, "ఒయిషిలి, ఒయిషిలి' (చాలా తీపి, చాలా తీపి) అన్న మాటలు వినిపిస్తాయి.
జపాన్ వర్కింగ్ క్లాస్ ప్రజల వద్ద సహజంగా కనిపించే ఈ చిన్న బళ్లనే "ఇడోహన్‌బాయ్' (సంచార అమ్మకాలు) వాహనాలుగా మార్చుతుంటారు. ఆ బండికి పైకప్పు ఉంటుంది. లోపల పొయ్యి ఉంటుంది. ధరల పట్టిక, రంగురంగుల అడ్వర్జైజ్‌మెంట్ వేలాడుతుంటాయి.
మార్చి నెలలోని ఓ సాయంత్రం వేళ చల్లని సమయంలో...ఆ బండి ఓ పార్కు చుట్టూ నెమ్మదిగా తిరిగింది. ఒక అపార్టుమెంట్ బ్లాక్ దగ్గర దాన్ని నిలిపి, ఇంజన్‌ను ఆపివేశారు. ఓ తల్లీ, కూతురు వచ్చి ఆ వ్యాపారితో కాసేపు మాట్లాడారు. వేడి వేడి చిలగడ దుంపలను చేతిలో పట్టుకొని తాపీగా నడిచి వెళ్లిపోయారు.
అక్కడే కొద్దిసేపు తచ్చాడిన ఆ బండి మళ్లీ మెల్లగా ముందుకు సాగింది. హెచ్చుతగ్గుల స్వరాలు ఉన్న శోక గీతం మాదిరిగా "యాకి-ఇమో' అన్న పాట మళ్లీ మొదలయింది.
సుషి, సుషిమి, నూడుల్స్ వంటి వంటకాలకు పేరు పొందిన జపాన్ లో చాలా సింపుల్ వంటకమైన కాల్చిన చిలగడ దుంపలు..యాకి-ఇమోకు వాటికున్నంత ప్రాధాన్యం లేదు.
కానీ, మనిషి ఆరోగ్యానికి మేలు చేసే ఈ కూరగాయకు చరిత్రలో స్థానం ఉంది. ఈ ద్వీపంలోకి బయటి నుంచి వచ్చిన ఆహార పదార్థాల్లో ఇది కూడా ఒకటి. రామెన్ నూడుల్స్ మాదిరిగా ఇది కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందే.
జపాన్ లో శీతకాలపు స్నాక్ అంటే ఇదే. పంటల కాలం ముగిసిన తరువాత వచ్చే చలి నెలల్లో జపాన్ ప్రజలు దీన్ని ఇష్టంగా తినేవారు. 1600 సంవత్సరం నుంచే ఇది జపాన్‌లో ప్రజల ఫేవరేట్ ఫుడ్ ఇది.
దుంపకు ఉండే తేమ, నమలడానికి అనువుగా ఉండే మెత్తదనం, కాల్చడంతో వచ్చిన తియ్యని వాసన...ఇవన్నీ యాకి-ఇమో అంటే ఇష్టపడేలా చేస్తాయి. వీధుల్లో ఈ బళ్లు వెళ్లినప్పుడు ఈ వాసనలే చాలా మందికి పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి.
వీటి అమ్మకాలు ప్రస్తుతం స్టోర్స్, సూపర్ మార్కెట్‌లలో అధికంగా జరుగుతున్నాయి. బళ్లు క్రమేణా కనుమరుగవుతుండడంతో చాలా మంది పాత రోజులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Chronicle/Alamy Stock Photo
వినబడని వీధి వ్యాపారుల కేకలు
వీధి వ్యాపారుల పాట వినడం చాలా అరుదయిపోయిందని ఒసాకాలోని జపాన్ ఫుడ్ స్టడీస్ కాలేజీకి చెందిన ఫుడ్ రీసెర్చర్, డైరెక్టర్‌గా పనిచేస్తున్న అయికో తనక అన్నారు.
''ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో కెయి ట్రక్కులు ఉన్నాయి. భవిష్యత్తులో వీటి మాట వినబడకపోవచ్చు కూడా. పాటలు వినబడకపోవడానికి ప్రధాన కారణం ధ్వని కాలుష్యం జరుగుతోందన్న ఫిర్యాదులే'' అని కొకి ఒనో అనే వీధి వ్యాపారి చెప్పారు.
ఆయన రెండేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నారు. హికి-యురి (సంచార వ్యాపారులు) సంఖ్య తగ్గడం కూడా ఇంకో కారణం.
ఆధునిక యాకి-ఇమో దుకాణమైన హిమిత్సు న యకి ఇమో (సీక్రెట్ రోస్టెడ్ స్వీట్ పొటాటో) సంస్థ ప్రెసిడెంట్ అసురి కమటని కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"షోవా శకం (1926-89)తో పోల్చి చూస్తే చిలగడ దుంపల బళ్లతో వచ్చే ఒజిసాన్ (అంకుల్)లు ఎప్పుడోగాని కనిపించడం లేదు. ఇది అంత తేలికైన వృత్తేమీ కాదు. ఇందుకు చాలా శారీరక బలం, సమయం కావాలి. వయసు మళ్లిన వారికి ఇది కష్టమైన పనే'' అని ఆమె అన్నారు.
దీనితోనే నెట్టుకొస్తున్నవారు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఒనో నడుపుతున్న బండి ఒనో-యా..ఇప్పుడు బిజీగా ఉండే మార్గాల్లోనే తిరుగుతోంది. ఒడక్యూ లైన్ నుంచి టోక్యో నైరుతి శివారులోని షింజుకు రైలు మార్గం వెంబడి అది వెళ్తోంది. టోక్యో ఓటా వార్డ్, కవసాకి సమీప ప్రాంతాలను కలిపే నంబులైన్‌లోనూ వ్యాపారం కొనసాగిస్తోంది.
"సింపుల్‌గా ఉండే యాకి-ఇమో స్టైల్లో పెద్దగా మార్పు లేదు' అని ఒనో చెప్పాడు.
ఆయన బండి మీద రాసిన ప్రకటనను పరిశీలిస్తే చిన్న, మీడియం, పెద్ద, భారీ దుంపలు ఉన్నాయని, ఎందులోనూ మసాలాలు లేవని పేర్కొటుంది.
ఒక్కటి మాత్రం మారింది. అదే ఆయన వ్యాపార వ్యూహం. బండి మీద ట్విటర్ పక్షి బొమ్మ, క్యూఆర్ కోడ్ రాయించారు.
చిలగడ దుంప (స్వీట్ పొటాటో) జన్మస్థానం మధ్య, దక్షిణ అమెరికా. జపాన్‌కు 17వ శతాబ్దంలో వచ్చినట్టు కొందరు చెబుతున్నారు.
"జపాన్ చరిత్రలో చిలగడ దుంప ప్రస్తావన తొలిసారిగా 1615లో రిచర్డ్ కాక్స్ డైరీలో ఉంది" అని ఎరిక్ రాత్ చెప్పారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ కన్సాస్‌లో జపనీస్ హిస్టరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జపాన్స్ క్యూజినెస్: ఫుడ్, ప్లేస్ అండ్ ఐడెంటిటీ అనే పుస్తకాన్ని ఆయన రాశారు.
హిరాదో అవుట్‌పోస్టులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్‌గా పనిచేసిన కాక్స్ తన డైరీలో..తాను సమురాయ్ విలియం ఆడమ్స్ నుంచి చిలగడ దుంపలను స్వీకరించినట్టు పేర్కొన్నారు. ఆడమ్స్‌ను జపాన్‌లోని తొలి ఇంగ్లిష్ వ్యక్తిగా పరిగణిస్తుంటారు.
రుక్యు రాజ్యం (ప్రస్తుత ఒకినవ)లో 1605 నాటికే చిలగడ దుంపలు దొరుకుతుండేవనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయని ప్రొఫెసర్ రాత్ చెప్పారు. అవి తొలుత ఫిలిప్పీన్స్, అనంతరం చైనా నుంచి వచ్చినట్టు ఉందని తెలిపారు.

ఫొటో సోర్స్, Kōki Ono
మరో కథనం ప్రకారం 1611లో రుక్యు రాజు షో నెయి..సత్సుమ రాజ్యానికి చిలగడ దుంపలను బహుమతిగా పంపించారు.
దక్షిణ క్యుషు ప్రాంతంలో బలంగా ఉన్న ఆ రాజ్యం రుక్యుపై దండయాత్ర చేసి ఆక్రమించుకుంది. అనంతర పరిణామాల్లో ఈ బహుమతిని అందజేసింది. అందుకే ఇప్పటికీ వీటిని సత్సుమ-ఇమో (సత్సుమ చిలగడలు)గా వ్యవహరిస్తుంటారు.
ఇవి ఏ మార్గంలో వచ్చాయన్నదాన్ని పక్కన పెడితే జపాన్‌లో మాత్రం కాల్చిన చిలగడ దుంపలు చాలా పాపులర్ అయ్యాయి.
పోస్టాఫీసులు ఉన్న పట్టణాల్లోని మెయిన్ గార్డు బిల్డింగులు, ప్రధాన రహదారి మార్గాల్లో స్టాల్స్ ఏర్పాటయ్యాయి. వాటి తియ్యదనం, వాసన, అందుబాటులో ఉండే ధర అందర్నీ ఆకర్షించాయి.
"కురి-యొరి-ఉమయ్' (జీడి పప్పు కన్నా మంచివి) అన్న ప్రకటనలు షాపుల వద్ద వెలశాయి.
"టోక్యోలో చాలా మంది ఒకాయు (బియ్యం, బార్లీతో చేసిన పాయసం)తో కలిపి తినేవారు' అని ప్రొఫెసర్ రాత్ చెప్పారు.
యాకి-ఇమో ఇష్టమైన స్నాక్ ఐటంగా గుర్తింపు పొందింది. టోక్యో పత్రిక యోమురి షింబున్ 1891 మే 8న ఈ విషయమై రాస్తూ "విద్యార్థులకు ఇవి కసుతేరా (పోర్చుగీసు పద్ధతిలో తయారు చేసే స్పాంజ్ కేక్)గా మారాయి. చిన్న చిన్న వీధుల్లో నివసించే వారికి యోకాన్ (ఎర్ర చిక్కుళ్లతోచేసే గట్టి జెల్లీలాంటి స్వీట్)లాంటిద'ని అభివర్ణించింది.
ఆ రోజుల్లో దొరికే స్వీట్సు కన్నా ఉడకబెట్టిన చిలగడ దుంపలే మంచివని, చౌకైన ప్రత్యామ్నాయమని చెప్పడమే ఆ పత్రిక ఉద్దేశం.
శతాబ్దం తిరిగే నాటికి చిలగడ దుంపలతో రకరకాల పదార్థాలు చేయడంపై విద్యార్థులు దృష్టి పెట్టారు. అలా తయారు చేసిందే డైగాకు-ఇమో (యూనివర్సిటీ స్వీట్ పొటాటో). చిలగడ దుంపల ముక్కలను బెల్లం పాకంలో నానబెట్టడం ద్వారా దీన్ని తయారు చేసేవారు.
టోక్యో యూనివర్సిటీ సమీపంలోని కాండాలో ఈ స్వీటును తొలిసారిగా విక్రయించడంతో దానికి ఆ పేరు వచ్చింది.
"1905 నాటికి టోక్యోలో 1,300 యాకి-ఇమో ప్రదేశాలు ఉండేవి" అని రాత్ తెలిపారు.
యాకి-ఇమో అల్పాదాయ వర్గాల వారికి ప్రధానమైన శీతాకాల ఆహారంగా మారడంతో 20 శతాబ్దం తొలినాళ్లలో చిలగడ దుంపల షాపులు, వ్యాపారులు భారీ సంఖ్యలో దర్శనమిచ్చారు.
అయితే రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942లో ఆహారంపై నియంత్రణలు విధించడంతో పరిస్థితి మారింది.
ప్రధాన ఆహార నియంత్రణ చట్టం కింద బియ్యం, చిలగడ దుంపలు, ఇతర ఆహార పదార్థాలకు రేషన్ విధించారు. ఫలితంగా చాలా స్వీట్ పొటాటో షాపులు మూతపడ్డాయి.
అయితే యుద్ధం కారణంగా గోదుమలు, బార్లీకి మరింత కొరత ఏర్పడడంతో చివరకు చిలగడ దుంపలనే ప్రధాన ఆహారంగా తీసుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Kōki Ono
"గోదుమ పిండికి ప్రత్యామ్నాయంగా చిలగడ పిండిని ఉపయోగించారు" అని రాత్ చెప్పారు.
"1944 నుంచి ప్రభుత్వ భూములను చిలగడ దుంపల పంటకు వినియోగించారు. 1945 నుంచి పబ్లిక్ రేషన్ షాపుల ద్వారా అతితక్కువ మొత్తంలో సరఫరా చేసిన బియ్యం బదులు చిలగడ దుంపలు ఇచ్చారు" అని వివరించారు.
యుద్ధం అనంతరం స్టేపుల్ ఫుడ్ కంట్రోలు యాక్ట్‌ను సవరించి, స్వీట్ పొటాటోపై ఉన్న ప్రభుత్వ ఆంక్షలు ఎత్తివేశారు. దాంతో వీధుల్లో వ్యాపారులు మళ్లీ కనిపించారు.
అప్పుడే కెయి ట్రక్కుల వెనుక భాగంలో చిన్న పొయ్యిని అమర్చడం ప్రారంభించారు. మరికొన్ని సంవత్సరాల్లో వీటి ప్రజాదరణ తారాస్థాయికి చేరింది.
"1970 వరకు యాకి-ఇనో సామాన్యులకు ఒకరకమైన ఫాస్ట్ ఫుడ్‌గా ఉండేది. అనంతరం అమెరికా తరహా స్నాక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లు జపాన్‌లో ఏర్పాటయ్యాయి" అని తనక చెప్పారు.
ఈ క్లాసిక్ ఫుడ్ కు ఇంకా అభిమానులు ఉన్నారనడానికి ఒనో సాధించిన విజయమే ఒక ఉదాహరణ. "జపాన్‌లో వసంతం, శీతకాలాల్లో వీటిని తినడం ఒక సంప్రదాయంగా మారింది" అని తనక అన్నారు. ఆయన ప్రతి రోజూ సగటున 100 యాకి-ఇనోలు అమ్ముతుంటానని తెలిపారు. తన కస్టమర్లలో ఏడేళ్ల నుంచి 90 ఏళ్ల వయసు వారు కూడా ఉన్నారు.
రోస్టెడ్ స్వీట్ పొటాటోకు ఇంత ఆదరణ ఉండడానికి వాటికున్న చిరకాల వారసత్వం మాత్రమే కారణం కాదని ఒనో చెప్పారు. ఆరోగ్యకరమైనది, కల్తీ లేనిది, చాలా కంఫర్ట్‌గా ఉండే ఫాస్ట్ ఫుడ్ కావడం వల్లనే అందరూ ఇష్టపడుతున్నారని వివరించారు.
కొవిడ్ మహమ్మారి సమయంలో దీని పాపులారిటీ మరింతగా పెరిగింది. "ప్రజలంతా ఇంట్లోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. ఈజీ-టు- పర్చేజ్ హెల్త్ ఫుడ్స్ వైపే అందరు దృష్టి పెట్టారు. అందుకే ఎక్కువ మంది వినియోగదారులు మా బళ్ల వద్దకు వచ్చేవారు" అని ఒనో చెప్పారు.
అయితే, ఆధునిక తరం యువతీయువకులు ఇవి పాతకాలపు వంటకాలుగా పరిగణించడం కూడా కనిపిస్తుంది. "యువతులు ఎక్కువగా స్వీట్ పొటాటోను ఇష్టపడుతారు. ఇవి 'పాతకాలపు పద్ధతులకు చెందినవి', 'నాటు'వి ఉన్న భావన వారిలో ఉంటుంది. 'వీటిని తినాలని అనుకుంటుంటాను. కానీ కొనాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది'అని చెప్పేవారూ ఉన్నారు" అని కమటని అనే మహిళ వివరించారు.
ఈ భావన తొలగించడానికి ఆమె ఒంకోచిషిన్ పై దృష్టి కేంద్రీకరించారు. ఈ జాతీయానికి అర్థం 'గత కాలం నుంచి కొత్త ఐడియాలు తెలుసుకోవడం'.
అందుకే చాలా కొత్త పద్ధతిలో 2018లో ఆమె వ్యాపారాన్ని ప్రారంభించారు. చాలా స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా ఉండేలా గులాబీ రంగు క్యాంపర్ వ్యాన్‌లో వ్యాపారాన్ని మొదలు పెట్టారు. 2021లో టొక్యోలో ఫ్యాషన్‌బుల్ ప్రాంతంగా పేరుపొందిన ఒమొటెసాండోలోని ఓ స్టోర్ ముందు శాశ్వతంగా ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
'సేల్స్ స్టాఫ్.. ఇమో గర్ల్స్, ఇమో బాయ్స్...అంతా చాలా ప్రభావశీలురు. వారంతా కూల్‌గా, ఫ్యాషన్‌బుల్‌గా ఉండే యువతీ యువకులు' అని ఆమె వివరించారు.
కమిటని నవీన పద్ధతుల్లో వ్యాపారం చేస్తున్నప్పటికీ, కస్టమర్లను ఆకర్షించడానికి పాతకాలపు వెండర్లు అనుసరిస్తున్న విధానాలను ఆమె బాగా గుర్తించారు.
"వారు కనుమరుగవుతారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వారు చాలా 'రేర్' అన్న భావన ప్రజల్లో ఉంది. అరుదైన వ్యక్తుల నుంచి కొనుగోలుచేయాలన్న ఆకర్షణ కొందరు కస్టమర్లలో ఉంటుంది. అందుకే అలాంటి వారు ఆ వ్యాపారుల వద్దే కొనుగోలు చేస్తారు. ఈ కారణంగా ఆ తరహా వ్యాపారానికీ కొంత డిమాండ్ ఉంటుంది" అని ఆమె తెలిపారు.
మిగతా వాటితో పోల్చితే జపాన్‌లో ఎవరైనా యాకి-ఇమో ట్రక్ ద్వారా వ్యాపారం చేయాలనుకుంటే దాన్ని ప్రారంభించడం చాలా సులువే.
ఇతర ఆహార పదార్థాల వ్యాపారాల మాదిరిగా దీనికి ఫుడ్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ట్రక్ ద్వారా అమ్ముకోవడానికి పర్మిట్ తీసుకుంటే సరిపోతుంది.
ఇందుకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి యాకి-ఇమో కొబో (యాకి-ఇమో వర్క్‌షాప్) పేరుతో ఓ కంపెనీయే ఉంది. వారికి కావలసిన అన్ని వస్తువులను విక్రయిస్తుంది. సంచార దుకాణం ప్రారంభించడానికి కావలసిన అన్ని సరకులు అంటే యాకి-ఇమో పాట క్యాసెట్ దగ్గర నుంచి అన్నీ ఇక్కడ దొరుకుతాయి.
"ఈ ఫుడ్ వెండర్లంటే ఇష్టపడడంతో పాటు, జ్ఞాపకాల దొంతర్లలోకి వెళ్తుండడం క్రమేణా పెరుగుతోంది. ఈ కారణంగానే ఆ వ్యాపారం కొనసాగుతుంది. రుతువులు మారాయనడానికి సూచనగా వారు వస్తుంటారు. వారు లేని నగర దృశ్యాలను ఊహించడం కష్టం" అని రాత్ అన్నారు.
వ్యాపార రహస్యాన్ని తనక చెబుతూ "సింపుల్‌గా ఉండడమే దీని సీక్రెట్. కాల్చిన చిలగడ దుంపలు సహజంగానే తియ్యగా ఉంటాయి. పొయ్యి నుంచి తీసిన వెంటనే తినేయొచ్చు. మంచి బలవర్థకం. జంక్ ఫుడ్‌కు ప్రత్యామ్నాయమైన మంచి స్నాక్. యాకి-ఇమో అంటే ఓ భావోద్వేగంతో కూడిన విందు. ఆనందకరమైన మధుర క్షణాలు దానితో పాటే ఉంటాయి" అని రాత్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- కోనసీమకు ఆ పేరు ఎలా వచ్చింది?
- ఎవరీ అన్యం సాయి.. వైసీపీయా, జనసేనా? ఆయనది ఏ పార్టీ
- ‘మంటలు ఆర్పడానికి వెళ్తే మా అగ్నిమాపక వాహనాలనూ తగలబెడతామని బెదిరించారు’
- అస్సాం వరద ప్రాంతాల్లో బురదలో నడిచి వెళ్తున్న ఈ తెలుగు ఐఏఎస్ అధికారిణి ఎవరో తెలుసా
- ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాలనే బీజేపీ డిమాండ్, హిందువులకే చేటు చేస్తుందా?
- అంబేడ్కర్ పుట్టిన గడ్డపై ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినప్పుడు ఎందుకంత హింస చెలరేగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















