కోనసీమ: ఎవరీ అన్యం సాయి.. వైసీపీయా, జనసేనా? ఆయనది ఏ పార్టీ

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో చోటు చేసుకున్న హింస చుట్టూ ఇప్పుడు రాజకీయ దుమారం సాగుతోంది. ఈ హింస వెనుక ఉన్నదెవరన్న చర్చ అంతటా జరుగుతోంది.
వైసీపీకే చెందిన ఓ కౌన్సిలర్ పాత్ర ఉందంటూ మంత్రి పినిపే విశ్వరూప్ చెబుతుండగా అన్యం సాయి అనే రాజకీయ పార్టీ కార్యకర్త ఒకరి పేరూ అంతటా వినిపిస్తోంది.
ఆయన మీ పార్టీ వాడంటే మీ పార్టీ వాడంటూ వైసీపీ, జనసేన నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
పెద్ద ఎత్తున జరిగిన హింసలో మంత్రి విశ్వరూప్ ఇంటినీ ఆందోళనకారులు తగలబెట్టారు. హింసకు ప్రణాళికలు రచించినవారు తమ పార్టీ కౌన్సిలర్ ఒకరితోనూ సంప్రదింపులు జరిపారని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని మంత్రి విశ్వరూప్ అన్నారు.
వైసీపీ నేతలే ఈ హింసకు కారణం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు.
మరోవైపు ఈ హింసకు కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్యం సాయి జనసేన కార్యకర్త అని వైసీపీ చెబుతుండగా... వైసీపీ కీలక నేతలకు ఆయన సన్నిహితుడంటూ టీడీపీ, జనసేనలు ఆరోపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, UGC
అన్యం సాయి - అందరితో ఫొటోలు
కోనసీమ జిల్లా పేరుని కొనసాగించాలనే డిమాండ్‌తో తొలుత మే 20న ఆందోళనలు జరిగాయి. ఆ సందర్భంగా అమలాపురం కలెక్టర్ కార్యాలయాన్ని వేల మంది ముట్టడించారు.
ఆ సమయంలో అన్యం సాయి అనే వ్యక్తి ‘కోనసీమ జిల్లా పేరు మారిస్తే ఆత్మహత్య చేసుకుంటాను’ అని హెచ్చరించారు.
ఒంటిపై పెట్రోలు పోసుకుని అలజడి సృష్టించారు.
దాంతో అన్యం సాయి జనసేన పార్టీ కార్యకర్త అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా పేరు మార్చాలని దీక్ష చేసిన జనసేన కార్యకర్తలే ఇప్పుడు పేరు మార్చిన తర్వాత రాజకీయంగా వివాదం సృష్టిస్తున్నారనే విమర్శలకు దిగింది. పవన్ కల్యాణ్ సభా వేదికపై అన్యం సాయి ఉన్నారంటూ వైసీపీ కొన్ని ఫోటోలు ప్రచారంలోకి తెచ్చింది.
దీన్ని తిప్పికొడుతూ జనసేన, మిగతా విపక్షాలు అన్యం సాయి ఫోటోలు మరిన్ని ప్రచారంలోకి తెచ్చాయి. వాటిలో.. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారితో అన్యం సాయి ఉన్న ఫోటోలున్నాయి.
దీంతో అన్యం సాయి జనసేన కార్యకర్తా? వైసీపీ కార్యకర్తా? అనే చర్చ మొదలైంది.

ఫొటో సోర్స్, UGC
ఇంతకీ ఆయనెవరు?
"అన్యం సాయి అమలాపురంలో ఓ సాధారణ రాజకీయ కార్యకర్త. అన్ని సందర్భాల్లోనూ ముందుండాలని ఆశిస్తూ ఉంటారు. ఆయన మీద పోలీసు కేసులున్నాయి. గతంలో జనసేన శ్రేణులతో కలిసి తిరిగారు. ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. స్థానిక నాయకులతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. కోనసీమ జిల్లా పేరు కోసం సాగుతున్న ఉద్యమంలో ఆయన నాయకత్వం వహించేటంత పరిస్థితి లేదు. కానీ ఆత్మహత్యాయత్నం ఘటన బాగా ప్రచారం కావడంతో ఆయన పేరు చుట్టూ రాజకీయం సాగుతోంది" అని రిటైర్డ్ పోలీస్ అధికారి ఎం.రాజగోపాల్ చెప్పారు.
అన్యం సాయి మీద రౌడీ షీట్ ఉందన్న ప్రచారం నేపథ్యంలో కోనసీమ జిల్లా పోలీసులను బీబీసీ సంప్రదించింది. కానీ, దీనిపై వారి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు.
మరోవైపు అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా అమలాపురంలో ప్రచారమవుతోంది.

ఫొటో సోర్స్, UGC
‘వంగవీటి రంగా హత్య తరువాత మళ్లీ ఇప్పుడే ఇలా’
కోనసీమలో శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో మొబైల్ సర్వీసుల నియంత్రణ మొదలైంది. కోనసీమ వ్యాప్తంగా ఇంటర్ నెట్ సేవలపై ఆంక్షలు విధించారు. సోషల్ మీడియాలో వదంతుల వ్యాప్తికి కొందరు ప్రయత్నిస్తున్నారని, దానిని కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని కోనసీమ జిల్లా పోలీసులు బీబీసీకి తెలిపారు.
1988లో వంగవీటి రంగా హత్య అనంతరం కోనసీమలో చెలరేగిన అల్లర్ల తర్వాత భారీ విధ్వంసం ఇప్పుడే జరిగిందని సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ ప్రసాద్ బీబీసీతో అన్నారు.
"మూడున్నర దశాబ్దాల్లో అనేక ఉద్యమాలు జరిగాయి. నిరసనలు అదుపు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇంత భారీ విధ్వంసం గతంలో ఎన్నడూ లేదు. ఒక మంత్రి ఇంటిని తగులబెట్టిన సందర్భం కోనసీమ చరిత్రలో లేదు. ఏపీలో కూడా ఇలాంటివి చాలా అరుదు. ఈ స్థాయిలో అల్లరిమూకలు రెచ్చిపోతున్నా కట్టడి చేయలేకపోవడం ఊహించనిది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ఇంటర్‌నెట్ సేవలు పాక్షికంగా నిలిపివేయడం సామాన్యులకు చాలా సమస్యగా మారిందని ప్రసాద్ అన్నారు.
మరోవైపు పోలీసు దర్యాప్తు వేగవంతమైంది. మంగళవారం అమలాపురం పట్టణంలో జరిగిన పరిణామాలకు కారకులుగా పలువురు అనుమానితుల జాబితా సిద్ధమయ్యింది.
వారిలోఇప్పటి వరకూ 70 మందిని అరెస్ట్ చేసినట్టు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు వెల్లడించారు.
అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 100కి పైగా ఉందని, వారిలో కొందరిని విచారించి ఇంటికి పంపించగా, మరికొందరు పోలీసుల కస్టడీలో ఉన్నారని కోనసీమ జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు బీబీసీకి తెలిపారు.

ఇంకా పోలీసుల కనుసన్నల్లోనే..
24వ తేదీ నాటి పరిణామాలతో అప్రమత్తమైన పోలీస్ శాఖ ఉన్నత స్థాయి అధికారులతో పాటుగా పెద్ద సంఖ్యలో సిబ్బందిని కోనసీమలో మోహరించింది.
బుధవారం ఉదయం నుంచి కోనసీమను పోలీస్ కట్టడిలోకి తీసుకున్నారు. అనేక ఆంక్షలు విధించారు. సెక్షన్ 144తో పాటుగా, 30 పోలీస్ యాక్ట్ కూడా కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.
అదే సమయంలో అమలాపురం సహా ప్రధాన పట్టణాల్లో కవాతు నిర్వహించారు. అడుగడుగునా ప్రత్యేక బలగాలతో తనిఖీలు నిర్వహించారు.
కోనసీమ వ్యాప్తంగా సుమారు 2వేల మంది అదనపు బలగాలతో పహారా సాగిస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బీబీసీకి తెలిపారు.
గురువారం కూడా పోలీస్ గస్తీ కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, UGC
పరిస్థితి అదుపులోకి వచ్చిందా
కోనసీమలో మంగళవారం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన పరిణామాలు అపార నష్టానికి కారణమయ్యాయి. దానిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఓ నివేదిక రూపొందించింది. కేంద్రానికి కూడా ప్రాథమిక నివేదిక పంపించింది.
మే 24 మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగిన పరిణామాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని హోం మంత్రి తానేటి వనితి బీబీసీకి తెలిపారు.
"పోలీస్ దర్యాప్తు సాగుతోంది. ఏ పార్టీ వారయినా, ఎంతటి స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదు. చట్ట ప్రకారం చర్యలుంటాయి. ఇప్పటికే పరిస్థితి అదుపులోకి వచ్చింది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకూ పోలీసు భద్రత కొనసాగిస్తాం. ఎవరికీ ఆందోళన అవసరం లేదు" అంటూ ఆమె వివరించారు.
( గమనిక: ఈ కథనంలో అన్యం సాయి వివిధ పార్టీల నేతలతో ఉన్న ఫొటోలను బీబీసీ స్వయంగా ధ్రువీకరించలేదు. ఇవి సోషల్ మీడియాలో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు షేర్ చేసినవి )
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు వద్దంటూ ఎందుకీ నిరసనలు... అసలేం జరుగుతోంది?
- టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలతో పాటు 21 మంది మృతి
- వరల్డ్ థైరాయిడ్ డే: ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు, కారణాలేంటి?
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











