అమలాపురం: మంత్రి విశ్వరూప్ ఇంటికి చేరుకోవడానికి అగ్నిమాపక సిబ్బందికి 4 గంటలు ఎందుకు పట్టింది

అమలాపురంలో మంటల్లో కాలిపోయిన ఇల్లు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అమలాపురంలో ఆందోళనకారులు నిప్పుపెట్టిన మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి అగ్నిమాపక కేంద్రం కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే, అక్కడికి చేరుకోవడానికి అగ్నిమాపక సిబ్బందికి 4 గంటల సమయం పట్టింది.

అతి కష్టం మీద మంత్రి ఇంటికి 200 మీటర్ల దూరం వరకు చేరుకున్న ఫైర్ సిబ్బంది అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదు.

మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురంలో 3 గంటల తర్వాత ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు, కలెక్టర్ కార్యాలయంతో పాటు సమీపంలోని బస్సులకు ఆందోళన కారులు నిప్పుపెట్టారు.

రాత్రి 11 గంటల వరకు ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే పనిలోనే ఉన్నారు. మంటల్లో తగలబడిన నివాసాలు, వాహనాలు అన్నీ కూడా కిలోమీటరు, రెండు కిలోమీటరు పరిధిలోనే ఉన్నా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోవడానికి ఎందుకు అన్ని గంటల సమయం పట్టింది?

ఫైర్ సిబ్బంది ఆందోళనకారులను దాటుకుని మంత్రి ఇంటి వద్దకు ఎందుకు వెళ్లలేకపోయారు?

ఈ విషయాలపై అమలాపురం అగ్నిమాపక కేంద్రం స్టేషన్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు బీబీసీతో మాట్లాడారు. మంగళవారం జరిగిన ఆందోళన సమయంలో ఫైర్ సిబ్బంది ఏం చేశారు, ఏం చేయలేకపోయారన్నది ఆయన మాటల్లోనే...

విశ్వరూప్ ఇల్లు

‘వెనక్కి వెళ్లండి...లేదా మీ వాహనాన్నీ తగలబెట్టేస్తాం’

‘‘సాయంత్రం 4.50 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో బస్సు తగలబడుతుందని మాకు ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్నాం. అయితే అక్కడ అప్పటికే వందల సంఖ్యలో ఉన్న పెద్ద గుంపు కనిపించింది. వాళ్లు మమ్మల్ని లోపలికి వెళ్లనివ్వలేదు. ఎంతో ప్రయత్నం చేశాం.

మాకు వంద మీటర్ల దూరంలోనే బస్సు తగలబడుతోంది. అయినా మేం అక్కడికి వెళ్లలేకపోయాం. నిజం చెప్పాలంటే సాహసం చేయలేకపోయాం. ఎందుకంటే అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తే మీ వాహనాన్ని కూడా తగలబెడతామని ఆందోళకారులు మమ్మల్ని హెచ్చరించారు.

మా వాహనం డోర్లు పీకేసే ప్రయత్నం చేశారు. కొందరు వాహనం టైర్ల కింద పడుకున్నారు. మరికొందరు మా వైపు దూసుకుని వస్తున్నారు. దాంతో ఏం చేయాలో తెలియలేదు.

చాలాసేపటి తర్వాత ఆందోళనకారుల గుంపు అక్కడ నుంచి నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయింది. అప్పటికీ ఇంకా బస్సు తగలబడుతూనే ఉంది. ఆందోళనకారులు వెళ్లిపోవడంతో వెంటనే మేం తగలబడుతున్న బస్సు మంటలను ఆర్పేశాం. అక్కడ నుంచి ముందుకు వచ్చి అక్కడ ఉన్న కాలువ నుంచి ట్యాంకర్‌లోకి నీళ్లు పట్టుకున్నాం’’

అమలాపురంలో మంటల్లో కాలిపోయిన ఇల్లు

‘ఫోన్ మోగింది... మంత్రి ఇల్లు తగలబడుతుందని...’

‘మా వాహనంలో నీళ్లు పట్టుకుంటుండగా... నా ఫోన్ మోగింది. కలెక్టర్ కార్యాలయం నుంచి వెళ్లిన ఆందోళనకారులు నేరుగా మంత్రి ఇంటికి వెళ్లారని... అక్కడ ఆయన ఇంటిని తగులబెట్టారని పోలీసుల నుంచి వచ్చిన ఫోన్ అది.

వెంటనే మేం అక్కడ నుంచి బయలుదేరి ఎర్రవంతెన దగ్గరకు అతి కష్టం మీద చేరుకున్నాం. అక్కడ నుంచి ఆందోళనకారులు మా వాహనాన్ని కదలనివ్వలేదు.

అయితే అక్కడ నుంచి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాం. కానీ మాపై రాళ్లు రువ్వారు. దాంతో వాహనాన్ని వెంకటేశ్వర స్వామి గుడి వైపు మళ్లించాం. మమ్మల్ని చాలా దూరం వెంబడించారు.

మంత్రిగారి ఇల్లు తగలబడిపోయిందని మాకు వరుస ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మాకు అక్కడికి వెళ్లేందుకు అవకాశం దొరకలేదు.

ఈలోగా...ఎర్రవంతెన వద్ద మరో రెండు బస్సులు తగలబడుతున్నాయని మళ్లీ ఫోన్లు రావడం మొదలైంది. కానీ మమ్మల్ని వెళ్లనివ్వడం లేదు. అంతకు ముందే సమీపంలో ఉన్న ముమ్ముడివరం, రాజోలు, కొత్తపేట ఫైర్ స్టేషన్లకు సమాచారం ఇవ్వడంతో అక్కడ నుంచి ఫైర్ వెహికల్స్ వచ్చాయి.

కానీ ఆందోళనకారులు మమ్మల్ని మంటలు ఆర్పనివ్వలేదు. మేం కొంచెం సాహసించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినా మమ్మల్ని కొట్టేందుకు వారు సిద్ధమయ్యారు’’ అని చెప్పారు అమలాపురం అగ్నిమాపక కేంద్రం స్టేషన్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు.

కేవీ మురళీ కొండబాబు

ఫొటో సోర్స్, lakkoju srinivas

‘ఈ సారి ఎమ్మెల్యే ఇంటికి నిప్పంటించారని మరో ఫోన్’

‘ఎర్రవంతెన వద్ద రెండు బస్సులు, మంత్రి పినిపే విశ్వరూప్ ఇల్లు తగులబడుతూనే ఉన్నాయి. అప్పటికే రెండు గంటలు గడిచింది. ఆందోళనకారులు మమ్మల్ని కదలనివ్వడం లేదు. ఇలోగా ఎమ్మేల్యే పొన్నాడ సతీశ్ ఇల్లు తగలబడుతోందని మరో ఫోన్, దానితో పాటు వరుస ఫోన్లు వస్తూనే ఉన్నాయి. దీంతో మేం ముమ్మిడివరం గేటు నుంచి వచ్చే ప్రయత్నం చేశాం. చుట్టూ తిరిగి పొన్నాడ సతీశ్ ఇంటికి చేరుకున్నాం. అప్పటికే అక్కడ ఫైర్ కంట్రోల్ లోకి వచ్చింది. అక్కడ నుంచి చూస్తే తగలబడుతున్న బస్సులు కనిపిస్తున్నాయి. మళ్లీ అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశాం. మాపై రాళ్లు విసురుతున్నారు. పోలీసులు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. ఇంతలో మంత్రి పినిపే విశ్వరూప్ కట్టుకుంటున్న కొత్త ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

‘వరుస సంఘటనలు...వృథా ప్రయత్నాలు’

అమలాపురం పేరు మార్చవద్దంటూ జరిగిన ఆందోళనలు మధ్యాహ్నం 3 గంటల నుంచే తీవ్ర రూపం దాల్చాయి. అయితే మాకు మాత్రం సాయంత్రం 4.50కి మొదటి ఫోన్ వచ్చింది. దాని తర్వాత వరసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మేం అమలాపురంలోని అన్ని వైపుల నుంచి కదిలినా...అగ్నికి ఆహుతవుతున్న బస్సులను, ఎమ్మెల్యే, మంత్రి ఇళ్లను మాత్రం చేరుకోలేకపోయాం. దీంతో మా ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. మేం మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తే మా వాహనాలను తగలబెట్టేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. అయినా మేం ముందుకు వెళ్లేందుకే ప్రయత్నించాం.

పోలీసుల సహకారంతో ప్రమాద స్థలానికి వెళ్లేందుకు చాలా ప్రయత్నం చేశాం. కానీ అప్పటికే పోలీసులని ఆందోళనకారులు ఖాతరు చేయలేదు. వాళ్లలో చాలా మందికి దెబ్బలు తగిలాయి. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసురుతూనే ఉన్నారు, దాంతో పాత్రికేయులు, స్థానికులను దూరంగా తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. వాళ్ల పరిస్థితే అలా ఉంటే మాకు అండగా నిలబడే వారు ఎవరు లేకుండా పోయారు. దీంతో మంటలను అదుపు చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి’ అని వివరించారు.

వీడియో క్యాప్షన్, వైసీపీ ప్రకటించిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు తెలంగాణవారు

‘మధ్యాహ్నం 3కి మొదలైన మంటలను రాత్రి 11కి ఆర్పగలిగాం’

‘నేను డిపార్టుమెంట్‌లో చేరినప్పటి నుంచి ఎన్నో ఆందోళనలు చూశాను. కానీ ఇలాంటి ఆందోళనలు మాత్రం ఎప్పుడూ చూడలేదు.

ఎదురుగా మంటల్లో తగలబడుతున్న ఇళ్లు కనిపిస్తున్నాయి. కానీ అక్కడకు వెళ్లేందుకు ఆందోళనకారులు ఒప్పుకోలేదు. వీరిలో ప్రజలు కూడా ఉన్నారు. అసలు ఎందుకు అంత వైలెంట్‌గా ప్రవర్తించారో అర్థం కాలేదు. అడుగు ముందుకు వేస్తే ఊరుకునేది లేదని ఆందోళనకారులు మమ్మల్ని ఎక్కడికక్కడ హెచ్చరించారు.

ఒక్కొక్కచోట నుంచి ఆందోళనకారులు వెళ్లిపోతుంటే...అక్కడ మేం మంటలను ఆర్పే వాళ్లం. ఇలా చేసుకుంటూ పోతే చివరకు రాత్రి 11 గంటల సమయానికి చివరి నిప్పుని అర్పగలిగాం’ అన్నారు కేవీ మురళీ కొండబాబు.

వీడియో క్యాప్షన్, పోలవరం డయాఫ్రమ్ వాల్ ఎందుకిలా అయింది?

‘మాకు చాలా భయం వేసింది’

మంటల్లో తగలబడిపోయిన మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటి వద్ద స్థానికులతో బీబీసీ మాట్లాడింది. మధ్యాహ్నం మూడున్నర, నాలుగు గంటల మధ్యే మంత్రి ఇంటికి నిప్పు పెట్టారని వారు చెప్పారు. అయితే ఆ సమయంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఎవరు అక్కడికి రాలేదని, మంత్రి ఇల్లు గలబడుతున్నా ఎవరూ ఆర్పే ప్రయత్నం మాత్రం చేయలేదని చెప్పారు. అయితే ఫైర్ సర్వీసు సిబ్బంది రాకపోవడానికి కారణాలేంటో తమకు తెలియదని చెప్పారు.

వీడియో క్యాప్షన్, అమలాపురంలో విధ్వంసం: మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇళ్లకు నిప్పు

నెట్ వర్క్ బంద్

ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అమలాపురంలో సెల్ ఫోన్ నెట్ వర్క్ సేవలు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ సేవలూ అందుబాటులో లేవు. అమలాపురం నుంచి రావులపాలెం వెళ్లే మార్గంలో, అలాగే విశాఖ వైపు దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర ఫోన్ నెట్‌వర్క్ నిలిచిపోయింది. దీంతో ఈ పరిధిలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు అమలాపురంలో కర్ఫ్యూ విధిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో చాలా దుకాణాలు బంద్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)