హైదరాబాద్‌ బేగం బజార్ నీరజ్ హత్య: ‘వారికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు నేను చచ్చిపోయానని అనుకుంటామన్నారు.. కానీ ఇప్పుడు కాపుకాసి నా భర్తను చంపేశారు’

సంజన, నీరజ్‌లు ఏడాదిన్నర కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సంజన, నీరజ్‌లు ఏడాదిన్నర కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కులాంతర వివాహం చేసుకున్న నీరజ్ పన్వర్ హత్య హైదరాబాద్‌లో కలకలం సృష్టించింది.

పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం మార్వాడ్ ప్రాంతానికి చెందిన ఓబీసీ మాలీ క్షత్రియ కులానికి చెందిన నీరజ్ పన్వర్ కుటుంబం కొన్ని తరాలుగా హైదరాబాద్‌లో స్థిరపడింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రం మూలాలున్న మరో ఓబీసీ గోవాలీ/గౌళీ యాదవ కులానికి చెందిన సంజన కుటుంబం కూడా ఎంతోకాలంగా హైదరాబాద్‌లో ఉంటోంది.

సంజన ఇల్లు బేగం బజార్ కోసలవాడీలో ఉంది. అక్కడే వ్యాపారం చేసే నీరజ్, సంజనలు ప్రేమించుకున్నారు.

కానీ, సంజన ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో షా ఇనాయత్ గంజ్‌లోని సాయిబాబా గుడిలో వారిద్దరూ 2021 ఏప్రిల్ 13న పెళ్లి చేసుకున్నారు. తరువాత రక్షణ కోసం అఫ్జల్ గంజ్ స్టేషన్‌కి వెళ్లారు. అఫ్జల్ గంజ్ పోలీసులు ఇరువర్గాలకూ నచ్చజెప్పారు. కొత్త జంట షంషీర్‌గంజ్‌‌లో నివాసం ఉంటోంది.

నీరజ్ వేరుశనగ (పల్లీ) వ్యాపారం కోసలవాడీలో ఉంది. అక్కడే సంజన పుట్టిల్లు కూడా ఉంది.

"తరచూ నీరజ్ తమ కళ్ల ముందు తిరగడాన్ని జీర్ణించుకోలేకే... తమ అమ్మాయిని చేసుకున్నవాడు తమను అవమానించడానికే ఈ ప్రాంతానికి వస్తున్నాడని భావించిన కుర్రాళ్లు పక్కా పథకం ప్రకారం హత్య చేసినట్టు" డీసీపీ జోయల్ డేవిస్ మీడియాతో చెప్పారు.

‘‘స్నేహితులతో, కజిన్స్‌తో వాళ్లు ప్లాన్ డిస్కస్ చేసుకున్నారు. జుమ్మేరాత్ బజార్‌లో మూడు రోజుల క్రితం కత్తులు కొన్నారు. నీరజ్‌ను ఫాలో అయ్యారు. అతని రాకపోకలు తెలుసుకున్నారు. ఎవరికీ అనుమానం రాని చోటు కోసం వెతికారు. హత్యకు ముందు రెక్కీ నిర్వహించారు. మందు తాగారు. తరువాత అతన్ని అనుసరించి హత్యచేశారు’’ అని డేవిస్ వివరించారు.

సంజన

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రెండో ఘటన

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రెండో కుల/మత అహంకార హత్య ఇది. మే మొదటివారంలో దళిత అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ముస్లిం అమ్మాయి అన్నలు, ఆమె భర్తను ఇదే తరహాలో నడిరోడ్డుపైన కత్తులతో నరికి చంపారు.

అది మరువకముందే ఈ హత్య జరిగింది. ఇందులో రెండు వైపుల వారూ ఓబీసీ వర్గాలే.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... "శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బేగం బజార్ కోసలవాడీలోని షాపు దగ్గర నీరజ్ పన్వర్, ఆయన తాత ఉన్నారు. నీరజ్ షాపు దగ్గర నుంచి తన తాతను తీసుకుని బయల్దేరారు. వారు తెలిసిన వారింట్లో ఫంక్షన్‌కు వెళ్లాలి. అక్కడి నుంచి బేగం బజార్, మచ్చీగల్లీ మీదుగా వెళ్తున్నారు.

తనకు వరుసకు బావమరదులు అయ్యే కొందరు మరికొన్ని బండ్లపై తనను వెంబడిస్తున్నారని నీరజ్‌కు తెలియదు. విజయ్ యాదవ్, అభినందన్ యాదవ్, రోహిత్ యాదవ్, మహేశ్ యాదవ్‌లు ఆ బండ్లపై ఉన్నారు. వారంతా నీరజ్ భార్య తరపు మనుషులు.

నీరజ్ పన్వర్ బండి మచ్చీగల్లీ దాటి యాదగిరి గల్లీలోకి వెళ్లగానే అభినందన్ ఓవర్ టేక్ చేసి నీరజ్‌ను ఆపారు. అందులో ఒకరు, నీరజ్‌ను బండి మీద నుంచి కిందపడేశారు. రోడ్డుపై దొరికిన రాయితో నీరజ్ తలపై మోదారు మరొకరు. వెంటనే అందరూ కలిసి కత్తులతో నీరజ్‌ను ఇష్టం వచ్చినట్టు పొడిచారు. అడ్డుకోబోయిన నీరజ్ తాత జగదీశ్ చేయికి గాయం అయింది" అని పోలీసులు చెప్పారు.

నీరజ్‌ను ఉస్మానియాకు తరలించారు. అప్పటికి ఆయనకు ప్రాణం ఉంది. చికిత్స తీసుకుంటుండగా నీరజ్ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.

సంజన, నీరజ్‌లు ఏడాదిన్నర కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు

కర్ణాటకకు పారిపోయేందుకు ప్లాన్

పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు. తాత ఫిర్యాదుపై కేసు పెట్టారు. నిందితులను పట్టుకోవడానికి 7 బృందాలను ఏర్పాటు చేశారు. ఈలోపే నిందితులు కర్ణాటక పారిపోయే ప్రణాళిక వేశారు.

26 ఏళ్ల అభినందన్ యాదవ్, 22 ఏళ్ల కె.విజయ్ యాదవ్, 25 ఏళ్ల కె. సంజయ్ యాదవ్, 18 ఏళ్ల బి. రోహిత్ యాదవ్, 21 ఏళ్ల మహేశ్ అహీర్ యాదవ్‌లతో పాటు ఇంకా 18 ఏళ్లు నిండని మరొకరు కూడా ఈ హత్యలో భాగం అయ్యారని పోలీసులు వెల్లడించారు.

ఈ ఆరుగురిలో మైనర్ సహా నలుగురు పోలీసులకు దొరికారు. మిగిలిన ఇద్దరు అభినందన్ యాదవ్, మహేశ్ అహీర్ యాదవ్‌లు తప్పించుకున్నారు. వారికోసం పోలీసులు వెదుకుతున్నారు.

చనిపోయిన నీరజ్‌కి 23 ఏళ్లు నిండలేదు. అతని భార్యకు 22 నిండలేదు. వారికి 2 నెలల వయసున్న బాబు ఉన్నాడు. చంపిన వాళ్లలో ఎవరూ కనీసం 30 ఏళ్లు దాటిన వారు లేరు. చంపిన వారు అమ్మాయి బంధువులేనని పోలీసులు తెలిపారు.

నీరజ్

'అందరూ సంజన బంధువులే'

సంజన పెదనాన్న కొడుకు అభినందన్. సంజన మేనమామ కొడుకు విజయ్. సంజన మరో పెదనాన్న కొడుకు సంజయ్ యాదవ్. వీళ్ల స్నేహితుడు రోహిత్. అయితే ఇప్పటి వరకూ ఈ ఘటనలో సంజన తల్లిదండ్రుల పాత్ర ఉన్నట్టు ఆధారాలు లేవు.

‘‘వారికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు, నేను చచ్చిపోయానని అనుకుంటామన్నారు. కానీ ఇప్పుడు వెతికి కాపుకాసి మరీ నా భర్తను చంపేశారు. నాకు న్యాయం చేయాలి. వారిని శిక్షించాలి’’ అని బీబీసీతో సంజన అన్నారు.

‘‘ఆమె తల్లిదండ్రులు మొదట్లో పెళ్లికి ఒప్పుకోకపోయినా, తరువాత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నీరజ్ వ్యాపారం చేసుకుంటూ ఆ అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడు. అతనికి ఏ అలవాట్లూ లేవు. కూతురు బావుందని ఆ తల్లిదండ్రులూ సంతోషించారు. కానీ ఆమెకు అన్నయ్య వరుసయ్యే కజిన్స్ కొందరు ఇదంతా చేశారు’’ అని స్థానికంగా ఉండే న్యాయవాది జే సోలంకి బీబీసీకి చెప్పారు.

జనం తిరిగే సమయంలో ఇంత ఘోరంగా హత్యకు ప్రయత్నించడం దారుణమన్న జే సోలంకి, పోలీసులు నిందితులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు.

బేగం బజార్‌లో మార్వాడీ సమాజం

బేగం బజార్‌లో మార్వాడీ, ఇతర ఉత్తర భారత దేశానికి చెందిన వ్యాపారుల సంఖ్య చాలా ఎక్కువ. హైదరాబాద్‌లో అన్ని రకాల వస్తువులూ దొరికే అతి పెద్ద హోల్ సేల్ మార్కెట్ ఇది. ఈ హత్య వారిలో ఆగ్రహాన్ని కలిగించింది. శుక్రవారం అర్ధరాత్రి వారు ధర్నా చేశారు.

శనివారం ఉదయం వందల సంఖ్యలో పోలీస్ స్టేషన్ దగ్గర గుమిగూడారు. నీరజ్ భార్య సంజన, నెలల బిడ్డతో అక్కడ ఆందోళనలో పాల్గొన్నారు. మార్వాడీ సమాజం పెద్దలంతా ఆందోళనలకు వచ్చారు. నిందితులను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేశారు.

షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్

స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ వారిని పరామర్శించారు. ఆందోళన విరమించకపోవడంతో స్థానిక డీసీపీ జోయస్ డేవిల్ వారికి సర్దిచెప్పారు. ఈ ఆందోళన వల్ల తమ విచారణ ఆలస్యం అవుతుందని, నిందితులు తప్పించుకుంటారనీ నచ్చచెప్పారు. సాయంత్రం పోస్టుమార్టం జరిగింది. ఆ తరువాత భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.

షా ఇనాయ్ గంజ్ స్టేషన్‌లో క్రైం నంబర్ 100వ కేసు ఇది. ఐపీసీ సెక్షన్ 302 రెడ్ విత్ 34 కింద కేసు పెట్టారు. ఇంకా ఇద్దరు నిందితులు దొరకాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)