ఫ్యూచర్ ఫుడ్స్: 2050నాటికి మనం తినే ఆహార పదార్థాలు ఇవేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, బీబీసీ ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్
2050నాటికి మన ఆహారంలో భాగమయ్యే అవకాశమున్న కొన్ని మొక్కలపై పరిశోధకులు దృష్టిసారించారు. నిజానికి వీటిలో చాలా మొక్కలపై మనకు తెలిసిన వివరాలు చాలా తక్కువ.
భవిష్యత్‌లో ఫాల్స్ బనానాతో బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చని లేదా పాండెనస్ చెట్టు పళ్లను స్నాక్స్‌గా తీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
కొన్ని ఆహార పంటలపైనే ప్రపంచం మొత్తం ఆధారపడటంతో వచ్చే ముప్పులేమిటో తాజా యుక్రెయిన్ యుద్ధం మన కళ్లకుకట్టింది.
ప్రస్తుతం 90 శాతం కేలరీలు మనకు కేవలం 15 పంటల నుంచే వస్తున్నాయి. దీంతో భవిష్యత్‌లో మన ఆహారంలో భాగమయ్యే పంటలపై లండన్‌లోని రాయల్ బొటానిక్ గార్డెన్స్ నిపుణులు దృష్టిసారించారు.

వాతావరణ మార్పులతో..
వాతావరణ మార్పులతో ఆహార ధాన్యాల కొరత పెరిగే అవకాశముంది. ఎందుకంటే చాలా పంటలు నాశనం అవుతున్నాయి. మరోవైపు కొన్ని పంటల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
‘‘ఆకలిని అరికట్టేందుకు మనం తినే ఆహార ధాన్యాల పరిధిని విస్తరించుకోవాలి. దీని వల్ల చాలా ఆహారపు పంటలు అంతరించిపోయే ముప్పు నుంచి అడ్డుకోవచ్చు. వాతావరణ మార్పులపై పోరాటంలోనూ ఇది తోడ్పడుతుంది’’అని పరిశోధకుడు డాక్టర్ శామ్ పిరినన్ చెప్పారు.
‘‘ఆహారంగా తీసుకునే అవకాశమున్న వేలకొద్దీ పంటలు మనకు అందుబాటులో ఉన్నాయని తెలుసు. వీటిని చాలా మంది ఆహారంగా తీసుకుంటున్నారు. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లకు ఇవి పరిష్కారం చూపగలవు’’అని ఆయన అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆహారంగా తీసుకునేందుకు అందుబాటులోనున్న 7,000 ఆహారపు మొక్కల్లో కేవలం 417వాటినే ఎక్కువగా పండిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాండెనస్ పళ్లు..
పసిఫిక్ దీవుల నుంచి ఫిలిప్పీన్స్ వరకు తీర ప్రాంతాల్లో పెరిగే చెట్లలో పాండెనస్ కూడా ఒకటి. దీన్నే పాండెనస్ టెక్టోరియస్ అని కూడా పిలుస్తారు. ఆగ్నేయాసియాలో ఈ చెట్లు ఆకులను తీపి, కారంగా ఉండే వంటకాల్లో వాడుతుంటారు. పైనాపిల్‌ను పోలివుండే ఈ చెట్టు పళ్లను పచ్చిగానూ తినొచ్చు. లేదా వండుకుని కూడా తినొచ్చు.
‘‘ఈ చెట్టు వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడగలదు. కరువులు, బలమైన గాలులు, భూగర్భ జలంతో ఉప్పు నీరు కలిసిపోవడం లాంటి పరిస్థితులను కూడా ఈ చెట్టు తట్టుకోగలదు’’అని డాక్టర్ మెరిబెల్ సోటో గోమెజ్ చెప్పారు.
‘‘ఇది వాతావరణ మార్పులను తట్టుకోవడంతోపాటు.. రుచికరమైన ఆహారం’’అని ఆమె అన్నారు. ‘‘మనం ఆహారంగా తీసుకునే పంటలను విస్తరించుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల మన పాతకాలంనాటి సంస్కృతీ సంప్రదాయాలను మనం కొనసాగించినట్లు అవుతుంది. పైగా ఇలాంటి పంటలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం పండించుకోవచ్చు’’అని ఆమె వివరించారు.
‘‘పాండెనస్ వ్యవసాయం సుస్థిరమైనది. దీని వల్ల స్థానిక ప్రజలపై ఎలాంటి చెడు ప్రభావమూ ఉండదు. వీటిని ఎక్కువగా పండించాలి’’అని ఆమె అన్నారు.

బీన్స్
బీన్స్ లేదా లెగ్యూమ్స్ మరొక భవిష్యత్ ఆహారంగా పరిశోధకులు చెబుతున్నారు. ఇవి చవకగా అందుబాటులోకి వస్తాయి. పైగా వీటిలో ప్రోటీన్లు, బీ-విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. తీర ప్రాంతాల నుంచి కొండ ప్రాంతాల వరకూ ఎక్కడైనా వీటిని పండించుకోవచ్చు.
ప్రస్తుతం 20,00కుపైగా బీన్స్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. కానీ, వీటిలో చాలా కొన్నింటినే మనం ఉపయోగిస్తున్నాం. అడవుల్లో ఇప్పటికీ అంతుచిక్కని ఎన్నో బీన్స్ ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.
బోట్స్‌వానాలో మోరామా బీన్స్ చాలా ఎక్కువగా దొరుకుతుంది. దీన్ని దాదాపు అన్ని వంటకాల్లోనూ వాడుతుంటారు. వీటిని మొక్కజొన్నలతోపాటు కలిపి ఉడకబెట్టి తింటారు. ఒక్కొసారి వీటిని పిండిగాచేసి జావ చేసుకుంటారు.
అన్ని బీన్స్ తినడానికి పనికిరావు. అయితే, భవిష్యత్‌లో మనకు ఏవి ఆహారంగా ఉపయోగపడగలవనే అంశంపై తాజా పరిశోధనలో నిపుణులు దృష్టిసారించారు.
తృణ ధాన్యాలు..
తృణ ధాన్యాలు గడ్డిజాతి మొక్కల నుంచి వస్తుంటాయి. వీటిలో చాలా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. పది వేలకుపైగా రకాలుండే ఇలాంటి తృణ ధాన్యాలు భవిష్యత్ ఆహారంగా ఉపయోగపడొచ్చని పరిశోధకులు అంటున్నారు.
ఆఫ్రికాలో కనిపించే ఫోనియో మంచి పోషకాహారంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. డిజిటారియా ఎక్సిలిస్‌గా పిలిచే ఈ తృణ ధాన్యాలతో పానీయాలు లేదా జావ చేసుకోవచ్చు. ఇది భిన్న వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకోగలదు.

ఫొటో సోర్స్, RBG Kew
ఫాల్స్ బనానా
ఎన్సెట్ లేదా ఫాల్స్ బనానాకు అరటిపండ్లతో దగ్గరి సంబంధాలున్నాయి. అయితే, దీన్ని కేవలం ఆఫ్రికాలోని ఇథియోపియాలో మాత్రమే ఆహారంగా తీసుకుంటారు.
అరటిపళ్లలా కనిపించే ఈ పండ్లు తినడానికి పనికిరావు. కానీ, ఈ చెట్లు కాండం, వేళ్ల నుంచి తీసే పిండితో రొట్టెలు, జావ చేసుకోవచ్చు.
ఈ ఫాల్స్ బనానా పది కోట్ల మందికిపైగా ఆహారాన్ని అందించగలదని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది కూడా వాతావరణ మార్పులను తట్టుకొని నిలబడగలదు.
ఇవి కూడా చదవండి:
- ఔరంగజేబు: 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి గురించి ఇప్పుడెందుకు చర్చ జరుగుతోంది
- మంకీపాక్స్: ఈ పాత వైరస్ కొత్తగా వ్యాపిస్తోంది.. మనం భయపడాలా? అవసరం లేదా?
- డ్రైవర్ మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని అరెస్ట్ చేస్తాం: కాకినాడ జిల్లా ఎస్పీ
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారా, బౌద్ధ ఆరామాలను కూల్చి గుడులు కట్టారా? చరిత్ర ఏం చెబుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















