ముస్లిం అని తెలిస్తే జైల్లో వేసేస్తున్న చైనా.. మత తీవ్రవాదాన్ని పెంచుతున్నారంటూ వీగర్లపై ఆరోపణ

- రచయిత, జాన్ సుడ్‌వర్త్
- హోదా, బీబీసీ న్యూస్
చైనాకు చెందిన కీలకమైన సమాచార నిధి (కేష్) చేతికందింది. షిన్‌జియాంగ్‌లో అత్యంత రహస్యంగా నిర్వహించే సామూహిక జైలు నుంచి వేలాది ఫోటోలు అందుబాటులోకి వచ్చాయి.
తప్పించుకోవాలని ప్రయత్నించే వారిని కాల్చి చంపాలన్న ఉత్తర్వుల సమాచారమూ చిక్కింది. ఆ ప్రాంతంలోని పోలీసు సర్వర్లను హ్యాక్ చేసినప్పుడు పెద్దయెత్తున లభించిన డాటాలో ఈ వివరాలు లభ్యమయ్యాయి.
‘‘ద షిన్‌జియాంగ్ పోలీస్ ఫైల్స్ '' పేరుతో పిలుస్తున్న ఈ డాటా ఈ ఏడాది మొదట్లో బీబీసీకి అందింది. వాటిపై పరిశోధన జరిపి, ధ్రువీకరించడానికి నెలల తరబడి ప్రయత్నం జరిగింది.
ఆ ప్రాంతంలో జీవించే ముస్లిం వీగర్లు, ఇతర టర్కిక్ మైనార్టీలను భూస్థాపితం చేసిన వైనంపై ఈ డాటా కొత్త సమాచారాన్ని వెలుగులోకి తెచ్చింది.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ మిషెల్లీ బాష్‌లెట్ ఇటీవల షిజ్‌జియాంగ్‌లోని సింగ్‌యాంగ్ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షల నడుమ ఆమె పర్యటించారంటూ విమర్శలు రావడంతో చివరకు అది వివాదాస్పదంగా మిగిలింది.
మునుపెన్నడూ తెలియని వివరాలను ఈ సమాచార నిధి వెల్లడించింది. అక్కడ అమలు చేస్తున్న "రీ ఎడ్యుకేషన్ క్యాంపులు'', సంప్రదాయ జైళ్లు.. ఈ రెండింటి ఉపయోగం వేరువేరేనంటూ చైనా చెబుతూ వస్తోంది. అయితే వీగర్లను సామూహికంగా ఖైదు చేయడానికే ఈ రెండింటినీ వినియోగిస్తున్నట్టు వెల్లడయింది. ఈ రెండింటిపై ఇప్పుడు బహిరంగంగా లభిస్తున్న సమాచారం తీవ్రమైన ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

పాఠశాలలు కాదు..
షిన్‌జియాంగ్ ప్రాంతమంతటా 2017 నుంచి నిర్మిస్తున్న "రీ ఎడ్యుకేషన్ క్యాంపులు'' పాఠశాలలు తప్పా ఇంకేమీ కాదని చైనా ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే పోలీసుల అంతర్గత ఆదేశాలు, కాపలా నియమనిబంధనలు, మునుపెన్నడూ చూడని బందీల ఫొటోలు మాత్రం ఆ మాటలను ఖండిస్తున్నాయి.

ఉగ్రవాదులనే ఆరోపణలను విపరీతంగా చేస్తూ వేలాది మందిని ప్రభుత్వం జైళ్లలో పడేసింది. దానికి సమాంతరంగా "పాఠశాలలు'' అన్న పేరుతో మరికొన్ని జైళ్లను నడుపుతోంది. ఇక్కడ పోలీసులు నిరంకుశ, క్రూర శిక్షలను అమలు చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పడు బహిర్గతమయ్యాయి.

"వీగర్ల గుర్తింపు, సంస్కృతి, ఇస్లాం విశ్వాసాలకు'' సంబంధించిన ఏ చిన్న చిహ్నాలు కనిపించినా వాటిపై గురి పెట్టాలన్న విధానం ఉందనడానికి ఈ పత్రాల్లో బలమైన సాక్ష్యాలు దొరికాయి. చైనా నాయకుడు షీ జిన్‌పింగ్ స్థాయి నుంచి కింది స్థాయిలో ఉన్నవారు వరకు ఇచ్చిన ఆదేశాల గొలుసు కూడా ఈ పత్రాల్లో లభించింది.

5,000కుపైగా ఫోటోలు
హ్యాకింగ్‌కు గురయిన ఫైళ్లలో వీగర్లకు చెందిన 5,000కుపైగా ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ 2018 జనవరి-జులై మధ్యలో పోలీసులు పెట్టినవే.
ఇతర డాటాతో సరిపోల్చి చూసినప్పుడు వీరిలో కనీసం 2,884 మంది పోలీసుల అదుపులో ఉన్నట్టు చూపించారు.
కానీ, "రీ ఎడ్యుకేషన్ క్యాంప్ '' జాబితాను పరిశీలిస్తే వారు " ఇష్టపడి చేరిన విదార్థులేమీ కాదని తెలుస్తుంది. చైనా మాత్రం వారు స్వచ్ఛందంగానే అక్కడ ఉంటున్నారంటూ ఎంతో కాలంగా చెబుతూ వస్తోంది.
రీ ఎడ్యుకేషన్ క్యాంపునకు చెందిన మరికొన్ని ఫోటోలను చూస్తే అక్కడ లాఠీలు పట్టుకున్న సాయుధ పోలీసులు కనిపించారు.
ఇక్కడ వీగర్లను నిర్బంధిస్తున్నారన్న వాదనలు సరికాదంటూ చైనాకు చెందిన ఉన్నతాధికారులు నిరంతరం చెబుతునే ఉన్నారు.
‘‘షిన్‌జియాంగ్‌లోని విద్య, శిక్షణ కేంద్రాలు పాఠశాలలన్నది నిజం. ప్రజలు ఉగ్రవాదం నుంచి తమంతట తాముగా బయటపడేందుకు ఇవి సహకరిస్తున్నాయి'' అని 2019లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు.
అయితే, చాలా చిన్న కారణాలపైనే ఇక్కడ ఎంతో మందిని అరెస్టు చేశారు. బహిరంగంగా కనిపించేలా ఇస్లాం చిహ్నాలు ధరించారనో, ముస్లింలు మెజార్టీగా ఉన్న దేశాలను సందర్శించారనో కారణాలు చూపి అరెస్టులు చేశారు.
నేరారోపణలు మోపిన వారిని కలిసినా "సహవాస నేరం" గా పరిగణిస్తున్నారు. ఈ ఆరోపణలను విపరీతంగా మోపుతున్నారు.
భౌతిక దాడులకు పాల్పడుతారన్న ఆరోపణలతో ఓ మహిళపై "సహవాస నేరం" కేసు మోపారు.

మద్యం తాగకున్నా జైలు
మతంవైపు విపరీతమైన మొగ్గు చూపుతున్నాడని ఆరోపిస్తూ ఆమె కుమారుడిని జైలులో పెట్టారు. మద్యం ముట్టకపోవడం, పొగ తాగకపోవడంతో ఆయనకు మతంపై ఇష్టం అధికంగా ఉందని అనుమానించారు. దీంతో ఉగ్రవాది అన్న ఆరోపణలు మోపి పదేళ్ల పాటు జైలులో పెట్టారు. మాకు లభించిన పత్రాల్లో ఈ విషయం వెల్లడయింది.
" డిటెన్షన్‌లో ఉన్న వ్యక్తుల బంధువుల జాబితా"లో కూడా ఆమె పేరు ఉంది. ఇదే కారణంపై వేలాది మందిని అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు చేసిన " నేరాలు" వారి పాలిట శాపంలా మారాయి.
ఈ సంయుక్త చిత్రంలో 2,884 మంది ఫోటోగ్రాఫ్‌లు ఉన్నాయి. వీగర్లను ఎలా జైళ్లలోనూ, క్యాంపుల్లోనూ పడేశారో ఈ ఫోటోలు రుజువులుగా నిలుస్తున్నాయి.
నిర్బంధంలో ఉన్నవారిలో పిన్న వయస్కురాలు రహీలే ఒమర్. 15 ఏళ్లు ఉన్నప్పుడే ఆమెను జైలులో పడేశారు.

73 ఏళ్ల అనిహన్ అమిత్ జైలులో ఉన్న పెద్ద వయస్కురాలు.
జర్నలిస్టుల బృందం..
" ద షిన్‌జియాంగ్ పోలీస్ ఫైల్స్".. ఇంటర్నేషనల్ జర్నలిస్టుల కన్సార్షియం సంపాదించిన సమాచార నిధికి పెట్టిన పేరు ఇది. ఈ కన్సార్షియంలో బీబీసీకి సభ్యత్వం ఉంది. ఇందులో వేలాది పత్రాలు, ఫోటోలు ఉన్నాయి.
ఇందులో పోలీసు అధికారుల రహస్య ప్రసంగాలు, పోలీసుల అంతర్గత మ్యాన్యుయల్స్, వ్యక్తిగత సమాచారం, జైలులో ఉన్న 20వేలకు పైగా వీగర్ల వివరాలు, సున్నితమైన ప్రాంతాల ఫోటోలు ఉన్నాయి.
షిన్‌జియాంగ్‌లోని చాలా పోలీసు కంప్యూటర్ సర్వర్లను హ్యాక్ చేసి, డౌన్‌లోడ్ చేసి, రహస్య పాస్‌వర్డ్‌లను ఛేదించడం ద్వారా ఈ వివరాలను సేకరించగలిగారు. వీటిని అమెరికాలోని డాక్టర్ ఆడ్రియన్ జెంజ్ పరిశీలనకు పంపించారు. ఆయన ‘‘విక్టిమ్స్ ఆఫ్ కమ్యూనిజం మెమోరియల్ ఫౌండేషన్’’లో నిపుణుడిగా పనిచేస్తున్నారు. షిన్‌జియాంగ్‌పై ప్రభావవశీలమైన పరిశోధన చేసినందుకు చైనా ప్రభుత్వం ఆయనపై నిషేధం విధించింది.
ఇందుకు సంబంధించిన వివరాలను డాక్టర్ జెంజ్ బీబీసీకి అందజేశారు. బీబీసీ కూడా నేరుగా కొందర్ని సంప్రదించి సమాచారం సేకరించింది. అయితే వారు తమ గుర్తింపు, ఎక్కడ ఉన్నదీ, ఇతరత్రా వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.

హ్యాకింగ్ సాయంతో..
హ్యాకింగ్ ద్వారా సంపాదించిన పత్రాలేవీ 2018 సంవత్సరం తరువాత వచ్చినవి కావు. ఎందుకంటే 2019 ప్రారంభం నుంచే ఎన్‌క్రిప్షన్ స్టాండర్డ్స్‌ను చైనా గట్టిగా బిగించింది. దాంతో ఆ తరువాత పత్రాలను పొందడం హ్యాకర్లకు సాధ్యం కాలేదు.
షిన్‌జియాంగ్ పోలీస్ ఫైల్స్‌పై డాక్టర్ జెంజ్ శాస్త్రీయ అధ్యయనం చేసి యూరోపియన్ అసోసియేషన్ ఫర్ చైనీస్ స్టడీస్ జర్నల్‌కు పరిశోధన పత్రాన్ని పంపించారు. ఇందులో భాగంగా డిటెన్యూల ఫుల్ సెట్ ఫోటోలను, ఇతర పత్రాలను ఆన్‌లైన్‌లో ఉంచారు.
"ఈ సమాచారం సెన్సార్ కానిది, ముడి సరకులాంటిది. సంపూర్ణమైనది. అన్నీ ఇందులో ఉన్నాయి" అని ఆయన బీబీసీకి చెప్పారు.
"మా దగ్గర రహస్య పత్రాలు ఉన్నాయి. తమ ఆలోచనలపై నాయకులు ఫ్రీగా మాట్లాడుకున్న మాటల స్పీచ్ ట్రాన్స్‌స్క్రిప్టులు ఉన్నాయి. స్ప్రెడ్‌షీట్లు ఉన్నాయి. ఫోటోలు ఉన్నాయి. మొత్తంగా ఇది కీలకమైనది. చైనా చేస్తున్న ప్రచార ముసుగుపై పెద్ద దెబ్బలాంటిది"అని ఆయన తెలిపారు.

భిన్నమైన వాస్తవాలు..
ద షిన్‌జియాంగ్ పోలీసు ఫైల్స్‌లో మరో రకం పత్రాల వివరాలూ ఉన్నాయి.
డిటెన్యూల ఫోటోలకు మించి ఎంతో విస్తృతమైన సమాచారం ఉంది. జైళ్లను తలపించే రీ ఎడ్యుకేషన్ క్యాంప్‌ల ఫోటోలు ఉన్నాయి. వీటిని వృత్తి విద్య శిక్షణ పాఠశాలలుగా వ్యవహరించాలని చైనా నొక్కి చెబుతుండడం గమనార్హం.
వీటి వద్ద ఎలా వ్యవహరించాలో పోలీసుల అంతర్గత ప్రొటోకాల్‌లో స్పష్టంగా వివరించారు. సాయుధ పోలీసు అధికారులను రొటీన్‌గా అక్కడికి విధులకు పంపించడం, మెషిన్ గన్లను మోహరించడం, వాచ్‌టవర్లపై గురిచూసి కాల్చగలిగే స్నైపర్ గన్స్ పెట్టడం, తప్పించుకొని పారిపోయే వారిపై షూట్ టు కిల్ విధానాన్ని అనుసరించడం వంటి వివరాలను ఇందులో పొందుపరిచారు.
ఏ "విద్యార్థి"నైనా ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు కళ్లకు గంతలు కట్టడం, బేడీలు వేయడం, గొలుసులతో బంధించడం వంటివి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
దశాబ్దాలుగా షిన్‌జియాంగ్‌లో వేర్పాటువాద ఉద్యమాలు, హింసాత్మక సంఘటనలు, ప్రభుత్వ కఠిన ఆంక్షలు తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
అయితే 2013, 2014లో జరిగిన రెండు భయంకర దాడులు పరిస్థితిని మార్చివేశాయి. బీజింగ్‌లో పాదచారులు, ప్రయాణికులు లక్ష్యంగా సాగిన ఒక దాడి, దక్షిణ చైనాలోని కున్మింగ్ నగరంలో జరిగిన మరో దాడి ప్రభుత్వ వైఖరిని మారేలా చేశాయి. వీగర్ వేర్పాటువాదులు, రాడికల్ ఇస్లామిస్టులు ఇందుకు కారణమని ఆరోపించిన ప్రభుత్వం తన విధానాల్లో నాటకీయ మార్పును చేసుకుంది.
వీగర్ సంస్కృతే పెద్ద సమస్య అని ప్రభుత్వం భావించింది. కొన్ని సంవత్సరాల్లోనే వందలాది భారీస్థాయి రీ ఎడ్యుకేషన్ సెంటర్లు ఉపగ్రహ చిత్రాల్లో దర్శనమిచ్చాయి. ఎలాంటి విచారణ లేకుండానే వీగర్లను అక్కడికి పంపించింది.
వీగర్ల గుర్తింపును అణచివేయడానికి మరో మార్గంగా షిన్‌జియాంగ్‌లో సంప్రదాయ జైళ్ల వ్యవస్థను కూడా భారీగా విస్తరించింది. క్యాంపుల్లో ఎలాంటి న్యాయ ప్రక్రియకు అవకాశం ఉండడం లేదంటూ అంతర్జాతీయంగా పెద్దయెత్తున వచ్చిన విమర్శలను ఎదుర్కొని, అంతా చట్టబద్ధంగా జరిగిందని చెప్పుకోవడానికి జైళ్లను విస్తరించింది.
ప్రభుత్వం అమలు చేసిన ఈ ద్వంద్వ విధానం 452 స్ప్రెడ్‌షీట్ల ద్వారా పూర్తిగా బహిర్గతమయింది. 2.5 లక్షలకుపైగా వీగర్ల పేర్లు, చిరునామాలు, ఐడీ నెంబర్లు మొత్తం సమాచారం ఇందులో ఉంది. ఎందర్ని నిర్బంధంలో ఉంచారు? ఎక్కడ ఉంచారు? ఎందుకు ఉంచారు? తదితర వివరాలన్నీ ఇందులో సమగ్రంగా ఉన్నాయి.
క్రూరంగా వ్యవహరించి క్యాంపులు, జైళ్లు.. రెండు చోట్లా ఎలా ఖైదు చేశారో అన్నదాన్ని ఇవి అద్దం పడుతున్నాయి. వీగర్ సమాజం అంటే ముప్పుగా భావించే చైనా అధికారులు.. వారి వ్యక్తిగత వ్యవహారాల్లోకి లోతుగా చొరబడిన వైనానికి ప్రతి పంక్తిలోనూ సాక్ష్యాధారాలు ఉన్నాయి. నిరంకుశత్వం, ఇష్టానుసారంగా అరెస్టులు చేశారనడానికి బిగ్ డాటా సర్వైలెన్స్ టూల్స్ ఆధారంగా ఉన్నాయి.
సాకు కనిపిస్తే చాలు..జైలే
గతంలో ఎప్పుడో "నేరం" చేశారంటూ శిక్ష విధించిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఏళ్ల కిందట, కొన్నిసార్లు దశాబ్దాల కిందట జరిగిన నేరాలకు కూడా శిక్షలు పడ్డాయి. 2017లో ఒకాయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. 2010లో కొన్ని రోజుల పాటు తన అమ్మమ్మతో కలిసి "ఇస్లామిక్ మత గ్రంథాలు చదివార"న్న నేరంపై ఈ శిక్ష వేశారు.
మొబైల్ ఫోను ఉపయోగిస్తున్నందుకు వందలాది మందిని లక్ష్యంగా చేసుకున్నారు. ఎక్కువ మందిపై "చట్టవ్యతిరేక ప్రసంగాలు వినడం", ఎన్‌క్రిప్టెడ్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారన్న అనుమానాలు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.
మొబైళ్లను తగినంతగా ఉపయోగించనందుకు శిక్షలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరికయితే దశాబ్ద కాలం పాటు శిక్ష కూడా విధించారు. " ఫోనులో తగినంత బ్యాలెన్స్ లేనందుకు" శిక్ష పడ్డ సంఘటనలు వందల వరకు ఉన్నాయి. నిరంతర డిజిటల్ నిఘా నుంచి తప్పించుకోవడానికే బ్యాలెన్స్ లేకుండా చేస్తున్నారంటూ జైలుకు పంపించారు.
ఈ స్పెడ్‌షీట్లలో మరికొన్ని విషాదకర సంఘటనలు నమోదయ్యాయి. చిన్న చిన్న సాకులకే జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన ఉదంతాలు నమోదయ్యాయి. తొలుత చిన్న కారణాలుగా చూపి తరువాత తీవ్రమైన ఆరోపణలు చేశారు. తొలుత "గొడవలు పెట్టకోవడం", " సోషల్ ఆర్డర్‌కు భంగం కలిగించడం" వంటి నేరాలు మోపారు. అనంతరం అతిపెద్దదైన ఉగ్రవాదం కింద ఆరోపణలు చేసి శిక్షలు విధించారు. పదేళ్లు, 25 ఏళ్లు.. ఇలా శిక్షల వరుసలు పెరిగిపోతునే ఉంటాయి.
ఒక వేళ నిజంగా ఉగ్రవాద ముద్రవేయాలనుకుంటే సముద్రంలా కనిపిస్తున్న ఇంత డాటా నుంచి వారిని గుర్తించడం అసాధ్యం. ఎందుకంటే వారేమి చేశారని కాకుండా, వారు ఎవరన్నది ఆధారం చేసుకునే జైల్లో పెట్టారు కాబట్టి, వారిలో ఉగ్రవాదులు ఎవరన్నది తెలుసుకోవడం కష్టం.

గడ్డం పెంచినందుకు..
తుర్సున్ ఖాలిద్ స్ప్రెడ్ షీట్‌ను పరిశీలిస్తే ఎప్పుడో 1980ల్లో ఆయన ఇస్లామిక్ గ్రంథాలను చదివినట్టు, బోధించినట్టు ఆరోపణ నమోదయింది. ఇటీవల చేసిన నేరాన్ని చూస్తే ఆయన "మత తీవ్రవాద ప్రభావంతో గడ్డం పెంచి తప్పు చేస్తున్నారు" అని రాశారు.
ఈ 58 ఏళ్ల వ్యక్తి 16 సంవత్సరాల 11 నెలల పాటు జైలులో ఉన్నారు. వీఘర్ అన్న గుర్తింపే చట్ట వ్యతిరేకమని చైనా అధికారులు భావించడానికి ముందు, ఆ తరువాత తీసిన ఆయన ఫోటోలు లభ్యమయ్యాయి.
ద షిన్‌జియాంగ్ పోలీస్ ఫైల్స్ మరికొన్ని దారుణాలను వెల్లడి చేశాయి. క్యాంపులోనూ, జైలులోనూ లేనివారికి కూడా భారీ స్థాయిలో నిఘా పెట్టి, బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తేలింది.
ఈ ఫోటోలు మరికొన్ని రహస్యాలను వెల్లడి చేశాయి. ఇళ్లలో ఉన్న వీగర్లను ఫోటోలు తీయించడం కోసం ఎప్పుడంటే అప్పడు పోలీసు స్టేషన్లకు పిలిపించేవారు. టైమ్‌స్టాంప్స్‌ను పరిశీలిస్తే మొత్తం ఆ కమ్యూనిటీనే పిలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇంట్లోని వృద్ధులతో మొదలు పిల్లల వరకు ఏ సమయంలోనైనా పిలిచేవారు. అర్ధరాత్రి పిలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
క్యాంపులు, జైలులో తీసిన ఫోటోలకు ఒక తరహా ఫైల్ నేమ్‌లు ఇచ్చిన విధానాన్ని పరిశీలిస్తే దీని వెనుక ఒక ఉమ్మడి లక్ష్యం ఉన్నట్టు కనిపిస్తోంది. భారీ స్థాయిలో ఫేసియల్ రికగ్నిషన్ డాటాబేస్‌ను ఏర్పాటు చేయడమే దీని ఆశయం. ఆ సమయంలో చైనా ఇలాంటి ప్రయత్నాల్లోనే ఉండేది.
వారి ముఖాలు క్యాంపు నిర్వాహకులకు కూడా తెలియవా? ఏమో ఈ విషయం చెప్పడం చాలా కష్టం. ఇప్పటికే వేలాది మంది కనిపించకుండా పోయారు. ఇందుకు సంబంధించిన స్ప్రెడ్‌షీట్లను పరిశీలిస్తే జరిగిన ప్రమాదం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది.

2018లో పోలీసులు ఫోటోలు తీసిన అయిదు నెలలకు భార్యాభర్తలైన అషిగుల్ తుర్‌ఘున్, తుర్సున్ మెమెటిమిన్‌లను నిర్బంధ కేంద్రానికి పంపించారు. అంతకు ఆరేళ్ల ముందు వారు మొబైల్‌లో చట్ట వ్యతిరేక ప్రసంగం రికార్డును విన్నారన్న అభియోగాన్ని మోపారు.
హ్యక్ చేసిన ఫైళ్లలో వారి ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరి ఫోటోలు లభ్యమయ్యాయి. తల్లిదండ్రులు అదృశ్యమైన సమయంలో రుజిగుల్ తుర్‌ఘున్ వయసు పదేళ్లు, ఆయేషెమ్ తుర్ఘున్ వయసు ఆరేళ్లు మాత్రమే.

తల్లిదండ్రులిద్దరూ నిర్బంధంలో ఉండడంతో ఒంటరిగా మిగిలిన అలాంటి పిల్లల వివరాలు ఈ స్ప్రెడ్ షీట్లలో కొంతవరకు ఉన్నాయి.
ఇలాంటి వారిలో చాలా మందిని శాత్వత, దీర్ఘకాలిక సంరక్షణ ఇచ్చే ప్రభుత్వ బోర్డింగ్ స్కూళ్లలో చేర్పించినట్టు కనిపిస్తోంది. షిన్‌జియాంగ్ వ్యాప్తంగా క్యాంపులు ఏర్పాటు చేసిన సమయంలోనే ఈ బోర్డింగ్ స్కూళ్లను కూడా నిర్మించారు.
దాదాపుగా గుండుతో ఉన్న పిల్లలు కనిపించారంటే వారు బోర్డింగ్ స్కూలులో ఉన్నట్టు గుర్తు అని విదేశాల్లో ఉన్న వీగర్లు బీబీసీకి తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నా, ఒక్కరి సంరక్షణలో ఉన్నప్పటికీ పిల్లలు వీక్ డేస్‌లో తప్పనిసరిగా ఆ పాఠశాలలకు హాజరు కావాలంటూ నిబంధన తీసుకువచ్చారు.
వీగర్ల కుటుంబాల ఉనికి, సంస్కృతిని టార్గెట్ చేసే విధానానికి మానవ రూపం ఇస్తే అది ఈ ఫోటోలు భద్రపరిచే స్థలంలా కనిపిస్తుంది. చైనా సొంత మాటల్లో చెప్పాలంటే "వారి వేళ్లను పెకిలించాలి. వారి వారసత్వాన్ని కూలగొట్టాలి. వారి సంబంధాలను తెంచి వేయాలి. వారి మూలాలను నాశనం చేయాలి" ఈ విధానాన్నే కొనసాగించాలన్నట్టుగా ఉంటుంది.

ద షిన్‌జియాంగ్ పోలీస్ ఫైల్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా చైనా జైళ్ల వ్యవస్థ అంతర్గత పనితీరును మరింత స్పష్టంగా బహిర్గత పరిచింది. వాటి విస్తృతిపై తాజా క్లూలు ఇచ్చింది.
ఈ స్ప్రెడ్‌షీట్లు చాలా వరకు దక్షిణ షిన్‌జియాంగ్ ప్రాంతానికి చెందినవి. ఈ ప్రాంతాన్ని వీగర్ భాషలో కొనషేహెర్, చైనా భాషలో షుఫు అని పిలుస్తారు.
డాక్టర్ జెంజ్ విశ్లేషణ ప్రకారం 2017-2018 సంవత్సరాల మధ్య ఈ ఒక్క ప్రాంతానికి చెందిన 22,762 మంది అటు క్యాంపులోనో, ఇటు జైలులోనో ఉన్నారు. మొత్తం వయోజనుల్లో వీరి సంఖ్య 12 శాతానికి మించి ఉంది.
మొత్తం షిన్‌జియాంగ్ రాష్ట్రం గణాంకాలను పరిశీలిస్తే 1.2 మిలియన్లకు పైగా వీగర్, టర్కిక్ మైనార్టీ వయోజనులు నిర్బంధంలో ఉన్నట్టు తేలింది. షిన్‌జియాంగ్ వ్యవహారాల నిపుణులు జరిపిన స్థూల అంచనాలకు అనుగుణంగానే ఈ సంఖ్య ఉంది. అయితే చైనా ఎల్లప్పుడూ దీన్ని తిరస్కరిస్తునే ఉంది.
11 దేశాలకు చెందిన 14 మీడియా సంస్థల కన్సార్షియంతో బీబీసీ కలిసి పనిచేస్తోంది. ద షిన్‌జియాంగ్ పోలీసు ఫైల్స్‌లోని ముఖ్యమైన అంశాలను ధ్రవీకరించగలిగింది.
యూరోప్, అమెరికాలో నివసిస్తున్న వీగర్లను కలిసి షిన్‌జియాంగ్‌లో ఉంటూ కనిపించకుండా పోయిన తమ బంధువుల పేర్లు, ఐడీ నెంబర్లు ఇవ్వాలని కోరింది.
స్ప్రెడ్ షీట్లలో ఉన్న డాటాతో చాలా పేర్లు మ్యాచ్ అయ్యాయి. అంటే ఈ సమాచారం నిజమైన ప్రజలదేనంటూ బలమైన రుజువులు లభించినట్టయింది.

బర్కెలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియోకు చెందిన ఇమేజ్-పోరెన్సిక్ నిపుణుడు ప్రొఫెసర్ హనీ ఫరిడ్‌ను బీబీసీ సంప్రదించింది. వీగర్ డెటిన్యూలకు చెందిన కొన్ని ఫోటోలను పరిశీలించాలని కోరింది.
ఇవి కల్పిత ఫొటోలని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు.
మరీ ఎక్కువ ఫేక్‌గా ఉండే చిత్రాలను కంప్యూటర్ ద్వారా విశ్లేషించినప్పుడు సాధారణంగా అవి కట్టు కథల్లా ఉన్నాయన్న గుర్తులు ముందుగా కనిపిస్తాయి. ఇక్కడ అలాంటి చిహ్నాలేవీ అగుపించలేదు. కుట్ర, డిజిటల్ మ్యానుపులేషన్ వంటి లక్షణాలూ లేవని వివరించారు.
కొన్ని ఫోటోల అంచుల్లో ఆశ్చర్యకరమైన ఎఫెక్ట్స్ కనిపించాయి. ఫోటోలను కాపీ చేసి, అనంతరం వాటిని కొద్దిగా రొటేట్ చేసినట్టు కనిపించింది. షిన్‌జియాంగ్‌లో చైనాకు భారీగా ఉన్న నిఘా నెట్‌వర్క్ నుంచి ఈ ఫోటోలను సేకరించినట్టు అర్థమవుతోంది. ఆ విధంగా వాదనకు మరింత బలం చేకూరింది.
ఫోటోల చివరన ఉన్న చిన్న వంకరల గురించి ప్రొఫెసర్ ఫరిడ్ తన అభిప్రాయం చెబుతూ...ఫేసియల్ రికగ్నిషన్ డాటాబేస్‌లో సాధారణంగా ఉపయోగించే ప్రామాణిక ప్రక్రియ కారణంగా అలా జరిగి ఉంటుందని పేర్కొన్నారు. కళ్ల వద్ద స్వల్పంగా ఎగుడుదిగుడుగా ఉన్నట్టు అనిపిస్తే ఫోటోలను ఆటోమేటిక్‌గా రొటేట్ చేస్తుంటారు. ఆ కారణంగానే ఆ వంకరలు వచ్చి ఉండవచ్చని తెలిపారు.
"అయితే ఇది ఎలాంటి అపాయం కలిగించని ప్రక్రియ" అని బీబీసీకి ఇచ్చిన లిఖితపూర్వక నివేదికలో పేర్కొన్నారు.
ఫోటోలను వాటికి సంబంధించిన టైమ్‌స్టాంప్ క్రమంలో అమర్చడం ద్వారా కూడా మరింత ధ్రవీకరణ సాధ్యమయింది. వాటికి ఉన్న ఉమ్మడి బ్యాక్ గ్రౌండ్ గుర్తించడం సాధ్యమయింది. వాస్తవ ప్రదేశాల్లో, రియల్ టైమ్‌లో ఆ ఫొటోలు తీసినట్టు తేలింది.

ఇవి ఉగ్రవాద నిరోధక చర్యలే...చైనా స్పందన
హ్యాకింగ్ ద్వారా సంపాదించిన డాటాపై స్పందించాలని చైనా ప్రభుత్వాన్ని మీడియా కన్సార్షియం సంప్రదించింది. అందులోని ఆధారాలకు అనుగుణంగా సవివరమైన ప్రశ్నావళిని పంపించింది.
దీనిపై వాషింగ్టన్ డీసీలోని చైనా రాయబార కార్యాలయం లిఖిత పూర్వక సమాధానం పంపించింది.
"షిన్జియాంగ్‌కు సంబంధించిన సమస్యలన్నీ ప్రధానంగా హింసాత్మక ఉగ్రవాదం. తీవ్రవాదం, వేర్పాటువాదాలను ఎదుర్కోవడానికి సంబంధించినవి. మానవ హక్కులు, మతానికి సంబంధించినవి కావు" అని ఆ ప్రకటనలో పేర్కొంది.
చైనా అధికార యంత్రాంగం "నిర్ణయాత్మక, సుదృఢ, సమర్థమైన ఉగ్రవాద నివారణ చర్యలు తీసుకొంది. ఆ ప్రాంతం ప్రస్తుతం సామాజిక సుస్థిరత, సామరస్యం, ఆర్థిక ప్రగతిని సాధిస్తోంది"అని వివరించింది. అయితే కొన్ని ప్రత్యేక ఆధారాలపై ఏవిధంగానూ స్పందించలేదు.
ద షిన్‌జియాంగ్ పోలీస్ ఫైల్స్‌లో కొన్ని ప్రత్యేకమైన ఫొటోలు ఉన్నాయి. అవి తీవ్ర స్థాయిలో ఉన్న పోలీసుల నియంత్రణను మరింతగా బహిర్గతం చేస్తున్నాయి. గుర్తింపును మార్చుకోవాలంటూ వీగర్లపై తీవ్ర స్థాయిలో ఉన్న ఒత్తిళ్లకు నిదర్శనంగా ఉన్నాయి.
ప్రసంగాల్లో ఏముంది?
హ్యాకింగ్ ద్వారా లభ్యమైన ఫైల్స్‌లో కమ్యూనిస్టు పార్టీ ఉన్నత స్థాయి నాయకుల ప్రసంగాలు ఉన్నాయి.
వీటి సాయంతో విధానాల వెనుక ఉన్న భావజాలం ఏమిటో తెలుసుకోవచ్చు. చివరికి ఎవరిని బాధ్యులను చేయవచ్చో తెలుస్తుంది.
రహస్యం అని ముద్ర ఉన్న ఓ ప్రసంగం చైనా ప్రజా భద్రత మంత్రి ఝావో కెఝీ చేసినది. 2018 జూన్‌లో షిన్‌జియాంగ్‌లో పర్యటన సందర్భంగా ఇచ్చిన ఉపన్యాసమిది.
కేవలం ఒక్క దక్షిణ షిన్‌జియాంగ్‌లోనే కనీసం రెండు మిలియన్ల ప్రజలు "తీవ్రవాద భావజాలం" అనే అంటురోగం బారిన పడ్డారని అన్నారు.
అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ప్రస్తావిస్తూ తన ప్రసంగంలో మసాలా జోడించారు. ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. కొత్త సౌకర్యాల నిర్మాణానికి చైనా నాయకుడు "ముఖ్యమైన ఆదేశాలు" ఇచ్చారని చెప్పారు.
డిటెన్యూల సంఖ్య ప్రవాహంలా పెరిగి రెండు మిలియన్లకు చేరనుందని, అందుకు అనుగుణంగా జైళ్ల సామర్థ్యం పెంపుదలకు నిధులు పెంచుతామని చెప్పారని వివరించారు.
షిన్‌జియాంగ్‌లోని వీగర్లు, ఇతర టర్కిక్ మైనార్టీలను సామూహికంగా జైలుకు పంపించాలని చైనా నాయకుడు నిజంగా ఆదేశాలు ఇచ్చి ఉంటే.. అందుకు సంబంధించి ఆయన ఆలోచించిన కాల వ్యవధిపైనా సూచనలు ఉండే అవకాశం ఉంది.
ఇంతవరకు షిన్‌జియాంగ్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉండి, హార్డ్ లైనర్‌గా పేరుపొందిన చెన్ క్వానుంగ్వో 2017లో చేసిన రహస్య ప్రసంగం కూడా ఈ పత్రాల్లో ఉంది.
సీనియర్ మిలటరీ అధికారులు, పోలీసు కేడర్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ "కొందరికి అయిదేళ్ల రీ ఎడ్యుకేషన్ కూడా ఏ మాత్రం సరిపోదు. మనం పార్టీకి చూపిస్తున్నంత విశ్వాసాన్ని వీగర్లు వారి ఉనికి, మతం పట్ల చూపిస్తే ఈ సమస్యకు అంతం కనిపించదు. ఒకసారి వారిని బయటకు విడిచిపెడితే సమస్యలు పునరావృతమవుతాయి. అది షిన్‌జియాంగ్‌లో వాస్తవ పరిస్థితి "అంటూ తమ విధానాన్ని అంగీకరించారు.
ఇవి కూడా చదవండి:
- మీ సెల్‌ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడం ఎలా... హ్యాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- సైబర్ మాయగాళ్లు వేసే ఎరలు ఎలా ఉంటాయి? వాటికి చిక్కుకోకుండా ఉండడం ఎలా : డిజిహబ్
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















