కేరళ: ఇద్దరు లెస్బియన్ ముస్లిం అమ్మాయిల సహజీవనానికి అనుమతిచ్చిన కోర్టు

ఫొటో సోర్స్, ANI
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్
కేరళకు చెందిన స్వలింగ సంపర్క జంట సహజీవనం చేసేందుకు కోర్టు అనుమతి లభించింది. కానీ, తమ కుటుంబాల వల్ల మాత్రం తమకు బెదిరింపులు వస్తున్నాయని ఈ జంట అంటున్నారు.
22 ఏళ్ల అధీలా నస్రీన్ భాగస్వామి ఫాతిమా నూరాను తన నుంచి దూరం చేశారని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. నూరా కుటుంబం ఆమెను బలవంతంగా తన నుంచి దూరం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
అధీలా నస్రీన్, 23 ఏళ్ల ఫాతిమా నూరాతో సహజీవనం చేసేందుకు పూర్తి స్వేచ్ఛ ఉందని చెబుతూ సోమవారం కోర్టు తీర్పునిచ్చింది.
కోర్టు ఆదేశాలు తమకు చాలా ఉత్సాహం కలిగించాయని, కానీ, పూర్తిగా స్వేచ్ఛ లభించినట్లుగా అనిపించటం లేదని వారన్నారు.
సుప్రీం కోర్టు 2018లో గే-సెక్స్‌ను చట్టబద్ధం చేసినప్పటికీ, ఎల్జీబీటీ సమాజం మాత్రం ఇప్పటికీ వివక్షను, ప్రతిఘటనను ఎదుర్కొంటోంది.
దేశంలో స్వలింగ సంపర్కుల హక్కుల కోసం చాలా ఉద్యమాలు జరిగినప్పటికీ, వాటి ప్రభావం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమయింది.
సౌదీ అరేబియాలో చదువుకుంటున్నప్పుడు అధీలా, ఫాతిమా ఒకరితో ఒకరు ప్రేమలో పడినట్లు వారు స్థానిక మీడియాకు చెప్పారు.
వారిద్దరూ చాలా రోజులుగా కలిసి ఉంటున్నప్పటికీ వారి సంబంధం గురించి తమ కుటుంబాలకు గత నెలలోనే వెల్లడించారు.
"ఇన్నేళ్లు మా ఇళ్లల్లో ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా ఉండేది" అని నూరా సోమవారం ఒక న్యూస్ చానెల్‌కు చెప్పారు.

ఫొటో సోర్స్, Vanaja Collective via Facebook
కానీ, వారి సంబంధం గురించి తెలియచేయగానే కుటుంబాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు ఈ అమ్మాయిలు చెప్పారు.
వారిద్దరూ కలిసి కోజికోడ్‌లోని బలహీన వర్గాలకు, ఎల్జీబీటీక్యూలకు ఆశ్రయమిచ్చే వనజ కలెక్టివ్‌లో ఆశ్రయం పొందారు.
నస్రీన్ తల్లితండ్రులు వారికి ఎటువంటి హాని తలపెట్టరని హామీ తీసుకుని వారిని ఇంటికి పంపించినట్లు వారు చెప్పారు.
కానీ, కొన్ని రోజుల తర్వాత నూరాను ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా ఆమె నుంచి వేరు చేసినట్లు అధీలా చెప్పారు.
అధీలా ఈ మేరకు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేసి కోర్టుకు వెళ్లారు. ఈ అమ్మాయిలిద్దరూ కలిసి ఉండేందుకు కోర్టును అనుమతి ఇమ్మని కోరారు.
నూరా మంగళవారం కోర్టులో హాజరయి తన భాగస్వామితో కలిసి ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
కోర్టు వాదనలు విన్న కొన్ని నిమిషాల్లోనే వారు కలిసి ఉండేందుకు అనుమతినిచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.
2018లో స్వలింగ సంపర్క జంటను వారి కుటుంబం బలవంతంగా దూరం చేసిన కేసులో కూడా స్వలింగ సంపర్కులు కలిసి ఉండే హక్కు ఉందని అంటూ కేరళ హై కోర్టు తీర్పునిచ్చింది.
ఈ మొత్తం ప్రక్రియ చాలా కష్టంగా ఉందని ఇది తమను మానసికంగా చాలా కుంగదీసిందని నస్రీన్ క్వింట్ మీడియాకు చెప్పారు.
"కలిసి ఉండేందుకు మేము చాలా పోరాటం చేయాలని మాకు తెలుసు" అని నోరా ఒక స్థానిక టీవీ చానెల్ కు చెప్పారు.
"మీడియా, కోర్టుతో సహా చాలా మంది ప్రజల నుంచి ఇంత మద్దతు లభిస్తుందని మేం ఊహించలేదు" అని వారిద్దరూ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆసియా దేశాలు ఆహార ఎగుమతులను ఎందుకు నిలిపేస్తున్నాయి? దీనిని ఫుడ్ నేషనలిజం అంటారా?
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











