ముఖిహౌస్: పాకిస్తాన్ హైదరాబాద్‌లోని అందమైన ప్యాలెస్ చుట్టూ అల్లుకున్న ఒక కుటుంబం జ్ఞాపకాలు

1956 కు ముందు ముఖిహౌస్

ఫొటో సోర్స్, DR SURESH BHAVNANI

ఫొటో క్యాప్షన్, 1956 కు ముందు ముఖిహౌస్
    • రచయిత, సహర్ బలూచ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనా మహమ్మారి తర్వాత కరాచీకి వెళ్లడానికి అనుమతులు వచ్చాయి. కానీ, హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా చూడలేదు కాబట్టి, ఈసారి అక్కడికి వెళ్లాలని భావించాను.

నేను సింధ్ వచ్చి వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో అప్పుడప్పుడు పాకిస్తాన్‌లోని హైదరాబాద్ లో కొంతసేపు గడిపేదాన్ని. కానీ, ఆ నగరాన్ని పూర్తిగా చూడలేదు.

అందుకే ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఆ చారిత్రక నగరానికి పూర్తి సమయం కేటాయించాలని భావించాను. ఒకరోజు ఉదయం కరాచీ నుండి హైదరాబాద్‌కు ఫ్రెండ్ తో కలిసి బయలుదేరాను.

సాధారణంగా కరాచీ నుండి హైదరాబాద్ చేరుకోవడానికి ఒకటిన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఇంకొంచెం సమయం పట్టొచ్చు.

నా స్నేహితురాలు హైదరాబాద్‌లోని మంచి మంచి ప్రదేశాలను చూపిస్తానని, అందులో నువ్వు చూడాల్సిన ప్రత్యేకమైన ఇల్లు ఒకటి ఉందని అంది. ఆ ఇంటి పేరు ముఖిహౌస్ అని చెప్పింది.

ఆ బిల్డింగ్‌ను చూస్తే పాడుబడ్డ ఇంటిని బాగు చేసినదానిలా కనిపిస్తోంది. ప్రజలు దాన్ని చూడటానికి అనుమతిస్తున్నారు. అయితే, ఈ భవనానికి ప్రత్యేకమైన, ఆసక్తికరమైన చరిత్ర ఉంది.

ముఖిహౌస్ ప్రస్తుత స్థితి
ఫొటో క్యాప్షన్, ముఖిహౌస్ ప్రస్తుత స్థితి

హైదరాబాద్‌లోని ఇరుకైన వీధుల గుండా వెళుతూ, పాకాఖిలా రోడ్డులోని ముఖిహౌస్ ముందు మా కారు ఆగింది. ఈ ఇల్లు అక్కడి మిగిలిన ఇళ్లకు పూర్తి భిన్నంగా ఉంది.

ఈ ఇంటి ముఖ ద్వారం గుండా లోపలికి రాగానే కుడివైపున చిన్న కౌంటర్ ఉంది. టిక్కెట్టు కొన్న తర్వాత ఎక్కడి నుంచి ఎలా లోపలికి వెళ్లాలో సిబ్బంది చెబుతారు.

ఈ రహదారి పైకి వెళ్లడానికి మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఎక్కగానే ముఖిహౌస్ అనే ఎత్తైన భవనం కనిపిస్తుంది.

లోపలకు అడుగుపెట్టగానే నాకు ఈ భవనం నిజంగానే యునిక్(విలక్షణం) అన్న భావన కలిగింది. ఎందుకంటే లోపలికి అడుగు పెట్టగానే బయట నుండి ట్రాఫిక్ శబ్దం, కార్ల హారన్లు, ప్రజల గొంతులు, రణగొణ ధ్వనులు ఏవీ వినబడవు. అప్పట్లో ప్యాలెస్ లాంటి ఈ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటే ఓపెన్ చేశారు.

వీడియో క్యాప్షన్, పాప చనిపోయిందని ఖననం చేశారు, కానీ తవ్వి చూస్తే ప్రాణంతో ఉంది

భవనంలోకి రాగానే ఎదురుగా పై అంతస్తుకి మెట్ల మార్గం ఉంది. దానికి రెడ్ కార్పెట్ ఉంది. కానీ ఆ సమయంలో మమ్మల్ని లోపలికి అనుమతించలేదు. దీంతో మెట్లను చూస్తూ ముందుకు వెళ్లాము.

ముందు మరో ద్వారం గుండా ప్రవేశం ఉంది. ఇప్పుడు ఈ ఇంటికి మ్యూజియం హోదా వచ్చింది కాబట్టి లోపలికి వెళ్లగానే గది మధ్యలో, గోడల వెంట బల్లలు ఉన్నాయి.

ముఖి హౌస్ లోపలి భాగం

ఫొటో సోర్స్, Empics

ఫొటో క్యాప్షన్, ముఖి హౌస్ లోపలి భాగం

ఇందులో హైదరాబాదు చరిత్ర, నగరంలోని రాజకీయ నాయకులు, సమాజంలోని ప్రముఖుల గురించి సమాచారం ఉంది.

అయితే ముఖిహౌస్ చరిత్ర ఏంటి? దీనిని ఎవరు నిర్మించారు, ఎందుకు కట్టారు? ఇది తెలుసుకోవడానికి, నేను ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశారు. ఈ ముఖిహౌస్ నిర్మించిన వారి కుటుంబ సభ్యుల కోసం వెతకడం ప్రారంభించాను.

1920లో ప్రముఖ సింధీ హిందూ కుటుంబానికి చెందిన ముఖి ప్రీతమ్ దాస్ కుమారుడు ముఖిజెత్ ఆనంద్ అనే వ్యక్తి దీన్ని నిర్మించారని తెలిసింది.

ఇంట్లో పన్నెండు గదులు, రెండు పెద్ద హాళ్లు, వరండా ఉన్నాయి. ముఖి ప్రీతమ్ దాస్‌కి ఇద్దరు కొడుకులు. ముఖి జెత్ ఆనంద్, ముఖి గోవింద్ రామ్. ముఖి జెత్ ఆనంద్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు.

ముఖి జెత్ ఆనంద్ ఒక అందమైన ప్యాలెస్‌ని నిర్మించాలని కోరుకునేవారు. దీన్ని చాలాకాలంపాటు అనేకమంది ఆసక్తితో సందర్శించాలన్నది ఆయన కోరిక.

ప్యాలెస్ లాంటి ఈ ఇంట్లో ముఖి కుటుంబం 26 ఏళ్ల పాటు నివసించగా, దేశ విభజన తర్వాత ముఖి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఇక్కడి నుంచి వలస వెళ్లారు. 1956 తర్వాత ఇల్లు పూర్తిగా ఖాళీ అయింది.

నెహ్రూ ముఖిహౌస్ సందర్శించినప్పటి చిత్రం

ఫొటో సోర్స్, DR SURESH BHAVNANI

ఫొటో క్యాప్షన్, నెహ్రూ ముఖిహౌస్ సందర్శించినప్పటి చిత్రం

ఖాళీ అయిన తరువాత, కొంతకాలం దీనిని రికార్డ్ అండ్ సెటిల్మెంట్ ఆఫీసుగా ఉపయోగించారు. ఇంటిలోని రెండు గదులను అధికారులు ఉపయోగించేవారు. మిగిలిన భవనం చాలా వరకు ఖాళీగా ఉండేది.

1970లలో హైదరాబాద్‌లో భాషాపరమైన అల్లర్లు జరిగినప్పుడు ముఖి హౌస్ లో ప్రభుత్వ కార్యాలయానికి కొందరు దుండగులు నిప్పుపెట్టారు.

ఆ తర్వాత ఇక్కడ రేంజర్ల ఆఫీసు కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమీషనర్ దానిని బాలికల ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్న ఎన్జీవోకు అప్పగించారు. అయితే భవనం బాగోగులును ఎవరూ పట్టించుకోలేదు.

వీడియో క్యాప్షన్, తొమ్మిదో తరగతి చదివి, దేశాలన్నీ తిరుగుతూ నెలకు లక్షకు పైనే సంపాదిస్తున్న యువకుడు

1989లో, హైదరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ డీఏ) నగరంలోని పాత భవనాల జాబితాను రూపొందించింది. ఆ తర్వాత ముద్రించిన పోస్టు కార్డుల్లో ముఖిహౌస్ బొమ్మ కూడా ఉండేది.

పోస్ట్‌కార్డ్‌ కు ఎక్కినా, చాలాకాలం పాటు జిల్లా కార్యాలయాలకు అనుబంధంగా ఉండటం తప్ప ఎలాంటి మార్పుల లేకుండా ఉండిపోయింది.

హైదరాబాద్ నుండి వలస వచ్చిన ముఖి కుటుంబంలో ముఖి జెత్ ఆనంద్ కుమార్తె ధర్మ కూడా ఉన్నారు. ఆమె తన జీవితంలో రెండుసార్లు వలస వెళ్లారు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి నేటి ముంబయికి, ఆ తర్వాత ముంబయి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు.

సింధ్ ముఖ్యమంత్రి గులాం హసన్ హిదయతుల్లా (ఎడమ)తో ముఖి జెత్ ఆనంద్ (మధ్య)

ఫొటో సోర్స్, DR SURESH BHAVNANI

ఫొటో క్యాప్షన్, సింధ్ ముఖ్యమంత్రి గులాం హసన్ హిదయతుల్లా (ఎడమ)తో ముఖి జెత్ ఆనంద్ (మధ్య)

ముఖిహౌస్ ను సందర్శించిన వారిలో నెహ్రూ కూడా ఉన్నారు. ధర్మ తాము సింధులో గడిపిన రోజులను గుర్తుకు తెచ్చుకునే వారు. ముంబయిలో తాము బ్రీచ్ కాండీ ప్రాంతంలోని ఇంట్లో ఉన్నప్పుడు, ఆ విశేషాలను పిల్లలకు వివరించే వారు.

అమెరికా వెళ్లిన తర్వాత కూడా ఈ కథలు కొనసాగాయి. ధర్మ చెప్పిన ఈ కథలు ఆయన కుమారుడు డాక్టర్ సురేశ్ భవ్నాని మనసులో లోతైన ముద్ర వేసాయి. ఫలితంగా పాకిస్తాన్‌లో పుట్టకపోయినప్పటికీ హైదరాబాద్‌కు వచ్చి ముఖి హౌస్‌ని చూడాలని తహతహలాడేవారు.

ముఖి జెత్ ఆనంద్ సోదరుడు గోవింద్ రామ్ కుమార్తె ఆండ్రూ వోటోమల్ సింధ్‌లోని ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ కలీముల్లా లాషారీని కలిసినప్పుడు ఆయన కోరిక నెరవేరింది.

2005లో తాను చదువుకునేందుకు అమెరికా వెళ్లినప్పుడు అక్కడ ముఖి కుటుంబానికి చెందిన భవ్నానిని కలిశానని లాషారీ బీబీసీతో అన్నారు. ఆ ఆస్తిని కాపాడుకోవాలని వారు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశం తర్వాత, 2006లో కలీముల్లా లాషారీ పాకిస్తాన్‌కు తిరిగి వచ్చి సింధ్ ప్రభుత్వాన్ని సంప్రదించారు. సింధ్ ప్రభుత్వం అంగీకరించడంతో వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ముఖి కుటుంబం కోరింది. కలీం లాషారీ జిల్లా యంత్రాంగం వద్దకు వెళ్లారు.

ముఖి కుటుంబ సభ్యులు

ఫొటో సోర్స్, DR SURESH BHAVNANI

ఫొటో క్యాప్షన్, ముఖి కుటుంబ సభ్యులు

హైదరాబాదు ఆధునిక ముఖ చిత్రాన్ని చాటి చెప్పే ఆధునిక మ్యూజియంను హైదరాబాద్‌లో నిర్మించాలని తాను భావిస్తున్నట్లు లాషరి వెల్లడించారు.

''హైదరాబాద్‌కు చెందిన నజీమ్ కన్వర్ సాహిబ్‌తో మాట్లాడి బాలికల పాఠశాలను ఇక్కడి నుంచి మార్చాం. అప్పుడు నాకు ప్రభుత్వం నుండి ముఖి హౌస్ పవర్ ఆఫ్ అటార్నీ వచ్చింది. దానిని మ్యూజియంగా మార్చే పని ప్రారంభించా'' అని లాషారి వెల్లడించారు.

2013లో డాక్టర్ సురేశ్ భునానీ తన తల్లి ధర్మ తనకు చాలా కథలు చెప్పిన ఈ ముఖిహౌస్‌లో అడుగు పెట్టారు.

తన తల్లి ఈ ఇంటిని ముఖి మహల్ అని పిలిచేవారని డాక్టర్ సురేశ్ భునాని బీబీసీతో అన్నారు.

''అమ్మ చెప్పిన కథలన్నీ గుర్తొచ్చి ఇంట్లో ఒక గోడను తాకి కాసేపు కూర్చున్నాను. వంద సంవత్సరాల తరువాత, మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది. ఎందుకంటే ఈ ఇల్లు మంచి పనికి ఉపయోగించాలని ఆమె కోరుకునే వారు. ఇప్పుడు అది జరగబోతోంది'' అని అన్నారాయన.

ధర్మ ఈ ప్యాలెస్ ను మళ్లీ చూసి ఉండకపోవచ్చు. కానీ, ఆ దానిపై ఆమె ప్రేమ మాత్రం అందరికీ తెలిసింది.

ముఖి జెత్ ఆనంద్ కూతురు ధర్మ

ఫొటో సోర్స్, DR SURESH BHAVNANI

ఫొటో క్యాప్షన్, ముఖి జెత్ ఆనంద్ కూతురు ధర్మ

ముఖి ఫ్యామిలీ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఆ ఇంటిపై ప్రజల్లో ఉత్సుకత మొదలైంది. అప్పటికే ఆ భవనం రిపేర్ పనులు మొదలయ్యాయి. అయితే, అదే సమయంలో దొంగల భయం కూడా పెరిగింది.

ముఖి హౌస్‌కు కాపలాగా రెగ్యులర్ గార్డులను నియమించారు. ఇన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ముఖిహౌస్ ఇప్పుడు 'భూత్ బంగ్లా'గా మారింది.

ఈ విషయాన్ని ఇద్దరు వాచ్‌మెన్‌లు కలీముల్లా లాషారీకి చెప్పారు. ప్రజల్లో భయం పోగొట్టడానిక లాషారి స్వయంగా ఆ గదిలో నిద్రించడం ప్రారంభించారు.

తాము లేనప్పుడు వాచ్ మెన్‌లు ఈ ఇంటిని వదిలిపోకుండా, విలువైన వస్తువులు దొంగల చేతికి చిక్కకుండా చేసేందుకు ఆయన ఈ పని చేశారు.

ఇంతకుముందు ఇక్కడ ఏర్పాటు చేసిన అదే రకమైన పరికరాలను ఈ ఇంట్లో అమర్చడం అతిపెద్ద బాధ్యతలలో ఒకటి. ఇబ్బందులు ఉన్నప్పటికీ, నేల మునుపటి పలకల మాదిరిగానే ఉంది, కిటికీలలో స్టెయిన్డ్ గ్లాస్, ఇంతకు ముందు ఉన్న కిటికీలలో అదే చెక్క ఫర్నిచర్ అమర్చబడింది.

మొత్తం మీద ఇంటిని పాత రూపానికి తీసుకు వచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్ నలుమూలల నుండి ప్రజలు ముఖి హౌస్‌ని చూడటానికి హైదరాబాద్‌కు వస్తూనే ఉన్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)