బంగారం కొంటున్నారా? మోసపోకుండా ఉండేందుకు మీరు తెలుసుకోవాల్సిన 8 అంశాలివే...

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

బంగారు ఆభరణాల తయారీదారులకు 10 గ్రాముల బంగారం ఇస్తే మనకు 10.44 గ్రాముల బంగారు ఉంగరాన్ని ఇస్తారు. తక్కువ బంగారమే ఇస్తున్నా, ఎక్కువ బరువున్న ఆభరణం మనకు ఎందుకు వస్తుందో తెలుసా? ఇందులో ఎవరు లాభం పొందుతున్నారు?

ఇలా బంగారం కొనేటప్పుడు మనం చాలా విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అవేమిటో వివరంగా తెలుసుకుందాం.

బంగారం

ఫొటో సోర్స్, Srivivas Lakkoju

ప్రత్యేకమైన లోహం

బంగారం ప్రత్యేకమైన లోహం కావడం, లభ్యత తక్కువగా ఉండటం లాంటి కారణాల వల్ల దీనిపై ఆసక్తి, డిమాండ్, అన్నీ ఎక్కువే. బంగారాన్ని వందల ఏళ్ల నాడే డబ్బులాగే, లేదా డబ్బుకు బదులుగా వ్యాపార క్రయవిక్రయాల్లో ఇచ్చిపుచ్చుకునేవారు.

బంగారం మెత్తగా, సున్నితంగా ఉంటుంది. సాగే గుణం వలన ఆభరణాల తయారీకి అనుకూలంగా ఉంటుంది. అలా తయారైన ఆభరణాలు ఏళ్ల తరబడి పాడవకుండా ఉండటం కూడా బంగారంపై ఇష్టం పెరగడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వేల సంవత్సరాలుగా బంగారాన్ని చాలా గొప్ప లోహంగా, ఖరీదైనదిగానే చూస్తున్నారు.

వీడియో క్యాప్షన్, బంగారం కొనేముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 8 అంశాలివే...

క్రేజ్ అంతా ఇంతా కాదు..

బంగారు ఆభరణాలు కొనేటప్పుడు లేదా తయారీ సమయంలో ముందుగా ఆరా తీసేవి రెండే విషయాలు. ఒకటి ఆభరణం ధర ఎంత? అందులో తరుగు ఎంత?

బంగారు ఆభరణాల తయారీలో తరుగు ఎందుకు వస్తుంది? ఈ విషయంపై విశాఖపట్నంలోని బంగారం దుకాణాలు అధికంగా ఉండే వన్‌టౌన్ ప్రాంతంలోని కొందరు స్వర్ణకారులు, దుకాణాల యాజమానులతో బీబీసీ మాట్లాడింది.

బంగారు ఆభరణాల తయారీలో తరుగు, తయారీ విషయాలతో పాటు ఇతర ఆసక్తికర అంశాలను ఆభరణాల తయారీలో 27ఏళ్ల అనుభవమున్న స్వర్ణకారుడు, విశాఖ నగర స్వర్ణకారులు/విశ్వబ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు గురజాపు రవి వివరించారు.

బంగారం

ఫొటో సోర్స్, Srivivas Lakkoju

1. ఏ బంగారం మంచిది?

బంగారం నాణ్యత లేదా స్వచ్ఛతను 0 నుంచి 24 క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం అంటే అది 99.99 శాతం స్వచ్ఛమైదని అర్థం. ఇందులో స్వల్ప మోతాదులో ఇతర లోహాలుంటాయి. 24 క్యారెట్ల బంగారం సున్నితంగా ఉండటంతో దీనితో ఆభరణాలు తయారు చేయడం కష్టం. దీనికి గట్టిదనం చేకూర్చడం కోసం రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహాలను కలుపుతారు.

ఈ లోహాలు కలిసిన శాతం ఆధారంగా బంగారం స్వచ్ఛత అంటే 22 క్యారెట్లు, 18 క్యారెట్లుగా నిర్ణయిస్తారు. 22 క్యారెట్ల బంగారం అంటే అందులో 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహాలు ఉంటాయి. అలాగే 18 క్యారెట్లు అంటే బంగారం స్వచ్ఛత 75 శాతం, ఇతర లోహాలు 25 శాతం ఉన్నాయని అర్థం.

14 క్యారెట్లలో బంగారం 58.5 శాతం, 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. అయితే సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు.

బంగారం

ఫొటో సోర్స్, Srivivas Lakkoju

2. పెట్టుబడుల బంగారం 24 క్యారెట్ గోల్డ్

24 క్యారెట్ల బంగారంతో నగలు చేయాలంటే దానికి కొంత రాగి, కాడ్మియం, జింక్, వెండి వంటి లోహాలు స్వల్ప మోతాదులో కలపాలి. అలా కలిపితే దానిని 22 క్యారెట్ల బంగారం అంటారు.

వంద గ్రాముల 22 క్యారెట్ల బంగారంలో 91.6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉండాలి, మిగిలిన 8.4 గ్రాములు వేరే లోహాలు ఉండాలి. అలా ఉండే దాన్నే 916 కేడీఎం గోల్డ్ లేదా 91.6 కేడీయం గోల్డ్ అని కూడా అంటారు. బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు 24 క్యారెట్ల బంగారాన్ని కొంటుంటారు.

ఇక 18 క్యారెట్ల బంగారంలో 18 భాగాల పసిడి ఉంటే.. ఆరు భాగాల ఇతర మెటల్స్ ఉంటాయి. అలాగే 14 క్యారెట్ల బంగారంలో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి.

అలాగే పది క్యారెట్ల బంగారం కూడా లభిస్తుంది. అయితే బంగారంలో ఏ లోహం ఎంత కలిపారన్న దాన్ని బట్టి బంగారు ఆభరణం రంగు ఆధారపడి ఉంటుంది. బంగారం స్వచ్ఛతను దాని నునుపు, మెరుపు, రంగును బట్టి గుర్తిస్తారు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండటంతోపాటు కొద్దిగా నల్లని రంగులో ఉంటుంది. బంగారానికి కలిపే లోహాన్ని బట్టి బంగారం రంగు మారుతుంది.

బంగారం

ఫొటో సోర్స్, Srivivas Lakkoju

3. తరుగు అంటే?

బంగారంతో నగలు తయారు చేయించుకునేవారు, లేదా రెడీమెడ్ ఆభరణాలు కొనేవారు బంగారం ధరతో పాటు తరుగు, మజూరీ విషయాలపై ఆరా తీస్తారు. బంగారు ఆభరణాలను తయారు చేసేటప్పుడు...వివిధ దశల్లో బంగారాన్ని కాల్చడం, కరిగించడం, సుత్తితో కొట్టడం, మిషన్లపై తీగలుగా మార్చడం, డిజైన్లు తీయడం, మెరుగు పెట్టడం ఇలా చేసే ప్రక్రియలో స్వల్ప మెతాదులో బంగారం వృథా అవుతుంది. దీనినే తరుగు లేదా వేస్టెజ్ అంటారు.

ఉదాహరణకు రూ. 50 వేలు విలువైన 10 గ్రాముల బంగారంతో ఉంగరం చేస్తే మజూరీ అంటే తయారీ ఛార్జీలు 200 మిల్లీ గ్రాములు, ఇతర తరుగు కింద 200 మిల్లీ గ్రాములు అంటే మొత్తం 400 మిల్లీ గ్రాములు పోతుంది. ఈ మొత్తాన్ని తరుగుగానే వ్యవహరిస్తాం.

వస్తు తయారీలో పది గ్రాములకు 70 మిల్లీ గ్రాములు కరిగింపులో పోయే అవకాశం ఉంది. దాని తర్వాత ఆ బంగారాన్ని రాపడం, డిజైన్ చెక్కడం, చివరగా మెరుగు పెట్టడం చేసేటప్పుడు బంగారం ఒక్కో చోట 15 నుంచి 30 మిల్లీ గ్రాముల వరకు తరుగు రూపంలో పోతుంది.

ఇలా సరాసరి ఉంగరం తయారీ ప్రక్రియలో వివిధ దశల్లో 200 మిల్లీ గ్రాముల వరకు తరుగు పోతుంది. ఇది ఇటు వినియోగదారుకుగానీ, తయారీదారుకుగానీ మిగలదు.

బంగారం

ఫొటో సోర్స్, Srivivas Lakkoju

4. బంగారు ఆభరణంలో బంగారం ఎంత?

22 కేడీఎం హాల్‌మార్క్ ఉంగరం పది గ్రాములు, అంటే 22కే పది గ్రాముల బంగారం ఖరీదు రూ. 50 వేలు అనుకుందాం. ఈ రూ.50 వేలులో తయారు చేయడానికి రూ. 2 వేల విలువైన బంగారం ఖర్చవుతుంది. అంటే తయారీదారు 400 మిల్లీ గ్రాముల బంగారాన్ని తీసుకుంటారు.

వస్తువు తయారీలో హ్యాండ్ అండ్ మిషన్ వర్క్ చేసేటప్పుడు దాదాపు 200 మిల్లీ గ్రాములు పోతుంది. మిగిలిన 200 మిల్లీ గ్రాములు మజూరీ లేదా తయారీకి తీసుకుంటారు. తయారీదారు వస్తువుగా చేసి కస్టమరు ఇచ్చే ఆభరణంలో 9.6 గ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. దీని విలువ రూ. 48,000/-. కానీ ఆ ఆభరణం బరువు మాత్రం 10.44 గ్రాములుంటుంది.

అంటే 10 గ్రాముల బంగారం ఇస్తే 10.44 గ్రాముల బరువైన ఆభరణం వస్తుంది. అందులో 96 శాతం బంగారం ఉంటే, 8.4 శాతం ఇతర లోహాలుంటాయి.

బంగారం

ఫొటో సోర్స్, Srivivas Lakkoju

5. కస్టమర్ మోసపోయే అవకాశం ఎక్కడ?

స్వర్ణకారుడు తయారు చేసినా, నేరుగా దుకాణాల్లో కొన్నా 10 గ్రాములకు 400 మిల్లీ గ్రాములు తరుగు, మజూరీకి పోతుంది. అయితే మోసం జరిగే అవకాశం మాత్రం డిజైన్లు, స్టోన్ వర్క్ ఎక్కువగా ఉండే ఆభరణాల విషయంలోనే ఉంటుంది.

ఆభరణంలో అద్దిన రాళ్ల (స్టోన్స్) బరువును సైతం బంగారంగా చూపిస్తారు. అందులోనూ ఎన్ని ఎక్కువ స్టోన్స్ ఉంటే అంత మోసానికి అవకాశం ఉంటుంది. అది గ్రహించకపోతే మోసం తప్పదు. స్టోన్స్‌తో కూడిన ఒక ఆభరణం బరువు 20 గ్రాములుంటే అందులో ఐదు గ్రాములు స్టోన్స్ ఉంటే, రాళ్ల బరువును కూడా బంగారం ధరకే లెక్క వేసే అవకాశం ఉంటుంది.

ఆ రాళ్లను బంగారంలా లెక్కించి, తరుగు ధర, మేకింగ్ ఛార్జెజ్ ఉండవని, లేదా చాలా తక్కువ తరుగు, తయారీ ధరలంటూ తగ్గించి... మార్కెటింగ్ చేసుకుంటారు. రాళ్లలో మిగిలిన దాంతో పోల్చుకుంటే ఇచ్చే ఆఫర్లు పెద్దగా ఏమీ ఉండవు. బంగారు ఆభరణాల్లో పొదిగే రాళ్లు ఖరీదు రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.2000 వరకు ఉంటాయి. అయినా కూడా బంగారంలో వాటిని కలిపి చూపిస్తే కస్టమర్ చాలా నష్టపోతారు. అదే తరుగు, తయారీ ఛార్జీలు లేవనే ఆఫర్లు గట్టి గాజులు, గట్టి ఉంగారాలు, డిజైన్ వర్క్ లేని బంగారు ఆభరణాల విషయంలో ఇవ్వరు. ఇవ్వలేరు.

బంగారం

ఫొటో సోర్స్, Srivivas Lakkoju

6. వేస్టేజ్‌లో పోయిన గోల్డ్ ఏమవుతుంది?

ఆభరణాల తయారీలో స్వర్ణకారులు తయారీ కోసం తీసుకునే 200 మిల్లీ గ్రాముల బంగారం కాకుండా, తయారీలోని వివిధ దశల్లో మరో 200 మిల్లీ గ్రాముల వరకు పోతుంది. మౌల్డింగ్ చేసేటప్పుడు బంగారాన్ని వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కరిగిస్తారు. అక్కడ కొంత పోతుంది. అలాగే వివిధ దశల్లో స్వల్ప పరిమాణంలో కంటికి కనిపించకుండా పోయే బంగారం ఆ వర్క్ ఏరియాలోనే రజను రూపంలో కొంత ఉంటుంది.

కానీ దానిని పొందడం చాలా కష్టం. దాన్ని వివిధ రూపాల్లో పొందేవారు ఉంటారు. బంగారు ఆభరణాలు తయారు చేసే ప్రాంతంలో ఉన్న మట్టి లేదా వ్యర్థాలను మూడు నెలలకు ఒక్కొసారి చైన్నె నుంచి వచ్చి కొందరు కొంటారు. ఒక 8x8 అడుగుల ఆభరణాల దుకాణంలో మూడు నెలల్లో పోగైన మట్టిని కాల్చి, నానబెట్టి, ఎండబెట్టి, జల్లించి, వడకట్టి ఇలా అనేక ప్రక్రియలు చేస్తే అందులో 200 మిల్లీ గ్రాముల బంగారం దొరికే అవకాశం ఉంటుంది. గ్యారంటీ అయితే ఉండదు. కానీ మట్టి నుంచి కనీసం 200 మిల్లీ గ్రాముల బంగారాన్ని పొందాలంటే మాత్రం కనీసం రూ. 600 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

బంగారం

ఫొటో సోర్స్, Srivivas Lakkoju

7. 22 క్యారట్ల బంగారాన్ని నమ్మేదెలా?

ఆభరణాల తయారీకి అనువైన బంగారమే 22 క్యారెట్ గోల్డ్. అయితే ఇందులో కొంత మెతాదులో ఇతర లోహాలను కలుపుతారు. మరి దీనిని నమ్మడం ఎలా? ఇక్కడే మనం బంగారం ఆభరణాల విషయంలో తరచూ వినే హాల్ మార్కింగ్ ఉపయోగపడుతుంది.

ఏదైనా విలువైన లోహంతో తయారుచేసే వస్తువులో ఆ లోహం ఎంత శాతముందో కచ్చితంగా నిర్ధారించి, అధికారికంగా ముద్ర వేయడమే హాల్‌మార్కింగ్. ఇది బంగారానికి కూడా వర్తిస్తుంది. హాల్ మార్కింగ్ చాలా దేశాల్లో విలువైన లోహపు వస్తువుల స్వచ్ఛతకు హామీ ఇస్తుంది. కల్తీ నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం, తయారీదారులు చట్టబద్ధమైన ప్రమాణాలను పాటించేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశాలు.

చెన్నైలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బీఎస్ఐ) హాల్‌మార్క్‌ లైసెన్స్ ఇస్తుంది. ఈ లైసెన్స్ పొందిన బంగారు దుకాణదారులంతా హాల్ మార్క్ సీల్ వేయవచ్చు. హాల్ మార్క్ లేకుండా ఏ నగ అమ్మినా అది నేరమే. ఏదైనా నగకు హాల్ మార్కింగ్ వేయాలంటే రూ. 50 నుంచి రూ. 100 వరకు, దానికి సర్టిఫికేట్ కూడా కావాలంటే మరో రూ. 60 అదనంగా తీసుకుంటారు.

22 క్యారెట్లకు 22కే916, 18 క్యారెట్లకు 19కే750, 14 క్యారెట్ల బంగారం అయితే 14కే585 ఇలా గుర్తులు ఉంటాయి. హాల్ మార్కింగ్‌పై బంగారం స్వచ్ఛత నంబర్, తయారీ సంవత్సరం వివరాలు కూడా ఉంటాయి.

వీడియో క్యాప్షన్, ఇది ఎవరి దగ్గరుంటే వారికి భవిష్యత్తులో తిరుగుండదు

8. బంగారాన్ని యాసిడ్‌తో పరీక్ష చేయవచ్చా?

కొనే బంగారు ఆభరణం స్వచ్ఛత, నాణ్యతను కొనుగోలుదారులు పరీక్షించవచ్చు. దానికి చిన్నచిన్న చిట్కాలున్నాయి. ముందుగా ఆభరణం అంచులను జాగ్రత్తగా గమనించాలి. అందులో ఎక్కడైనా రంగు పోయినట్లు, వెలిసినట్లు ఉంటే అది అసలైన బంగారం కాదని, బంగారు పూత పూశారని అర్థం చేసుకోవాలి.

ఆభరణాల తయారీలో రాగి, జింక్, వెండి కాకుండా బరువు ఎక్కువగా తూగడం కోసం ఇనుమును కూడా కలుపుతారు. అందుకే అయస్కాంతంతో ఆభరాణాన్ని పరీక్షించవచ్చు. ఇనుము ఉంటే ఆభరణం అయస్కాంతానికి అతుక్కుంటుంది.

వీడియో క్యాప్షన్, పాత కంప్యూటర్లు, టీవీల నుంచి బంగారం తయారు చేసే కొత్త టెక్నాలజీ

ఆభరణాన్ని గీస్తే నల్లటి రంగు కనిపిస్తే అది స్వచ్ఛమైనది కాదని, పసుపు వర్ణం కనిపిస్తే అది స్వచ్ఛమైన బంగారమని అర్థం. అవకాశముంటే కొనే ఆభరణాన్ని యాసిడ్‌తోనూ పరీక్షించవచ్చు. నైట్రిక్ యాసిడ్ ఒక డ్రాప్ వేస్తే బంగారం రంగు మారితే అది నకిలీదని, రంగు మారకపోతే అది నాణ్యమైనదని తెలుసుకోవచ్చు.

బంగారు ఆభరణాల మోసాలు, నకిలీలపై ఫిర్యాదు చేయాలన్నా, బీఐఎస్ లైసెన్స్ పొందిన ఆభరణాల వర్తకుల వివరాలు తెలుసుకోవాలన్నా http://www.bis.org.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)