బంగారం గని సమీపంలో పేలుడు, 60 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
నైరుతి బుర్కినా ఫాసోలోని ఒక తాత్కాలిక బంగారం గని సమీపంలో జరిగిన పేలుడులో 60 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు చెప్పారు.
బంగారం తవ్వకాలు జరిగే ప్రాంతంలో ఒక మార్కెట్లో నిల్వ చేసిన డైనమైట్లకు మంటలు అంటుకోవడంతో ఈ పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
"ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా కనిపిస్తున్నాయి. ఈ పేలుడుతో చెట్లు కూలిపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి" అని ఒక అధికారి వార్తా సంస్థ రాయిటర్స్‌కు చెప్పారు.
పేలుడులో గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసిందని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ చెప్పింది.
ఈ ఘటన సోమవారం జరిగింది. గావా పట్టణం దగ్గరే ఉన్న ఘటనా స్థలాన్ని స్థానిక అధికారులు పరిశీలించారు. పేలుడు ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు.
తదుపరి నోటీసులు వచ్చేవరకూ ఆ బంగారు గనిని మూసిస్తున్నట్లు బుర్కినా ఫాసో న్యూస్ ఏజెన్సీ ఏఐబీ చెప్పింది.
"గని దగ్గర జరిగిన పేలుడు ఆ ప్రాంతంలో అన్నింటినీ ధ్వంసం చేసింది" అని స్థానిక ఆర్టీబీ టీవీ చెప్పింది.
ఇక్కడ పనిచేసే గని కార్మికుల్లో చాలా మంది దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చినవారేనని స్థానిక నేత సంసాన్ ఉర్బైన్ కాంబో రాయిటర్స్‌కు చెప్పారు.
ఆఫ్రికాలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో బుర్కినా ఫాసో ఒకటి. ఇక్కడ తవ్వకాలు జరిగే చాలా గనులను విదేశీ సంస్థలే నడుపుతున్నాయి. వీటిపై పెద్దగా పర్యవేక్షణ, నియంత్రణ కూడా ఉండడం లేదు.
2009 నుంచి బంగారం బుర్కినా ఫాసో ప్రధాన ఎగుమతిగా మారిందని, పత్తి ఎగుముతులను అది దాటిపోయిందని బీబీసీ పశ్చిమ ఆఫ్రికా ప్రతినిధి నికొలస్ నెగోస్ చెప్పారు.
"2019లో 45 టన్నుల ఉత్పత్తితో పోలిస్తే 2020లో బుర్కినా ఫాసోలో 54 టన్నుల బంగారం ఉత్పత్తి జరిగిందని, ఇది 20 శాతం వృద్ధి" అని ఆ దేశ గనుల శాఖ మంత్రి చెప్పారు.
ఇక్కడ మొత్తం బంగారం ఉత్పత్తిలో పావు వంతు అనధికారిక గనుల నుంచే జరుగుతోంది. ఇవి దాదాపు 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయిని ఆ దేశ గనుల శాఖ అంచనా.
తవ్వకాలు జరిగే అనధికారిక గనుల్లో పైకప్పు కూలిపోవడం లాంటి ప్రమాదాలు చాలా ఆఫ్రికా దేశాల్లో తరచూ సంభవిస్తుంటాయి.
ఇదే ఏడాది జనవరిలో ఘనాలోని ఒక బంగారు గనికి పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్న ట్రక్కు మోటార్ బైకును ఢీకొనడం వల్ల జరిగిన భారీ పేలుడులో 13 మంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














