చికెన్‌: కోడి మాంసాన్ని షాపు నుంచి తెచ్చాక కడగకూడదా? వాష్ చేస్తే ప్రమాదమా? మరి ఎలా వండాలి?

ట్యాప్ కింద శుభ్రం చేస్తున్న చికెన్

ఫొటో సోర్స్, Getty Images

కూర వండే ముందు చికెన్‌ను కడగడం ప్రమాదకరమా? అవుననే అంటున్నారు పరిశోధకులు. సరిగ్గా శుభ్రం చేయకపోతే కదా ప్రమాదం, క్లీన్ చేస్తే మంచిది కాదని చెబుతారేంటని ఆశ్చర్యపోవచ్చు. కానీ అదే నిజమని పరిశోధకులు చెబుతున్నారు.

సాధారణంగా షాపు నుంచి చికెన్ తీసుకురాగానే తొలుత చేసే పని దాన్ని శుభ్రంగా కడగడం. ఆ తరువాతే దాన్ని కావాల్సినట్లు వండుకుంటారు. కానీ ఇలా శుభ్రం చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, చికెన్‌ను షాపు నుంచి తెచ్చాక కడగకూడదా?

'ట్యాప్ కింద కడిగితే ప్రమాదం'

కడిగేటప్పుడు మాంసం మీద ఉండే బ్యాక్టీరియా మన చేతులకు సోకి తద్వారా అది మన కడుపులోకి చేరే అవకాశం ఉంటుందని బ్రిటన్‌కు చెందిన ఫుడ్ స్టాండర్స్ ఏజెన్సీ(ఎఫ్‌సీఏ) చెబుతోంది.

పచ్చి కోడి మాంసం మీద సాల్మోనెల్ల, క్యాంపిలోబ్యాక్టర్ వంటి బ్యాక్టీరియాలుంటాయి. ట్యాప్ కింద పెట్టి చికెన్‌ను కడిగేటప్పుడు నీళ్లు చిందిపడటం వల్ల వంట పాత్రలు, మనం వేసుకున్న దుస్తులు, చేతులు తుడుచుకునే గుడ్డలు వంటి వాటికి బ్యాక్టీరియా సోకుతుంది.

ఉదాహరణకు సింక్ పక్కనే కత్తి ఉంటే చికెన్‌ను కడిగే నీళ్లు పడి కత్తి మీదకు బ్యాక్టీరియా చేరుతుంది. ఆ తరువాత అదే కత్తితో మనం మామిడి కాయనో, యాపిల్‌నో కోసుకుని తినొచ్చు. ఫలితంగా ఆ బ్యాక్టీరియా అది మన కడుపులోకి చేరుతుంది.

చికెన్

ఆరోగ్యాన్ని దెబ్బతీసే క్యాంపిలోబ్యాక్టర్

ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ప్రధానమైన బ్యాక్టీరియాలలో క్యాంపిలోబ్యాక్టర్ ఒకటి.

పచ్చి మాంసం, తాజా కూరగాయలు, శుద్ధి చేయని పాలు వంటి వాటిని తీసుకొనడం వల్ల ఈ బ్యాక్టీరియా సోకుతుంది.

క్యాంపిలోబ్యాక్టర్ బ్యాక్టీరియా సోకడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. డయేరియా, పొత్తికడపులో నొప్పి, జ్వరం, వాంతులు వంటివి తలెత్తుతాయి.

కొందరిలో ఈ వ్యాధులు కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. కానీ మరికొందరిలో ఆరోగ్యం మీద దీర్ఘకాల ప్రభావం పడుతుంది.

ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్:

ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌కు క్యాంపిలోబ్యాక్టర్ దారి తీస్తుంది. అంటే పొత్తి కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, డయారేయా, మలబద్ధకం వంటివి తలెత్తుతాయి.

గ్యాంబరే సిండ్రోమ్:

క్యాంపిలోబ్యాక్టర్ వల్ల తలత్తే మరొక రుగ్మత గ్యాంబరే సిండ్రోమ్. చాలా అరుదుగా సోకే ఈ వ్యాధి వల్ల మనలోని వ్యాధి నిరోధక శక్తి మన నాడీ వ్యవస్థ మీద దాడి చేస్తుంది.

అలసట, ఒళ్లు మొద్దుబారడం వంటివి ఇందులో తొలుత కనిపించే లక్షణాలు. ఆ తరువాత ఇది మెల్లగా విస్తరిస్తూ చివరకు శరీరమంతా చచ్చుబడి పోతుంది. వెంటనే ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది.

క్యాంపిలోబ్యాక్టర్ వల్ల ప్రాణాలు కూడా పోవచ్చు. ముఖ్యంగా పిల్లలు, ముసలి వాళ్లకు ఎక్కువ ప్రమాదం.

చికెన్ కూర

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • షాప్ నుంచి తీసుకొచ్చిన చికెన్‌ను కడగకుండా తగిన టెంపరేచర్ వద్ద ఉడికించాలి. ఒకవేళ చికెన్ మీద ఉండే రక్తపు మరకలు వంటివి ఇబ్బందికరంగా అనిపిస్తే పేపర్ టవల్‌తో శుభ్రం చేయాలి. ఆ తరువాత పేపర్ టవల్స్‌ను జాగ్రత్తగా డస్ట్‌బిన్‌లో వేయాలి.
  • పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లో జాగ్రత్తగా స్టోర్ చేయాలి. ఇతర ఆహారపదార్థాలతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • చికెన్ ముక్కలు చేయడానికి ఉపయోగించే చాపింగ్ బోర్డు, కత్తి, చికెన్ ఉంచేందుకు వాడే పాత్రలను శుభ్రంగా కడగాలి.
  • మాంసం పట్టుకున్న చేతులను బట్టలకు లేదా అప్రాన్‌కు తుడుచుకోకూడదు. చేతులను సబ్బుతో, వేడి నీళ్లతో కచ్చితంగా వాష్ చేసుకోవాలి. అప్పుడే బ్యాక్టీరియా సోకకుండా ఉంటుంది.
వీడియో క్యాప్షన్, బందరు లడ్డూ ఇలా చేస్తారా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)