ధరల సంక్షోభం: 'అన్ని ఖర్చులూ తగ్గించుకున్నా... కడుపు నిండా తిండి దొరకడం లేదు'

ఫొటో సోర్స్, Getty Images
ఆహారం, ఇంధన ధరలు పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఖర్చులు తగ్గించుకుని బతికేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది.
వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పంటల దిగుబడి తగ్గింది. కోవిడ్ మహమ్మారి వస్తువులు, కార్మికుల కొరతకు దారి తీసింది.
యుక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల గ్యాస్ సరఫరాలు తగ్గి, ఎరువుల ధరలు పెరగడంతో అంతర్జాతీయ మాంద్యం రావచ్చని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది.
జీవన వ్యయం పెరగడం వల్ల తమ జీవితాలపై కలిగిన ప్రభావం గురించి అయిదు దేశాలకు చెందిన వ్యక్తులు బీబీసీ ప్రతినిధులతో తమ కథనాలను పంచుకున్నారు.

బ్రెజిల్: పంటలు బాగా పండాయి... కానీ, మా వంటింట్లో ఏమీ లేదు
కేటీ వాట్సన్ , బ్రెజిల్ ప్రతినిధి
సావ్ పాలో లోని అరారాకారాకు చెందిన రోసియేన్ ఇనాసియో బుల్హోస్ ఆలివెరాకు కనీస అవసరాలను సమకూర్చుకోవడం కూడా కష్టంగా ఉంది. ఆమె ప్రస్తుతం ఎవరైనా ఉచితంగా పంపిణీ చేసే సరకులు, డిస్కౌంట్‌లో లభించే ఆహార పదార్థాలపై ఆధారపడుతున్నారు.
ఆమె ఫ్రిడ్జ్‌లో ఒక గిన్నెలో మిగిలిపోయిన ఆహారం తప్ప ఇంకేమీ లేవు.
"ఈ బీన్స్, కొంచెం మాంసాన్ని మా ఆయన పడేయబోతుంటే సరిగ్గా సమయానికి అడ్డుపడ్డాను" అని ఆమె చెప్పారు.
బ్రెజిల్‌లో గత ఏడాది నిత్యావసరాలు, సేవల విషయంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు పెరిగింది. బ్రెజిల్ శక్తిమంతమైన వ్యవసాయ దేశమైనప్పటికీ ప్రతి నలుగురిలో ఒకరికి తగినంత తిండి దొరకడంలేదు. దేశంలో ఆహార పదార్ధాల ధరలు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో ప్రజల జీతాలు మాత్రం పెరగడం లేదు.
వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఎరువుల ధరలతో పాటు కోవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన సరఫరా చెయిన్‌లో కలిగిన అంతరాయం రైతులకు ఉత్పత్తి ఖర్చును పెంచేస్తోంది. ఇవన్నీ కలిపి వినియోగదారులపై భారాన్ని చూపిస్తున్నాయి.
రోసియేన్ ఇంట్లో నుంచి మురికి వాసన వస్తోంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా ఖర్చుతో కూడుకున్న పనే. ఒక వైపు వంట నూనె ధరలు పెరుగుతుండగా, రోసియేన్, ఆమె తండ్రి కలిసి వంటకు ఉపయోగించిన నూనెతో సబ్బులను తయారు చేయడం నేర్చుకున్నారు.

న్యూజీలాండ్ : ఆస్ట్రేలియాకు వలస వెళ్లాల్సి వచ్చింది
షైమా ఖలీల్, ఆస్ట్రేలియా ప్రతినిధి
స్థిరాస్తి కొనుక్కునేందుకు న్యూజీలాండ్ రాజధాని వెల్లింగ్టన్ ప్రపంచంలోనే అందుబాటులో లేని నగరాల్లో ఒకటిగా ర్యాంకింగ్ పొందింది. గత ఏడాది స్థిరాస్తుల ధరల్లో 12% పెరగడంతో అద్దెకు ఉండేవారి పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది.
దీంతో పాటు, పెట్రోల్, ఆహార పదార్ధాల ధరలు పెరుగుతుండటంతో చాలా మంది ఆస్ట్రేలియాకు వలస వెళ్లాలని చూస్తున్నారు.
ఆ దేశంలో వారికి జీవించేందుకు, పని చేసుకునేందుకు హక్కులు ఉంటాయి.
వెల్లింగ్టన్‌కు చెందిన క్రిస్ ఆయన భాగస్వామి హార్మనీ, నలుగురు కూతుళ్లతో కలిసి ఇటీవల ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ నగరానికి వెళ్లారు. వారికొక సొంత ఇల్లు ఉంటూ మంచి జీతాలు సంపాదించుకున్నప్పటికీ కూడా వారు ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
"మాకు నలుగురు పిల్లలు ఉన్నారు. దాంతో, జీవన వ్యయం మరింత ఎక్కువగా ఉంటుంది. జీవన వ్యయం పెరుగుతోందని ఆస్ట్రేలియాలో ప్రజలు కూడా అంటున్నారు. కానీ, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఉన్న జీవన వ్యయం న్యూజీలాండ్ లో ఐదేళ్ల క్రితమే ఉంది" అని క్రిస్ చెప్పారు.
న్యూజీలాండ్‌ను మిగిలిన కుటుంబ సభ్యులను వదిలిపెట్టి రావడం హార్మనీకి చాలా కష్టమైన నిర్ణయం. కానీ, పిల్లల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు.
"న్యూజీలాండ్ లో బ్రతకడం చాలా కష్టంగా ఉంటోంది. రోజు రోజుకీ తిరోగమనమే కనిపిస్తోంది. బ్రతకాలనుకుంటే వేరే మార్గం లేదు. అయితే, దేశం విడిచి వెళ్ళాలి లేదా న్యూజీలాండ్ లో పరిస్థితులు మారాలి. నా పిల్లలకు భవిష్యత్తు కావాలని అనుకుంటున్నాను.
న్యూజీలాండ్‌లో నాకు భవిష్యత్తు కనిపించలేదు" అని ఆమె అన్నారు.
న్యూజీలాండ్ ప్రభుత్వం ఇంధన సబ్సిడీలు ఇవ్వడం, ప్రజా రవాణా చార్జీలను సగానికి తగ్గించడం లాంటి చర్యలను ప్రవేశపెట్టింది కానీ, ఈ చర్యలు చాలా మందికి సరిపోవు.

ఇటలీ: ఇంధన ధరల్లో పెరుగుదల
జెస్సికా పార్కర్, యూరోప్ ప్రతినిధి
ఇటలీలోని బ్రెసికాలో సమాజం నరాల్లో ఇనుము ప్రవహిస్తూ ఉంటుంది. గత 15 ఏళ్లలో స్టీల్ పరిశ్రమ ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనికి తోడు కోవిడ్ మహమ్మారి జత అయింది. యుక్రెయిన్ లో యుద్ధం, చైనాలో కోవిడ్ లాక్‌డౌన్‌లతో ఈ వ్యాపారానికి మరింత ఆటంకం కలుగుతోంది.
బ్రెస్కియాలోని ఒక కాస్ట్ ఐరన్ కర్మాగారం దగ్గర మిరెల్లా, ల్యూకాస్ కలుసుకున్నారు. వారికొచ్చే జీతాలు పెరుగుతున్న ఆహార, ఇంధన, పెట్రోల్ ధరలకు అనుగుణంగా ఉండేవి కావు.
"కరెంటు విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఇంట్లో అసలు లేకపోయినా కూడా మా కరెంటు బిల్లు రెట్టింపు అయింది" అని మిరెల్లా చెప్పారు.
"మేము చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాం. ఆదా చేసే సొమ్ము తగ్గిపోతోంది" అని ల్యూకాస్ అన్నారు.
కాస్ట్ ఐరన్ కర్మాగారానికి ఆర్డర్లు వస్తున్నాయి. కానీ, యుక్రెయిన్ నగరం మరియుపూల్‌ను రష్యా ఆక్రమించిన తర్వాత అక్కడి నుంచి సరఫరా అయ్యే ముడి సరుకు కొరత ఏర్పడింది.

ఘనా: మంచి నీటికి కూడా బడ్జెట్ కేటాయింపు
నోమ్సా మాసేకో, వెస్ట్ ఆఫ్రికా ప్రతినిధి
ఘనాలో మార్క్ ఇంప్రయిమ్‌కు కేటరింగ్ వ్యాపారం ఉంది. ఆఫ్రికాలో బ్రతికేందుకు అత్యంత ఖరీదైన నగరాల్లో ఘనా ఒకటి.
ఆయన స్థానిక మార్కెట్‌లో బియ్యం కొంటారు. కానీ, ఇటీవల దాని ధర రెట్టింపు అయింది.
మార్క్ టమాటోల ధర చూసి ఆశ్చర్యపోయారు. "ఒక బాక్స్ టమాటోలు ధర రూ. 230 రూపాయలు ఉండగా, ప్రస్తుతం అది 460 రూపాయలు అయింది" అని ఆయన చెప్పారు.
"నేను అందించే ఆహార పదార్ధాల ధరలను కూడా రెట్టింపు చేయాలి. కానీ, అది వినియోగదారులను భయపెడుతుంది. పరిమాణాన్ని తగ్గించి ధరలను స్థిరంగా ఉంచేందుకు చూస్తూ ఉంటాను" అని అన్నారు.
తాగు నీటి బడ్జెట్‌లో కూడా పెరుగుదల మార్క్ బడ్జెట్ ను ఇబ్బంది పెడుతున్న మరో విషయం. ఆఫ్రికన్ కరెన్సీ విలువ పడిపోవడంతో మంచి నీటి ప్యాకెట్ల ధర గత నాలుగు నెలల్లో రెండు సార్లు రెట్టింపు అయింది. ఇక ఈ ధరల భారాన్ని వినియోగదారులపై మోపడం తప్పడం లేదని మంచి నీటి సరఫరాదారులు అంటున్నారు.

థాయ్‌లాండ్: ఎరువుల ధరలు పెరగడంతో బియ్యం ధర పైపైకి
జోనాథన్ హెడ్, సౌత్ ఈస్ట్ ఆసియా ప్రతినిధి
పంటలు బాగా పండేందుకు అవసరమైన ఎరువును వేరు చేసే పనిలో వరి రైతు బున్‌చువే ఉన్నారు.
థాయ్‌లాండ్ వరి నాణ్యతకు పేరు పొందింది. బ్యాంకాక్‌కు ఉత్తరంగా ఉన్న సుఫాన్‌బురీలో పండే పంటలను చాలా వరకు మధ్యప్రాచ్య దేశాలకు, ఆఫ్రికాకు ఎగుమతి చేస్తారు.
బున్‌చువే తన అప్పులను రాసుకునేందుకు ఒక నోట్ పుస్తకం వాడతారు. ఆమెకు గత సంవత్సరం చేసిన అప్పులే సుమారు 39,000 ఉన్నాయి. ఒక వైపు అంతర్జాతీయంగా వరి ధరలు తక్కువగా ఉండటం, ఎరువుల ధరలు మాత్రం పెరుగుతూ ఉండటంతో ఈ ఏడాది కూడా ఆమె అప్పులు తీర్చగలరో లేదో సందేహమే.
గత ఏడాది ఏప్రిల్‌లో ఎరువుల బస్తా ధర సుమారు రూ.1200 ఉండగా, ఈ ఏడాది దాని ధర మూడు రెట్లు పెరిగింది.
థాయ్‌లాండ్ ఎరువుల కోసం 90 శాతానికి పైగా దిగుమతుల పైనే ఆధారపడుతుంది.
ప్రభుత్వం ధరల పెరుగుదలకు పరిమితి విధించినప్పటికీ, ఇది ఎక్కువ కాలం కొనసాగడం కష్టమని ఉత్పత్తిదారులు అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వరిని ఎగుమతి చేసేందుకు థాయ్‌లాండ్ వరి రైతులకు ఎరువులు చాలా పెద్ద మొత్తంలో అవసరమవుతాయి. ఉత్పత్తిని పెంచేందుకు ఎరువుల ధరలు తగ్గడం లేదా బియ్యం ధరలు పెరగడమైనా జరగాలి. ఈ పరిస్థితి వరి ప్రధాన ఆహారంగా ఉన్న దేశాలకు ఆందోళన కలిగించే విషయం.
ఇవి కూడా చదవండి:
- సిజేరియన్ ప్రసవాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ ఎందుకు అయింది
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- కళ్లు ఎందుకు అదురుతాయి? మీ ఆరోగ్యం గురించి మీ కళ్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి...
- పెట్రోల్-డీజిల్ ధరలు: కర్ణాటక బోర్డర్ వద్ద ఏపీ పెట్రోలు బంకులు ఎందుకు మూతపడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












