పాకిస్తాన్: లీటర్ పెట్రోల్ రూ. 180... డీజిల్ రూ. 174... కిరోసిన్ రూ. 154.. భారత్‌ను పొగుడుతున్న ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, SCREENGRAB/JUNAID AKRAM'S PODCAST
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను దాదాపు 30 రూపాయల మేర పెంచడంపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
గురువారం రాత్రి చేసిన రెండు ట్వీట్లలో ఆయన పాకిస్తాన్‌లోని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ''దిగుమతి ప్రభుత్వం'' అంటూ విమర్శించారు.
విదేశీ యజమానులకు కట్టు బానిసల్లా ప్రవర్తిస్తోన్న తాజా ప్రభుత్వం కారణంగా పాకిస్తాన్ మూల్యం చెల్లించడం ప్రారంభమైందని ఆరోపించారు.
''ఈ బానిసత్వమే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 30 రూపాయలు పెరగడానికి దారితీసింది. దేశ చరిత్రలోనే ఒకేసారి ధరలు ఇంత మొత్తంలో పెరగడం ఇదే తొలిసారి'' అని ట్వీట్‌లో రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
షరీఫ్ ప్రభుత్వాన్ని అసమర్థ, జడ ప్రభుత్వంగా ఆయన పేర్కొన్నారు. 30 శాతం చౌకగా రష్యా నుంచి చమురు కొనుగోలు కోసం తాము చేసిన ప్రయత్నాలను ఈ ప్రభుత్వం కొనసాగించలేదని ఆరోపించారు.
మరో ట్వీట్‌లో...''అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న భారత్, రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడం ద్వారా తమ దేశంలో చమురు ధరలు తగ్గించడంలో విజయవంతం అయింది. పాకిస్తాన్ చర్యలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ మరో భారీ ద్రవ్యోల్బణం బారిన పడనుంది'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చమురు ధరలు పెరగడానికి కారణం
పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ గురువారం ఒక విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల ధరలను దాదాపు 30 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
గురువారం అర్ధరాత్రి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.
ఈ ప్రకటన ప్రకారం పాకిస్తాన్‌లో ఇప్పుడు లీటరు పెట్రోల్ ధర రూ. 180 (పాకిస్తాన్ కరెన్సీ), డీజిల్ ధర రూ. 174, కిరోసిన్ రూ. 156, లైట్ డీజిల్ ధర రూ. 148కి పెరిగాయి.
ఖతర్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్- ఐఎంఎఫ్)తో పాకిస్తాన్ ప్రభుత్వ చర్చలు విఫలమైన తర్వాత చమురు ఉత్పత్తుల ధరల పెంపు ఈ ప్రకటన విడుదలైంది.
ఐఎంఎఫ్ సహాయం
బలహీనంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎంఎఫ్ నుంచి సహాయం పొందడం కోసం ప్రయత్నిస్తోంది.
అయితే, రుణం తీసుకునేముందు దేశంలో విధానపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పాక్ ప్రభుత్వంతో ఐఎంఎఫ్ చెప్పింది. ఈ చర్యల్లో చమురు ధరలపై ఇస్తున్న సబ్సిడీలను ఆపేయడం కూడా ఉంది.
పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీలను ఎత్తివేయాలని వాటితో పాటు ఇతర విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాలని పాక్ ప్రభుత్వానికి ఐఎంఎఫ్ చెప్పిందని గురువారం ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ వెల్లడించారు.
ఇలాంటి పరిస్థితుల్లో చమురు ధరల భారం మోపడం అవసరంగా మారిందని ఆయన అన్నారు.
కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టేవరకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఫిబ్రవరి చివర్లో గత ప్రభుత్వం నిషేధం విధించింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని తాజా ప్రభుత్వం ఇప్పటివరకు సమర్థించింది.
కానీ, ధరలను పెంచకూడదనే నిర్ణయం కారణంగా ప్రభుత్వం ఇంధనంపై కోట్లాది రూపాయల సబ్సిడీ అందించాల్సి వస్తోంది. దీనివల్ల దేశ ఖజానాపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా నుంచి చౌకగా చమురు పొందుతున్నామన్న వాదనలు నిజమేనా?
రష్యా నుంచి పాకిస్తాన్‌కు తక్కువ ధరకే చమురును తెచ్చేందుకు తాను ప్రయత్నించినట్లు ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. పాకిస్తాన్‌లో గత కొన్ని వారాలుగా ఈ అంశం చర్చల్లో ఉంది.
ప్రస్తుత ఇంధన శాఖ మంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్ ఈ అంశం గురించి మాట్లాడుతూ... ఇమ్రాన్ ఖాన్ సర్కారు రష్యా నుంచి రాయితీపై క్రూడాయిల్ కొనుగోలు చేసేందుకు ఎలాంటి చర్చలు జరపలేదు అని అన్నారు.
కానీ, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో ఇంధన మంత్రిగా పనిచేసిన హమ్మద్ అజహర్ ట్విటర్‌లో రష్యా ఇంధన మంత్రికి రాసిన ప్రభుత్వ లేఖను షేర్ చేశారు. ఈ లేఖలో రష్యా నుంచి పాకిస్తాన్ క్రూడాయిల్, డీజిల్, పెట్రోల్‌లను రాయితీపై దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రస్తావించారు.
దీని తర్వాత పాకిస్తాన్‌కు చౌకగా చమురును అందిస్తామనే ఎలాంటి సంకేతాలు రష్యా నుంచి రాలేదని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చెప్పింది.
ఈ అంశం గురించి హమ్మద్ అజహర్, బీబీసీతో మాట్లాడారు. ''30 శాతం తక్కువ ధరలకే చమురును సరఫరా చేస్తామంటూ రష్యా కొనుగోలుదారుల కోసం చూస్తున్నప్పుడు మేం వారికి లేఖ రాశాం. పాకిస్తాన్ ప్రధానంగా చమురును దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి రష్యా, పాక్‌కు చమురును విక్రయిస్తుందని అనుకున్నాం'' అని ఆయన చెప్పారు.
హమ్మద్ అజహర్ రాసిన లేఖ గురించి పాకిస్తాన్ ఇంధన మంత్రిత్వ శాఖ, బీబీసీతో మాట్లాడుతూ... మాజీ ఇంధన మంత్రి ప్రభుత్వం తరఫున లేఖ రాశారని ధ్రువీకరించారు.
''భారత్, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది. కానీ, వారి ఇంధన అవసరాల్లో 10 నుంచి 12 శాతమే రష్యా నుంచి పొందుతుంది. ఈ దిగుమతులు చాలా కాలం నుంచి జరుగుతున్నాయి'' అని సీనియర్ జర్నలిస్ట్ ఖుర్రమ్ హసన్, బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇమ్రాన్ ఖాన్ మాటల దాడి
పాకిస్తాన్ ప్రధానమంత్రిగా తొలిగించినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై మాటల దాడి చేస్తూనే ఉన్నారు.
పదవిలో ఉన్నప్పుడు తొలుత ఆయన అమెరికాతో పాటు ఇతర విదేశీ శక్తులు తనను ప్రధాని పదవి నుంచి తొలిగించేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాన్ని 'దిగుమతి చేసుకున్న ప్రభుత్వం' అంటూ పిలుస్తున్నారు.
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగగానే ఇప్పుడు 'జడ ప్రభుత్వం, దొంగల ముఠా' అని పిలవడం మొదలు పెట్టారు.
ఇవి కూడా చదవండి:
- పోస్టాఫీసులో ప్రజలు డిపాజిట్ చేసిన కోటి రూపాయలతో ఐపీఎల్ బెట్టింగ్ ఆడిన సబ్ పోస్ట్ మాస్టర్
- ఫేస్‌బుక్: మెటావర్స్‌లో మహిళ అవతార్‌పై లైంగిక దాడి
- యాసిన్ మలిక్‌కు జీవితఖైదు విధించడంపై పాకిస్తాన్ ఎలా స్పందించింది
- భారతీయులు లావెక్కిపోతున్నారు... ఇది మామూలు సమస్య కాదు
- స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు నష్టాల నుంచి బయట పడేందుకు ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















