తెలంగాణ: అప్పులు తెచ్చి ఊరు బాగు చేసిన సర్పంచ్‌లు ఎందుకు కష్టాలు పడుతున్నారు?

- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘నా పుస్తెలతాడు కుదువ పెట్టాను. భూమి అమ్మి అప్పులు తీర్చుదామంటే సెంటు భూమి కూడా లేదు. ఊరి పనుల కోసం తీసుకున్న అప్పు తిరిగి కట్టలేకపోతున్నాను. ఊరికి సర్పంచినే అయినా నేను, నా భర్త పూట గడవడానికి పనికి ఆహార పథకంలో కూలి చేసుకుంటున్నాం" అని తెలంగాణకు చెందిన ఓ సర్పంచి వల్లెపు అనిత అన్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో కొత్తగా ఏర్పడిన విశ్వనాధ్ కాలనీకి అనిత సర్పంచి.
‘రూ. 9 లక్షలు అప్పు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేయించా. ఆ అప్పు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాను’ అని నాగర్ కర్నూల్ జిల్లా అవసలకుంట సర్పంచి ఎల్లయ్య ‘బీబీసీ’తో చెప్పారు.
మరోవైపు సిరిసిల్లలో 18 మంది సర్పంచులు.. తమకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు . తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సర్పంచులుగా పని చేస్తున్న కొందరి పరిస్థితి ఇది.
తెలంగాణ రాష్ట్రంలోని కొందరు సర్పంచులు పల్లె ప్రగతిలో భాగంగా లక్షల రూపాయిలు గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టారు. రెండేళ్లయినా ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు .

ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, పల్లె ప్రగతి పనులకు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టామని సర్పంచ్ అనిత చెప్పారు.
అయితే చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో తెచ్చిన రూ.8 లక్షల అప్పుకు వడ్డీలు కట్టలేక, ఇల్లు గడవడమే కష్టంగా మారిందని, అందుకే తానూ తన భర్త కూలి పని చేసుకొని కాలం వెళ్లదీస్తున్నామని అనిత చెప్పారు.
''వస్తున్న జీతం తీసుకున్న అప్పులకు కిస్తీలు కట్టడానికే సరిపోతోంది. ఇల్లు గడవాలంటే ఏదో ఒక పని చేసుకోక తప్పడం లేదు. సర్పంచ్ కూలి పని చేసుకుంటుందా అని చాలామంది అనుకుంటున్నా తప్పడం లేదు'' అని అనిత అన్నారు.

అవసలకుంట సర్పంచ్ ఎల్లయ్యతో మాట్లాడడానికి బీబీసీ ఆ ఊరు వెళ్లింది. ఆ గ్రామంలో ఓ మూలన ఉన్న పూరి గుడిసెనే ఎల్లయ్య ఇల్లు.
ఎల్లయ్యకి ఇద్దరు పిల్లలు. వాళ్లలో ఒకరికి 8ఏళ్లు, మరొకరికి 13 నెలలు. ఎండలు మండిపోతున్నాయి. ఇంటి పైకప్పు కూడా సరిగా లేకపోవడంతో టార్పాలిన్ పట్టా వేసి, ఆ గుడిసెలోనే జీవితం వెళ్లదీస్తున్నారు ఎల్లయ్య .
కొన్నేళ్ల కిందట వర్షానికి ఇల్లు కూలిపోవడంతో ఇంటి పనులు మొదలుపెట్టారు. కానీ సర్పంచ్ అయ్యాక ఇంటి పని ఆగి పోయింది. వెనుకబడిన కులానికి చెందిన తాను, తన తాత లాగా సర్పంచ్ అయ్యి, గ్రామానికి మేలు చేయాలనీ అనుకున్నారు.

‘‘సర్పంచ్ బరిలో ఉన్న మిగతా నలుగురి కంటే నా పైనే ఊర్లో వాళ్లు నమ్మకం పెట్టుకొని గెలిపించారు. అందుకే ఊరికి అభివృద్ధి పనులు చేయాలి అన్న బాధ్యత మీద వేసుకున్నాను. రూ.11లక్షల వరకు అప్పు చేసి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేయించాను'' అని ఎల్లయ్య వెల్లడించారు.
''రూ.9 లక్షల బిల్లులు పెట్టినప్పటికీ 2 ఏళ్లగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు'' అని ఆయన వాపోయారు .
అప్పు తిరిగి చెల్లించాలని అప్పిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు ఎల్లయ్య. సరైన సమయంలో చికిత్స అందడంతో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. 2019లో సర్పంచ్ ఎన్నికల్లో ఎల్లయ్య గెలిచారు.
''మా ఉరిలో అభివృద్ధి పనుల కోసం అప్పులు తీసుకొని వచ్చి, 2కి.మీ మట్టి రోడ్ వేయించా. స్మశాన వాటిక , డ్రైనేజి పనులు, రోడ్ల వెడల్పు చేయించా. కానీ, ప్రభుత్వం రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో, చేసిన రూ.9లక్షల అప్పుకు నెలకు రూ.27,000 వడ్డీ కట్టాల్సి వస్తోంది'' అని ఎల్లయ్య చెప్పారు.
'లేచినప్పటి నుంచి అప్పులు ఇచ్చిన వాళ్లే కనిపిస్తున్నారు. వాళ్లు ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు. వడ్డీ పెరిగిపోతోంది'' అని ఆయన బీబీసీ తో అన్నారు.
వర్షానికి ఇల్లు కూలిపోగా, సర్పంచ్ కాక ముందు మొదలు పెట్టిన పని, సర్పంచ్ అయ్యాక పూర్తిగా ఆగి పోయిందని ఎల్లయ్య భార్య కురువమ్మ చెబుతున్నారు.
''సర్పంచ్ కాక ముందు కనీసం ఇల్లు గడిచేందుకు డబ్బు ఉండేది. కొంత డబ్బు దాచుకున్నాం కూడా. ఇప్పుడు బయటకు పనికి వెళ్లాలంటే, ఊరికి పెద్ద అని చెప్పుకునే సర్పంచ్ కుటుంబం ఇలా అయ్యింది అని చిన్న చూపు చూస్తుంటే బాధ అనిపిస్తోంది. అందుకే పనికి కూడా వెళ్లడం లేదు'' అని కురువమ్మ అన్నారు.
అప్పులు ఇచ్చిన వాళ్లు నానా మాటలు అంటున్నారని, ఊళ్లో వాళ్లేమో, నిన్ను గెలిపించాం, పనులు చేయవా అని నిలదీస్తున్నారని ఎల్లయ్య భార్య చెప్పారు.

ఫొటో సోర్స్, DAYAKAR RAO ERRABELLI
రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది?
తెలంగాణలో మొత్తం 10,292 గ్రామా పంచాయతీలు ఉండగా, అందులో 4383 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా సర్పంచులకు ఇబ్బంది కలగటం లేదని అంటోంది.
''రూ.300 కోట్ల నిధులు కేంద్ర సర్కారు నుండి వచ్చేవి. ఇప్పుడు వాటిని తగ్గించి రూ.230 కోట్లు చేసారు. కానీ, అవి కూడా రావడం లేదు. మూడు నెలలుగా డబ్బు విడుదలలో కొంత జాప్యం జరుగుతోంది. ఇబ్బంది ఉన్న తీవ్ర ఇబ్బంది ఎక్కడా లేదు'' అని పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పల్లె ప్రగతి వచ్చిన తరువాత సర్పంచుల జీవితాలలో గణనీయంగా మార్పు వచ్చిందని ఆయన బీబీసీ తో అన్నారు.
''అయినా అప్పు చేసి పనులు చేయించాలని వారికి ఎవరు చెప్పారు? పనులు కాంట్రాక్టులకు ఇవ్వవచ్చు కదా? కొంతమంది కక్ష పూరితంగా చేస్తున్న పని ఇది" అని ఆయన విమర్శించారు.
ఈ విషయం పై విపక్షాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి. ఐదో విడత పల్లె ప్రగతి కంటే ముందు బకాయి డబ్బులు సర్పంచులకు చెల్లించాలని నల్గొండ కాంగ్రెస్ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసారు.
కాంట్రాక్టర్లతో పనులు చేయించాలని తాము కూడా ప్రయత్నించామని, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వారు కూడా ఈ పనులకు ముందుకు రావడం లేదని కొందరు సర్పంచులు తెలిపారు.
ఇబ్బందులు పడుతున్నవారు సమస్యను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించగా, సర్పంచ్ కావాలంటే ఆర్థికంగా బలంగా ఉండాల్సిందేనని, బలహీన వర్గాలు వారు సర్పంచ్ లుగా పనికి రారని అంటూ కొందరు సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ముస్లిం అని తెలిస్తే జైల్లో వేసేస్తున్న చైనా.. మత తీవ్రవాదాన్ని పెంచుతున్నారంటూ వీగర్లపై ఆరోపణ
- మీ సెల్ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడం ఎలా... హ్యాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- సైబర్ మాయగాళ్లు వేసే ఎరలు ఎలా ఉంటాయి? వాటికి చిక్కుకోకుండా ఉండడం ఎలా : డిజిహబ్
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













