Amreena Bhat: కశ్మీర్ టీవీ నటిని చంపిన మిలిటెంట్లు- అక్కడి హింస మహిళల ప్రగతిని దెబ్బతీస్తోందా

అమ్రీనా భట్

ఫొటో సోర్స్, Abid Bhat

ఫొటో క్యాప్షన్, అమ్రీనా భట్

కశ్మీర్‌లో టీవీ నటి, గాయని అమ్రీనా భట్(30) హత్య అక్కడ విషాదాన్ని నింపింది. దశాబ్దాలుగా సాగుతున్న ఘర్షణ, హింసతో అందమైన కశ్మీర్ రక్తపు ముద్దగా మారిపోతోంది.

అమ్రీనా హత్యకు గురైన రోజు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్ట్ అబిద్ భట్.

వారు చెప్పిన ప్రకారం.. నటి, గాయని అయిన అమ్రీనా భట్‌కు సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. మే 25న బడగావ్‌లోని తన ఇంటి దగ్గర్లోనే ఉన్న మసీదులో సాయంత్రం ప్రార్థనలు చేస్తున్నారు అమ్రీనా బావ షేక్ జుబైర్ అహ్మద్. ఇంతలో ఆయనకు తుపాకీ కాల్పులు, అరుపులు వినిపించాయి.

కాల్పులు వినగానే ఇంటికి పరుగెత్తారు జుబైర్. 30 ఏళ్ల అమ్రీనా తన గదిలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. గదిలోని గోడల మీద, నేల మీద రక్తం ఉంది.

ఒక ప్రోగ్రాం గురించి మాట్లాడాలంటూ ఇద్దరు వ్యక్తులు అమ్రీనా వద్దకు వచ్చారు. ప్రోగ్రాం వివరాల గురించి ఆమె అడుగుతున్న సమయంలో వారు తుపాకులతో కాల్పులు జరిపారు. ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

అమ్రీనా భట్ బంధువులు

ఫొటో సోర్స్, Abid Bhat

ఫొటో క్యాప్షన్, అమ్రీనా భట్ బంధువులు

లష్కర్-ఇ-తయిబా కమాండర్ లతీఫ్ ఆదేశాలతోనే దుండగులు అమ్రీనాను హత్య చేసినట్లు కశ్మీర్ పోలీసులు చెబుతున్నారు.

హత్యకు పాల్పడిన షాహిద్ ముస్తాక్ భట్, ఫర్హాన్ హబీబ్‌లు ఇటీవలే స్థానిక మిలిటెంట్లతో చేరారని, అమ్రీనా హంతకులను భద్రతాదళాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయని పోలీసులు ప్రకటించారు.

పాకిస్తాన్‌ కేంద్రంగా పని చేస్తున్న లష్కర్-ఇ-తయిబా భారత్‌లో హింసకు పాల్పడుతోందనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.

అయితే ఎందుకు అమ్రీనాను టార్గెట్ చేసి చంపారో లష్కర్-ఇ-తయిబా కారణం చెప్పలేదు.

కానీ ఇలాంటి హత్యలు ఇటీవల కాలంలో కశ్మీర్ లోయలో పెరుగుతున్నాయి. కొద్ది వారాలుగా మిలిటెంట్లు చేస్తున్న దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

అమ్రీనా హత్యకు కొద్ది రోజుల ముందు కశ్మీర్ పండిట్ సముదాయానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని కాల్చి చంపారు. అలాగే ఒక ప్రభుత్వ మహిళా టీచర్‌ను కూడా చంపేశారు.

అమ్రీనా భట్ తండ్రి ఖజీర్ మహ్మద్ భట్

ఫొటో సోర్స్, Abid Bhat

ఫొటో క్యాప్షన్, అమ్రీనా భట్ తండ్రి ఖజీర్ మహ్మద్ భట్

'మాకు తిండి పెట్టేది అమ్రీనానే'

అమ్రీనా మరణం మిగిల్చిన బాధ నుంచి ఆమె కుటుంబం తేరుకోలేక పోతోంది. తన బిడ్డను ఎందుకు చంపారో తెలియదంటున్న అమ్రీనా తండ్రి ఖజీర్ మహ్మద్ భట్, ఇప్పుడు తమకు తిండి పెట్టే బిడ్డ బతికి లేదని కన్నీటిపర్యంతమవుతున్నారు.

'మా అమ్మాయి పాటలు పాడతాను అంటే ముందు నేను ఒప్పుకోలేదు. పాటల కోసం చదువును కూడా మధ్యలో ఆపేసింది.' అని ఖజీర్ భట్ చెప్పుకొచ్చారు.

కానీ అమ్రీనా కలలకు తన భార్య అండగా ఉండేదని, 2008లో ఆమె చనిపోయిన తరువాత తనలో మార్పు వచ్చిందని ఆయన అన్నారు.

తొలుత చిన్నచిన్న కేబుల్ చానెళ్లలో పని చేసిన అమ్రీనా, ఆ తరువాత సోషల్ మీడియాలో సొంతంగా వీడియోలు చేయడం ప్రారంభించారు. దాంతో ఆమెకు ఆదరణ బాగా పెరిగింది.

అమ్రీనా భట్ సాధించిన పురస్కారాలు

ఫొటో సోర్స్, Abid Bhat

ఫొటో క్యాప్షన్, అమ్రీనా భట్ సాధించిన పురస్కారాలు

'తగ్గుతున్న అవకాశాలు'

కశ్మీర్‌లో యువతులు కళాకారులుగా కొనసాగడం అనేది చాలా కష్టమైన విషయం. ఒక పక్క దశాబ్దాలుగా కొనసాగుతున్న హింస. మరోవైపు సామాజిక కట్టుబాట్లు, వివక్ష. వీటన్నింటి మధ్య నటన, సంగీతాన్ని కెరియర్‌గా ఎంచుకోవడమనేది అంత సులభం కాదు. కానీ అమ్రీనా వంటి యువతులు ఆ సాహసాన్ని చేస్తున్నారు. చాలా మంది టీవీ యాక్టర్ల మాదిరిగానే అవకాశాల కోసం అమ్రీనా కూడా ఎన్నో కష్టాలు పడ్డారు.

కశ్మీర్‌లో ప్రభుత్వ మీడియా అయిన దూరదర్శన్ ఉంది. కానీ అక్కడ లభించే అవకాశాలు చాలా తక్కువ.

గత కొద్ది సంవత్సరాలుగా కశ్మీర్‌లో నటులకు అవకాశాలు తగ్గిపోతూ వస్తున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ యాక్టర్ బీబీసీకి చెప్పారు.

ప్రధానంగా 2019లో కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన నాటి నుంచి పరిస్థితులు మరింత దిగజారాయని అన్నారు.

ఆర్టికల్-370 రద్దు తరువాత కొన్ని నెలల పాటు కశ్మీర్‌లో ఇంటర్నెట్, కమ్యూనికేషన్లను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. కదలికలను, రాకపోకలను కఠినతరం చేసింది. ఆ తరువాత కరోనా సంక్షోభం వల్ల లాక్‌డౌన్ పెట్టారు. ఈ కారణాల వల్ల కశ్మీరీల జీవనోపాధి బాగా దెబ్బతింది. బహుశా ఈ కారణంతోనే అమ్రీనా వంటి వాళ్లు ఆదాయం కోసం సోషల్ మీడియాలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.

ఇప్పుడు అమ్రీనా మరణంతో తమ భవిష్యత్తు ఏమిటో తెలియని స్థితిలో ఆమె కుటుంబం ఉంది. ఎంతో ప్రేమగా చూసుకుంటూ స్కూలు ఫీజులు కడుతూ ఉండే తన పిన్ని లేకపోవడం 11 ఏళ్ల ఫర్హాన్‌కు తీరని లోటు.

'వచ్చే ఏడాది పిన్ని నాకు కంప్యూటర్ కొనిస్తానని చెప్పింది' అంటున్నాడు ఫర్హాన్.

వీడియో క్యాప్షన్, కశ్మీర్‌లో హిందువుల హత్యలు: ‘ఆడవాళ్లను చంపడం కాదు, ఇండియన్ ఆర్మీతో పోరాడండి’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)