తొమ్మిదో తరగతి చదివి, దేశాలన్నీ తిరుగుతూ నెలకు లక్షకు పైనే సంపాదిస్తున్న యువకుడు
చదువు మధ్యలోనే ఆపేశారు. కానీ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. అతి తక్కువ డబ్బులతో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. తమిళనాడుకు చెందిన భువని ధరణ్ ఆసక్తికర కథ గురించి తెలుసుకుందాం.
తమిళనాడులోని తంజావూరుకు చెందిన భువని ధరణ్ అనేక దేశాల్లో పర్యటిస్తుంటారు. ఆ విశేషాలను వీడియోగా మార్చి తన యూట్యూబ్ చానల్‌లో పెడుతుంటారు. ఈయన తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నారు. కానీ ఆఫ్రికా, పశ్చిమాసియా సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో పర్యటించారు.
భువని ధరణ్ మొదటిసారి తంజావూరు నుంచి మనాలీకి ఏడు రోజుల ట్రిప్‌కు వెళ్లారు. ఈయనకు ఆ భాష తెలియదు. తమిళనాడు దాటి మరో ప్రదేశానికి ఇదివరకెప్పుడూ ఒంటరిగా వెళ్లలేదు. అందుకే 7 రోజుల ట్రిప్ కోసం భువని ధరణ్ సాహసం చేశారనే చెప్పాలి.
రోజుకు 230 రూపాయలతో ఒక చిన్న హోటల్‌లో బస చేశారు. అప్పటి నుంచి తక్కువ ఖర్చుతో ఎలా పర్యటనలు చేయాలన్న దానిపై వీడియోలు చేసి, యూట్యూబ్ చానల్‌లో పెట్టడం ప్రారంభించారు.
అయితే, భువని ధరణ్ ప్లాన్ మారింది. ముందుగా ఏడు రోజులు అనుకున్నప్పటికీ.. అది రెండు నెలల ట్రిప్‌గా మారింది. దిల్లీ, జైపూర్, ఇతర ప్రాంతాల్లో కూడా పర్యటించారు. ఆ తర్వాత లిఫ్ట్ అడుక్కుంటూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై చేరుకున్నారు.
ఈ ట్రిప్‌లో ప్రజలు తనపట్ల ఎంతో ఆప్యాయత చూపించారని భువని ధరణ్ చెప్పారు.
‘‘నేను మొదట రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్నాను. ఆ తర్వాత పర్యటనలు మొదలుపెట్టాను. మొదట ఊటీ, కొడైకెనాల్ వంటి చిన్న చిన్న పర్యటనలు చేశాను. ఏడాదిన్నర తర్వాత నా బైక్ పోయింది.
కానీ బైక్ లేకున్నా మనాలి ట్రిప్‌కు వెళ్లాలనుకున్నాను. బ్యాగ్ ప్యాక్ చేసుకుని దిల్లీ వెళ్లాను. అక్కడి నుంచి మనాలికి వెళ్లాను. నేను ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లడం అదే మొదటిసారి. నాకు హిందీ రాదు. కానీ ఎలాగోలా మేనేజ్ చేశాను.
అప్పుడే ఈ ట్రిప్ గురించి వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టాలనిపించింది. నా ప్రయాణం, నా కెరీర్ అక్కడి నుంచే మొదలైంది’’ అని బీబీసీతో అన్నారు భువని ధరణ్.
‘‘నేనిప్పుడు రాజస్థాన్‌లో ఉన్నాను. నేను చెన్నైకి వెళ్లాలి. కానీ నా దగ్గర ఐదు వందలు మాత్రమే ఉన్నాయి. బడ్జెట్ ట్రావెలింగ్‌లో లిఫ్ట్ తీసుకుని పర్యటించడం ఒక పద్ధతి. నేను రాజస్థాన్ నుంచి చెన్నైకి లిఫ్ట్ తీసుకుంటూ వచ్చాను. ఇంటికి రావడానికి 12 రోజులు పట్టింది. ప్రతిరోజు భిన్నంగా గడిచింది. వేర్వేరు వ్యక్తుల ఇళ్లలో ఉండటం, వారితో పాటు కలిసి తినడం.. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. పరిచయం లేని వాళ్ల ఇళ్లలో తినేవాడిని. వాళ్లు నాకు సాయం చేశారు. ఉండడానికి చోటిచ్చారు. పెట్రోల్ బంకుల్లో కూడా పడుకున్నాను. అలా నేను చెన్నైకి చేరుకున్నాను.
నా ప్రయాణాన్ని వీడియోల్లో చిత్రీకరించాను. వాటిని ఎడిట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. నా వీడియోలకు మంచి వ్యూస్ వచ్చాయి’’ అని ఆయన వివరించారు.
భువని ధరణ్ అనేక దేశాల్లో పర్యటించారు. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆయన ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత, ఆఫ్రికాకు విమాన సర్వీసులు మొదలైన తర్వాత భువణి అక్కడికి వెళ్లారు.
ఈ ట్రిప్ కూడా భువని మొదటి యాత్రలాగే మారింది. మొదట నెల రోజులకు ప్లాన్ చేసుకున్నారు. కానీ 8 నెలల 20 రోజుల పాటు కెన్యా, యుగాండ, ఇథియోపియా, దుబాయ్, టాంజానియా, ఈజిప్ట్ దేశాల్లో పర్యటించారు.
భువని తన యూట్యూబ్ చానల్ ప్రారంభించినప్పుడు ఆయన రోజు వారి పర్యటనల ఖర్చు మూడు వందల రూపాయలు మాత్రమే. ఇప్పుడు తన యూట్యూబ్ చానల్ ద్వారా భువని నెలకులక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. ఇలా వచ్చే డబ్బుల్లో 75 శాతం మళ్లీ టూర్ల కోసమే ఖర్చు చేస్తారు.
కొత్త వ్యక్తులు, ప్రదేశాలను చూపిస్తూ తక్కువ ఖర్చుతో ఎలా ప్రయాణించాలో ఈయన వీడియోలు చేస్తుంటారు. కొత్తగా, ఆసక్తికరంగా చెప్పడంతో ఈయన వీడియోలకు మంచి వ్యూస్ వస్తుంటాయి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: లీటర్ పెట్రోల్ రూ. 180... డీజిల్ రూ. 174... కిరోసిన్ రూ. 154.. భారత్‌ను పొగుడుతున్న ఇమ్రాన్ ఖాన్
- ఫ్యూచర్ ఫుడ్స్: 2050నాటికి మనం తినే ఆహార పదార్థాలు ఇవేనా?
- 'సంపన్నులకు లాభం చేసే ప్రజాస్వామ్యానికి నిరుపేదలు డబ్బు చెల్లిస్తున్నారు'
- ఎఫ్3 రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్‌ల వేసవి కాలక్షేపం... లాజిక్ లేని మ్యాజిక్
- సెక్స్ వర్కర్స్: ‘వారిని నేరస్థుల్లా చూడకూడదు, అరెస్టు చేయకూడదు’ - సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)