Johnny Depp-Amber Heard: మాజీ భార్యపై కేసు గెలిచి, నష్టపరిహారంగా రూ. 80 కోట్లు పొందిన హాలీవుడ్ నటుడు

జానీ డెప్, అంబర్ హెర్డ్

ఫొటో సోర్స్, Getty Images

జానీ డెప్, అంబర్ హెర్డ్ ఇద్దరూ బహిరంగ ప్రకటనల ద్వారా ఒకరి పరువుకు మరొకరు నష్టం కలిగించినట్లు అమెరికాలోని వర్జీనియా న్యాయమూర్తులు నిర్ణయానికి వచ్చారు.

58 ఏళ్ల జానీ డెప్, తన మాజీ భార్య అంబర్ హెర్డ్‌పై మూడు ఆరోపణలు చేస్తూ 50 మిలియన్ డాలర్ల (రూ. 387 కోట్లు) పరువు నష్టం దావా వేశారు. ఆయన చేసిన మూడు ఆరోపణలు నిజం అని తేలడంతో కోర్టు ఆయనకు రూ. 10.4 మిలియన్ డాలర్ల (రూ. 80.66 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని అంబర్ హెర్డ్‌ను ఆదేశించింది.

జానీ డెప్‌పై 36 ఏళ్ల అంబర్ హెర్డ్‌ 100 మిలియన్ డాలర్ల (రూ. 775 కోట్లు) ఎదురు దావా వేశారు. అయితే, ఆమె డెప్‌కు వ్యతిరేకంగా చేసిన మూడు ఆరోపణల్లో ఒకదానిలో మాత్రమే నెగ్గారు. దీంతో ఆమెకు 2 మిలియన్ డాలర్ల (రూ. 15.51 కోట్లు) నష్టపరిహారాన్ని అందించాలని డెప్‌ను కోర్టు ఆదేశించింది.

ఈ ఇద్దరు హాలీవుడ్ నటుల కేసులో కోర్టు డ్రామా ముగిసింది. ఫైనల్‌గా తీర్పు వెలువడింది.

జానీ డెప్

ఫొటో సోర్స్, Getty Images

డెప్, హెర్డ్ చెల్లించాల్సిన పరిహారాలు ఏంటి?

ఫిర్యాదుదారుడు (వాది) అనుభవించిన బాధను భర్తీ చేయడానికి లేదా వారు ఒక ఘటన తర్వాత ఎదుర్కొన్న నష్టాన్ని పూరించడానికి సివిల్ కోర్టులు, ఫిర్యాదుదారులకు నష్టపరిహారాలను అందజేస్తాయి.

నష్టం నుంచి ఫిర్యాదుదారులకు ఉపశమనం కల్పించేందుకు ఉద్దేశించినవే ఈ నష్టపరిహారాలు.

ప్రతివాది (డిఫెండెంట్) నిర్లక్షపూరిత చర్యలకు శిక్షగా కోర్టు జరిమానా విధిస్తుంది. వారు మరోసారి అలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా నిరోధించేందుకే ఈ జరిమానాను విధిస్తుంది.

జ్యూరీ తొలుత డెప్‌కు 10 మిలియన్ డాలర్ల (రూ. 77 కోట్లు) నష్టపరిహారంతో పాటు 5 మిలియన్ డాలర్ల (రూ. 38 కోట్లు) జరిమానాను అందించాలని హెర్డ్‌ను ఆదేశించింది.

తర్వాత జడ్జి పెన్నీ అజ్కారేట్, జరిమానా మొత్తాన్ని 3,50,000 డాలర్ల (రూ. 2.7 కోట్లు)కు తగ్గించారు. దీంతో హెర్డ్ మొత్తం 10.4 మిలియన్ డాలర్లు (రూ. 80.66 కోట్లు) డెప్‌కు చెల్లించాల్సి ఉంది.

మరోవైపు హెర్డ్‌కు 2 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని డెప్‌ను ఆదేశించింది. ఆయనకు అదనంగా ఎలాంటి జరిమానా విధించలేదు. ఆమె ఎదురు దావాలో పేర్కొన్న 100 మిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

అంబర్ హెర్డ్

ఫొటో సోర్స్, Getty Images

హెర్డ్ అప్పీల్‌ చేయొచ్చా?

ఈ కేసులో వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్ జ్యూరీ, ఎక్కువగా డెప్ వైపే నిలిచింది.

''హెర్డ్, తమ బంధానికి సంబంధించి తప్పుడు ప్రకటనల ద్వారా తన మాజీ భర్త పరువుకు నష్టం కలిగించారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె ఆ విధమైన ప్రకటనలు చేశారు'' అని తీర్పు సందర్భంగా ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ వ్యాఖ్యానించింది.

తాను చేసిన వాదనలు బూటకం అని పేర్కొంటూ డెప్ న్యాయవాది 2020లో డైలీ మెయిల్‌కు ఒక ప్రకటన ఇచ్చారని హెర్డ్ ఆరోపించారు. ఇందులో కోర్టు ఆమె పక్షం వహించింది. ఈ వాదనలో మాత్రమే హెర్డ్ నెగ్గింది.

తీర్పుపై స్పందిస్తూ 'మాటల్లో చెప్పలేనంత నిరాశగా ఉంది. గుండె పగిలిపోయింది'' అని హెర్డ్ అన్నారు.

జ్యూరీ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసే అవకాశం ఆమెకు ఉంది. ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు ఆమె తరఫు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఆరు వారాల పాటు ఈ కోర్టు డ్రామా రసవత్తరంగా జరిగింది. ఇందులో ఏదైనా కొత్త సాక్ష్యం పుట్టుకొస్తే తప్ప బుధవారం నాటి కోర్టు తీర్పు పెద్దగా ప్రభావితం కాదు.

జానీ డెప్

ఫొటో సోర్స్, Reuters

డెప్, హెర్డ్‌ల విలువ ఎంత?

జానీ డెప్, బాల నటుడి స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యధిక పారితోషికాన్ని అందుకునే స్టార్లలో ఒకరిగా ఎదిగారు.

ఒక్క పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ ఫ్రాంచైజ్ ద్వారానే ఆయన 300 మిలియన్ డాలర్ల (రూ. 2,326 కోట్లు)కు పైగా పారితోషికం అందుకున్నాడని చెబుతుంటారు.

ప్రస్తుతం ఆయన నెట్‌వర్త్ 150 మిలియన్ డాలర్లు (రూ. 1163 కోట్లు)గా అంచనా వేశారు.

డానిష్ గర్ల్, అక్వామ్యాన్ వంటి సినిమాల ద్వారా హెర్డ్ పేరు సంపాదించారు. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువపై స్పష్టత లేదు. కానీ, ఆమె మాజీ భర్త జానీ డెప్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఆమె ఆస్తుల విలువ 8 మిలియన్ డాలర్లు (రూ. 62 కోట్లు)గా ఉండొచ్చని కొంతమంది చెబుతుండగా, మరికొంతమంది అంతకంటే తక్కువగా ఉండొచ్చని అంటున్నారు.

తాజా తీర్పు ప్రకారం ఆమె డెప్‌కు 10మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలి. బదులుగా ఆమెకు కేవలం 2 మిలియన్ డాలర్లు మాత్రమే అందుతాయి. ఇది ఆమె ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు.

వీడియో క్యాప్షన్, ‘న్యాయం జరిగితే సరిపోదు, వివక్ష చూపే మగాళ్ల స్వభావం మార్చాలి’

అమెరికా న్యాయవ్యవస్థలోనే ఇదో కొత్త కేసు

బీబీసీ ప్రతినిధి డేవిడ్ సిల్లిటో విశ్లేషణ

సోర్స్ మెటీరియల్ పట్ల ప్రతీ ఒక్కరికీ సమాన ప్రాప్యత ఉన్న కేసు ఇది. ఇలాంటి అవకాశం లభించడంతో ఈ కేసు గురించి లక్షలాది మందికి చర్చించే అధికారం లభించింది.

ఈ కేసుకు సంబంధించిన ముఖ్య వ్యక్తుల స్పందనలు చూశాం. వారి ముఖ కవళికలు, ప్రధాన కథనంతో అసలు సంబంధమే లేని కొన్ని క్షణాలను కూడా ఈ కేసులో మనం చూడగలిగాం.

డెప్-హెర్డ్‌లు ఒకప్పడు నివసించిన ఇంటికి డోర్‌మ్యాన్‌గా పనిచేసిన అలెజాండ్రో రొమెరో పొగతాగుతూ, కారులో నుంచే జూమ్ ద్వారా సాక్ష్యం చెప్పడం అమెరికా న్యాయవ్యవస్థకే కొత్తది.

వీడియో క్యాప్షన్, ఫెమిసైడ్: మహిళల్ని కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్లే చంపేస్తున్నారు, ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)