Multiple myeloma: నడుము నొప్పి వస్తోందా? అయితే, ఇది క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జూలియా గ్రాంచీ
- హోదా, బీబీసీ న్యూస్
మల్టిపుల్ మయలోమా ఒక అరుదైన రక్త క్యాన్సర్. రక్తం, ఎముకల్లోని మూల కణాలపై ఇది ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఎముకలు, కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.
అయితే, ఈ మల్టిపుల్ మయలోమా లక్షణాలను తొలి దశల్లో నిర్ధరించడం చాలా కష్టమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ప్లాస్మా కణాలపై ఈ వ్యాధి దాడిచేస్తుంది. ఇవి ఒక రకమైన తెల్ల రక్తకణాలు. వ్యాధులతో పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీలను ఇవి ఉత్పత్తి చేస్తాయి.
ఈ వ్యాధి సోనప్పుడు తెల్ల రక్తకణాలు అసాధారణ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. ఎం.ప్రోటీన్ లేదా మోనోక్లోనల్ ప్రోటీన్‌గా పిలిచే ఈ యాంటీబాడీలు శరీరంలోని కీలకమైన అవయవాలను దెబ్బతీస్తాయి.
ఈ వ్యాధి సోకిన వారిలో ఒకటి కంటే ఎక్కువ అవయవాల వైఫల్యం కనిపిస్తుంది. అందుకే దీని పేరులో మల్టిపుల్ అని ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన లక్షణంనడుం నొప్పి
ఈ వ్యాధి సోకివారిలో మొదట నడుం నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ఈ నడుం నొప్పి అనేది చాలా మందిలో సాధారణంగా కనిపించే లక్షణం. అసౌకర్యంగా నిద్రపోవడం, ఎక్కువ సేపు జిమ్ చేయడం లేదా ఏదైనా చిన్న తేడా వల్ల కూడా నడుం నొప్పి రావొచ్చు.
అయితే, మల్టిపుల్ మయలోమా సోకిన వారిలోనూ నడుం నొప్పే ముందు కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఇలా నడుము నొప్పి రావడంతో 37ఏళ్ల మర్చంట్ లూయిజ్ ఫెర్నాండో వరుస పరీక్షలు చేయించుకున్నారు. అయితే, మొదట అన్ని బానేవున్నట్లు పరీక్ష ఫలితాలు వెల్లడించేవి.

ఫొటో సోర్స్, Getty Images
‘‘నాకు నడుం నొప్పి చాలా ఎక్కువగా ఉండేది. అయితే, ఏడు నెలల తర్వాతే ఈ వ్యాధి సోకినట్లు నిర్ధరణ అయ్యింది. నాకు మొదట్నుంచీ అనుమానం ఉండేది. ఎందుకంటే దీనిపై ఇంటర్నెట్‌లో నేను చాలా విషయాలు చదివాను’’అని ఆయన వివరించారు.
లూయిజ్ ఫెర్నాండోకు అయినట్లే ఈ వ్యాధి వల్ల ఎముకలు విరిగిపోవచ్చు. ఒక్కోసారి ఎముకలన్నీ బలహీనం కావడం, రక్త హీనత లాంటి సమస్యలు కూడా రావొచ్చు. తీవ్రమైన కేసుల్లో కిడ్నీల్లోని నాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా కిడ్నీ విఫలం అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
అరుదైన క్యాన్సర్..
ఇది అరుదైన క్యాన్సరే. అయితే, రక్త క్యాన్సర్లలో ప్రపంచ వ్యాప్తంగా ఇది రెండో స్థానంలో ఉంది.
ముఖ్యంగా 60ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. అయితే, యువతలోనూ ఇది కనిపిస్తుంటుంది.
బ్రెజిల్‌లోని సాల్వడోర్‌కు చెందిన 8ఏళ్ల బాలుడికి ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధి సోకిన అత్యంత పిన్న వయస్కుడు ఇతడేనని ఇంటర్నేషనల్ మయలోమా ఫౌండేషన్ లాటిన్ అమెరికా తెలిపింది.
మూత్ర లేదా రక్త పరీక్ష సాయంతో మల్టిపుల్ మయలోమాను నిర్ధారించొచ్చు. ఈ పరీక్షను సీరమ్ ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ (సీపీఈపీ)గా పిలుస్తారు.

‘‘అందరికీ ఈ టెస్టు చేయించుకోవాలని మేం సూచించం. ఎందుకంటే వారిపై అనవసరంగా టెస్టుల పేరుతో ఖర్చులు పెంచకూడదు కదా. అదే సమయంలో ఎక్కువ రోజులు అవే లక్షణాలు ఉన్నప్పటికీ టెస్టులు చేయించకుండా ఉండకూడదు. ఇక్కడే వైద్యుల నైపుణ్యానికి పని పడుతుంది. మనం రోగి లక్షణాల బట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది’’అని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియో డీ జెనీరోలో హేమటాలజీ ప్రొఫెసర్ ఏంజెలో మయోలినో చెప్పారు.
కేవలం 29 శాతం మంది రోగుల్లోనే మొదట లక్షణాలు కనిపించిన వెంటనే ఈ వ్యాధి నిర్ధారణ అవుతోందని బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ లింఫోమా అండ్ లుకేమియా చేపట్టిన సర్వేలో తేలింది.
‘‘చాలా మంది డయాలసిస్ వరకు పరిస్థితి చేయిదాటే స్థాయికి వెళ్లిపోతుంటారు. వ్యాధి సోకిన మూడేళ్ల తర్వాత వారికి నిర్ధారణ అవుతుంటుంది’’అని మయోలినో చెప్పారు.
చికిత్స ఏమిటి?
18వ శతాబ్దంలో తొలిసారి ఈ వ్యాధిని గుర్తించినప్పటి నుంచి చికిత్స విధానాలు మెరుగుపడుతూ వచ్చాయి. నేడు ఈ వ్యాధి సోకిన వారి జీవిత కాలం పొడిగించేందుకు ఈ చికిత్సా విధానాలు తోడ్పడుతున్నాయి.
నిజానికి ఈ వ్యాధిని పూర్తిగా నయంచేసే చికిత్సా విధానాలు అందుబాటులో లేవు. అయితే, లక్షణాలను తగ్గిస్తూ జీవితం కాలం పొడిగించేందుకు అందుబాటులోనున్న చికిత్సలు తోడ్పడతాయి.
‘‘ఈ చికిత్సా విధానాలతో మధుమేహం, రక్తపోటు వచ్చినట్లే ఔషధాలు వేసుకుంటూ జీవితం గడపొచ్చు’’అని మయోలినో చెప్పారు.
తొలి దశల్లోనే ఈ వ్యాధిని నిర్ధరిస్తే, వ్యాధి ముదరకుండా అడ్డుకోవచ్చు. ఒకసారి పరిస్థితి తీవ్రంగా మారిపోతే నయం చేయడం చాలా కష్టం.
‘‘వ్యాధి తొలి దశల్లో ఉంటేడప్పుడు మన దగ్గర చాలా చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఒకసారి వ్యాధి తీవ్రమయితే, వీటితో పెద్దగా ఉపయోగం ఉండదు’’అని మయోలినో చెప్పారు.
ఈ వ్యాధి సోకిన వారికి సాధారణంగా మూలకణాల మార్పిడి చికిత్సను సూచిస్తుంటారు. ఒక్కోసారి కీమోథెరపీ లేదా రేడియోషన్ థెరపీలతోనూ ఉపయోగం ఉంటుంది.
లూయిజ్.. మూల కణ మార్పిడి చికిత్సను ఆశ్రయించారు. అయితే, కొన్ని రోజుల తర్వాత మళ్లీ వ్యాధి తిరగబెట్టింది.
‘‘నేను ఒక నెల ఆసుపత్రిలో ఉంటే.. మరో నెల ఇంటిలో ఉంటాను. 28ఏళ్ల వయసున్నప్పుడు ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అప్పటినుంచీ నొప్పి లేని రోజంటూ లేదు. ఇది కొంచెం కష్టమే. కానీ, మనకు అలవాటు అవుతుంది. సాధారణ జీవితం గడిపేందుకు మందులు కొంతవరకు సాయం చేస్తాయి’’అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- Fake Currency notes: నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలా.. ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి
- మీ సెల్‌ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడం ఎలా... హ్యాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- సైబర్ మాయగాళ్లు వేసే ఎరలు ఎలా ఉంటాయి? వాటికి చిక్కుకోకుండా ఉండడం ఎలా : డిజిహబ్
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













