కమల్‌హాసన్ రాజకీయ పార్టీ.. ‘ప్రజా న్యాయ కేంద్రం’

కమల్‌హాసన్ తన రాష్ట్రవ్యాప్త పర్యటనను రామేశ్వరం నుంచి ప్రారంభించారు. దేశంలో ఎంతో ప్రజాదరణగల రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్‌కలాం ఆ ఊరి బిడ్డే. ఆయన అభివృద్ధి స్వాప్నికుడు.
తమిళంలో ‘‘నాలాయ్ నమాదే’’ అనే కమల్ నినాదానికి అర్థం ‘‘రేపు మనదే’’. డాక్టర్ కలాం ఆలోచనలు ప్రాతిపదికగా గల నినాదమిది.
కమల్ రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా భావించే మదురై వెళ్లే ముందు.. తన పార్టీని, పార్టీ పతాకాన్ని లాంఛనంగా ప్రారంభించటానికి తన సొంతూరు పరమకుడిలో ఆగుతారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆయన తన పార్టీని ప్రారంభించారు. దాని పేరు 'మక్కల్ నీది మయ్యం' (ప్రజా న్యాయ కేంద్రం)



కమల్ గత కొన్ని వారాల్లో వివిధ రాజకీయ పార్టీల అగ్ర నాయకులను కలిశారు. డీఎంకే నేతలు ఎం.కరుణానిధి, ఎం.కె.స్టాలిన్, డీఎండీకే నేత విజయ్‌కాంత్ తదితరులు వారిలో ఉన్నారు. సినీ రంగంలో మరో అగ్రతార రజనీకాంత్‌ను కూడా కమల్ కలిశారు. రజనీ కూడా రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ ఏఐఏడీఎంకే నాయకులు ఎవరినీ కమల్ కలవలేదు. దీనికి రాజకీయ కోణం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏఐఏడీఎంకే వ్యతిరేక ఓట్లను ఆకర్షించాలన్నదే ఈ వ్యూహం ఉద్దేశమని స్పష్టమవుతోంది.

చారిత్రకంగా చూస్తే.. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో సొంత ప్రభావం చూపగల కొత్త పార్టీలు పుట్టినప్పటికీ రాజకీయ అధికారాన్ని డీఎంకే, ఏఐఏడీఎంకేలే పంచుకున్నాయని గత 50 ఏళ్ల ఎన్నికల గణాంకాలు చెప్తున్నాయి.
‘పట్టణ మధ్యతరగతి’ని కమల్ ఆకర్షించగలరని.. ఈ వర్గాన్ని చేరటానికి కూడా కొత్త పార్టీకి ‘‘బలమైన కేడర్ ఉండాల’’ని రాజకీయ విశ్లేషకుడు మాలన్ అంటారు. ‘‘ఆయన పేరున్న సినీ నటుడు కనుక వార్తల్లో ఉన్నప్పటికీ.. ఇది సులువైన విషయం కాదు. ఆయన తన అభిమానులను ఓట్ల రూపంలోకి మార్చగలగటం చాలా కష్టమైన పని’’ అని మాలన్ వ్యాఖ్యానించారు.

‘‘ఎం.జి.రామచంద్రన్ (ఎంజీఆర్) లేదా జయలలితల్లాగా కాకుండా రజనీకాంత్, కమల్‌హాసన్‌లు ఇద్దరూ రాజకీయాల్లో ప్రవేశించటం.. ఇటు రాజకీయ రంగంలోనూ, అటు వారి కెరీర్‌లోనూ బాగా ఆలస్యంగానే జరిగింది. ఎంజీఆర్, జయలలితలు తమ సినీ కెరీర్‌లో పతాక స్థాయిలో ఉన్నపుడు రాజకీయాల్లోకి వచ్చారు’’ అని అబ్జర్వేటర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) చెన్నై డైరెక్టర్ ఎన్ సత్యమూర్తి అభిప్రాయపడ్డారు.
కానీ.. రాజకీయాలనేవి ఎప్పుడూ ఒక వింతైన వేదికగానే ఉన్నాయి. తెలుగు అగ్రనటుడు ఎన్.టి.రామారావు 1983లో అకస్మాత్తుగా రాజకీయ రంగంలోకి ప్రవేశించి తన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో ఆంధ్రప్రదేశ్‌ను సమ్మోహితం చేసి ముఖ్యమంత్రి అయ్యారు.
ఇవి కూడా చదవండి:
- కళ వేరు... పొలిటి‘కళ’ వేరు
- ‘రజనీకాంత్, నేను స్నేహపూర్వక ప్రత్యర్థులం’ - కమల్
- రాజకీయాలకు రజినీ వయసు దాటిపోయిందా?
- నచ్చితే పవన్ కల్యాణ్ పార్టీకి మద్దతు: ప్రకాశ్‌రాజ్
- రజినీకాంత్ మాటలకు అర్థమేమిటి?
- మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ?
- దక్షిణాదిలో నిరసన స్వరాలు.. బాలీవుడ్లో మౌన రాగాలు
- జయలలిత స్థానాన్ని రజినీకాంత్ పూరించగలరా?
- తమిళనాడు: ప్రాణాంతకంగా మారిన ప్రైవేటు అప్పులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








