రజినీకాంత్’ఆధ్యాత్మిక రాజకీయాల’కు అర్థమేమిటి?

రజనీకాంత్

ఫొటో సోర్స్, Getty Images

నీతి, నిజాయితీ, పారదర్శకతలతో ‘ఆధ్యాత్మిక రాజకీయాలు’ నడపాలని తాను కోరుకుంటున్నట్లు సినీ నటుడు రజినీకాంత్ పేర్కొన్నారు.

రాజకీయాల్లోకి తాను వస్తున్నానంటూ రజినీ కొద్ది రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే.

తనవి ‘ఆధ్యాత్మిక రాజకీయాలు’ అని ఆయన ఆ సందర్భంగా చెప్పారు.

రాజకీయాల్లోకి ప్రవేశించాలని ప్రకటించిన తర్వాత రజనీ మంగళవారం చెన్నైలో కొందరు పాత్రికేయులను విడివిడిగా కలిశారు.

రజినీకాంత్‌ను కలిసిన బీబీసీ ప్రతినిధి.. ఆయన ‘ఆధ్యాత్మిక రాజకీయాలు’ అన్న మాటల అర్థమేమిటని అడిగారు.

రజినీ బదులిస్తూ.. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీలలో నిజాయతీ, పారదర్శకతలు లేవని విమర్శించారు.

రజనీకాంత్ సినిమా పోస్టర్ ముందు పూజ చేస్తున్న అభిమానులు

ఫొటో సోర్స్, Getty Images

‘‘కాబట్టి నీతి, నిజాయితీ, పారదర్శకతలతో కూడిన రాజకీయాలకు సారథ్యం వహించటానికి ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలన్నది నా ప్రణాళిక’’ అని చెప్పారు.

తాను సినిమాల్లోకి రాకముందు ‘సంయుక్త కర్ణాటక’ అనే కన్నడ మేగజీన్‌లో కొద్ది కాలం పాత్రికేయుడిగా పనిచేశానని కూడా రజినీ తనను కలిసిన పాత్రికేయులకు తెలిపారు.

స్వతంత్ర పోరాటం మొదలుకుని భారతదేశంలో ముఖ్యమైన రాజకీయ పరిణామాలన్నీ తమిళనాడులో పుట్టాయని.. కాబట్టి రాజకీయ విప్లవాన్ని ఇదే రాష్ట్రం నుంచి ప్రారంభించాలని తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

‘‘ఆ విప్లవాన్ని ప్రారంభించటానికి ఇది సరైన సమయం’’ అని చెప్పారు.

ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)