పార్టీ ఏర్పాటుపై రజినీకాంత్ ప్రకటన బీజేపీకి ఎలాంటి సంకేతం?

ఫొటో సోర్స్, Twitter
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
తాను రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్టుగా 'సూపర్ స్టార్' రజినీకాంత్ తీసుకున్న నిర్ణయం అర్ధ శతాబ్దపు ద్రవిడ రాజకీయాల రూపురేఖల్ని మార్చే అవకాశం ఉంది.
అయితే ఇది రాజకీయాల్లో ఆయన ఏ మేరకు సక్సెస్ అవుతారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
గత రెండు దశాబ్దాలుగా రావాలా, వద్దా అని తటపటాయిస్తూవచ్చిన రజినీ ఎట్టకేలకు 2017 సంవత్సరపు చివరి రోజున రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఇప్పుడు మార్పుకు సమయం వచ్చిందని రజినీకాంత్ అన్నారు. ఆయన ప్రకటన తన అభిమానుల్లోనే కాకుండా, ద్రవిడ రాజకీయాలను వ్యతిరేకించే వారిలో కూడా కొత్త ఆశలు రేకెత్తించింది.
ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కావల్సినంత ఖాళీ ఉంది. రజినీకాంత్, కమల్‌హాసన్ వంటి ఫిల్మ్ స్టార్లకు ఈ పరిస్థితిపై తగిన అవగాహన ఉంది.

ఫొటో సోర్స్, AFP
అన్నాడీఎంకే అంతర్గత రాజకీయాలు
తమిళనాడులో శక్తిమంతమైన నేతగా కొనసాగిన జయలలిత మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఖాళీ ఏర్పడింది.
జయలలిత చాలా బలమైన నేతగా ఉండేవారు. ఆమె తన షరతులతో కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఇరుకున పెట్టేవారు.
జయలలిత, రజినీకాంత్‌లలో ఉన్న ఒకే సారూప్యత ఏమిటంటే, ఇద్దరిదీ సినీరంగ నేపథ్యమే.
"ద్రవిడ రాజకీయాల నుంచి ఎదిగివచ్చిన జయలలిత లేని లోటును రజినీకాంత్ వెంటనే పూరిస్తారని అనుకోవడానికి వీల్లేదు. జయ మరణం తర్వాత ద్రవిడ రాజకీయాల్లో ఓ పెద్ద సంక్షోభం తలెత్తింది. దీనిని మనం మార్పుకు తొలి అడుగు అని చెప్పుకోవచ్చు. అయితే సాగాల్సిన దూరం మాత్రం ఇంకా చాలా ఉంది" అని రాజకీయ విశ్లేషకుడు బీఆర్‌పీ భాస్కర్ అన్నారు.
జయలలిత మృతి చెందిన తర్వాత అన్నాడీఎంకేపై పట్టు కోసం ఓ వైపు ఆమె సన్నిహిత సహచరి శశికళకూ, మరోవైపు అధికారంలో ఉన్న ఈ. పలనిస్వామి, ఓ. పన్నీర్‌సెల్వంలకూ మధ్య పోటాపోటీ పోరు సాగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ద్రవిడ రాజకీయాలు
మరో రాజకీయ విశ్లేషకుడు కేఎన్ అరుణ్ దీనిపై మాట్లాడుతూ, "ఓ వైపు జయలలిత లేకపోవడం, మరోవైపు అన్నాడీఎంకేలో ముఠా కుమ్ములాటలు జోరుగా సాగుతుండడం... రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి ఇదే అనువైన సమయం" అని అన్నారు.
ద్రవిడ రాజకీయాల్లో మరో పక్షమైన డీఎంకే పరిస్థితిని గమనిస్తే ఆ పార్టీ సుప్రిమో కరుణానిధి ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారు. జయలలితకు ముఖ్య పోటీదారుగా కరుణానిధి ఉండేవారన్నది తెలిసిందే.
కరుణానిధి ద్రవిడ రాజకీయాల బరువుబాధ్యతలు ఇప్పుడు ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ భుజాలపై ఉన్నాయి.
అయితే ఎంకే స్టాలిన్‌కు ఉన్న సమస్యలు తక్కువేమీ కావు. ఆయన తన సోదరుడు ఎంకే అళగిరి నుంచి సవాలును ఎదుర్కొంటున్నారు.
"స్టాలిన్‌కు అనేక సమస్యలున్నాయి. అయితే ఆయన ద్రవిడ రాజకీయాలకు తానే అసలైన వారసుడిగా స్థిరపర్చుకున్నారు. అయితే ఇప్పుడు ద్రవిడ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాల్సి ఉంది. ద్రవిడ రాజకీయాల నేలను సినీ ప్రపంచం నుంచి వచ్చిన వారు కదిలించగలరా లేదా అనే ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి" అని భాస్కర్ అన్నారు.
రాజకీయ నేల
రజినీ తన ప్రసంగంలో రాజకీయాలతో పాటు ఆధ్యాత్మికత గురించి ప్రస్తావించారు.
ఆయన అన్న ఈ మాటతో బీజేపీలో ఓ సానుకూల సంకేతం వెళ్లి ఉండొచ్చు. తమిళనాట రాజకీయ పట్టు కోసం బీజేపీ అనేక ఏళ్లుగా ప్రయత్నిస్తోందన్న విషయం తెలిసిందే.
అయితే రజినీకాంత్ ఆధ్యాత్మికత గురించి ప్రస్తావించడం అసాధారణమైందేమీ కాదని అరుణ్ భావిస్తారు.
"రజినీకాంత్‌కు స్వతహాగా ఆధ్యాత్మిక ప్రవృత్తి ఎక్కువే. ద్రవిడ సంస్కృతి బలంగా ఉన్నప్పటికీ తమిళనాడులో ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఎక్కువే. దీనిని బీజేపీ పెద్దగా ఉపయోగించుకోలేకపోతోంది. బహుశా రజినీకాంత్ దీనిని తనకు అనుకూలంగా మల్చుకుంటారేమో" అని అరుణ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కేడర్ నిర్మాణానికి కష్టపడాల్సిందే
సీనియర్ రాజకీయ విశ్లేషకుడు మాలన్ అరుణ్ ఈ అంశాన్ని మరో కోణంలో చూస్తారు.
"వాస్తవానికి తనను బీజేపీకి దగ్గరివాడుగా చూపించే ఇమేజిని రజినీ వదులుకోవాలనుంటున్నారు. వాస్తవం ఏమిటంటే, బీజేపీ, కాంగ్రెస్, విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకే లాగా రజినీ కూడా ద్రవిడ వ్యతిరేక ఓటర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. అన్నాడీఎంకే నుంచి కూడా జనాలను తన కొత్త పార్టీలోకి తేవడానికి రజినీ తప్పక ప్రయత్నిస్తారు. ఆయన ద్రవిడ పార్టీలకు ఒక పెద్ద సవాలు విసరనున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు" అని మాలన్ అన్నారు.
అయితే చేదు నిజం ఏమిటంటే కేవలం అభిమానుల వల్లనే రాజకీయాల్లో సక్సెస్ సాధ్యమయ్యే పని కాదు. అభిమానులను పార్టీ కేడర్లుగా మల్చుకోవడం కోసం కష్టపడాల్సిందే.
"రజినీకాంత్ అచ్చమైన రాజకీయ నాయకుడి లాగా తన కార్యకలాపాలన్నింటినీ సమన్వయించాల్సి ఉంటుంది. ఆయనలా చేయలేకపోయినట్టయితే రాజకీయంగా జవాబుదారీతనాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది" అని అరుణ్ అంటారు.

ఫొటో సోర్స్, Kabali Movie Poster
అసలు పోటీ పోలింగ్ కేంద్రాల్లోనే
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2021లో తమిళనాడు అసెంబ్లీకి జరుగబోయే ఎన్నికలలో మొత్తం 234 స్థానాలకూ పోటీ చేస్తానని రజినీ ప్రకటించారు.
అంతకు ముందే ఆయన తన పార్టీని నిర్మించే పనికి పూనుకుంటారన్నది స్పష్టమే. అయితే వచ్చే సంవత్సరం స్థానిక సంస్థలకు జరుగబోయే ఎన్నికలలో పాల్గొనబోమని ఆయన తెలిపారు.
ఒక సూపర్ స్టార్ రాజకీయ ఎత్తు వేయడం అనేది కూడా ఫిల్మ్ రిలీజ్ లాంటిదే.
ఒక ఫిల్మ్ సక్సెస్ అయ్యిందా లేదా అని చెప్పడానికి బాక్స్ ఆఫీస్ రికార్డులనే ప్రామాణికంగా చూసినట్టు ఒక పార్టీ రాజకీయ భవిష్యత్తు తేల్చేది కూడా పోలింగ్ కేంద్రాలే.
ఒకవేళ రజనీకాంత్ నటుడి నుంచి నేతగా మారడంలో విజయవంతం అయినట్టయితే తమిళనాడులో 50 ఏళ్ల చరిత్ర ఉన్న ద్రవిడ రాజకీయాల స్వరూప స్వభావాలు మారిపోక తప్పదు.
మా ఇతర కథనాలు:
- 2018: మగవారికి గర్భ నిరోధక మాత్రలు!
- కొత్త సంవత్సరం గురించి 2017 ఆర్థిక పరిస్థితి ఏం చెబుతోంది?
- 2017: శాస్త్ర పరిశోధనా రంగాల్లో జరిగిన 8 కీలక పరిణామాలివే!
- #గమ్యం : 2020 తర్వాత వైద్యరంగంలో ఈ కోర్సులదే హవా
- పోలవరం ప్రాజెక్టు
- చైనా: నూడుల్స్ అమ్మకాల్లో తగ్గుదల సూచిస్తున్నమార్పులు ఏమిటి?
- మంటల్లో చిక్కుకుంటే ఏం చేయాలి?
- సరిహద్దుకు ఇరువైపులు.. భర్తల కోసం ఎదురుచూపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









