జ్ఞానవాపి: ‘ప్రతి మసీదు కింద శివలింగాన్ని ఎందుకు వెతుకుతారు?’ - ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

శిక్షణ శిబిరంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

ఫొటో సోర్స్, Facebook/RSS

'ప్రతి మసీదు కింద శివలింగాల కోసం ఎందుకు వెతుకుతారు?'... ఈ ప్రశ్న వేసింది ఎవరో కాదు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తాజాగా వేసిన ప్రశ్న ఇది.

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం అంశం కొంతకాలంగా చర్చలో ఉంది. ఈ నేపథ్యంలో హిందూ ఆలయాలను కూల్చి కట్టిన మసీదుల్లో తవ్వకాలు జరపాలనే డిమాండ్లు రైట్ వింగ్ నుంచి పెరుగుతున్నాయి.

జ్ఞానవాపి మసీదు విషయంలో చరిత్రను మార్చలేమని మోహన్ భాగవత్ అన్నారు. 'జ్ఞానవాపి వివాదం కొనసాగుతోంది. కానీ అదొక చరిత్ర. నేటి హిందువులు, ముస్లింలు ఆ చరిత్రకు కారణం కాదు. అదంతా గతంలో జరిగిందే' అని ఆయన చెప్పుకొచ్చారు.

నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంగణం

ఫొటో సోర్స్, Facebook/RSS

ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు...

•దాడులు, దండయాత్రల ద్వారా ఇస్లాం బయటి నుంచి వచ్చింది. ఆ రోజుల్లో భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని మానసికంగా దెబ్బతీసేందుకు హిందూ దేవాలయాలను కూలగొట్టారు.

•తమకు ప్రత్యేక అనుబంధం ఉన్న కొన్ని ప్రాంతాల గురించి హిందువులు మాట్లాడుతున్నారు కానీ ముస్లింలకు వ్యతిరేకంగా వారు ఆలోచించడం లేదు. నేటి ముస్లింల పూర్వీకులు నాడు హిందువులే కదా.

'హిందువులు అందుకే అలా కోరుకుంటున్నారు'

•హిందువులను ఎప్పటికీ స్వాతంత్ర్యానికి దూరంగా ఉంచేందుకు వారి ఆలయాలను ధ్వంసం చేశారు. అందువల్లే నాడు కూల్చిన ఆలయాలను తిరిగి పునరుద్ధరించాలని హిందువులు కోరుకుంటున్నారు.

•మరి ఇందుకు మార్గం ఏంటి? పరస్పర అంగీకారంతో ముందుకు వెళ్లడమే. కానీ ప్రతిసారి ఇది సాధ్యం కాకపోవచ్చు.

•హిందూ ఆలయాల పునరుద్ధరణ కోసం కోర్టుకు వెళ్లొచ్చు. కానీ కోర్టులు ఇచ్చే తీర్పును మనం స్వాగతించాలి. రాజ్యాంగం ఆధారంగా పని చేసే మన న్యాయవ్యవస్థ చాలా గొప్పది. అవి ఇచ్చే తీర్పులను మనం పాటించాలి. వాటిని ప్రశ్నించకూడదు.

జ్ఞానవాపి మసీదు

ఫొటో సోర్స్, Sameeratmaj Mishra

ఫొటో క్యాప్షన్, జ్ఞానవాపి మసీదు

'రోజుకో కొత్త వివాదం ఎందుకు?'

‘కొన్ని ప్రాంతాల అంటే మనకు చాలా గౌరవం ఉంది. వాటితో ప్రత్యేక అనుబంధం ఉంది. వాటి గురించి మనం మాట్లాడొచ్చు. కానీ రోజుకో కొత్త వివాదం తీసుకురాకూడదు’ అన్నారు మోహన్ భగవత్.

‘జ్ఞానవాపీ అంటే మనకు ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ఇది తరతరాల నుంచి వస్తోంది. కానీ ప్రతి మసీదులో శివలింగం కోసం ఎందుకు చూస్తున్నారు? బయటి నుంచి వచ్చిన మతమైనా అది కూడా ఒక పూజా విధానమే. ఆ భక్తి మార్గాన్ని ఎంచుకున్న వారు ముస్లింలు అయ్యారు. అంతేకానీ వారేమీ బయటి వారు కాదు. ఈ విషయాన్ని ముస్లింలు కూడా అర్థం చేసుకోవాలి’ అన్నారు ఆయన.

‘వారు అలాగే ముస్లింలుగా ఉండాలనుకుంటే మంచిదే. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ మతానికి మేం వ్యతిరేకం కాదు. ప్రతి ఒక్కరికీ తమ కంటూ సొంత నమ్మకాలు, విశ్వాసాలుంటాయి. కానీ మనదంతా ఒకటే వారసత్వం. మీకు, మాకు పూర్వీకులు ఒకరే. మన సంప్రదాయాలు ఒకటే’ అన్నారాయన.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

ఫొటో సోర్స్, Facebook/RSS

'దేవాలయాల ఉద్యమాలకు దూరంగా ఉంటాం'

‘ఇప్పుడు మాకు దేవాలయాల కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులోనూ హిందూ దేవాలయాల ఉద్యమాల్లో ఆర్‌ఎస్‌ఎస్ పాల్గొనదు’ అని చెప్పారు భాగవత్.

ఆలయాల కోసం ఉద్యమించడం తమ వైఖరికి వ్యతిరేకమే అయినా కొన్ని చారిత్రక కారణాల వల్ల రామ జన్మభూమి ఉద్యమంలో నాడు పాల్గొన్నామని, ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశామని భాగవత్ చెప్పుకొచ్చారు.

యుక్రెయిన్‌లో గల రాకెట్ లాంచ్ చేసే వాహనం

ఫొటో సోర్స్, Getty Images

'యుక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో భారత్ వైఖరి సబబే'

‘‘యుక్రెయిన్ మీద రష్యా దాడికి దిగింది. కానీ యుక్రెయిన్ వెళ్లి రష్యాతో పోరాడటానికి ఏ దేశమూ సిద్ధంగా లేదు. రష్యా దగ్గర దమ్ము ఉంది. దాన్ని ఢీ కొట్టడం సులభం కాదు. ఎవరైనా వస్తే అణుబాంబులు వేస్తామంటోంది. అలాంటప్పుడు ఎవరైనా భయపడాల్సిందే’’ అంటూ యుక్రెయిన్, రష్యా యుద్ధంపై స్పందించారాయన.

‘‘మరొకవైపు యుక్రెయిన్‌కు అనేక రకాల ఆయుధాలు, యుద్ధసామాగ్రి ఇచ్చే వారు ఇస్తున్నారు. గతంలో భారత్, పాకిస్తాన్ కొట్టుకుంటూ ఉంటే రెండు దేశాలకు ఆయుధాలను ఇచ్చి వాటి పనితీరును పశ్చిమ దేశాలు పరీక్షించుకుంటూ ఉండేవి. యుక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించింది. అటు యుక్రెయిన్ మీద దాడిని సమర్థించలేదు. అలాగని రష్యాను వ్యతిరేకించలేదు. భారతదేశానికి అంత శక్తి ఉండి ఉంటే యుద్ధాన్ని ఆపి ఉండేది. కానీ భారత్ ఇంకా ఆ స్థాయికి రాలేదు. శక్తివంతమైన చైనా కూడా యుక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. యుక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల మనల్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. మనం శక్తిమంతులుగా మారాలి. అప్పుడే ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉంటాయి’’ అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)