మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం: 50 ఏళ్ల కిందటి హిందూ-ముస్లింల ఒప్పందాన్ని పక్కన పెట్టి మసీదును తొలగించాలని కేసు ఎందుకు వేశారు

మథుర

ఫొటో సోర్స్, SURESH SAINI/BBC

    • రచయిత, కమలేశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వారణాసిలోని కాశీ విశ్వనాథ్-జ్ఞాన్‌వాపి మసీదు వివాదం తర్వాత మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదంపైనా చర్చ జరుగుతోంది. దీనిపై విచారణ చేపట్టేందుకు మథుర జిల్లా కోర్టు తాజాగా అంగీకరించింది.

షాహీ ఈద్గా మసీదును తొలగించాలని ఫిబ్రవరి 2020లో మథుర సివిల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. 1968లో రెండు పక్షాల అంగీకారంతో కుదుర్చుకున్న ఒప్పందం అక్రమమని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే, ఈ పిటిషన్‌ను 2020 సెప్టెంబరు 30న కోర్టు తిరస్కరించింది. ‘‘కృష్ణ విరాజ్‌మాన్ పేరుతో వీరు పిటిషన్‌ వేశారు. అయితే, వీరెవరూ స్థానికులు కారు’’ అని ఆనాడు కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ అంశంపై మథుర జిల్లా కోర్టు హిందువుల తరఫున ప్రతినిధి రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఈ కేసుపై సివిల్ కోర్టు విచారణ చేపట్టాలని సూచించింది.

అయితే, ఈ కేసు 2020నాటిది అనుకుంటే పొరపాటే. ఈ వివాదం ఏళ్లనాటిది. దీని గురించి తెలుసుకునేముందు, ప్రస్తుత పరిస్థితి ఏమిటో చూద్దాం. పిటిషనర్లు ఏం డిమాండ్ చేస్తున్నారో పరిశీలిద్దాం.

మథురలోని ‘‘కట్రా కేశవ్ దేవ్’’ ప్రాంతాన్ని హిందూ దేవుడు శ్రీకృష్ణుడి జన్మ స్థలంగా భావిస్తారు. ఇక్కడ కృష్ణుడి దేవాలయం పక్కనే షాహి ఈద్గా మసీదు ఉంటుంది. దేవాలయాన్ని ధ్వంసంచేసి మసీదును కట్టినట్లు చాలా మంది హిందువులు చెబుతుంటారు. అయితే, ఆ వాదనలో నిజంలేదని ముస్లింలు ఖండిస్తున్నారు.

1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, ట్రస్ట్ షాహి ఈద్గా మసీదుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, ఇక్కడి భూమిని రెండు భాగాలుగా విభజించారు. అయితే, ఈ ఒప్పందం అక్రమమని తాజాగా పిటిషనర్లు అంటున్నారు.

మథుర

ఫొటో సోర్స్, SURESH SAINI

పిటిషన్‌లో ఏముంది?

‘‘కంస కారాగారంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఇది శ్రీకృష్ణ జన్మస్థలం. ఈ మొత్తం ప్రాంతాన్ని కట్రా కేశవ్ దేవ్‌గా పిలుస్తారు. మథుర జిల్లాలోని మథురా బజార్‌కు సమీపంలో ఇది ఉంది. కృష్ణుడి జన్మస్థలంగా భావించే ఇక్కడి 13.37 ఎకరాల స్థలంలోని కొంత భాగంలో అక్రమంగా మసీదును నిర్మించారు’’అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

‘‘శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, ట్రస్ట్ షాహీ ఈద్గాల మధ్య 1968లో కుదుర్చుకున్న ఒప్పందం అక్రమమైనది. దాన్ని తిరస్కరించాలి. కాట్రా కేశవ్ దేవ్ భూమిని శ్రీకృష్ణుడికి తిరిగి ఇచ్చేయాలి. ముస్లింలు ఇక్కడ ప్రార్థనలు చేసేందుకు వీల్లేదు’’అని పిటిషన్‌లో వివరించారు.

ఈద్గా మసీదును పూర్తిగా ఇక్కడ లేకుండా చూడాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు.

పిటిషనర్లు ఎవరు?

  • భగవాన్ శ్రీకృష్ణ (తరఫున.. రంజనా అగ్నిహోత్రి)
  • అస్థాన్ శ్రీకృష్ణ జన్మభూమి (తరఫున.. రంజనా అగ్నిహోత్రి)
  • రంజన అగ్నిహోత్రి
  • ప్రవేశ్ కుమార్
  • రాజేశ్ మణి త్రిపాఠి
  • కరుణేశ్ కుమార్ శుక్లా
  • శివాజీ సింగ్
  • త్రిపురారి తివారీ
మథుర

ఫొటో సోర్స్, Ranjana Agnihotri

ముస్లిం పక్షం

  • యూపీ సున్నీ సెంట్రల్ వఖ్ప్ బోర్డు
  • ఈద్గా మసీదు కమిటీ
  • శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్టు
  • శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్

ఇది ఎలా మొదలైంది?

ఈ వివాదంపై శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, ట్రస్టు షాహీ మసీదు ఈద్గాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఈ భూమిని రెండు భాగాలుగా విభజించారు.

అయితే, ఇక్కడ దేవాలయం ముందు నిర్మించారా? లేదా మసీదు నిర్మించారా? అనే వివాదమూ ఉంది. 1618 నుంచీ దీనిపై చాలా మంది కోర్టులను ఆశ్రయించారు.

మథుర

ఫొటో సోర్స్, Ranjana Agnihotri

కేసుకు ముందు ఏం జరిగింది?

  • కోర్టులో తాజాగా నమోదైన పిటిషన్ ప్రకారం.. ‘‘ఇది శ్రీకృష్ణుడి జన్మస్థానం. ఇక్కడికి దేశవిదేశాల నుంచి పర్యటకులు వస్తుంటారు. ఇక్కడి కాట్రా కేశవ్ దేవ్ ప్రాంతంలో హిందూ రాజులు కృష్ణుడి దేవాలయాన్ని నిర్మించారు. కాలక్రమేనా దీనికి చాలా మర్మతులు చేశారు. 1618లో ఈ దేవాలయానికి మరమ్మతులు చేపట్టేందుకు రాజా వీర్ సింగ్ దేవ్ బుందేలా 33 లక్షల రూపాయలు ఖర్చుపెట్టారు.
  • ‘‘అయితే, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (1658-1707) దేశంలోని చాలా ప్రాంతాల్లో దేవాలయాలను ధ్వంసం చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ఆ సమయంలోనే ఇక్కడి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఈద్గా మసీదును నిర్మించారు’’అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
  • 1770లలో మొఘల్ పాలకులపై మరాఠాలు విజయం సాధించారు. దీంతో మళ్లీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ తర్వాత ఈ భూమి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలోకి వచ్చింది. ఈ స్థలాన్ని నజూల్ భూమిగా ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తించింది. ఎవరికీ చెందని భూమిని నజూల్ భూమిగా ప్రకటిస్తారు.
  • 1815లో 13.37 ఎకరాల కాట్రా కేశవ్ దేవ్ భూమిని వేలం వేశారు. దీన్ని అత్యధిక ధర చెల్లించి రాజా పటనీమల్ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఈ భూమి పటనీమల్ వారసుడైన రాజా నరసింహ దాస్ చేతుల్లోకి వెళ్లింది. అప్పుడే ఈ స్థలం పటనీమల్ చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని ముస్లింలు కోర్టుకు వెళ్లారు. కానీ, కోర్టు వారి విజ్ఞప్తిని తిరస్కరించింది.
  • 1944 ఫ్రిబ్రవరి 8న రాజా పటనీమల్ వారసులైన రాయ్ కృషణ్ దాస్, రాయ్ ఆనంద్ దాస్.. ఈ భూమిని మదన్ మోహన్ మాలవీయ, గోస్వామి గణేశ్ దత్, భికేన్ లాల్ జీ ఆత్రే, జుగల్ కిశోర్ బిర్లాలకు అప్పగించారు. అప్పుడు కూడా ముస్లింల తరఫున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కానీ, దీన్ని కూడా కోర్టు తిరస్కరించింది.
  • ఆ తర్వాత జుగల్ కిశోర్ బిర్లా 21 ఫిబ్రవరి 1951న ‘‘శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్టు’’ను ఏర్పాటుచేశారు. ఇక్కడ కృష్ణ విరాజ్‌మాన్’’ పేరుతో భారీ దేవాలయాన్ని నిర్మించే బాధ్యతను ట్రస్టును అప్పగించారు. అయితే, 13.37 ఎకరాల్లో దేవాలయం నిర్మించడం కుదరలేదు. 1958లో ఈ ట్రస్టును రద్దు చేశారు.
  • 1958 మే 1న శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ పేరుతో ఒక సొసైటీని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత దీని పేరును శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్‌గా మార్చారు.
  • ఈ పరిణామాల నడుమ ఈ భూమిపై ముస్లిం ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, ట్రస్టు షాహీ ఈద్గాల మసీదుల మధ్య వివాదం రాజుకుంది. ఈ రెండు వర్గాల మధ్య 1968లో ఒక ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఈ భూమిలో కొంత భాగాన్ని ముస్లింలకు అప్పగించారు. ముస్లింలు కూడా కొన్ని ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లారు.

అయితే, ఈ ఒప్పందం కుదర్చుకోవడానికి ఆ సొసైటీకి ఎలాంటి హక్కూలేదని తాజాగా పిటిషన్‌దారులు చెబుతున్నారు. ఈ ఒప్పందంలో శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్టును కూడా భాగస్వామ్యం చేయలేదని అంటున్నారు.

మథుర

మసీదు తరఫున ఏం చెబుతున్నారు?

ఈ విషయంపై ఈద్గా మసీదు కమిటీ సెక్రటరీ, న్యాయవాది తన్వీర్ అహ్మద్ మాట్లాడారు. పిటిషనర్ల ఆరోపణల్లో నిజంలేదని ఆయన అన్నారు. ‘‘ఈ ఒప్పందం అక్రమం అయితే, ఆ సొసైటీకి ఎలాంటి హక్కులూ లేనట్లా? ట్రస్టు వైపు నుంచి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు. ప్రస్తుత పిటిషనర్లంతా బయటివారే. వారు ఎలా ఆ ఒప్పందాన్ని ప్రశ్నించగలరు?’’అని ఆయన ప్రశ్నించారు.

‘‘మనం హిందూ-ముస్లింల ఐకమత్యం గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఒకవైపు కృష్ణుడికి హారతి ఇస్తుంటే మరోవైపు ఆజాన్ శబ్దాలు వినిపిస్తాయి. ఇక్కడి ప్రజలకు దీనిపై ఎలాంటి అభ్యంతరాలూ లేవు. గతంలో ఏదో జరిగింది. ఇప్పుడు దాన్ని పట్టుకొని వివాదాలు చేయకూడదు. వారికి ఇక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు’’అని ఆయన అన్నారు.

కృష్ణుడి దేవాలయాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలను తన్వీర్ అహ్మద్ ఖండించారు. ‘‘1658లో కాట్రా కేశవ్ దేవ్‌లో ఔరంగజేబు మసీదును నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అంతకుముందు ఇక్కడ దేవాలయం ఉన్నట్లు ఆధారాలు లేవు. ఇక్కడి దేవాలయాన్ని ఔరంగజేబు కూలగొట్టించారని చెబుతున్నారు కదా.. దానికి సంబంధించిన ఆదేశాలు వారి దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇక్కడ 1658 నుంచి మసీదు ఉంది. 1968లో ఈ వివాదంపై రెండు వర్గాలు చర్చించుకొని ఒక ఒప్పందానికి వచ్చాయి’’అని తన్వీర్ అన్నారు.

ఈ అంశంపై ఈద్గా మసీదు కమిటీ ఛైర్మన్ డా. జెడ్ హసన్ కూడా మాట్లాడారు. ‘‘1968 ఒప్పందంలో ఈ భూమిని చాలా స్పష్టంగా విభజించారు. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి వివాదమూ లేదు. కానీ, ఇప్పుడు అధికారం మన చేతుల్లో ఉంటే ఏమైనా చేయొచ్చని కొందరు భావిస్తున్నారు. ఇక్కడ అందరూ శాంతి నెలకొనాలని అనుకుంటున్నారు’’అని ఆయన అన్నారు.

రంజన అగ్నిహోత్రి

ఫొటో సోర్స్, Ranjana Agnihotri

ఫొటో క్యాప్షన్, రంజన అగ్నిహోత్రి

పిటిషన్‌దారులు ఏం అంటున్నారు?

‘‘మేం శ్రీకృష్ణుడి భక్తులుగా ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నాం’’ అని అడ్వొకేట్ రంజన అగ్నిహోత్రి అన్నారు. ‘‘దేవుడి భూమిని దుర్వినియోగం చేస్తున్నారని లేదా సురక్షితం కానివారి చేతుల్లోకి ఈ భూమి వెళ్తుందని అనిపిస్తే అభ్యంతరం వ్యక్తంచేసే హక్కును రాజ్యాంగం మనకు కల్పించింది’’అని ఆమె అన్నారు.

‘‘ఇది పాత విషయాలను తవ్వడం కాదు. ఆ వివాదం సద్దుమణగలేదు. ఇప్పటికీ హిందూ దేవతల విగ్రహాలు మసీదుల్లో వెలుగులోకి వస్తున్నాయి. ఇది దారుణం. హిందువుల ప్రార్థనా స్థలాలను కాపాడుకోవాలి’’అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, వారణాసి: మందిరం, మసీదు పక్కపక్కనే ఎలా నిర్మించారు?

మసీదు నిర్మాణం విషయంలోనూ హిందువుల తరఫున పిటిషన్‌దారులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

‘‘1815లో ఈ భూమిని వేలం వేసేటప్పుడు కూడా మసీదు గురించి ప్రస్తావన లేదు. అప్పుడు ఇక్కడ అధ్వానంగా ఒక ప్రార్థనా స్థలం ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు చెబుతున్న షాహి ఈద్గా దర్గాను ఆ తర్వాత ఆక్రమించిన స్థలంలో కట్టారు’’అని అగ్నిహోత్రి చెప్పారు.

అయితే, ఈ మసీదు 1658 నుంచీ ఉందని మసీదు కమిటీ సెక్రటరీ తన్వీర్ అహ్మద్ చెబుతున్నారు.

మథుర

ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది?

శ్రీకృష్ణ జన్మభూమి-ఈద్గా మసీదు వివాదం.. ‘ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్-1991’ పరిధిలోకి వస్తుందా? ఈ చట్టం ప్రకారం.. ఆగస్టు 15, 1947 ముందు ప్రార్థనా స్థలాలు ఏ మతానికి చెందినవో ఆ తర్వాత కూడా ఆ మతానికే చెందుతాయి.

అయోధ్య వివాదానికి ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎందుకంటే ఆ తేదీకి ముందు నుంచీ కూడా ఈ వివాదం ఉంది.

వీడియో క్యాప్షన్, కాశీ-జ్ఞాన్‌వాపి వివాదమేంటి? దాని వెనుక ఉన్న చారిత్రక మూలాలేంటి?

మథుర వివాదానికి కూడా ఆ చట్టం నుంచి మినహాయింపు ఉంటుందని రంజనా అగ్నిహోత్రి చెప్పారు. ‘‘ఆ చట్టంలో సెక్షన్ 4(3)(బీ) ప్రకారం.. ఏదైనా కోర్టు లేదా ట్రైబ్యునల్ లేదా ఇతర అథారిటీల మందు పెండింగ్‌లోనున్న వివాదాలకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఉంటుంది’’అని ఆమె చెప్పారు.

అయితే, ఈ వివాదానికి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నుంచి మినహాయింపు ఉండదని, దీనిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని తన్వీర్ అహ్మద్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)