‘మహమ్మద్ ప్రవక్తపై భారత్‌లో చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగానే గురుద్వారాపై దాడి చేశాం’ - ఇస్లామిక్ స్టేట్

అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లోని ఒక గురుద్వారాపై శనివారం దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. భారత్‌లో మహమ్మద్ ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు ఐఎస్ తెలిపింది.
గురుద్వారాలో జరిగిన దాడిలో కనీసం ముగ్గురు చనిపోయారు. కాబుల్‌లో సిక్కులకు మిగిలిపోయిన ఏకైక గురుద్వారా పర్వాన్. శనివారం ఉదయం కొందరు సాయుధులు పర్వాన్ వద్ద తొలుత గార్డును చంపేశారు. ప్రాంగణం సమీపంలో ఒక కారు బాంబును పేల్చారు.
తర్వాత ఒక భక్తుడిని చంపారు. వారిని అడ్డుకునేందుకు తాలిబాన్ ఫైటర్లు ప్రయత్నించారు. వారి మధ్య పోరాటం చాలా సేపు సాగింది.
మూడు గంటల పాటు జరిగిన ఈ పోరాటంలో దాడికి పాల్పడిన సాయుధులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు.
ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు కాబుల్ పోలీస్ అధికారప్రతినిధి ఖాలిద్ జర్దానీ ధ్రువీకరించారు. ఆయన చెప్పినదాని ప్రకారం దాడిలో ఒక సిక్కు వ్యక్తి, ఒక తాలిబాన్ అధికారి, గుర్తు తెలియని ఒక దుండగుడు మరణించారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పేలుళ్లు, కాల్పులు జరిగినట్లు కాబుల్‌లోని బీబీసీ ప్రతినిధి మలిక్ ముదస్సిర్ చెప్పారు. గురుద్వారాలో మొత్తం 8 పేలుళ్లు జరిగాయని పోలీసు వర్గాలు, స్థానిక ప్రజలను ఉటంకిస్తూ ఆయన తెలిపారు.
అఫ్గానిస్తాన్‌లో మిగిలి ఉన్న చివరి గురుద్వారా ఇదే. అఫ్గాన్‌లో ఇప్పుడు కేవలం 140 మంది మాత్రమే సిక్కులు ఉన్నారని, 1970ల్లో సుమారు లక్ష మంది ఉండేవారని ఇటీవలే అక్కడి సిక్కు కమ్యూనిటీ చెప్పింది.
కాబుల్‌లో గురుద్వారాపై దాడిని భారత్ ఖండించింది. తాలిబాన్లు కూడా దీన్ని పిరికిచర్యగా అభివర్ణించారు.
పౌరులను లక్ష్యంగా చేసుకోవడం దాడి చేసిన వారి పిరికితనాన్ని చూపిస్తుందని బీబీసీతో ఖాలిద్ జద్రాన్ అన్నారు.
''సిక్కు సమాజం కోసం మా కామ్రేడ్లు వారి ప్రాణాలను త్యాగం చేశారు. సిక్కులను రక్షించడం ఇస్లామిక్ ప్రభుత్వం పరంగా వారి హక్కు'' అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, MALIK MUDASSIR
ఇస్లామిక్ స్టేట్ ప్రకటన
దాడి తర్వాత దీనికి కారణం తామేనంటూ, దాడికి ఎలా పాల్పడ్డారో వివరిస్తూ ఇస్లామిక్ స్టేట్ ఒక ప్రకటనను విడుదల చేసింది.
గురుద్వారాలో సిక్కు, హిందూ భక్తులపై తుపాకులు, గ్రెనేడ్లతో అటాకర్లు దాడి చేశారని తాలిబాన్లు ఒక సందేశంలో తెలిపారు. ఈ ఘటనలో మరణించిన, గాయాలపాలైన తాలిబాన్ ఫైటర్ల సంఖ్య 20గా ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 50 మంది గాయపడినట్లు తెలిపారు. అయితే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
అబూ మొహమ్మద్ అల్ తాజికీ ఈ దాడికి పాల్పడ్డారంటూ ఆయన ఫొటోలను కూడా ఐఎస్ విడుదల చేసింది.
ఘటనాస్థలానికి వచ్చిన తాలిబాన్ యోధులను ఎదుర్కొనేందుకు పేలుడు పదార్థాలని వినియోగించామని, కారు బాంబు పేలుడులో చాలామంది తాలిబాన్ ఫైటర్లు మరణించారని నివేదికలో ఐఎస్ తెలిపింది.

మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారం
ప్రచార వెబ్‌సైట్ అమక్‌లో ఐఎస్ ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది. శనివారం నాటి దాడి హిందువులు, సిక్కులు, వారికి రక్షణగా వచ్చిన మతభ్రష్టులపై జరిగిన దాడి అని సందేశంలో ఐఎస్ పేర్కొంది.
''ఇది అల్లాకు మద్దతుగా చేసిన చర్య'' అని వారన్నారు.
''మా యోధుడు ఒకరు కాబుల్‌లోని హిందు, సిక్కుల దేవాలయంలోకి చొరబడి ముందుగా అక్కడి గార్డును చంపేశారు. ఆ తర్వాత భక్తులపై మిషన్ గన్‌తో కాల్పులు జరిపారు'' అని ఐఎస్ వివరించింది.
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలను ఖండించారు. చాలా ముస్లిం దేశాలు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తాలిబాన్, ఇస్లామిక్ స్టేట్
అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం కూడా నూపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండించింది. భారత ప్రభుత్వం, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
''ఇలాంటి మూఢభక్తులను ఇస్లాంను అవమానించకుండా, ముస్లింల మనోభావాలకు దెబ్బతీయకుండా ఆపాలని మేం భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం'' అని జూన్ 6న తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు.
అఫ్గాన్‌లో తాలిబాన్లతో పోలిస్తే ఇస్లామిక్ స్టేట్ ప్రభావం చాలా తక్కువ. దేశంలోని ఏ భాగం కూడా ఐఎస్ నియంత్రణలో లేదు. అయినప్పటికీ అఫ్గాన్‌లో జరిగిన చాలా పెద్ద దాడుల్లో వారి ప్రమేయం ఉంది.
బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మాణీ ప్రకారం, అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వారు తీవ్రవాద కార్యకలాపాలను వదిలిపెట్టిన తర్వాత నుంచి హింస తగ్గిపోయింది. ఇస్లామిక్ స్టేట్ వల్ల, దేశ భద్రతను కాపాడాలనే సంకల్పాన్ని తాలిబాన్లు కొనసాగిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
అఫ్గానిస్తాన్‌లో సిక్కులు
అఫ్గానిస్తాన్‌లో ఒకప్పుడు పెద్ద సంఖ్యలో హిందువులు, సిక్కులు ఉండేవారు. కానీ, అక్కడ దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాల మధ్య వీరి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది.
గత కొన్నేళ్లలో ఇస్లామిక్ స్టేట్, అక్కడ మిగిలి ఉన్న సిక్కులపై చాలా సార్లు దాడులు చేసింది.
2018లో జలాలాబాద్ నగరంలో జరిగిన సిక్కుల సమావేశంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. 2020లో గురుద్వారాపై కూడా దాడి చేశారు.
శనివారం దాడికి లక్ష్యంగా మారిన గురుద్వారాకు సమీపంలో ఉండే సుఖ్‌బీర్ సింగ్ ఖాల్సా, బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మాణీతో మాట్లాడారు.
''జలాలాబాద్‌లో దాడి జరిగినప్పుడు ఇక్కడ సుమారు 1500 మంది సిక్కులు ఉండేవారు. ఆ ఘటన తర్వాత ఇక్కడ ఉండలేమని ప్రజలు అనుకున్నారు. 2020 దాడి తర్వాత మరింత మంది దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. గతేడాది తాలిబాన్లు మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ 300 మంది ఉండేవారు. ఇప్పుడు 150 మిగిలిపోయారు. మా చారిత్రక గురుద్వారాలు అన్నింటినీ కోల్పోయాం. మిగిలి ఉన్న ఒక్క గురుద్వారాపై కూడా ఇప్పుడు దాడి జరిగింది'' అని ఆయన అన్నారు.
తమకు వీసాలు ఇవ్వాలని ఆయన భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తామిక్కడ ఉండలేమని చెబుతున్నారు.
''మా దగ్గర వీసాలు లేవు. అందుకే ఇక్కడ మిగిలిపోయాం. ఎవరూ ఇక్కడ ఉండాలని కోరుకోరు. ఈరోజు జరిగింది రేపు కూడా జరుగుతుంది. మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటుంది'' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఇందిరాగాంధీ వెంట 21 ఏళ్లు నీడలా నడిచిన ఆర్కే ధవన్ కాంగ్రెస్‌లో అనాథగా మిగిలారెందుకు?
- Revlon: బ్యూటీ మార్కెట్‌ను షేక్ చేసిన ఈ కంపెనీ దివాలా తీయడానికి కారణాలేంటి?
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- అగ్నిపథ్: ఇలాంటి సైనిక నియామకాల పథకం ఏఏ దేశాల్లో ఉంది? అక్కడి నియమ నిబంధనలు ఏమిటి
- బ్రిటిషర్ల ఇళ్ల నుంచి గెంటేసిన భారత ఆయాల కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












