తాలిబాన్ ఆదేశం: ‘మహిళలు బురఖా ధరించాల్సిందే.. లేకుంటే కుటుంబంలోని మగవాళ్లకు జైలు శిక్ష’

గత నెలలో కాందహార్‌లో ఆహార సహాయం అందుకుంటోన్న బుర్కా ధరించిన మహిళలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, గత నెలలో కాందహార్‌లో ఆహార సహాయం అందుకుంటోన్న బుర్కా ధరించిన మహిళలు
    • రచయిత, ప్యాట్రిక్ జాక్సన్
    • హోదా, బీబీసీ న్యూస్

అఫ్గానిస్తాన్ మహిళలు, దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఇప్పడు ముఖానికి ముసుగు ధరించాల్సి ఉంటుంది. దేశంలో అధికారంలో ఉన్న తాలిబాన్ మిలిటెంట్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

'ప్రివెన్షన్ ఆఫ్ వైస్ అండ్ ప్రమోషన్ ఆఫ్ వర్చు' అనే తాలిబాన్ మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను వెలువరించింది.

ఏ మహిళ అయిన ఈ అధికారిక హెచ్చరికలను నిర్లక్ష్యం చేసినా లేదా అంగీకరించకపోయినా వారి కుటుంబంలోని సంరక్షకుడు మూడు రోజుల పాటు జైలు పాలవుతారు.

తాలిబాన్లు, 1990లో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు బురఖా పద్ధతిని అమల్లోకి తెచ్చారు.

అయితే, గతేడాది అఫ్గాన్‌లో మళ్లీ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి తాలిబాన్లు, ఈ విధానాన్ని ఆఫ్గాన్ నగరాల్లో ఆచరణలోకి తీసుకురాలేదు.

అఫ్గానిస్తాన్‌లోని చాలామంది మహిళలు బురఖా ధరిస్తారు. ముఖ్యంగా నగర ప్రాంతాలకు చెందిన కొందరు తలను మాత్రమే కవర్ చేసుకుంటారు.

హిజాబ్ రకాలు

తాలిబాన్ అధికారులు తాజా ఉత్తర్వులను 'ఒక సలహా'గా అభివర్ణించారు. కానీ, ఈ ఉత్తర్వులను అంగీకరించని వారి కోసం నిర్దిష్ట నియమాలను రూపొందించారు.

  • మొదటి సందర్భంలో వారి ఇంటికి వెళ్లి భర్త, సోదరుడు లేదా తండ్రితో మాట్లాడతారు.
  • రెండో దశలో కుటుంబానికి చెందిన సంరక్షుడికి ఉత్తర్వులు జారీ చేస్తారు.
  • చివరగా సంరక్షుడిని కోర్టుకు తీసుకువెళ్లి మూడు రోజుల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్... ముస్లిం పురుషులు, మహిళలు అణుకువగా ఉండే దుస్తులు ధరించాలని చెబుతుంది. పురుషులు నాభి నుంచి మోకాలివరకు కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలి. తమకు బంధువులు కాని, తమకు సంబంధం లేని పురుషుల సమక్షంలో ముస్లిం మహిళలు... తమ ముఖం, కాళ్లు, చేతులు ఏవీ కనిపించకుండా దుస్తులు ధరించాలి.

వీడియో క్యాప్షన్, ఆధునిక ముస్లిం మహిళ బురఖా ధరించాలా? వద్దా?

ఏది ఏమైనప్పటికీ ఇస్లాంలోనే దీనిపై చాలా చర్చ జరిగింది. ఇది హిజాబ్, నిఖాబ్ మధ్య వ్యత్యాసానికి దారి తీసింది.

హిజాబ్ అనేది జుట్టు, మెడ భాగం కవర్ అయ్యేలా ఉండే అమరిక. నిఖాబ్ అనేది కేవలం కళ్లు మాత్రమే బయటకు కనిపించేలా, ముఖం మొత్తాన్ని కవర్ చేసేలా ఉంటుంది. దీన్ని హెడ్‌స్కార్ఫ్‌తో పాటుగా ధరిస్తారు.

బురఖా అనేది మహిళల ముఖం, శరీరం మొత్తాన్ని కప్పేస్తుంది. కేవలం కళ్ల దగ్గర మాత్రమే కాస్త వెసులుబాటు ఉంటుంది.

రోజూవారీ జీవితంలో తాలిబాన్లు విధించిన అనేక కఠిన నిబంధనలు, మహిళలే లక్ష్యంగా రూపుదిద్దుకున్నాయి.

ప్రపంచంలోనే లింగం ఆధారంగా విద్యను పరిమితం చేసిన ఏకైక దేశంగా అఫ్గాన్ నిలిచింది. బాలికలు సెకండరీ విద్యను పొందకుండా నిషేధించారు. మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖను అక్కడ రద్దు చేశారు. చాలా సందర్భాల్లో మహిళలు బయటకి వెళ్లి పనిచేయడానికి కూడా అనుమతించలేదు.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ దళిత యువకుడి హత్య: ‘ ఇస్లాం ప్రకారం ఇది చాలా పెద్ద నేరం’ - అసదుద్దీన్ ఒవైసీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)