Bread: పశువులకు పెట్టే రొట్టెలను పిల్లలకు ఎందుకు తినిపిస్తున్నారు

అఫ్గానిస్తాన్
    • రచయిత, సికందెర్ కెర్మాణీ
    • హోదా, బీబీసీ న్యూస్

కాబుల్‌లోని నీలి గుమ్మటం మసీదుకు ఎదురుగా ఉండే మార్కెట్‌లో నారింజ రంగులో రొట్టెలు కనిపిస్తున్నాయి. ఇవి మనుషులు తినగా మిగిలిపోయిన, పాడైన రొట్టెలు.

సాధారణంగా వీటిని జంతువులకు ఆహారంగా పెడతారు. కానీ, ఇప్పుడు వీటిని మనుషులు తింటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది అఫ్గాన్ వాసులు వీటినే ఆహారంగా తీసుకుంటున్నారు.

కాబుల్‌లో పుల్-ఈ-ఖెష్టి మార్కెట్‌లో గత 30ఏళ్లుగా షఫీ మొహమ్మద్ ఇలా మిగిలిపోయిన రొట్టెలను అమ్ముతున్నారు.

‘‘ఒకప్పుడు రోజుకు ఐదుగురు మాత్రమే ఇవి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు 20 మందికిపైగా కొనడానికి వస్తున్నారు’’అని ఆయన చెప్పారు.

ఈ మార్కెట్ చాలా రద్దీగా ఉంది. ఇక్కడ చాలా మంది దేశాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకుంటున్నారు.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, AFP

గత ఆగస్టులో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తలసరి ఆదాయం మూడో వంతుకు పడిపోయింది. మరోవైపు ఆహారపు పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

వరుసగా పేర్చిన రొట్టెల్లోని శుభ్రంగా ఉన్నవాటిని ఆయన నాకు చూపించారు. చాలావరకు వీటిలో బాగున్నవి అమ్ముకునే వారే దాచిపెట్టి, ఇంటికి తీసుకెళ్లిపోతారు. వీటి మధ్యే పాతపడిన, బూజు పట్టిన రొట్టెలు కూడా ఉన్నాయి.

‘‘పంజరంలో ఆహారం, నీరు లేకుండా చిక్కుకున్న చిలుకల్లా అఫ్గాన్ వాసుల పరిస్థితి తయారైంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ దారిద్ర్యం, పేదరికం పోవాలని రోజూ నేను దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’’అని ఆయన చెప్పారు.

అఫ్గానిస్తాన్

సాయం సరిపోదు..

అఫ్గానిస్తాన్‌కు చాలా దేశాల నుంచి ఆర్థిక సాయం అందుతోంది. అయితే, శీతాకాలం రాబోతుండటంతో ఇక్కడ తీవ్రమైన కరవు విజృంభించనుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక్కడ ఆర్థిక సంక్షోభానికి పశ్చిమ దేశాలు అభివృద్ధి సాయం నిలిపివేయడమే ప్రధాన కారణం. తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత, చాలా దేశాలు తమ సాయాన్ని నిలిపివేశాయి. వీటిపై అఫ్గాన్ వాసుల జీవితాలు ఆధారపడి ఉండేవి.

ముఖ్యంగా మహిళలపై తాలిబాన్లు ఆంక్షలు విధిస్తారనే ఆందోళనల నేపథ్యంలో పశ్చిమ దేశాలు చర్యలు తీసుకున్నాయి. ఇదివరకు మహిళలపై తాలిబాన్లు చాలా రకాల ఆంక్షలను విధించారు.

పిల్లలతో హస్మతుల్లా
ఫొటో క్యాప్షన్, పిల్లలతో హస్మతుల్లా

కానీ, ఆంక్షలకు ఇప్పుడు పేదలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. హస్మతుల్లా.. ముగ్గురు పిల్లల తండ్రి.

మార్కెట్‌కు వచ్చేవారిని షాపింగ్ చేసేందుకు ఒప్పించడమే ఆయన పని. ముందే ఆయన జీతం చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు అది ఐదో వంతుకు పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ పాడైన రొట్టెలను ఆయన కొన్నారు. ‘‘ఉదయం నుంచి నేను కష్టపడి చేశాను. ఆ డబ్బులతో ఈ రొట్టెలు మాత్రమే వస్తాయి’’అని ఆయన బీబీసీతో అన్నారు.

ఈ రొట్టెల వెనుక ఒక చిన్న పరిశ్రమ ఉంది. రెస్టారెంట్లు, హాస్పిటళ్లు, ధనవంతుల ఇళ్ల నుంచి మొదట కొంతమంది మిగిలిపోయిన రొట్టెలను సేకరిస్తారు. వీటిని మధ్యవర్తులకు ఇస్తారు. వారు వీటిని రోడ్డుపై అమ్ముకునేవారికి విక్రయిస్తారు.

ఇక్కడ దేశంలో సగం మందిని ఆకలి పీడిస్తోంది. దీంతో బయటకు వస్తున్న మిగిలిపోయిన రొట్టెల సంఖ్య కూడా తక్కువగా ఉంటోంది.

వీడియో క్యాప్షన్, ‘నా భర్త తిరిగొచ్చాడు.. నేను దేశం వదిలి పారిపోయా..’

ఆకలితో..

‘‘ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు’’అని రొట్టెలు అమ్ముకునే ఓ వ్యక్తి చెప్పారు. వారం రోజుల క్రితం సేకరించిన రొట్టెలను ఆయన చూపించారు.

‘‘ఒకవేళ రొట్టెలు శుభ్రంగా ఉంటే, ముందు మేమే తినేస్తాం’’అని మరో రొట్టెలు అమ్ముకునే వ్యక్తి చెప్పారు.

కాబుల్‌లో ఒక బస్తీలో తన కుటుంబం కోసం హస్మతుల్లా ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. తన పిల్లలను స్కూలుకు పంపేందుకు తాను చేయాల్సిందంతా చేస్తున్నానని ఆయన చెప్పారు. అయితే, చాలా మంది పిల్లలను బడి మాన్పిస్తున్నారు.

హస్మతుల్లా కుటుంబం మొత్తం ఈ పాడైన రొట్టెలపైనే ఆధారపడుతోంది. టొమాటోలు, ఉల్లిపాయలతో కలిపి వండి వీటిని తింటోంది.

‘‘ఈ పాడైన రొట్టెలను తీసుకెళ్తుంటే నాకు సిగ్గనిపిస్తోంది. కానీ, నేను చాలా పేదవాడిని. ఇంతకంటే ఏం చేయగలను’’అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, ‘తిండి లేదు, వైద్యం అందదు.. రోజూ ఇదే పరిస్థితి’

‘‘ఎవరూ సాయం చేయడం లేదు’’

‘‘నేను చాలా ప్రయత్నిస్తున్నాను. ఎవరినైనా డబ్బులు అడుగుదామంటే.. ఇచ్చేందుకు ఎవరూ లేరు. నా పిల్లలు చాలా సన్నంగా అయిపోయారు. ఎందుకంటే వారికి తినడానికి ఏమీ దొరకడం లేదు’’అని ఆయన చెప్పారు.

కాబుల్‌లోని బ్యాకరీల బయట ఉచితంగా ఇచ్చే రొట్టెల కోసం మహిళలు, పిల్లలు భారీగా వరుసల్లో నిలబడుతున్నారు.

కొంత మంది రోజు మొత్తం ఆ వరుసలోనే నిలబడుతున్నారు. ఏ చిన్న అవకాశాన్నీ వారు వదలిపెట్టాలని అనుకోవడం లేదు.

అఫ్గానిస్తాన్‌కు కోట్ల రూపాయల సాయం అందించినా.. అవినీతి, యుద్ధం ప్రభావాల వల్ల ఇక్కడ జీవించడం చాలా కష్టం.

ఇప్పుడు యుద్ధం ముగిసింది. కానీ, జీవితం మాత్రం నానాటికి దుర్భరంగా మారుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)