Operation Zindagi: 68 అడుగుల లోతులో 5 రోజులు నరకయాతన.. పదేళ్ల మూగ బాలుడిని ఎలా రక్షించారంటే

ఫొటో సోర్స్, SANJEEV PANDEY
- రచయిత, అలోక్ ప్రకాశ్ పుతుల్
- హోదా, బీబీసీ హిందీ కోసం
బోరుబావిలో పడిన రాహుల్ సాహు అనే పిల్లాడిని సుమారు 104 గంటల తర్వాత ప్రాణాలతో బయటకు తీశారు.
రాహుల్ వయసు పదేళ్లు. మాట్లాడలేడు. వినలేడు.
బోరుబావిలో పడి సుమారు 68 అడుగుల లోతులో ఆయన చిక్కుకున్నాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గీర్ చంపా జిల్లాలో పెహెరీద్ గ్రామంలో జరిగింది.

ఫొటో సోర్స్, SANJEEV PANDEY
ఎలా పడిపోయాడుశుక్రవారం (జూన్ 10) మధ్యాహ్నం రాహుల్ తమ ఇంటి పెరట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడున్న బోరుబావిలో పడిపోయాడు.
పిల్లాడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. వారికి బోరుబావి నుంచి రాహుల్ ఏడుపు వినిపించింది.
వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పిల్లాడిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఫొటో సోర్స్, SANJEEV PANDEY
5 రోజులు సాగిన రెస్క్యూ ఆపరేషన్
బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయిన బోరుబావి దగ్గరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అదే రోజు సాయంత్రం చేరుకున్నారు.
వారు ముందుగా వాటర్ ప్రూఫ్ కెమేరాను బోరుబావిలోకి పంపించి రాహుల్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూశారు.
రాహుల్ నీరసించిపోకుండా ఉండేందుకు వెంటనే తాడు సాయంతో జ్యూస్, ఓఆర్‌ఎస్, పండ్లు పంపించారు.
ఆ తరువాత రాహుల్‌ను బయటకు తీసుకొచ్చేందుకు బోరుబావికి సమాంతరంగా తవ్వడం మొదలుపెట్టారు.
కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టమైంది. శనివారం, ఆదివారం కూడా సమాంతరంగా సొరంగం తవ్వే పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఒక దశలో రోబో సాయంతో రాహుల్‌ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

ఫొటో సోర్స్, Sanjeev pandey
బోరుబావిలో నీరు పైకి రావడంతో ఆశలు వదులుకున్నారురెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలోనే బోరుబావిలో నీటి మట్టం పెరగడం మొదలైంది.
దాంతో చుట్టుపక్కల ఉన్న బోర్లన్నింటినీ ఆన్ చేశారు. అలా చేయడం వల్ల భూగర్భ జల మట్టం తగ్గి రాహుల్ ఉన్న బోరుబావిలో నీరు పైకి రావడం తగ్గి ఆయన ప్రాణాలు నిలబడతాయని భావించారు.
మరోవైపు బోరు బావికి సమాంతరంగా తవ్వుతుండగా మధ్యలో రాయి తగిలింది. దాన్ని పగలగొట్టడానికి కొంత సమయం పట్టింది.
మంగళవారం మధ్యాహ్నం సైన్యం కూడా రంగంలోకి దిగింది. తవ్వకం పనులు వేగం అందుకున్నాయి.
ఎట్టకేలకు మంగళవారం రాత్రి తవ్వడం పూర్తయింది. రాహుల్‌ను తాడు సాయంతో బయటకు తీసుకొచ్చారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
రాహుల్ ప్రాణాలతో బయటికిరావడంతో అంతటా సంతోషం వ్యక్తమైంది. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు.

ఫొటో సోర్స్, Alok putul
రాహుల్ పక్కనే పాము
రాహుల్ పడిపోయిన బోరుబావిలో ఓ పాము కూడా ఉందని చంపా జిల్లా కలెక్టర్ జితేంద్ర శుక్లా ఈ రెస్క్యూ ఆపరేషన్ తరువాత మీడియాతో చెప్పారు.
రాహుల్ చిక్కుకున్న చోటే పాము, కప్ప కూడా ఉన్నాయని... బాలుడిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ విషయం తమకు ఆందోళన కలిగించిందని చెప్పారు.
‘‘రాహుల్ 5 రోజుల పాటు బోరుబావిలో సుమారు 60 అడుగుల లోతులో ఒక ఇరుకైన ప్రదేశంలో చిక్కుకున్నాడు. పైగా పక్కనే పాము ఉంది. ఇలాంటి పరిస్థితిలో రాహుల్‌ను కాపాడటం చాలా కష్టం. కానీ ఎలాగైనా కాపాడాలని అనుకున్నాం. సమాంతరంగా తవ్వాం. మాకు అందరూ సాయం చేశారు’’ అన్నారాయన.

ఫొటో సోర్స్, SANJEEV PANDEY
500 మందితో ‘ఆపరేషన్ జిందగీ’
రాహుల్‌ను బయటకు తీయడానికి చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌కు 'ఆపరేషన్ జిందగీ' అని పేరు పెట్టారు.
ఈ ఆపరేషన్‌లో 500 మంది పనిచేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు, స్థానికులు ఈ 'ఆపరేషన్ జిందగీ'లో పాల్గొన్నారు.
అయిదు రోజుల పాటు శ్రమించి రాహుల్‌ను బయటకు తీసిన తరువాత వెంటనే ప్రాథమిక చికిత్స చేసి బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం రాహుల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, ఆరోగ్యం స్థిరంగా ఉందని చంపా జిల్లా కలెక్టర్ చెప్పారు.

ఫొటో సోర్స్, SANJEEV PANDEY
ఇంతకీ ఆ బోరుబావి ఎవరిది?
ఈ బోరుబావిని రాహుల్ తండ్రి లాలా సాహూయే తవ్వించారు. ఇంటి పెరట్లోని మొక్కలకు నీరందిచడం కోసం దీన్ని తవ్వారు.
120 అడుగుల లోతు వరకు దీన్ని తవ్వారు. అయితే, అనంతరకాలంలో ఇందులో నీరు రాకపోవడంతో అందులోని ప్లాస్టిక్ గొట్టాలను తొలగించారు.
ప్లాస్టిక్ పైపులను తొలగించడంతో బోరుబావి సుమారు 8 అంగుళాల వెడల్పుగా మారిపోయింది.
రాహుల్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు.
ఇవి కూడా చదవండి:
- అలర్జీ అంటే ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
- వయసు పెరగకుండా చరిత్రలో జరిగిన ప్రయోగాలేంటి... తాజాగా సైన్స్ కనిపెట్టింది ఏమిటి?
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- కాథలిక్కుల్లో కులం సంగతేంటి? ఒక దళితుడు కార్డినల్ కావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?
- ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











