చత్తీస్‌గఢ్: ఏడాదిన్నర పాపకు సిగరెట్‌తో ఒళ్లంతా వాతలు.. 'నాన్నా' అని పిలవలేదని కానిస్టేబుల్ ఘాతుకం

ఫొటో సోర్స్, cg khabar
- రచయిత, అలోక్ ప్రకాశ్ పుతుల్
- హోదా, రాయపూర్ నుంచి బీబీసీ కోసం
చత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాకు చెందిన ఏడాదిన్నర బాలిక ముఖంపై, శరీరంపైనా సిగరెట్‌తో కాల్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ కానిస్టేబుల్ అవినాశ్ రాయ్‌ను విధుల నుంచి తప్పించారు.
ఈ సంఘటనకు అసలు కారణాలేంటో తెలుసుకునే పనిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
“ నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాం. దర్యాప్తు కోసం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశాం. కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించాం’’ అని బలోద్ ఎస్పీ జితేంద్ర మీనా బీబీసీకి తెలిపారు.
అతన్ని తొలగిస్తూ జారీ చేసిన ఆదేశాలలో “అలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై ప్రజా క్షేమం దృష్ట్యా కఠినమైన చర్యలు తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే పోలీసు వ్యవస్థపై సమాజంలో నమ్మకం పెరుగుతుంది’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, CG khabar
ఆరోపణలు ఏమిటి?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు అవినాశ్ రాయ్ అక్టోబర్ 5న బలోద్ నుంచి దుర్గ్ జిల్లాకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. సామాన్లు తీసుకెళ్లడానికి దుర్గ్ నుంచి బలోద్‌లో తాను ఇంతకు ముందు అద్దెకు ఉన్న ఇంటికి వచ్చారు అవినాశ్ రాయ్.
ఈ సందర్భంగా ఇంటి యజమానురాలి కూతురిని దగ్గరకు పిలిచిన తనను 'నాన్నా' అని పిలవాల్సిందిగా కోరారు రాయ్.
అయితే ఆ బాలిక అలా పిలవకపోవడంతో ఆగ్రహించిన అవినాశ్ రాయ్, ఆమె ముఖం మీదా, ఒంటినిండా సిగరెట్‌తో వాతలు పెట్టారు.
గురువారం రాత్రి 10.30 సమయంలో బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చారు.

ఫొటో సోర్స్, CG khabar
బాధిత చిన్నారికి సకాలంలో అందని వైద్యం
పోలీసులు గురువారమే కేసు నమోదు చేసినప్పటికీ, శనివారం వరకు ఆ చిన్నారికి చికిత్స అందలేదు.
ఈ విషయం మీడియాలో రావడంతో అధికారులు బాధితురాలిని శనివారంనాడు బలోద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత అక్కడి నుంచి రాయ్‌పూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అక్కడే ఆమెకు ప్రభుత్వ వైద్యం మొదలైంది.
అయితే కేసు పెట్టిన మరుసటి రోజు బాలికకు దుర్గ్ జిల్లాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రిలో చికిత్స జరిపించినట్లు బీబీసీ ఆధారాలు సంపాదించింది.
అన్నం వండుతుండగా గంజి మీద పడి బాలికకు గాయాలైనట్లు ఆ ఆసుపత్రిలో చికిత్స సందర్భంగా రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
ఆసుపత్రిలో బాధితురాలి పేరును, ఫోన్ నంబర్‌ను తప్పుగా రిజిస్టర్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
అవినాశ్‌రాయ్ బంధువులు బాధితురాలిని, ఆమె తల్లిని శుక్రవారంనాడు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపించినట్లు తెలిసింది.

ఫొటో సోర్స్, CG khabar
కేసులో ట్విస్టులు
బాధితురాలి తల్లి జానపద గాయని. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రజాసంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. బాధితురాలి తండ్రి నాగ్‌పూర్‌లో ఉంటారు.
"ఈ ఏడాది జూన్ 19న నా పధ్నాలుగేళ్ల కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు నా రెండో కూతురు ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డాయి" అని బాధిరాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారికి చికిత్స కోసం శుక్రవారం నిందితుడితో కలిసి ఆసుపత్రికి వెళ్లినట్లు బాధితురాలి తల్లి అంగీకరించారు. మొదట గంజి పడటం వల్ల బాలికకు గాయాలయ్యాయని చెప్పిన బాధితురాలి తల్లి, ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్ తాగిన మైకంలో తన కుమార్తెను సిగరెట్‌తో కాల్చారని ఆరోపిస్తూ కేసు పెట్టారు.
బాధితురాలి తల్లితో మాట్లాడుతున్నామని, ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉందని సామాజిక కార్యకర్త, హైకోర్టు న్యాయవాది ప్రియాంక శుక్లా అన్నారు.
“ఈ కేసును అర్ధం చేసుకోవాల్సింది చాలా ఉంది. ముందే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుంది. దీనిని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. ప్రభుత్వం నిందితుడిని విధుల నుంచి తొలగించడం మంచి పరిణామం’’ అని శుక్లా బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- Social Media: బిడ్డకు పాలిస్తున్న ఫొటోను కూడా అశ్లీలంగా చూస్తారా? ఓ తల్లి ఆవేదన
- కరోనా వైరస్: ఇండియాలో వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్ వేవ్ ఉంటుందా?
- నగార్నో-కరాబఖ్ యుద్ధం: రాత్రి పూట లైట్లు కూడా వేయడం లేదు – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టైటానిక్ నుంచి టెలీగ్రాఫ్‌ను వెలికితీయటానికి అమెరికా కోర్టు అనుమతి: ఏ రహస్యాలు వెలుగుచూస్తాయి?
- జాలర్లకు సముద్రంలో రహస్య నిఘా పరికరాలు దొరుకుతున్నాయి.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








