Social Media: బిడ్డకు పాలిస్తున్న ఫొటోను కూడా అశ్లీలంగా చూస్తారా? విమర్శలపై ఓ తల్లి ఆవేదన

పాలు పట్టడం తమ తల్లి-బిడ్డల బంధంలో కీలకమంటున్నారు బెయిలీ

ఫొటో సోర్స్, Demi-Louise Bailey

ఫొటో క్యాప్షన్, పాలు పట్టడం తమ తల్లి-బిడ్డల బంధంలో కీలకమంటున్నారు బెయిలీ

మూడు నెలల వయసున్న తన చిన్నారికి పాలు పడుతుండగా తీసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు ఓ తల్లి. తన మాతృత్వపు ఆనందాన్ని ఆ విధంగా అందరితో పంచుకోవాలనుకున్నారామె.

కానీ ఆమె ప్రయత్నం చేదు అనుభవాన్ని మిగిల్చింది. వేలమంది సోషల్‌ మీడియా యూజర్లు ఈ చర్యను తీవ్రంగా విమర్శిస్తూ పోస్టులు పెట్టారు.

యూకేలోని ఎస్సెక్స్‌కు చెందిన 23 ఏళ్ల డెమీ లూయీస్ బెయిలీ జులైలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పాపకు హార్పర్‌ అని పేరు పెట్టారు.

ఆ చిన్నారి పుట్టి మూడు నెలలైన సందర్భంగా తన బిడ్డకు పాలు పడుతున్న ఫొటోలను బెయిలీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

కానీ ఆమె పోస్ట్ చేసిన కాసేపటికే విపరీతమైన కామెంట్లు రావడం మొదలైంది. ఈ ఫొటోలు అసహ్యంగా ఉన్నాయంటూ చాలామంది విమర్శించారు. మరికొందరు అసభ్యకరమైన కామెంట్లు చేశారు.

అయితే చిన్నారికి పాలు పట్టడాన్ని పబ్లిక్‌లో పెట్టడం తప్పేమీ కాదనీ, సర్వసాధారణమైన విషయమేనని బ్రెస్ట్‌ ఫీడింగ్‌ నెట్‌వర్క్‌ అనే స్వచ్ఛంద సంస్థ అన్నది.

తన కూతురును శ్రద్ధగా చూసుకోవడం పట్ల గర్విస్తున్నానని బెయిలీ అంటున్నారు

ఫొటో సోర్స్, Demi-Louise Bailey

ఫొటో క్యాప్షన్, తన కూతురును శ్రద్ధగా చూసుకోవడం పట్ల గర్విస్తున్నానని బెయిలీ అంటున్నారు

తొలిసారి తల్లినైన తాను, ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవాలనుకున్నానని, ముఖ్యంగా కరోనావైరస్‌ కారణంగా ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన ఆనందాన్ని తెలియజేయడానికి ప్రయత్నించానని బెయిలీ లూయీస్‌ అన్నారు.

“ హార్పర్‌కు పాలివ్వడం మా ఇద్దరి బంధంలో కీలకమైన అంశం. నేను దీనికి ఏ మాత్రం ఇబ్బంది పడను, దాన్ని వదులుకోను కూడా” అని బెయిలీ అన్నారు.

“ఆ ఫొటోలు నాకు చాలా బాగా నచ్చాయి. నేను పాలు ఇస్తుండగా తను నావైపు చూడడం, నేను తనవైపు చూడటం, తానెంతో భద్రంగా, సౌకర్యవంతంగా ఉన్నానని చెబుతున్నట్లుగా ఉన్న ఆ చిన్నారి అమాయకపు చూపులను మీరు కూడా గమనించవచ్చు’’ అన్నారు బెయిలీ

కూతురు పుట్టి మూడు నెలలైన సందర్భంగా ఆమెకు పాలుపడుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు బెయిలీ

ఫొటో సోర్స్, Demi-Louise Bailey

ఫొటో క్యాప్షన్, కూతురు పుట్టి మూడు నెలలైన సందర్భంగా ఆమెకు పాలుపడుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు బెయిలీ

'అలా ఎలా కామెంట్లు చేయగలుగుతారు'

తాను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలకు చాలామంది పాజిటివ్‌ కామెంట్లు కూడా పెట్టారని కానీ #breastfed #breastfeeding #normalizebreastfeeding లాంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పెట్టిన ఈ ఫొటోలపై కొందరు తీవ్రమైన కామెంట్లు చేస్తారని ఊహించలేదని బెయిలీ అన్నారు.

“కవర్‌ చేసి ఉండాల్సింది’’, ‘జనం దాన్ని చూడకూడదు’, ‘అసభ్యకరం’ లాంటివి ఈ కామెంట్లలో కొన్ని అని బెయిలీ వెల్లడించారు.

చిన్నారికి పాలుపడుతున్న దృశ్యాలను ఆన్‌లైన్‌లో పెట్టడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని, అది సిగ్గుపడాల్సిన విషయంకాదని, దాన్ని వ్యక్తుల ఇష్టాయిష్టాలకు వదిలేయాలని బ్రెస్ట్‌ఫీడ్‌ నెట్‌వర్క్‌ అన్నది.

“బహిరంగంగా చిన్నారికి పాలుపట్టడం చాలా సాధారణమైన విషయం. దానిపై ఆమెను తప్పుబట్టడం విచారకరం’’ అని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

కొందరు వ్యక్తులు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తూ కూడా పోస్టులు పెట్టారని, కానీ ఈ పోస్టులు పెట్టినందుకు ఏమాత్రం పశ్చాత్తాపపడటం లేదని, ఇంకా గర్విస్తున్నానని బెయిలీ స్పష్టం చేశారు.

“ సోషల్‌ మీడియాలో ఇలాంటి కామెంట్లు రాయకూడదు అనిపించకుండా వాళ్ల మనసులకు ఏం అడ్డుపడిందో నాకు అర్ధం కాలేదు’’ అన్నారు బెయిలీ

బెయిలీ

ఫొటో సోర్స్, DEMI-LOUISE BAILEY

తన కూతురు నిద్రపోయేటప్పుడు మాత్రమే ఆమెకు తల దువ్వడం, మేకప్ చేయడంలాంటి పనులు చేస్తానని బెయిలీ వివరించారు.

“ మామూలుగా చాలామంది తల్లులు పిల్లలు నిద్రపోతున్న సమయంలో ఎక్సర్‌సైజులు చేయడం, ఇతర పనులు చూసుకోవడం చేస్తారు. కానీ నేను మాత్రం నా చిన్నారి విషయంలో నిద్రపోతున్నప్పుడు కూడా అత్యంత శ్రద్ధగా ఉంటాను’’ అని బెయిలీ అన్నారు.

సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన తన ఫొటోల విషయంలో ఏ మాత్రం బాధపడటంలేదని బెయిలీ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)