అర్మేనియా, అజర్‌బైజాన్ యుద్ధం: రాత్రి పూట లైట్‌లు కూడా వేయడం లేదు – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

నగార్నో-కరాబఖ్ యుద్ధం

ఫొటో సోర్స్, KAREN MINASYAN

    • రచయిత, మరీనా కటాయేవా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అజర్‌బైజాన్, అర్మేనియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే, ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నారంటూ రెండు దేశాలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు గుప్పించుకొన్నాయి.

వివాదాస్పద నగార్నో-కరాబఖ్ ప్రాంతం విషయంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. ఇక్కడ కాల్పుల చప్పుడు, బాంబుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి.

కొన్నిసార్లు అయితే, సరిహద్దుకు దూరంగా ఉండే ప్రాంతాలపైనా కాల్పులు జరుగుతున్నాయి.

నఖ్‌చివాన్ ప్రాంతంపై అర్మేనియా దాడి చేసిందని గతవారం అజర్‌బైజాన్ తెలిపింది. ఈ ప్రాంతానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉంది.

అజర్‌బైజాన్‌లోని చెమెన్లీ గ్రామంలో ఒక బాంబ్ షెల్టర్ వద్ద ఆ దేశ అధికారి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అజర్‌బైజాన్‌లోని చెమెన్లీ గ్రామంలో ఒక బాంబ్ షెల్టర్ వద్ద ఆ దేశ అధికారి

ఇది అజర్‌బైజాన్ ప్రధాన భూభాగం నుంచి వేరుపడి ఉంటుంది. అజర్‌బైజాన్‌లోని ఈ రెండు భూభాగాల మధ్య అర్మేనియా భూభాగం ఉంటుంది.

అయితే, నఖ్‌చివాన్‌పై దాడి తాము చేయలేదని అర్మేనియా చెబుతోంది. అబద్ధాలను ప్రచారం చేస్తూ కావాలనే తమను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించింది.

నఖ్‌చివాన్‌కు మూడు కిలో మీటర్ల దూరంలోని ఓ అర్మేనియా గ్రామాన్ని బీబీసీ రష్యన్ సర్వీస్ సందర్శించింది. యుద్ధం నడుమ అక్కడి ప్రజల జీవన విధానం ఎలా ప్రభావితం అవుతుందో పరిశీలించింది.

ఖాచిక్ గ్రామం
ఫొటో క్యాప్షన్, ఖాచిక్ గ్రామం

ఖాచిక్ గ్రామంలో...

అర్మేనియా రాజధాని యెరెవాన్‌కు 130 కి.మీ. దూరంలోని ఈ గ్రామంలోకి అడుగుపెడుతూనే ఒక నల్లని రిబ్బన్ కనిపించింది. దీనిపై తాతుల్-19 అని రాసి వుంది.

ఎవరైనా చనిపోతే సంఘీభావం ప్రకటిస్తూ ఇలాంటి రిబ్బన్ కడతారు. దీనిపై మృతుడి పేరు, వయసు రాసి ఉంటాయి.

ఇటీవల కాలంలో అర్మేనియా వీధుల్లో ఇలాంటి రిబ్బన్లు ఎక్కడపడితే అక్కడే కనిపిస్తున్నాయి. 800 మంది నివసించే ఖాచిక్ గ్రామంలో ఖాచిక్ (ఊరి పేరు అతని పేరు ఒకటే) అనే వ్యక్తిని బీబీసీ కలిసింది. గ్రామ పరిపాలనా విభాగం కార్యాలయం వెలుపల ఆయన మాట్లాడారు.

గ్రామ పరిపాలనా విభాగంలో ఖాచిక్ సోదరుడు పనిచేస్తుంటారు. ఈ గ్రామ పెద్ద కూడా అర్మేనియా తరఫున యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లారు.

సెప్టెంబరులో నగార్నో-కరాబఖ్ ప్రాంతంలో ఘర్షణలు పెరుగుతున్నప్పుడే 24 గంటలూ తమ గ్రామాన్ని కాపాడుకోవాలని నిర్ణయించినట్లు ఖాచిక్ గ్రెగోరియాన్ తెలిపారు.

‘‘మా గ్రామం సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది. బైనాక్యులర్ ఉపయోగిస్తే.. ఇక్కడి నుంచే సరిహద్దులను మనం చూడొచ్చు’’

సరిహద్దులకు సమీపంలోని రోడ్డుపై వెళ్లే వాహనాలను నిరంతరం తాము గమనిస్తుంటామని ఖచిక్ తెలిపారు. ‘‘యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను మోహరించిన వాహనాలు నిరంతరం ఈ రోడ్డు గుండా వెళ్తుంటాయి. నఖ్‌చివాన్ వైపు వెళ్లే వాహనాలన్నీ మేం బైనాక్యులర్ సాయంతో స్పష్టంగా చూడగలుగుతాం’’ అని ఆయన వివరించారు.

గత కొన్ని వారాలుగా భారీ స్థాయిలో ఆయుధాలను ఇక్కడి సరిహద్దుల్లో అజర్‌బైజాన్ మోహరించిందని ఖాచిక్ తెలిపారు.

‘‘ఇక్కడ ఘర్షణలు మొదలైనప్పుడే చాలా కుటుంబాలు గ్రామాన్ని వదిలివెళ్లిపోయాయి. అయితే, ఇప్పుడు కొన్ని కుటుంబాలు తిరిగి వచ్చాయి’’అని ఆయన వివరించారు. ద్రాక్ష తోటలవైపు మమ్మల్ని ఆయన తీసుకెళ్లారు.

మనుక్యాన్ కుటుంబం
ఫొటో క్యాప్షన్, మనుక్యాన్ కుటుంబం

ద్రాక్ష తోటల్లో తలదాచుకొని..

ఈ గ్రామం ఒక కొండపై ఉంటుంది. కిందవైపు ద్రాక్ష తోటలు పెంచుతున్నారు. ఇక్కడ ఒక డజను మంది పనిచేస్తున్నారు.

‘‘ఇది మనుక్యాన్ కుటుంబం తోట. 900 చ.మీ. విస్తీర్ణంలో వారు ద్రాక్ష తోటల్ని సాగు చేస్తున్నారు. అనుశావన్ మనుక్యాన్ వయసు 87ఏళ్లు. వారి కుటుంబంలో చాలా మంది ద్రాక్ష పళ్లు అమ్ముతారు. కొందరు వోడ్కా కూడా తయారుచేస్తారు’’అని ఖాచిక్ వివరించారు.

ఏటా ఈ తోట నుంచి మూడు టన్నుల ద్రాక్ష ఉత్పత్తి అవుతుందని ఆయన తెలిపారు.

అనుశావన్ మనవరాలు అర్పిన్‌కు 24ఏళ్లు. అక్టోబరు 17న ఆమె ఇక్కడకు వచ్చారు. లాచిన్‌లో ఉండే ఆమె ప్రాణాలు అరచేత పెట్టుకొని ఇక్కడికి పారిపోయి వచ్చారు. బట్టలు తెచ్చుకోవడానికి కూడా ఆమెకు సమయం దొరకలేదు.

‘‘యుద్ధం వల్ల నేను మా ఇల్లు వదిలి పరిగెత్తుకుంటూ వచ్చేశాను. మా గ్రామం వైపు కొందరు వస్తున్నారని ఉదయం నాలుగు గంటలకు మా అన్నయ్య ఫోన్ చేశాడు. వెంటనే నేను పరిగెత్తుకుంటూ ఇటు వైపు వచ్చేశాను’’అని ఆమె తెలిపారు.

అర్పిన్ అన్నయ్య యుద్ధంలో పోరాడుతున్నారు. తన తండ్రి కూడా పోరాడేందుకు సైన్యంలోకి వెళ్దామని అనుకున్నారని, అయితే వయసు దృష్ట్యా ఆయన్ను సైన్యంలోకి తీసుకోలేదని ఆమె వివరించారు.

యెరెవాన్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో అర్పిన్ డిగ్రీ పట్టా పొందారు. ఆమె టీచర్ కావాలని అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఖాచిక్ గ్రామంలో తాత, నాన్నమ్మలతో కలిసి ద్రాక్ష తోటలను పెంచుతున్నారు.

ఆమెతోపాటు ఇంట్లో ఎనిమిది మంది ఉంటారు. యుద్ధం నడుమ వారంతా ఇంట్లోనే ఉంటున్నారు.

ద్రాక్ష తోటలు

‘‘చాలా స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం’’

అనుశావన్ ఖాచిక్ గ్రామంలోనే జన్మించారు. యెరెవాన్‌లో ఆయన అగ్రోఎకానమిక్స్ చదువుకున్నారు. విద్యాభ్యాసం అనంతరం ఆయన తన గ్రామానికి వచ్చేశారు.

అజర్‌బైజాన్, అర్మేనియా.. సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేటప్పుడు స్థానిక ప్రభుత్వ తోటలకు ఆయన డైరెక్టర్‌గా పనిచేశారు.

‘‘అక్కడ నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. నా స్నేహితుడు రుస్తం, అతడి కుటుంబం అజర్‌బైజాన్‌లోని యెద్‌జీ గ్రామంలో ఉంటుంది. ఒకసారి వారు నన్ను కలవడానికి ఇక్కడకు వచ్చారు. ఇక్కడ రుస్తం, ఆయన భార్య, పిల్లలు మూడు రోజులు ఉన్నారు’’అని నఖ్‌చివాన్ వైపు చూపిస్తూ అనుశావన్ చెప్పారు.

రుస్తం కుటుంబాన్ని కలిసేందుకు తను కూడా చాలాసార్లు సరిహద్దులను దాటి వెళ్లానని ఆయన వివరించారు. ‘‘1987లో నా కుమార్తె పెళ్లి సమయంలో అర్మేనియా ప్రజల కంటే అజర్‌బైజాన్ వాసులే ఎక్కువ మంది వచ్చారు’’అని ఆయన తెలిపారు.

అరారాత్ పర్వతం
ఫొటో క్యాప్షన్, అరారాత్ పర్వతం

ఒకసారి అయితే, నఖ్‌చివాన్‌లో పనిచేసే ఓ మందుల షాపు కుర్రాడు అరగంటలోనే తనకు మందులు తీసుకొచ్చి ఇచ్చాడని, తిరిగి తన దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకోలేదని పేర్కొన్నారు.

ఖాచిక్ గ్రామానికి నఖ్‌చివాన్‌తో మంచి సంబంధాలున్నాయి. ఖాచిక్ గ్రామ ప్రజలు ద్రాక్ష పళ్లను విక్రయించి.. నఖ్‌చివాన్ వాసుల నుంచి యాపిల్ పళ్లు కొనుక్కుంటారు. మరోవైపు కార్ల విడి భాగాల కోసం ఇక్కడికి చాలా మంది అజర్‌బైజాన్ వాసులు వస్తుంటారు.

1991లో నగార్నో-కరాబఖ్ వివాదం మొదలుకాకముందు.. కొందరు అజర్‌బైజాన్ వాసలు తమ పొరుగు ప్రాంతాల్లో ఉండేవారని అనుశావన్ వివరించారు.

‘‘వారు గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. వారిని ఆపేందుకు మేం ప్రయత్నించాం. మీరు ఇక్కడే ఉన్నా.. మాకు ఎలాంటి సమస్యా లేదని చెప్పాం. కానీ వారు చిన్న పిల్లలు. అర్థం చేసుకోలేక వెళ్లిపోయారు. వారిని మళ్లీ నేను చూడలేదు’’

అనుశావన్ దంపతులు
ఫొటో క్యాప్షన్, అనుశావన్ దంపతులు

‘‘మమ్మల్ని ఎవరూ విడదీయలేరు’’

అనుశావన్ భార్య రిమ్మా వయసు 84ఏళ్లు. ఆమె ఖాచిక్ గ్రామంలోనే జన్మించారు. ద్రాక్ష తోటల్లో భర్తతో కలిసి ఆమె పనిచేస్తారు.

‘‘1990ల్లో ఈ యుద్ధం మొదలైనప్పుడు ఖాచిక్ గ్రామానికి చెందిన ఆరుగురు చనిపోయారు. వారంతా సాధారణ పౌరులే’’అని రిమ్మా వివరించారు.

‘‘ఆ సమయంలో జోరిక్ పోగోస్యాన్ అనే వ్యక్తి గడ్డి కోసేందుకు సరిహద్దుల దగ్గర వరకు వెళ్లాడు. ఆయన్ను అజర్‌బైజాన్ సైన్యం అదుపులోకి తీసుకొని నెలలపాటు దిగ్బంధించింది’’.

‘‘ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఆయన్ను మళ్లీ విడిచిపెట్టారు. అతడికి ఖాచిక్‌లో ఇప్పటికీ భూమి ఉంది. అయితే, ఆయన ఈ ప్రాంతాన్ని వదిలి యెరెవాన్‌కు వెళ్లిపోయారు’’.

నగార్నో-కరాబఖ్ వివాదానికి ముందు.. అజర్‌బైజాన్‌లోని యెద్‌జీ గ్రామంలో రిమ్మా పనిచేసేవారు. ఉదయమే అక్కడకు వెళ్లి జంతువులను సంరక్షించేవారు. సాయంత్రం మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేసేవారు.

అర్పిన్

‘‘నాకు యుద్ధ సమయంలో చాలా భయంవేసింది. అయితే, గ్రామాన్ని వదిలిపెట్టాలని అనిపించలేదు. ఎందుకంటే గ్రామంలో చాలా మంది ఇక్కడే ఉన్నారు. యుద్ధంలో పాల్గొన్నారు. శత్రువులు గ్రామాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోరాడారు’’అని రిమ్మా వివరించారు.

‘‘మేం ఇదివరకు రాత్రి పూట కూడా తలుపులు వేసుకునే వాళ్లం కాదు. ఇప్పుడు అయితే సాయంత్రం దాటితే తలుపులు వేసేస్తున్నాం. లైట్లు కూడా వేసుకోవడం లేదు. ఎవరైనా వచ్చేస్తారేమోనని భయం వేస్తోంది. మేం గ్రామాన్ని వదిలి వెళ్లం. ఇక్కడి నుంచి వదిలిపోవాలని మాకు లేదు’’

గ్రామం నుంచి బయటకు వస్తున్నప్పుడు మేం మరొక మహిళను కలిశాం. ఆమె యెరెవాన్ టీవీలో 22ఏళ్లు పనిచేశారు. ఇక్కడ చాలా ఏళ్ల నుంచి ఆమె యాపిల్ పండిస్తున్నారు.

ఖాచిక్ ఇంటి వరండా లోనుంచి చూస్తే దూరంగా టర్కీలోని కొండ కనిపిస్తోంది. దాన్ని అరారాత్ పర్వతంగా పిలుస్తారు. ఈ ప్రాంతానికి ఒకవైపు అజర్‌బైజాన్, మరోవైపు అర్మేనియా, ఇంకొకవైపు టర్కీ, నాలుగోవైపు ఇరాన్ ఉన్నాయి.

మేం అర్మేనియాలో మూడు వారాలు గడిపాం. అయితే వారు ద్రాక్ష, యాపిల్, పంటల పెంపకం గురించే మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. ఎవరూ యుద్ధం గురించి మాట్లాడటానికి కూడా రావట్లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)