RTI Act: సమాచార హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నారా

సమాచార హక్కు చట్టం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అర్జున్ పర్మార్
    • హోదా, బీబీసీ గుజరాతీ

''సామాన్య ప్రజలకు సాధికారత కల్పించేందుకు తీసుకొచ్చిన విప్లవాత్మక చట్టాల్లో సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ)-2005 కూడా ఒకటి. తమ హక్కులను కాపాడుకునేందుకు చాలా మంది అణగారిన వర్గాల ప్రజలు దీన్ని ఆశ్రయిస్తున్నారు.''

ఇవి నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ సంస్థ కో-కన్వీనర్ అంజలి భరద్వాజ్ మాటలు. ఈ చట్టం పట్ల తనంతో గర్వపడుతున్నట్లు ఆమె చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నాయకులు, న్యాయవ్యవస్థ దీన్ని నీరుగారుస్తున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు.

చట్టానికి అనవసర సవరణలు చేయడం, సమాచార కమిషనర్లను నియమించడంలో ఆలస్యం, ఆర్‌టీఐ దరఖాస్తుదారులపై దాడులు తదితర చర్యలతో ఈ చట్టం బలహీనం అవుతోందని అంజలి చెబుతున్నారు.

సమాచార హక్కు చట్టం

ఫొటో సోర్స్, Getty Images

ఏడాదికి 60 లక్షలు..

2005 జూన్ 15న భారత రాష్ట్రపతి సమాచార హక్కు బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో ఇది చట్ట రూపం దాల్చింది.

గత 17ఏళ్లుగా ప్రభుత్వంలోని భిన్న స్థాయిల్లో అవినీతి, అవకతవకలను ఈ చట్టం వెలుగులోకి తీసుకొచ్చింది. మరోవైపు అధికారంలో ఉన్నవారిని జవాబుదారీతనానికి బాధ్యులను చేయడంలోనూ ఇది తోడ్పడింది.

సామాన్య పౌరులకు సాధికారత కల్పించడంలో ఈ చట్టం ప్రధాన పాత్ర పోషించింది. పంచాయతీల నుంచి మంత్రిత్వ శాఖల వరకు భిన్న స్థాయిల్లో అవినీతిని ఇది బయటపెట్టింది.

ప్రస్తుతం ఏడాదికి 60 లక్షల వరకు ఆర్‌టీఐ దరఖాస్తులు వస్తున్నాయి. వీటిలో చాలావరకు సమాచార హక్కు చట్టం ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు దాఖలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆహార భద్రత, ఉపాధి కల్పన లాంటి హక్కుల పరిరక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు.

మరోవైపు సుప్రీం కోర్టు కూడా ప్రజల సమాచార హక్కుకు మద్దతు పలికింది. సమాచార హక్కును భావప్రకటన స్వేచ్ఛలో భాగంగా గుర్తిస్తున్నట్లు పేర్కొంది. అయితే, గత కొన్ని ఏళ్లుగా ఈ హక్కును పొందండంలో చాలా అవాంతరాలు ఎదురవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఆర్‌టీఐ చట్టాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందనే ఆరోపణలపై భారత ప్రభుత్వంలోని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ, సమాచార కమిషనర్లను మేం సంప్రదించాం. అయితే, ఈ వార్త రాసే సమయానికి మాకు ఎలాంటి స్పందనా రాలేదు.

అయితే, ఈ చట్టాన్ని ఎలా నీరుగారుస్తున్నారనే ప్రశ్నపై క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఏం చేస్తున్నారు?

గుజరాత్‌లో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇనీషియేటివ్‌లో పంక్తి జోగ్ పనిచేస్తున్నారు. ''ఆర్‌టీఐ చట్టాన్ని ప్రభుత్వం, సమాచార కమిషనర్లు పటిష్ఠం చేస్తారని అంతా భావించారు. కానీ, ఇప్పుడు అలా జరగడం లేదు''అని ఆమె అన్నారు.

''ఈ చట్టం ప్రయోజనాలు.. సామాన్యులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చట్టంలో పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోంది. ప్రజలు, అధికారులకు శిక్షణ ఇవ్వాలని చట్టంలో చెప్పారు. కానీ, అసలు దీన్ని ఎక్కడా అనుసరించట్లేదు''అని ఆమె వివరించారు.

మరోవైపు ఈ చట్టాన్ని ప్రభుత్వం, అధికారులు, రాజకీయ నాయకులు, న్యాయ వ్యవస్థ కలిసి నీరు గార్చాయనే వాదనను అంజలి భరద్వాజ్ కూడా సమర్థించారు.

''ప్రభుత్వం, అధికారులకు ఈ చట్టం కొన్ని బాధ్యతలు అప్పగించింది. కానీ, ఇటు ప్రభుత్వం, అటు అధికారులు ఎప్పుడూ పారదర్శకత అనేదే పాటించడం లేదు. అందుకే ఈ చట్టంపై ప్రతికూల ప్రభావం పడుతోంది''అని ఆమె అన్నారు.

సమాచార హక్కు

ఫొటో సోర్స్, RTI.GOV.IN

50 మందికిపైగా మృతి

సమాచార హక్కు చట్ట ఉద్యమకారులపై వరుస దాడులు జరుగుతున్నాయని అంజలి ఆందోళన వ్యక్తం చేశారు.

''ఇప్పటివరకు 50 మందికిపైగా సమాచార హక్కు చట్టం ఉద్యమకారులు మరణించారు. ఇటీవల కాలంలో ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయి''అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వాదనతో పంక్తి కూడా ఏకీభవించారు.

''ఆర్‌టీఐ ఉద్యమకారులకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. చాలా కేసుల్లో బాధితులకు న్యాయం కూడా జరగడం లేదు. అందుకే చాలా మంది సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు''అని పంక్తి అన్నారు.

మరోవైపు ఎక్కువ దరఖాస్తులు పెట్టే వారిని సమాచార కమిషనర్లు, అధికారులు బ్లాక్ లిస్టులో పెడుతున్నారని ఆమె చెప్పారు.

ఈ చట్టాన్ని ఎక్కువ మంది ఉపయోగించాలని ప్రభుత్వం లేదా సమాచార కమిషనర్లు భావించడంలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

పార్లమెంటు

ఫొటో సోర్స్, Getty Images

''ఇక్కడ వ్యక్తులను బ్లాక్ లిస్టు చేయాలనే నిబంధనేదీ లేదు. కానీ, కొంతమందిని ఈ చట్టం ఉపయోగించకుండా బ్లాక్ లిస్టులతో అడ్డుకుంటున్నారు. ప్రజలకు సమాచారం ఇవ్వడానికి బదులుగా.. అసలు సమాచారం బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు''అని ఆమె వివరించారు.

''కొన్నిరకాల సమాచారాన్ని ఇవ్వకూడదనే నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారు. ఇది సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే''అని పంక్తి అన్నారు.

సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా శైలేశ్ గాంధీ పనిచేశారు. ఈ చట్టం నీరుగారిపోవడానికి మూడు వ్యవస్థలు కారణమని ఆయన చెప్పారు.

సమాచార కమిషన్, ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ఈ చట్టాన్ని నీరు గారుస్తోందని ఆయన అన్నారు.

''ప్రజల హక్కును పరిరక్షించే బాధ్యతను కమిషన్‌కు అప్పగించారు. కానీ, నిబంధనలను వక్రీకరించి ఈ చట్టాన్ని కమిషనే నీరు గారుస్తోంది. మరోవైపు సమాచార కమిషనర్లను సకాలంలో నియమించకుండా ప్రభుత్వం కూడా అలసత్వం ప్రదర్శిస్తోంది. మరోవైపు కమిషన్ జారీచేసిన కొన్ని మంచి ఆదేశాలపై న్యాయవ్యవస్థ నిలుపుదల ఆదేశాలు ఇచ్చింది. దీంతో మొత్తంగా మూడు వ్యవస్థలు కలిసి ఈ చట్టాన్ని నీరు గారుస్తున్నాయి''అని శైలేశ్ అన్నారు.

సమాచార హక్కు చట్టం

2014 తర్వాత ఏం మారింది?

ముందు రూపొందించిన చట్టంలో కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు.

కానీ, జులై 2019లో సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 13, 16లను కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సవరించింది. దీనిలో సమాచార కమిషనర్ల పదవీ కాలాన్ని నిర్ణయించే బాధ్యతలు తమకు కట్టబెట్టుకుంది. మరోవైపు కమిషనర్ల జీతాలు, సర్వీస్ కండిషన్లపై కూడా తుది నిర్ణయం తమకే అప్పగించుకుంది. ఇదివరకు ఇవన్నీ చట్ట ప్రకారం నిర్దేశించేవారు.

సమాచార కమిషనర్ల స్వతంత్రతకే ఈ మార్పులు ముప్పు తెస్తాయని నిపుణులు విమర్శిస్తున్నారు.

ఆర్‌టీఐను పూర్తిగా జబ్బుపడిన చట్టంగా మార్చేశారని కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, సమాచార హక్కు: గుజరాత్‌లో 13 మందిని చంపేశారు

అంతకుముందు నుంచే..

''2014కు ముందు నుంచే ఈ చట్టంపై ప్రజలతో సందప్రదింపులు, శిక్షణను కేంద్ర సమాచార కమిషన్ పక్కన పెట్టేసింది. ఇప్పుడు ప్రజల సమస్యలను చర్చించేందుకు ఎలాంటి వేదికా లేదు. ఇదివరకు సమాచార హక్కు ఉద్యమకారులతో ఉన్నతాధికారులు మాట్లాడేవారు. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రధాని మోదీ కూడా తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటివేమీ లేదు''అని పంక్తి చెప్పారు.

''ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ కూడా పనిచేయడం లేదు. సమాచారం తీసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను వినేందుకు ఎలాంటి సదుపాయమూ లేదు. ఏకపక్షంగానే అన్ని చర్యలూ తీసుకుంటున్నారు''అని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్, పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా: ప్రొఫెసర్ హరగోపాల్

''2014 తర్వాత కూడా చాలా నెలల వరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీలు అలానే ఉండేవి. కోర్టుకు వెళ్లిన తర్వాతే ఈ ఖాళీలను భర్తీ చేశారు. దీనిబట్టి ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు''అని ఆమె అన్నారు.

అయితే, సమాచార హక్కు చట్టం పతనం 2010-11 నుంచే మొదలైందని శైలేశ్ గాంధీ అన్నారు. ''అప్పటి నుంచే వరుస సవరణలు మొదలుపెట్టారు. క్రమంగా దీన్ని నీరుగారుస్తూ వచ్చారు. ఎందుకంటే పారదర్శకంగా ఉండటం ఎవరికీ ఇష్టముండదు కదా. 2019నాటి సవరణలు చావు దెబ్బగా నేనేమీ భావించడం లేదు''అని ఆయన వివరించారు.

అయితే, ఈ చట్టాన్ని పటిష్ఠం చేసేందుకు తాము కృషి చేస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. చాలా ప్రభుత్వాలు తమకు తాముగానే వెబ్‌సైట్లలో డేటా పెడుతున్నాయని చెబుతున్నాయి. అయితే, ఇప్పటికీ చాలా విభాగాల్లో సమాచారం కోసం నెలల నుంచి ఏళ్ల వరకు ఎదురుచూడాల్సి వస్తోంది. దీని ప్రకారం ప్రభుత్వాలు చెప్పే మాటల్లో నిజంలేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)