ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌‌ సుప్రీం కోర్టు తీర్పును అర్థం చేసుకోలేరా... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఆగ్రహం

ఏపీ హైకోర్టు

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN

ఫొటో క్యాప్షన్, ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌లో జ‌రిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పని తీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ జ‌ర‌గ‌లేద‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొత్త నోటిఫికేష‌న్ ప్ర‌కారం మళ్లీ ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని తీర్పు చెప్పింది.

ఈ ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను స‌వాల్ చేస్తూ టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కోర్టును ఆశ్ర‌యించాయి. మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్‌ను అనుసరించకుండా ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని ప్ర‌తిప‌క్ష‌ల తరఫు న్యాయవాదులు వాదించారు.

అయితే, ఈ తీర్పుపై ఏపీ ప్ర‌భుత్వం డివిజ‌న్ బెంచ్‌లో కానీ, సుప్రీం కోర్టులో కానీ స‌వాల్ చేసే యోచ‌న‌లో ఉంది.

ఓటరు

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికల కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం

జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పులో హైకోర్టు ఏపీ ఎన్నికల కమిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టు తీర్పును తమకు కావలసినట్లుగా అన్వయించుకున్నారని తప్పు పట్టింది. సుప్రీం కోర్టు తీర్పును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చదివి, అవగాహన చేసుకోవడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది.

నోటిఫికేషన్ తరువాత ఎన్నికలకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పులో స్పష్టంగా ఉందని, చదవటం, రాయటం తెలిసి ఇంగ్లీష్ భాషపై కొద్దిపాటి అవగాహన ఉన్న సామాన్యుడికి కూడా సుప్రీం కోర్టు తీర్పు అర్థమవుతుందని చెప్పిన హైకోర్టు గతంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పని చేసిన అధికారి దాన్ని సరైన దృక్పధంలో అర్థం చేసుకోకపోవటం ఆశ్చర్యాన్ని కల్గించిందని పేర్కొంది.

ఇటువంటి తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆమె అర్హతపై ఆలోచించాల్సి వస్తుందని కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా వ్యాఖ్యానించింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారని, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఏప్రిల్ 1న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి 10న కౌంటింగ్ ఎలా జరుపుతారని ప్రశ్నించింది. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమని, ఇటువంటి చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు పడిపోతాయని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది.

ఏప్రిల్ 1 నుంచి ఎన్నో మలుపులు

ఈ ఏడాది ఏప్రిల్ 1న రాష్ట్ర ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ 8న ఎన్నికల నిర్వహించింది. షెడ్యూల్ ప్రకారం 10న ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండేది.

అయితే, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నోటిఫికేషన్, పోలింగ్ తేదీల మధ్య కనీసం నాలుగు వారాల సమయం ఉండాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బీజేపీ, జనసేన నేతలు మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు.

ఆ కేసులను విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశించింది.

దానిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయడంతో డివిజన్ బెంచ్ పోలింగ్‌కు అనుమతి ఇస్తూ ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని సూచించింది.

అనంతరం పలుమార్లు విచారణ జరిగింది.

విచారణ అనంతరం ఈ రోజు ఇచ్చిన తుది తీర్పులో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)