పెట్రోల్, డీజిల్ ఆదా చేసే ట్రిక్స్‌లో అపోహలు, 5 వాస్తవాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టామ్ ఎడ్జ్‌టన్
- హోదా, బీబీసీ న్యూస్
పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న ఈ రోజుల్లో వాహనాలు తీసుకుని దూర ప్రాంతాలకు వెళ్ళి రావడం అన్నది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. చాలా దేశాల్లో ఇప్పుడు ఇంధన ధరలు కొత్త రికార్డులకు చేరుకున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఇంధనాన్ని ఆదా చేసే మార్గాలు వెతకడం అనివార్యంగా మారింది. అయితే, కారు నడుపుతున్నప్పుడు పెట్రోలు లేదా డీజిల్ ఆదా చేసే ట్రిక్స్‌లో కొన్ని నిజాలు, మరికొన్ని అపోహలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.
1. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఇంధనం ఆదా అవుతుందా?
ఇంధనాన్ని పూర్తి స్థాయిలో సమర్థంగా వినియోగించడానికి గంటకు 90 కిలోమీటర్ల వేగం అనే సూత్రాన్ని చాలా మంది డ్రైవర్లు చెబుతుంటారు. అయితే, ఆర్ఏసీ ఆటోమోటివ్ గ్రూప్ మార్గదర్శకాల ప్రకారం ఇంధనం ఆదా చేయడానికి అలాంటి నియమాలేమీ లేవు.
ఇది ఇంధన సామర్థ్యాలకు సంబంధించిన పాత పరీక్షల వల్ల ప్రచారంలోకి వచ్చిన అపోహ. ఆ రోజుల్లో కారును సిటీలో, గంటకు 90 కి.మీ, 120 కిలోమీటర్ల వేగంతో నడిపి చేసిన పరీక్షలతో అలాంటి అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ మూడు వేగాల్లో అప్పట్లో గంటకు 90 కిలోమీటర్ల వేగం మేలైనదని వారు భావించారు. కానీ, ఇప్పుడు కొత్తగా వస్తున్న రకరకాల సామర్థ్యాలతో కూడిన కార్లను పరిగణనలోకి తీసుకుని చూస్తే గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల ఇంధనం ఆదా అవుతుందని ఆర్ఏసీ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
2. ఏసీ ఆఫ్ చేయాలా?
మంచి ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు ఏసీ వాడకుండా కారు నడపాలని మీరు అనుకున్నారా? అయితే, మీరు ఇంధనం ఆదా చేసే విషయంలో సరైన నిర్ణయమే తీసుకున్నారు.
కారు ఏసీ ఆన్ చేయడం వల్ల పెట్రోలు లేదా డీజిల్ వినియోగం 10 శాతం పెరుగుతుందని ఆటోమొబైల్ అసోసియేషన్ (ఏఏ) చెబుతోంది. చిన్న చిన్న ట్రిప్పుల్లో ఈ తేడా మరింత ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే, కారు ఎక్కి స్టార్ట్ చేసిన ప్రతిసారీ లోపలి ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఏసీ మిషన్ ఎక్కువ ఇంధనాన్ని వాడుతుంది.
అలాంటప్పుడు కిటికీలు తెరవడం మంచిదే. కానీ, దాని వల్ల మరో సమస్య ఉంది. కిటికీ అద్దాలు దించినప్పుడు గాలి కారు లోపలికి చొరబడడం వల్ల ఇంజన్ మీద భారం ఎక్కువగా పడుతుంది. మరి కిటికీ అద్దాలు దించాలా వద్దా? ఈ విషయం కారు వేగం మీద ఆధారపడి ఉంటుంది. మీరు గంటకు 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో వెళ్తున్నట్లయితే కారు కిటికీ అద్దాలు మూయడమే మంచిది. ఆ వేగంలో గాలి వల్ల లోపల కలిగే ఒత్తిడి, తద్వారా ఇంజన్ మీద పడే భారం ఎక్కువవుతుంది.
3. న్యూట్రల్ మోడ్‌లో బండి పోనిస్తే ఇంధనం ఆదా అవుతుందా?
బండి గేర్లో లేకుండా, క్లచ్ తొక్కకుండా పోనివ్వడం సరైన పని కాదని ఆటోమొబైల్ అసోసియేషన్ చెబుతోంది. ఆ స్థితిలో మీరు కారును అదుపు చేయలేరు కాబట్టి అది ప్రమాదకరం. పైగా దాని వల్ల ఇంధనం ఆదా అయ్యే అవకాశం కూడా లేదు.
ఇప్పుడు అందుబాటులో ఉన్న చాలా కార్లకు ఎలక్ట్రిక్ కంట్రోల్స్ ఉన్నాయి. మీరు యాక్సిలరేటర్ మీంచి కారు తీసినప్పుడల్లా అవి ఇంధన సరఫరాను నిలిపేస్తాయి. కాబట్టి, న్యూట్రల్ మోడ్‌లో నడపడం వల్ల లాభమేమీ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
4. క్రూజ్ కంట్రోల్ వల్ల ఇంధనం ఆదా అవుతుందా?
యాక్సిలేటర్ తొక్కకుండా నియమిత వేగంలో కారును నడపడానికి క్రూజ్ కంట్రోల్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది కచ్చితంగా ఇంధనాన్ని ఆదా చేస్తుంది. యాక్సిలరేషన్ అకారణంగా వేగం పెంచడం, మళ్లీ బ్రేక్ వేయడం వంటివి ఉండవు కాబట్టి దీని వల్ల ఇంధనాన్ని గరిష్టంగా వినియోగించుకోవడం సాధ్యమవుతుంది.
అయితే, ఇది వీశాలంగా ఉండే హైవేలలో మాత్రమ సాధ్యం. కానీ, కొండ ప్రాంతాలలో వెళ్తున్నప్పుడు క్రూజ్ కంట్రోల్స్‌ను అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. క్రూజ్ కంట్రోల్‌కు రోడ్డు ఎత్తుగా ఉందని తెలియదు కాబట్టి అది ఎక్కువ పవర్ తీసుకుంటుంది. ఫలితంగా ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
5. టైర్ ప్రెషర్ తక్కువగా ఉంటే ఎక్కువ ఇంధనం ఖర్చవుతుందా?
టైర్లలో గాలి తగినంతగా లేకపోతే ఎక్కువ పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చవుతుంది. కారు మాన్యువల్‌లో సూచించిన విధంగా టైర్లలో గాలి ఉండేలా చూసుకోవాలి. కారులో బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రెషర్ గరిష్ట స్థాయిలో ఉంచుకోవచ్చు.
ఏది ఏమైనా, కారు లోడ్ పెరిగినప్పుడు ఇంధన వినియోగం పెరుగుతుంది. కాబట్టి, అనవసరమైన బరువులు ఏమైనా ఉంటే వాహనంలోంచి తీసేయండి.
ఇవి కూడా చదవండి:
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- Viagra: మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే ‘వయాగ్రా’ను తయారుచేయడం ఎందుకంత కష్టం?
- కాథలిక్కుల్లో కులం సంగతేంటి? ఒక దళితుడు కార్డినల్ కావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?
- ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














