Viagra: మహిళలు వాడే వయాగ్రాను తయారు చేయడం సాధ్యం కాదా?

వయాగ్రా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కమిల్లా వెర్సాస్ మోటా
    • హోదా, బీబీసీ ముండో

వయాగ్రా 1998లో మార్కెట్‌లోకి వస్తూనే సూపర్‌హిట్ అయ్యింది.

వేరే ఔషధాన్ని అభివృద్ధి చేస్తుండగా అనుకోకుండా వయాగ్రాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ‘‘బ్లూ పిల్’’గా పిలిచే ఈ మాత్ర ఫార్మా సంస్థ ఫైజర్‌కు లాభాల పంట పండించింది.

మొదటి మూడు నెలల్లోనే 400 మిలియన్ డాలర్లు (రూ.3,108.74 కోట్లు)ను అమెరికన్లు దీనిపై ఖర్చుపెట్టినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

పురుషుల అంగ స్తంభనం(ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్) సమస్యకు ఈ మాత్రతో కొంతవరకు పరిష్కారం లభించినట్లయింది. మహిళలకు కూడా ఇలాంటి ఔషధాన్ని అభివృద్ధిచేసే ప్రయత్నాలు కూడా అప్పుడే మొదలయ్యాయి.

‘‘వయాగ్రాను కనిపెట్టినప్పుడే సెక్సువల్ సైకాలజీపై నేను అధ్యయనం మొదలుపెట్టాను. అప్పట్లో సెక్సాలజీ రీసెర్చ్‌పై చాలా నిధులు వెచ్చించేవారు’’అని లాస్ ఏంజెలిస్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ రీసెర్చర్, న్యూరో సైంటిస్ట్ నికోల్ ప్రాస్ చెప్పారు.

అయితే, 25ఏళ్లు గడిచినప్పటికీ, మహిళలకు ‘‘బ్లూ పిల్’’ తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రం సఫలం కాలేదు.

మహిళల వయాగ్రా ప్రయత్నాలు విఫలం కావడంతో మహిళల సెక్సువాలిటీపై కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా వారి కోరికల వెనుకున్న అపోహలు, అపార్థాలపై నిపుణులు మాట్లాడటం మొదలుపెట్టారు.

వయాగ్రా

ఫొటో సోర్స్, Pfizer

పింక్ పిల్ కోసం..

పురుషుల వయాగ్రా చరిత్ర గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.

‘‘ఆంజైనాగా పిలిచే ఒక హృద్రోగానికి ఔషధం కోసం మేం ప్రయత్నిస్తుండగా వయాగ్రాను కనిపెట్టాం’’అని బ్రిటన్‌లోని ఫైజర్ పరిశోధనా విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ మిత్ర బూలెల్ చెప్పారు.

‘‘ఆనాడు క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నవారిలో సాధారణం కంటే ఎక్కువగా జననాంగం ఉద్రేకం కావడాన్ని గమనించాం. మొదట్లో దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. ఎందుకంటే వాటిలో పాల్గొన్నవారంతా యువకులే’’అని ఆయన వివరించారు.

అయితే, పురుషాంగంలోని కార్పస్ కెవెర్నోసమ్‌గా పిలిచే కణజాలంలో రక్త సరఫరాను పీడీఈ5 ఔషధం పెంచుతోందని అమెరికా శాస్త్రవేత్తలు ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించడంతో ఈ పరిశోధన మరింత ముందుకు వెళ్లింది.

‘‘అది నిజమో కాదో ధ్రువీకరించేందుకు పరిశోధన చేపట్టాలని మా పైఅధికారులు మాకు సూచించారు’’అని బూలెల్ చెప్పారు.

వయాగ్రా

ఫొటో సోర్స్, Getty Images

ఆ తర్వాత చేపట్టిన పరిశోధనల్లో వయాగ్రాతో జననాంగంలో రక్త సరఫరా పెరుగుతోందని, ఎక్కువసేపు ఉద్రేకంతో ఉండటానికీ ఇది తోడ్పుడుతోందని రుజువైంది.

ఇదే తరహాలో మహిళల జననాంగానికి రక్తాన్ని ఎక్కువగా సరఫరాచేసే ఔషధాల అభివృద్ధిపై మొదట ఫార్మా సంస్థలు ప్రయత్నించాయి.

‘‘మానవ పిండం అభివృద్ధి తొలి దశల్లో ఏర్పడే కణజాలంతోనే పురుషులు, మహిళల జననేంద్రియాలు రూపుదిద్దుకుంటాయి’’అని బూలెల్ చెప్పారు.

‘‘అయితే, హార్మోన్లతో ఈ కణజాలం ప్రభావితం అవుతుంది. కానీ, ఇవి అభివృద్ధి అయ్యేందుకు కారణమైన మూలకణాలు మాత్రం పిండం దశలో ఉండే కణాలే. ఫోస్పోడైఎస్టెరేస్‌ టైప్ 5 (పీడీఈ5)గా పిలిచే ఎంజైమ్ ఈ జననాంగాల్లో కనిపిస్తుంది. దీన్ని లక్ష్యంగా చేసుకునే పురుషుల్లో వయాగ్రా పనిచేస్తోంది. మహిళల్లోనూ దీన్ని లక్ష్యంగా చేసుకుని ఔషధాలను తయారుచేస్తే ఫలితం ఉంటుందని అనుకున్నాం’’అని ఆయన చెప్పారు.

కానీ, అలా జరగలేదు.

వయాగ్రాతో మహిళల జననాంగానికి రక్త సరఫరా మెరుగు పడుతోందని పరిశోధకులు గుర్తించారు. అయితే, ఇది తీసుకున్న వారికి, తీసుకోని వారికి మధ్య కోరికల్లో ఎలాంటి తేడా ఉండటంలేదని పరిశోధనల్లో వెల్లడైంది.

వయాగ్రా

ఫొటో సోర్స్, Getty Images

మహిళ వయాగ్రా కోసం ఇతర ఫార్మా సంస్థలు చేసిన ప్రయత్నాల్లోనూ ఇలాంటి సమస్యలే ఎదురయ్యారు. మరోవైపు రక్త ప్రసరణకు, లైంగిక సంతృప్తికి మధ్య సంబంధంపై పరిశోధనలు కూడా మొదలయ్యాయి.

అమెరికాలో అలా ఫిమేల్ వయాగ్రా ప్రాజెక్టులపై పనిచేసిన వారిలో న్యూరో సైంటిస్ట్ నికోల్ ఒకరు.

శృంగారంలో పాల్గొనేటప్పుడు మహిళల జననేంద్రియాలకు రక్త సరఫరా పెరుగుతుంది. ముఖ్యంగా కోరికలు పెరిగినప్పుడు యోని గోడలు, క్లిటోరిస్‌లకు రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. దీన్నే వ్యాసోకాగ్నిషన్‌గా పిలుస్తారు.

అయితే, ఇలా జరుగుతోందని చాలా మంది మహిళలకు తెలియదు. ‘‘మేం ఏళ్లుగా దీనిపై పరిశోధన చేపట్టాం. అయితే, వ్యాసోకాగ్నిషన్‌ లాంటి ప్రక్రియలు తమ శరీరంలో జరుగుతున్నాయని మహిళలు గుర్తించలేకపోతున్నారు’’అని నికోల్ చెప్పారు.

‘‘ఈ రక్త ప్రసరణను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధిచేసే ఔషధాలతో పెద్దగా ఉపయోగం ఉండదని అప్పుడు మాకు అవగాహన వచ్చింది’’అని నికోల్ వివరించారు.

మహిళల సెక్స్ సమస్యల్లో చాలావరకు జననాంగాలకు రక్త ప్రసరణతో సంబంధంలేనివే ఉంటాయని కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ గైనకాలజీ ప్రొఫెసర్ లోరీ బ్రోటో చెప్పారు.

ఎక్కువ సమస్యలకు సెక్స్ కోరికలు తగ్గిపోవడం లేదా పూర్తిగా లేకపోవడమే కారణం.

వయాగ్రా

ఫొటో సోర్స్, Getty Images

పురుషుల్లో ఎలా

పురుషుల్లో సెక్స్ కోరికలకు వయాగ్రాకు బలమైన సంబంధం ఉంటోంది. జననాంగం ఉద్రేకం కావాలంటే మెదడులోని కొన్ని భాగాలు క్రియాశీలం కావాలి. అయితే, మహిళల్లో ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది.

‘‘ఈ విషయం తెలిసినప్పటికీ మహిళల్లో రక్త ప్రసరణే లక్ష్యంగా చాలా ఫార్మా సంస్థలు ముందుకు వెళ్తున్నాయి. చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ, వాణిజ్యపరమైన లాభాలపై ఆశతో ముందుకు అడుగులు వేస్తున్నాయి’’అని కరోల్ చెప్పారు.

‘‘ఇది పనిచేయదని మేం చెప్పినప్పటికీ, వారు వినిపించుకోవడం లేదు’’అని కరోల్ అన్నారు. మహిళల వయాగ్రా ప్రాజెక్టుపై 2000లో కిన్స్ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు కరోల్ పనిచేశారు.

వయాగ్రా

ఫొటో సోర్స్, Getty Images

మహిళలపై సమగ్ర అధ్యయనం జరగాలి..

ఈ విషయంలో మహిళ శరీరంపై సమగ్ర అధ్యయనం జరగాల్సిన అవసరముందని బూలెల్ అన్నారు.

2004లో మహిళల వయాగ్రా ప్రాజెక్టును పక్కన పెట్టేస్తున్నట్లు ఫైజర్ వెల్లడించింది. ఆ సమయంలో ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు.

‘‘లైంగికంగా ఉద్రేకమైనప్పుడు మెదడులోని భాగాలు, జననాంగాలకు మధ్య సంబంధం కనపడలేదు. కానీ, పురుషుల విషయంలో ఇలా జరగలేదు. పురుషులు అయితే, నగ్నంగా ఉండే మహిళల ఫోటోలు చూసిన వెంటనే ఉద్రేకులవుతున్నారు. కానీ, మహిళల విషయంలో ఇది చాలా అంశాలపై ఆధారపడుతోంది’’అని ఆమె చెప్పారు.

ఈ ప్రయత్నాలు విఫలం కావడంతో ఫార్మా సంస్థలు తమ నిధులను వేరే పరిశోధనలపైకి మళ్లించాయి.

అయితే, ప్రస్తుతం మహిళ భావప్రాప్తి తదితర అంశాలపై చాలా కొన్ని సంస్థలు మాత్రమే పరిశోధనలు కొనసాగిస్తున్నాయని కరోల్ వివరించారు.

‘‘మహిళ లైంగిక వాంఛల విషయంలో చాలా అపోహలు, సందేహాలు ఉన్నాయి’’అని ఆమె అన్నారు.

వయాగ్రా

ఫొటో సోర్స్, Getty Images

కొత్త ప్రయత్నాలు..

రెండు దశాబ్దాల తర్వాత ఒక ఫార్మా సంస్థ ఇప్పటికీ ఫిమేల్ వయాగ్రాపై పరిశోధన చేపడుతోంది. అయితే, ఇప్పుడు మెదడును లక్ష్యంగా చేసుకుంటున్నారు.

2015లో ఫ్లిబాన్‌సెరిన్ పేరుతో ఫార్మా సంస్థ స్పౌట్ ఒక ఔషధాన్ని అభివృద్ధి చేసింది. కుంగుబాటు లక్షణాలను నివారించే ఈ ఔషధం డోపమైన్, సెరొటోనిన్ లాంటి హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా ఇది మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే అవకాశముందని పరిశోధకులు చెప్పారు.

అయితే, ఈ ఔషధంపై ఆరోగ్య నిపుణులు మిశ్రమంగా స్పందించారు.

మొదట దీని ప్రభావం చాలా తక్కువని నిపుణులు తేల్చారు. మిగతావారితో పోల్చినప్పుడు ఈ ఔషధాన్ని తీసుకున్నవారిలో నెలలో కేవలం 0.5 నుంచి 1 ఎపిసోడ్‌లలోనే కోరికలు ఎక్కువగా ఉంటున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో రుజువైంది.

ధరతో పోల్చినప్పుడు దీని వల్ల చేకూరే ప్రయోజనాలు చాలా తక్కువగా ఉంటున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఫ్లిబాన్‌సెరిన్‌ను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల తల తిరుగుడు, నీరసం, వికారం లాంటి సమస్యలు కూడా వస్తున్నట్లు కొందరు చెప్పారు. ఆల్కహాల్ తాగేటప్పుడు ఈ ఔషధాన్ని తీసుకోకూడదు.

అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎప్‌డీఏ) ఈ ఔషధాన్ని రెండుసార్లు తిరస్కరించింది.

దీంతో ఈ ఔషధం మార్కెట్‌లోకి రాలేదు. కొన్ని దేశాల్లో మాత్రం దీన్ని అమ్ముతున్నారు. మరోవైపు వైలీసీ పేరుతో మరో ఔషధం కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే, దీని ప్రభావం కూడా చాలా తక్కువని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.

వీడియో క్యాప్షన్, ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా... ఎలా తెలుస్తుంది?

కారణం ఏమిటి?

మహిళల విషయంలో శృంగారంపై మానసికపరమైన అంశాలు బలంగా ప్రభావితం చేయడమే దీనికి కారణం.

‘‘లైంగిక వాంఛ తక్కువగా ఉండటం అనేది పురుషుల కంటే మహిళలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి, ఆత్మన్యూనత తదితర అంశాలు మహిళలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి’’అని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లారి బ్రోటో చెప్పారు.

‘‘టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగితే, వెంటనే పురుషుల్లో లైంగిక వాంఛలు వస్తాయి. కానీ, మహిళల్లో ఇలా జరగదు’’అని ఆమె అన్నారు.

అయితే, మహిళల్లో లైంగిక వాంఛలు పెంచే కొన్ని ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయని ఆమె వివరించారు.

‘‘లైంగికంగా క్రియాశీలమైనప్పుడు శరీరంలో వచ్చే మార్పులపై నేడు మహిళల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా ఏం చేస్తే తమకు కోరికలు పెరుగుతాయో వారు తెలుసుకుంటున్నారు’’అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, మొదటి కలయిక తర్వాత కన్నెపొరకు ఏమవుతుంది, అసలు కన్యత్వంతో దానికి లింకేంటి?

‘‘నెగిటివ్ ఆలోచనలపై మైండ్‌ఫుల్‌నెస్ పనిచేస్తుందని ఇప్పటికే రుజువైంది. మహిళల్లో సెక్స్ సమస్యలకు ఈ నెగిటివ్ ఆలోచనల సమస్య కూడా కారణం’’అని ఆమె వివరించారు.

అయితే, మహిళల సెక్స్ సమస్యలకు పరిష్కారం చూపించే, కోరికలు పెంచే ఔషధాలను అభివృద్ధి చేసే ప్రయత్నాలను చాలా ఫార్మా సంస్థలు పక్కన పెట్టేశాయని కరోల్ చెబుతున్నారు. ‘‘అయితే, చిన్న చిన్న స్టార్టప్‌లో కొన్ని ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి’’అని ఆమె అన్నారు.

మహిళల సెక్స్ సమస్యలకు ఔషధాలు పరిష్కారం చూపగలవా?

‘‘నేడు అన్నింటికీ మాత్రల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. బరువు తగ్గడం నుంచి సెక్స్ సమస్యల వరకు మందుల కోసం చూస్తున్నారు. కానీ, మన శరీరం అద్భుతమైన మెషీన్ అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఒక మాత్రతో మన సమస్యలు తీరిపోతాయనే అపోహ తొలగిపోతుంది’’అని కరోల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)