Prophet Muhammad: అల్లా, మొహమ్మద్‌‌ ప్రవక్తల ఫొటోలు ఎందుకు కనిపించవు? వీరి బొమ్మలను ఖురాన్ నిషేధించిందా?

ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాన్ మెక్‌మెనాస్,
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇస్లాం మతానికి సంబంధించి అల్లా లేదా మొహమ్మద్‌‌ ప్రవక్త ఫొటోలు మనకు ఎక్కడా కనిపించవు. ఇస్లాం మీద ఎలాంటి చర్చ జరిగినా వాటి మీద ఎన్ని వార్తలు రాసినా ఎక్కడా వారి చిత్రాలు కనిపించవు.

మొహమ్మద్‌‌ ప్రవక్త ఫొటో మాత్రమే కాదు ఇతర ప్రవక్తల చిత్రాలను కూడా ఎప్పుడూ చూపించరు. ఇలా ఫొటోలు చూపించడాన్ని విగ్రహారాధన కింద చాలా మంది ముస్లింలు చూస్తారు. ఇస్లాం ప్రకారం విగ్రహారాధన తప్పు కాబట్టి వాళ్లు ఆ పని చేయరు. ఎవరైనా అల్లా లేదా ముహమ్మద్‌ ప్రవక్త చిత్రాలు గీస్తే అది పెద్ద వివాదంగా మారుతుంది.

గతంలో ఫ్రాన్స్‌కు చెందిన చార్లీ హెబ్డో అనే మ్యాగజైన్ మొహమ్మద్‌‌ ప్రవక్త కార్టున్లు వేసింది. అది నాడు పెద్ద దుమారాన్ని రేపింది. జిహాదీలు చార్లీ హెబ్డో సిబ్బందిపై దాడి చేసి కొందరిని చంపేశారు కూడా.

మొహమ్మద్‌‌ ప్రవక్త ఫొటోను ఎందుకు చూపించకూడదు?

ఖురాన్ ప్రకారం బొమ్మలు, ఫొటోలు, చిత్రాలు విగ్రహారాధనను ప్రోత్సహిస్తాయి. చాలా ఇస్లామిక్ దేశాలు ఈ నిబంధనలను పాటిస్తుంటాయి. చారిత్రకంగా చూస్తే రేఖా చిత్రాలు, కాలీగ్రఫి వంటివి మాత్రమే ఇస్లామిక్ ఆర్ట్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. మసీదులు వంటి ఇస్లామిక్ నిర్మాణాలను చూస్తే వాటి గోడల మీద ఎక్కువగా ఇవే ఉంటాయి తప్ప బొమ్మలు కనిపించవు.

మొహమ్మద్‌‌ ప్రవక్త చిత్రాలు గీయడాన్ని నిషేధించే సూక్తులు ఖురాన్‌లో నేరుగా లేవని ఎడిన్‌బరో యూనివర్సిటీలో పని చేస్తున్న ప్రొఫెసర్ మోన సిద్దిఖీ తెలిపారు. కాకపోతే మొహమ్మద్‌‌ ప్రవక్త చనిపోయిన తరువాత ఆయన జీవితానికి సంబంధించిన కథలు, హదీసుల ద్వారా ఆయన చిత్రాలను గీయకూడదనే ఆలోచన వచ్చినట్లు ఆమె వివరించారు.

ముస్లిం ప్రార్థన

ఫొటో సోర్స్, DINUKA LIYANAWATTE

‘అల్లాను పోలింది ఏదీ లేదు’

అల్లా లేదా మొహమ్మద్‌‌ ప్రవక్తల మీద చిత్రాలు గీయడం, పెయింట్స్ వేయడం, బొమ్మలు చెక్కడం వంటి వాటి మీద ఖురాన్‌లో ఎక్కడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అలాగే వాటిని నిషేధించలేదు. కానీ అల్లాను పోలింది ఏదీ లేదని ఖురాన్ చెబుతోంది.

‘భూమి, ఆకాశాల సృష్టికి అల్లానే మూలాధారం...

ఈ విశ్వంలో ఆయనను పోలింది ఏదీ లేదు.’

- అష్ షూరా(42:11)

ఖురాన్‌లోని ఈ సూక్తి ఆధారంగా ముస్లింలు అల్లాకు ఒక రూపమంటూ ఇవ్వడం లేదు. అల్లా అందం, శోభను గీయడం మనిషి చేతులకు సాధ్యం కాదనేది వారి నమ్మకం. ఎవరైనా బొమ్మ గీయాలని ప్రయత్నిస్తే దాన్ని అల్లాకు జరిగిన అవమానంగా ముస్లింలు భావిస్తారు.

మొహమ్మద్‌‌ ప్రవక్త విషయంలోనూ ఇదే సూత్రాన్ని వారు పాటిస్తున్నారు. ఖురాన్ ప్రకారం బొమ్మలు, విగ్రహాలు పూజిస్తున్న వారిని ఇబ్రహీం ప్రవక్త దారితప్పిన వారిగా చెబుతున్నారు.

అల్ అంబియా సూరాలోని 52-54 వరకు ఉన్న ఆయత్‌లు పరిశీలిస్తే విగ్రహారాధన గురించి ఖురాన్ ఏం చెబుతోందో అర్థమవుతుంది.

  • 52. తన తండ్రిని, తన ప్రజలను ఇబ్రహీం ఇలా అడిగారు: ‘మీరు భక్తితో ఆరాధిస్తున్న ఈ విగ్రహాలు ఏమిటి?’
  • 53. వారు ఇలా చెప్పారు:‘మా తండ్రులు వీటిని ఆరాధిస్తుండగా మేం చూశాం.’
  • 54. ఇబ్రహీం ఇలా అన్నారు:‘మీరు, మీ తండ్రులు చాలా స్పష్టంగా దారి తప్పి ఉన్నారు.’

ఖురాన్‌లో చెప్పిన ఈ ఆయత్‌ల ప్రకారం బొమ్మలు, చిత్రాలు విగ్రహారాధనకు దారి తీస్తాయని ముస్లింలు నమ్ముతారు. బొమ్మలు, చిత్రాలు దైవత్వాన్ని ఒక వస్తువుగా మార్చేస్తాయని భావిస్తారు.

ఇస్లామిక్ ఆర్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఒకప్పుడు మొహమ్మద్‌‌ ప్రవక్త బొమ్మలు గీశారా?

ఇస్లామిక్ సంప్రదాయాలు, హదీసులు... మొహమ్మద్‌‌ ప్రవక్త, ఆయన అనుచరులకు సంబంధించిన కథల ప్రకారం అల్లాతోపాటు ప్రవక్తల చిత్రాలను గీయడం నిషేధం.

అంతేకాదు ప్రాణం ఉన్న జీవులను చిత్రించడాన్ని ఇస్లామిక్ సంప్రదాయాలు చాలా వరకు వ్యతిరేకించాయి. ప్రధానంగా మనుషుల విషయంలో కఠినంగా ఉన్నాయి. అందువల్లే ఇస్లామిక్ ఆర్ట్‌లో మనుషులకు చోటు లభించలేదు.

అయితే ఇస్లాంలోని షియా వర్గం ఈ విషయంలో కాస్త ఫ్లెక్సిబుల్‌గా ఉంది. 7వ శతాబ్దం నాటి పర్షియాలో మొహమ్మద్‌‌ ప్రవక్త బొమ్మలను గీశారు.

మొహమ్మద్‌‌ ప్రవక్త బొమ్మలు గీయడాన్ని ఎప్పటి నుంచి పాపంగా చూసే వాళ్లు?

మంగోల్, ఒట్టమన్ సామ్రాజ్యాల కాలంలో ముస్లిం చిత్రకారులు మొహమ్మద్‌‌ ప్రవక్త బొమ్మలు గీశారని ప్రొఫెసర్ మోన సిద్దిఖీ చెప్పుకొచ్చారు.

కొన్ని చిత్రాల్లో మొహమ్మద్‌‌ ప్రవక్త ముఖానికి ముసుగు వేశారు. కానీ అది ఆయనే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

అయితే దీనికి విగ్రహారాధనతో సంబంధం లేదని, ప్రేమతో భక్తితో నాటి ప్రజలు బొమ్మలు గీశారని ప్రొఫెసర్ మోన వివరించారు.

13,14 శతాబ్దాల నాటి మొహమ్మద్‌‌ ప్రవక్త చిత్రాలను గమనిస్తే అవి ఇళ్లలో పెట్టుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని మిచిగాన్ యూనివర్సిటీ ఇస్లామిక్ ఆర్ట్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ క్రిస్టియానా గ్రూబర్ అన్నారు. విగ్రహారాధనను ప్రోత్సహించకుండా ఉండేందుకు ఇలా చేశారని, ధనవంతులు మాత్రమే కొనగలిగినవిగా అవి ఉండేవని ఆమె తెలిపారు.

క్రిస్టియానా గ్రూబర్ చెబుతున్న దాని ప్రకారం...18వ శతాబ్దంలో ప్రింట్ మీడియాకు ఆదరణ పెరుగుతుండటం, కొన్ని ముస్లిం రాజ్యాలను యురోపియన్ రాజ్యాలు ఆక్రమించుకోవడం వంటివి ఇస్లాంకు సవాలుగా నిలిచాయి.

యూరోపియన్లు క్రైస్తవులు. వారి సిద్ధాంతాలు వేరు. క్రిస్టియన్ ఆర్ట్‌కు జీసస్ వంటి మనుషులే ప్రధాన ఆధారం. అందువల్ల క్రైస్తవానికి ఇస్లాం భిన్నమైదని చూపించడంలో భాగంగా మొహమ్మద్‌‌ ప్రవక్త చిత్రాలను పూర్తిగా నిషేధించడం ప్రారంభించారు.

అయితే దీన్ని ఖారీ అసీం అంగీకరించడం లేదు. బ్రిటన్‌లోని లీడ్స్ మక్కా మసీదులో ఆయన ఇమామ్‌గా పని చేస్తున్నారు. ప్రాణమున్న జీవులను చిత్రించకుండా హదీసులు నిషేధిస్తున్నాయి కాబట్టి, ఆటోమేటిక్‌గా మొహమ్మద్‌‌ ప్రవక్తను చిత్రించడం కూడా నిషేధమేనని ఆయన అంటున్నారు.

ఖురాన్

ఫొటో సోర్స్, Getty Images

‘మధ్యయుగంలో మొహమ్మద్‌‌ ప్రవక్త చిత్రాలు గీయడానికి ఒక కారణం ఉంది. నాటి అత్యధిక చిత్రాలు ఒక రాత్రి పూట ప్రవక్త చేసిన ప్రయాణానికి సంబంధించినవి. మొహమ్మద్‌‌ ప్రవక్త స్వర్గానికి చేరుకోవడాన్ని అవి వర్ణించాయి. చిత్రాల్లో గొర్రె లేదా గుర్రాన్ని చూడొచ్చు. ఆయన గుర్రం వంటి జంతువు మీద కూర్చొని ఉన్నారు. సంప్రదాయ పండితులు ఆ చిత్రాలను తీవ్రంగా ఖండించారు. కానీ అవి ఉన్న మాట వాస్తవమే’ అని ఖారీ అసీం చెప్పుకొచ్చారు.

ఆ చిత్రాలు మొహమ్మద్‌‌ ప్రవక్తను వర్ణిస్తూ వేసిన చిత్రాలు మాత్రమే కాదని అసీం అంటున్నారు. చాలా చిత్రాల్లో ప్రధానమైన సబ్జెక్ట్ ఏమిటో స్పష్టంగా లేదని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి మొహమ్మద్‌‌ ప్రవక్తను వర్ణించాలనే ఆ బొమ్మలు వేశారా లేక ప్రవక్తకు దగ్గరగా ఉండే అనుచరుల గురించి చిత్రించారా అనేది కూడా ప్రశ్నార్థకరమేనని అసీం అంటున్నారు.

కానీ మొహమ్మద్‌‌ ప్రవక్త చిత్రణలపై గత రెండు మూడు వందల సంవత్సరాలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఎడిన్‌బరో యూనివర్సిటీలోని ఇస్లామిక్ స్టడీ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ హ్యూ గాడర్డ్ అన్నారు.

‘మొహమ్మద్‌‌ ప్రవక్త చిత్రణలకు సంబంధించి ఖురాన్‌లో కానీ హదీసుల్లో కానీ ఏకాభ్రిపాయం లేదు. దీని మీద ముస్లింల్లోనూ భిన్న అభిప్రాయాలు, వాదనలున్నాయి. సౌదీ అరేబియాలో వహాబిజం ఉద్యమానికి ఆద్యుడైన మహ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్, అల్లాను మాత్రమే పూజించాలని బోధించారు. ప్రవక్తలను సైతం ఆరాధించడాన్ని ఆయన వ్యతిరేకించారు’ అని ప్రొఫెసర్ హ్యూ గాడర్డ్ వెల్లడించారు.

అల్లాను లేదా ప్రవక్తలను విగ్రహాలుగా చెక్కడం లేదా మూర్తులుగా తయారు చేయడం మీద స్పష్టమైన నిషేధం ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.

ప్రాణంతో ఉన్న మనుషులు లేదా జంతువుల చిత్రాలను కూడా ఇంట్లో ఉంచుకునేందుకు నిరాకరించే ముస్లింలు కూడా ఉన్నారని ప్రొఫెసర్ మోన సిద్దిఖీ తెలిపారు.

కొన్ని ముస్లిం దేశాల్లో మొహమ్మద్‌‌ ప్రవక్త చిత్రాలు నేటికీ లభిస్తున్నట్లు గతంలో ఇరాన్‌లో మతబోధకునిగా పని చేసిన హసన్ యూసెఫీ ఎష్కావరీ అన్నారు. ఇరాన్‌లోని చాలా ఇళ్లలో గోడల మీద నేటికీ మొహమ్మద్‌‌ ప్రవక్త చిత్రాలు కనిపిస్తాయని ఆయన బీబీసీతో చెప్పారు.

‘మత పరంగా చూస్తే ఈ చిత్రాల మీద ఎటువంటి నిషేధం లేదు. ఇరాన్‌లోని షాపుల్లోనూ ఇళ్లలోనూ ఆ చిత్రాలు కనిపిస్తాయి. మతపరంగా చూసినా లేక సంప్రదాయంగా చూసినా అక్కడి ప్రజలు వాటిని అవమానంగా భావించరు’ అని హసన్ వివరించారు.

మొహమ్మద్‌‌ ప్రవక్త చిత్రాల విషయంలో సున్నీ, షియాల మధ్య తేడాలున్నాయి. కానీ చారిత్రకంగా తొలి నుంచే మొహమ్మద్‌‌ ప్రవక్త చిత్రాల మీద నిషేధం ఉందనే వాదనలు తప్పు అని ప్రొఫెసర్ క్రిస్టియానా గ్రూబర్ అంటున్నారు.

కానీ ఈ వాదనలను కొందరు ముస్లింలు అంగీకరించడం లేదు.

‘చిత్రాల గురించి ఖురాన్ ఏమీ చెప్పలేదు. కానీ మొహమ్మద్‌‌ ప్రవక్తతోపాటు అందరి ప్రవక్తల చిత్రాలను గీయడం కానీ వాటిని ప్రింట్ చేయడం కానీ చేయకూడదని ఇస్లామిక్ సంస్థలన్నీ అంగీకరిస్తున్నాయి. ఇస్లాం విశ్వాసాల ప్రకారం వారు మచ్చలేని వ్యక్తులు, ఆదర్శవంతులు. కాబట్టి వారికి అగౌరవం కలిగేలా ఏవిధంగాను చిత్రించకూడదు’ అని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ థాట్ మాజీ అధిపతి డాక్టర్ అజామ్ తమీమీ అన్నారు.

మధ్యయుగంలో గీసిన చిత్రాలను చూపించి పూర్తి నిషేధం లేదు అని వాదించడాన్ని అజామ్ ఒప్పుకోవడం లేదు. అలాంటి వాదనలు ఉంటే వాటిని ఇస్లాం పండితులు ఖండించాలని ఆయన కోరుతున్నారు.

వీడియో క్యాప్షన్, కాశీ-జ్ఞాన్‌వాపి వివాదమేంటి? దాని వెనుక ఉన్న చారిత్రక మూలాలేంటి?

వివాదాస్పదమైన మొహమ్మద్‌‌ ప్రవక్త కార్టూన్లు

  • డెన్మార్క్‌కు చెందిన జెలాండ్స్-పోస్టెన్ అనే పత్రిక 2005లో మొహమ్మద్‌‌ ప్రవక్తకు సంబంధించి 12 కార్టూన్లు ప్రచురించడంపై నాడు ఇస్లామిక్ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
  • ఫ్రాన్స్‌లో మొహమ్మద్‌‌ ప్రవక్త కార్టూన్లు వేసినందుకు చార్లీ హెబ్డో మ్యాగజైన్ కార్యాలయం మీద దాడులు జరిగాయి. 2012లో మొహమ్మద్‌‌ ప్రవక్త కార్టూన్లు వేయగా 2015లో ఆ పత్రికకు చెందిన 12 మందిని జిహాదీలు చంపేశారు. 2020లో క్లాసులో మొహమ్మద్‌‌ ప్రవక్త కార్టూన్లు ఉపయోగించి పాఠాలు చెప్పినందుకు శామ్యుల్ పెట్టీ అనే టీచర్‌ను తల నరికేశారు.
  • 2015లో ‘మొహమ్మద్‌‌ ద మెసేంజర్ ఆఫ్ గాడ్’ అనే సినిమాను తీశారు ఇరాన్‌కు చెందిన ఫిలిం డైరెక్టర్ మాజీద్ మాజీది. మొహమ్మద్‌‌ ప్రవక్త జీవితం ఆధారంగా తీసిన ఆ సినిమాలో ఎక్కడా ప్రవక్తను చూపించలేదు. కానీ ఆ సినిమాను ఇరాన్‌లో చాలా మంది మెచ్చుకోగా చాలా సున్నీ దేశాలు వ్యతిరేకించాయి. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

భారతదేశంలో చట్టాలు ఏం చెబుతున్నాయి?

మొహమ్మద్‌‌ ప్రవక్తను చిత్రించడం గురించి భారత్‌లో ప్రత్యేకమైన చట్టాలు ఏమీ లేవు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని మతపరమైన సెక్షన్ల కింద మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తుంటారు.

మాటలు, జోకుల వంటి వాటి ద్వారా ఒక మత విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఐపీసీ సెక్షన్-298 ప్రకారం నేరం. అల్లర్లను సృష్టించాలనే ఉద్దేశంతో చేసే రెచ్చగొట్టే చర్యలను నేరంగా చూస్తోంది ఐపీసీ సెక్షన్-153.

మొహమ్మద్‌‌ ప్రవక్తను అవమానించారని భావిస్తే ఈ రెండు సెక్షన్ల కింద మాత్రమే విచారణ చేపడతారు.

వీడియో క్యాప్షన్, దిల్లీని పాలించిన ఔరంగజేబు సమాధిని మహారాష్ట్రలో ఎందుకు నిర్మించారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)