నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
చర్మ సౌందర్య సాధనాల మార్కెట్‌లో భారతదేశానిది ప్రపంచంలో ఐదో స్థానం. ఇటీవలి సంవత్సరాల్లో ఈ మార్కెట్‌లో బూమ్ కనిపిస్తోంది.
ఆకర్షణీయంగా కనిపించటం కోసం డబ్బులు ఖర్చు చేయటానికి సిద్ధంగా ఉన్న భారీ యువ జనాభాతో పాటు.. దీనిని సానుకూలంగా ఉపయోగించుకోవటానికి రంగంలోకి దిగిన స్టార్టప్ కంపెనీలు ఈ బూమ్‌కి కారణమని నిపుణులు చెప్తున్నారు.
''నా సున్నితమైన, జిడ్డు కారే, మొటిమలు మొలిచే చర్మం మీద ఈ సన్‌స్క్రీన్‌లు అన్నిటినీ నేను వాడాను. ఏదైనాసరే నన్ను అడగండి'' అని r/IndianSkincareAddicts అనే రెడిట్ గ్రూప్‌లో ఒక పాపులర్ పోస్ట్ చెప్తోంది. 2018లో ఏర్పాటైన ఈ గ్రూప్‌లో దాదాపు 45,000 మంది మెంబర్లున్నారు.
ఈ పోస్టుతో పాటు షేర్ చేసిన ఒక ఫొటోలో భారతీయ, పాశ్చాత్య, కొరియా దేశాల బ్రాండ్లకు చెందిన 18 రకాల సన్‌స్క్రీన్ బాటిళ్లు కనిపిస్తున్నాయి.
ఆ పోస్టు కింద ఒక్కో ఉత్పత్తి మీద లోతైన చర్చ సాగింది. ఇండియాలో చాలాగా వేడి ఉండే వేసవులు ఉన్నప్పటికీ భారత వినియోగదారుల ఆలోచనల్లో పదేళ్ల కిందటి వరకూ సన్‌స్క్రీన్లు పెద్దగా నమోదు కాలేదు. అంతలోనే అకస్మాత్తుగా ఈ ఉత్పత్తుల నాణ్యత, పనితీరు, ప్రభావాల గురించి లోతైన చర్చలు విస్తృతంగా సాగుతున్నాయి.
భారత సన్‌స్క్రీన్ మార్కెట్‌లో హిందుస్తాన్ యూనిలీవర్, హిమాలయ వెల్‌నెస్, ఇమామి, నీవియా వంటి దీర్ఘకాలిక బ్రాండ్లు దశాబ్దాలుగా రాజ్యమేలాయి.

ఫొటో సోర్స్, Minimalist
భారత ఆర్థిక వ్యవస్థను విదేశీ సంస్థలకు తెరిచిన 1990ల తర్వాత ఎల్ ఓరియల్ వంటి పాశ్చాత్య బ్రాండ్లు ప్రవేశించాయి. అయితే ఈ క్రీములు, క్లీన్సర్ల మధ్య వాటి ధరలు, ప్యాకేజింగ్, ఆయుర్వేద మూలాలు మినహా పెద్దగా తేడాలు కనిపించవు.
ఇటీవలి కాలంలో దేశీయంగా తయారుచేసిన చర్మ సౌందర్య సాధనాల శ్రేణి ఈ మార్కెట్‌లో కొత్త ఒరవిడిని సృష్టించింది.
2013లో 580 కోట్ల డాలర్లుగా ఉన్న భారత స్కిన్‌కేర్ మార్కెట్ ఈ ఏడాదిలో 765 కోట్ల డాలర్లకు పెరుగుతుందని, 2026 నాటికి ఇది మరో 200 కోట్ల డాలర్ల మేర వృద్ధి చెందుతుందని అంచనా.
''ఈ ఆకస్మిక వృద్ధికి ప్రధాన కారణం నేరుగా వినియోగదారులకు అందేలా, ఈకామర్స్ ద్వారా, ఎక్స్‌ప్రెస్ డెలివరీల ద్వారా ఈ బ్రాండ్లు, ఉత్పత్తులు అందుబాటులో ఉండటం'' అంటారు పలు స్కిన్‌కేర్ బ్రాండ్లను వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంచే సంస్థ హొనస సహ వ్యవస్థాపకుడు వరుణ్ అలగ్.
ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
బాలీవుడ్ నటి అలియా భట్ తన చర్మ రక్షణ జాగ్రత్తల గురించి 2021లో చేసిన ఒక వీడియోలో కొన్ని ఉత్పత్తులను ప్రస్తావించారు. అందులో ఉన్న నియాసినామైడ్ సీరమ్, వాటర్‌మెలన్ బేస్డ్ మాయిస్చరైజర్, కెఫీన్ స్కిన్ డ్రాప్స్ వంటి సదరు ఉత్పత్తులకు సమానమైన ఉత్పత్తులు ఐదేళ్ల కిందట అందుబాటు ధరల్లో ఉండేవి కావు.
ఇప్పుడవి ఒక్క క్లిక్ దూరంలోకి వచ్చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
చర్మ సౌందర్య విప్లవం
ఈ-కామర్స్ వేదిక Nykaa 2012లో విస్తృత శ్రేణి సౌందర్య, చర్మ రక్షణ ఉత్పత్తులను తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతూ ఈ మార్పుకు నాంది పలికింది.
'ఆ సమయంలో స్కిన్‌కేర్, పర్సనల్ కేర్ అనేవి వృద్ధి చెందుతున్న వర్గంగా ఉండేది. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ ఉత్పత్తులకు డిమాండ్, వీటి కొనుగోళ్లు తక్కువగా ఉండేవి' అని Nykaa ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
Nykaa వేగంగా దేశంలోని దాదాపు 95 శాతం పోస్టల్ కోడ్ ప్రాంతాలకు డెలివరీ చేసేలా ఎదిగింది. ఆ తర్వాత కొన్నేళ్లకే 2016లో హొనస సంస్థ Mamaearth మొదలైంది.
ప్రపంచ వ్యాప్తంగా కూడా వినియోగదారులు గతంలో కన్నా తక్కువ వయసు నుంచే తమ చర్మ సౌందర్యం, ఆరోగ్యం గురించి పట్టించుకుండుటంతో స్కిన్‌కేర్ రంగం మార్పు చెందటం మొదలైంది.
అప్పటివరకూ పశ్చిమ దేశాల్లో క్లీన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వరకే పరిమితమైన స్కిన్‌కేర్.. 2016లో వైరల్‌గా మారిన కొరియన్ మల్టీ-స్టెప్ విధానంతో అతలాకుతలమైంది.
ద ఫేస్ షాప్, ఇన్నిస్‌ఫ్రీ వంటి కొరియన్ బ్రాండ్లు మార్కెట్‌లోకి రావటంతో Nykaa అమ్మకాలు 15 శాతం పెరిగాయని 2017లో ఆ కంపెనీ చెప్పింది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే BeautyBarn, Korikart, Limese, Maccaron, Shelc తదితర ఇండియన్ వెబ్‌సైట్లు పుట్టుకొచ్చి మరిన్ని కొరియన్ బ్యూటీ ఉత్పత్తులను వినియోగదారుల ముందుకు తెచ్చాయి.
ఇంటర్నెట్ అంతటా సమాచారం పోటెత్తింది. మీరు వాటర్ బేస్డ్ క్లీన్సర్‌ను వాడాలా లేక ఆయిల్ బేస్డ్ క్లీన్సర్ వాడాలా? హైడ్రేటింగ్ టోనర్ వాడాలా లేక ఎక్స్‌ఫోలియేటింగ్ టోనర్ వాడాలా? ఎసెన్స్ ఉపయోగించాలా లేదంటే సీరమ్ ఉపయోగించాలా? వంటి చర్చలు, విశ్లేషణలు మొదలయ్యాయి.
''మిలీనియల్స్ నేడు చాలా శోధిస్తుంటారు. సొంతంగా నేర్చుకుంటున్నారు'' అని హొసన సంస్థ ప్రతినిధి అలగ్ పేర్కొన్నారు.
ప్రతి చర్మ రకానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు చెప్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు, డెర్మటాలజిస్టుల వీడియోలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.
''18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయసు వారిలో FOMO(fear of missing out) అంటే, వెనుకబడిపోతామనే భయం.. ఇది కూడా ఈ వినియోగంలో తన వంతు పాత్ర పోషిస్తోంది'' అని మధ్యప్రదేశ్‌కు చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ మానసి షిరోలికర్ చెప్తున్నారు.

ఫొటో సోర్స్, Juicy Chemistry
వినియోగదారులు ఆన్‌లైన్‌లో కొత్త ఉత్పత్తులను కోరుకుంటుండటంతో.. వాటిని అందుబాటు ధరల్లో అందించటానికి దేశంలో అనేక కొత్త బ్రాండ్లు పుట్టుకొచ్చాయి.
మినిమలిస్ట్, డాట్ అండ్ కీ, రీక్విల్, కాన్షస్ కెమిస్ట్ వంటి సంస్థలు.. పెద్ద మొటిమలు, రంగుమారిన చర్మం, ముడతలకు సైన్స్ ఆధారిత ఉత్పత్తులను అందిస్తామని హామీ ఇచ్చాయి.
నీమ్లి నాచురల్స్, ఎర్త్ రిథమ్, జ్యూసీ కెమిస్ట్రీ వంటి మరికొన్ని సంస్థలు తమవి ఆర్గానిక్ (ప్రకృతి సహజమైన), క్రూరత్వ రహిత (జీవ హింస లేని) బ్రాండ్లని సహజ మూలికలను ఉపయోగిస్తామని చెప్తున్నాయి.
భారతీయుల చర్మం మీద మొటిమల వంటి ప్రక్రియల తర్వాత నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి అని డాక్టర్ షిరొలికర్ వివరించారు.
చర్మం మీద నల్ల మచ్చలకు విటమిన్ సి, చర్మం వయసు మళ్లకుండా ఉండటానికి రెటినాల్ బాగా పనిచేస్తాయని పరిగణించే ఉత్పత్తులను సామాన్య వినియోగదారులకు ఈ స్టార్టప్‌లు అందుబాటులోకి తెచ్చాయి.
''మొటిమలు, చర్మం మీద మచ్చలు, ముడతలు పడటం అనేవి భారతీయ వినియోగదారుల్లో ఉండే అతి పెద్ద ఆందోళనల్లో కొన్ని'' అని స్కిన్‌కేర్ ఉత్పత్తుల సంస్థ మినిమలిస్ట్ సహ వ్యవస్థాపకుడు మోహిత్ యాదవ్ పేర్కొన్నారు.
స్కిన్ పిగ్మెంటేషన్, మొటిమలకు ఉపయోగించే ఫేస్ సీరమ్‌లు ఈ సంస్థ విక్రయించే ఉత్పత్తుల్లో అత్యంత పాపులర్ ఉత్పత్తులు.
''కానీ సౌందర్యానికి విద్య అవసరం'' అంటారు Nykaa సీఈఓ, వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్. ఆ విద్య విషయంలో భారతీయ వినియోగదారులు చాలా ఆసక్తి చూపుతారు.
సీనియర్ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ 2020లో పోస్ట్ చేసిన ఒక స్కిన్‌కేర్ వీడియోకు రెండు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దాని మీద చేసిన కామెంట్లలో ఎక్కువ భాగం.. మంచి చర్మసౌందర్య కసరత్తుకు అవసరమైన విధివిధానాలను ఆమె ఎంత బాగా వివరించారనేదానిని ప్రశంసిస్తూ చేసినవే.
Nykaa తన వెబ్‌సైట్‌లో ఒక సెక్షన్‌ను స్కిన్‌కేర్ మీద బ్లాగ్స్, వ్యాసాల కోసం కేటాయించింది. ఈ సంస్థకు చెందిన యూట్యూబ్ చానల్‌లో తరచుగా ఇన్ఫ్లుయెసర్ల ఫీచర్లు, ట్యుటోరియళ్లు పోస్టవుతుంటాయి.
''వినియోగదారులు ఏదైనా ఒక ఉత్పత్తిని కొనే ముందు దానిలో ఉన్న పదార్థాలన్నిటి జాబితా, వాటికి సర్టిఫికేషన్లు, ప్రయోగాల వివరాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు'' అని అలగ్ చెప్పారు.
''మా వైద్య శిక్షణలో సోరియాసిస్, విటిలిగొ, లెప్రసీ వంటి అనారోగ్యాల గురించి, వాటికి చికిత్సా పద్ధతుల గురించి మేం ప్రధానంగా దృష్టి పెట్టాం. చర్మ సౌందర్యం, చర్మ రక్షణ కసరత్తులు చాలా తక్కువగా ఉండేవి'' అని డాక్టర్ షిరొలికర్ చెప్పారు.
వినియోగదారుల మీద నిరంతరం వచ్చిపడుతున్న సమాచారాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పటానికి తాను టోనర్, ఎసెన్స్ వంటి పదాలను బాగా తెలుసుకోవాల్సి వచ్చిందని ఆమె అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
వృద్ధికి అవకాశం
ఈ స్టార్టప్‌లు చాలా వరకూ డిజిటల్-ఓన్లీ వ్యాపారాలుగా ప్రారంభమయ్యాయి. అయితే Nykaa ఇప్పుడు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. భారతదేశపు బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్‌లో ఈ సంస్థ వాటా 28.6 శాతంగా ఉంది.
హొనస విలువ 100 కోట్ల డాలర్లుగా ఈ ఏడాది విలువ కట్టారు.
ఈ స్టార్టప్‌ల సక్సెస్‌తో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న బ్రాండ్లు కూడా వీటి బాట పట్టాయి.
పాండ్స్, లోరియల్ పారిస్ సంస్థలు పశ్చిమ దేశాల్లోని తమ ఉత్పత్తులను భారత్‌కు తీసుకొచ్చాయి. లాక్మే, గార్నియర్ సంస్థలు విటమిన్ సి ఉత్పత్తులను ప్రవేశపెట్టాయి.
లాక్మే, లోరియల్ సంస్థలు తమ వెబ్‌సైట్ల మీద ఏఐ వేదికలను ఉపయోగిస్తూ స్కిన్ కన్సల్టేషన్లను కూడా అందిస్తున్నాయి.
డాక్టర్ షిరొలికర్ వంటి డెర్మటాలజిస్టులు, ఈస్థటీషియన్లు వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా కన్సల్టేషన్లు అందిస్తున్నారు.
డాక్టర్ సేథ్స్, డాక్టర్ జమునా పాయ్స్ స్కిన్‌లాబ్ వంటి వారు తమ సొంత ఉత్పత్తుల శ్రేణులను కూడా ప్రారంభించారు.
ఈ డిమాండ్ ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవు.
''పెద్ద నగరాల్లోని వినియోగదారులకు ఎక్కువ అనుభవం, అవగాహన ఉంటాయని అనుకోవటం సులభం. కానీ అది అన్నిసార్లూ నిజం కాదు. మా వ్యాపారంలో సగానికి పైగా ద్వితీయ, తృతీయ శ్రేణి చిన్న నగరాల నుంచే వస్తోంది'' అని యాదవ్ పేర్కొన్నారు.
ఈ మార్కెట్ పెరగటానికి ఇంకా చాలా అవకాశముంది. ''అమెరికాలో చర్మ రక్షణ మీద పెట్టే తలసరి ఖర్చు సుమారు 65 డాలర్లుగా ఉంటే ఇండియాలో అది సుమారు 1 డాలరుగానే ఉంది'' అంటారు యాదవ్.
భారత స్కిన్‌కేర్ పరిశ్రమ ఇప్పుడిక ఆరంభ దశలో లేదని అలగ్ చెప్తున్నారు. ''ఈ రంగం అభివృద్ధి చెందుతున్న వేగంతో మన బ్రాండ్లు, ఉత్పత్తులతో అతి త్వరలో ప్రపంచ మార్కెట్‌లో పోటీపడబోతున్నాం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్ఆర్ఆర్ సినిమాను ‘గే’ చిత్రం అంటున్నారెందుకు
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్: భారత చరిత్రను మలుపు తిప్పిన ఈ వీరుడి కథ నిజమా, కల్పనా?
- Fake Currency notes: నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలా.. ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి
- ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










