ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?

జామా మసీదు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, జామా మసీదు
    • రచయిత, అభినవ్ గోయల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మహమూద్, అయాజ్ ఇద్దరూ ఒకే లైన్‌లో నిలబడ్డారు,

వారిలో ఎవరూ బంటు కాదు, ఎవరూ రాజు కాదు....

ప్రముఖ ఉర్దూ కవి అల్లామా ఇక్బాల్ (1877-1938) పై పద్యాన్ని రాశారు. దీనర్థం ఏంటంటే.... మహమూద్ గజ్‌నవీ (ఏడీ 971-1030), ఆయన బానిస అయాజ్ ఇద్దరూ నమాజ్ చదివేందుకు నిల్చున్నప్పుడు ఇద్దరూ ఒకే వరుసలో నిల్చుంటారు. ఆ సమయంలో ఎవరూ చక్రవర్తి కాదు, ఎవరూ బానిస కాదు.

ఇస్లాంను ఆచరించే వారందరూ సమానులేనని వారిలో ఎవరూ ఎక్కువ కాదు... ఎవరూ తక్కువ కాదు అనే భావనను ఇక్బాల్ ఈ పద్యం ద్వారా చెప్పేందుకు ప్రయత్నించారు.

కానీ, ముస్లిం సమాజం నిజంగానే ఎలాంటి కుల వివక్ష లేకుండా అందరూ సమానులే అనే భావనతోనే ఉందా?

బుధవారం అఖిలపక్ష సమావేశం అనంతరం రాష్ట్రంలో కుల ప్రాతిపదికన జన గణన చేస్తామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై గురువారం మంత్రివర్గం కూడా ఆమోద ముద్ర వేసింది. ఈ తరుణంలో ముస్లింలకు సంబంధించిన ఈ ప్రశ్న తలెత్తుతోంది.

''కుల గణనకు సమయం ఖరారైంది. దీనికి 'కులాల ఆధారిత జన గణన' అని పేరు పెట్టబోతున్నాం. ఇందులో ప్రతీ మతం, కులాలకు చెందిన వారిని లెక్కిస్తాం'' అని నితీశ్ చెప్పారు.

ఈ కుల గణన ఎలా జరుగుతుంది? దాని ప్రమాణాలు ఏంటి? దీన్ని ఎలా లెక్కిస్తారు? అనే విషయాలపై బిహార్ ప్రభుత్వం పెద్దగా సమాచారం ఇవ్వలేదు.

ముస్లింలలో కుల వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ముస్లింల జనాభాను లెక్కించాలని బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. ముస్లింల జన గణనను ఆయన రోహింగ్యా, బంగ్లాదేశ్ ముస్లింలతో ముడిపెట్టారన్నది వేరే విషయం.

బుధవారం ముగిసిన రెండు రోజుల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు గిరిరాజ్ సింగ్, కటిహార్ వెళ్లారు.

ముస్లింలలోని కులాలు, ఉపకులాలను కూడా లెక్కించాలని కటిహార్‌లో విలేఖరులతో మాట్లాడుతూ గిరిరాజ్ సింగ్ అన్నారు. ముస్లింల జన గణన ద్వారా రోహింగ్యాలు, బంగ్లాదేశ్ చొరబాటుదారులను కూడా ప్రభుత్వం గుర్తించాలనేది ఆయన ఉద్దేశం.

ఆయన ముస్లింలలోని కులాల గురించి మాట్లాడిన ఉద్దేశం ఏదైనప్పటికీ, ముస్లింలలో కులాల ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుందన్నది మాత్రం నిజం.

ముస్లింలలో కులం ప్రాతిపదికన ఎలాంటి వివక్ష ఉండదని చాలామంది అనుకుంటారు. అదే సమయంలో, ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయని, అయితే, హిందువులలో ఉన్నంత తీవ్రంగా ముస్లింలలో ఈ కుల విభేదాలు ఉండవని కొంతమంది నమ్ముతారు.

కానీ, అసలు నిజం ఏంటి? ముస్లిం సమాజ నిర్మాణం ఎలా ఉంటుంది? వారి సమాజంలోని అన్ని వర్గాల మధ్య సత్సంబంధాలు ఉంటాయా?

ఈ ప్రశ్నలలో కొన్నింటికి సమాధానాలు కనుగొనే ప్రయత్నం చేశాం. ఈ విషయాలను తెలుసుకునేందుకు ప్రముఖ సామాజికవేత్త, ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సోషియాలజిస్ట్ ప్రొఫెసర్ తన్వీర్ ఫజల్... రాజ్యసభ మాజీ ఎంపీ, పస్మాంద ముస్లిం ఉద్యమ నాయకుడు అలీ అన్వర్ అన్సారీలతో బీబీసీ మాట్లాడింది.

ముస్లింలు

ఫొటో సోర్స్, Reuters

ముస్లింలలో ఎన్ని కులాలు ఉన్నాయి?

భారతీయ ముస్లింలలో ప్రధానంగా మూడు సామాజిక వర్గాలు ఉన్నాయి. అవి 1. అష్రఫ్, 2. అజ్లాఫ్, 3. అర్జల్. ఈ వర్గాల్లో వివిధ కులాలు ఉంటాయి. హిందువులలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులలలో కులాలు ఎలా ఉంటాయో అదే విధంగా అష్రఫ్, అజ్లాఫ్, అర్జల్‌ వర్గాల్లో కూడా కులాలు ఉంటాయి.

అష్రఫ్‌ కుల సమూహంలో సయ్యద్, షేక్, పఠాన్, మీర్జా, మొఘల్ వంటి అగ్రవర్ణాలు ఉంటాయని రాజ్యసభ మాజీ ఎంపీ, పస్మాంద ముస్లిం ఉద్యమ నాయకుడు అలీ అన్వర్ అన్సారీ చెప్పారు. ముస్లిం సమాజంలోని ఈ అగ్రవర్ణ కులాలను ఆయన హిందు మతంలోని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య కులాలతో పోల్చారు.

రెండో వర్గం అజ్లాఫ్. వీటిని మధ్య రకపు కులాలుగా పరిగణిస్తారు. ఈ కులాల వారు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇందులో ముఖ్యంగా అన్సారీ, మన్సూరీ, రాయిన్, ఖురేషీ వంటి అనేక కులాలు ఉంటాయి.

ఖురేషీలు, మాంసం వ్యాపారులు. అన్సారీలు ప్రధానంగా వస్త్రాలు నేసే వృత్తితో సంబంధం కలిగి ఉంటారు. హిందువులలో వీరిని యాదవులు, కుర్మీ వంటి కులాలతో పోల్చవచ్చు.

మూడో వర్గం - అర్జల్. ఇందులో హలాల్‌ఖోర్, హవారీ, రజాక్ వంటి కులాలు ఉంటాయి. హిందువులలో మాన్యువల్ స్కావెంజర్లుగా పనిచేసే కులాల వారిని ముస్లిం సమాజంలో హలాల్‌ఖోర్లుగా పిలుస్తారు.

అర్జల్‌ కులాలను, హిందువులలో షెడ్యూల్డ్ కులాలతో పోల్చవచ్చని ప్రొఫెసర్ తన్వీర్ ఫజల్ చెప్పారు. అర్జల్ కులస్థులు కూడా షెడ్యూల్ కులాల ప్రజల తరహాలోనే వెనుకబాటుతనంలో ఉన్నారని ఆయన తెలిపారు.

ముస్లిం మహిళలు

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

భారతీయ ముస్లింలు తమ సొంత కులానికి చెందిన వారినే పెళ్లి చేసుకుంటారా?

ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్ దీని గురించి వివరించారు. ముస్లింలలోని కుల వ్యవస్థ కూడా హిందువుల తరహాలోనే పని చేస్తుందని అన్నారు. వివాహం, వృత్తులు తప్ప ముస్లింలలో వివిధ కులాల ఆచారాలు వేర్వేరుగా ఉంటాయని చెప్పారు.

డాక్టర్ తన్వీర్ ఫజల్ మాట్లాడుతూ.. ముస్లింలలో కూడా తమ కులానికి చెందిన వారినే పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడతారు. ముస్లిం ప్రాంతాలలో వీధులు కూడా కుల ప్రాతిపదికన కనిపిస్తాయి. కొన్ని ముస్లిం కులాల వీధులు ఒకవైపు, మరికొన్ని ముస్లిం కులాలు వీధులు మరోవైపు ఉంటాయి.

ఫజల్ చెప్పినదాని ప్రకారం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో తుర్క్, లోధీ ముస్లింలు నివసిస్తారు. వారి మధ్య చాలా ఉద్రిక్తతలు ఉన్నాయి.

అయితే, మసీదులో కుల వ్యవస్థ వర్తించదని, ఎందుకంటే ఇస్లాం దానిని అనుమతించదని ఆయన అన్నారు. దిల్లీలోని చాలా మసీదుల్లో వెనుకబడిన కులానికి చెందిన ఇమామ్‌లు ఉన్నారని ఆయన చెప్పారు.

పరస్పర సంబంధాల విషయంలో అలీ అన్వర్ అన్సారీ కాస్త భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. "పుట్టుక నుంచి మరణం వరకు ముస్లింలలో కులాల వారీగా విభజనలు ఉన్నాయి'' అని ఆయన అన్నారు.

కుల ప్రాతిపదికన ఎన్నో మసీదులు నిర్మించారని ఆయన చెప్పారు. ప్రతి గ్రామంలో కులాల వారీగా శ్మశాన వాటికలు నిర్మించారు. హలాల్‌ఖోర్, హవారీ, రజాక్ వంటి ముస్లిం కులాలకు సయ్యద్, షేక్, పఠాన్ కులాల శ్మశానవాటికల్లో ఖనన స్థలం ఇవ్వలేదని చెప్పారు.

తన్వీర్ ఫజల్
ఫొటో క్యాప్షన్, తన్వీర్ ఫజల్

ముస్లింలకు రిజర్వేషన్లు ఉంటాయా?

ముస్లిం సమాజంలో ఒక కులం ఎంత వెనుకబడినా, దాన్ని షెడ్యూల్డ్ కులంగా పరిగణించరు. కానీ, ముస్లింలలోని కొన్ని కులాలకు ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనం దక్కుతుంది.

ప్రొఫెసర్ తన్వీర్ ఫజల్ దీని గురించి వివరించారు. ''రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ద్వారా, షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లు లభిస్తాయి. హిందువులలో అంటరానివారిగా పరిగణించే కులాలకు మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది. తర్వాత దీనిలో రెండు మార్పులు చేశారు. వీటి ప్రకారం... సిక్కు, బౌద్ధ మతాలను నమ్మే వారిని కూడా ఈ జాబితాలో చేర్చారు. కానీ, ఇప్పటి వరకు ఇస్లాం, క్రైస్తవ మతాలను నమ్మే కులాలను ఇందులో చేర్చలేదు'' అని ఆయన చెప్పారు.

షెడ్యూల్డ్ కులాల హోదా అందాల్సిన కులాలు ముస్లింలలో కనీసం 15 ఉన్నాయని ఫజల్ అన్నారు. ముస్లింలలోని వెనుకబడిన కులాలను ఓబీసీ కేటగిరీలో చేర్చారు. కానీ, దీనివల్ల హలాల్‌ఖోర్ వంటి కులాలకు చెందిన వ్యక్తులకు ఎలాంటి ప్రయోజనం దక్కదు. ఎందుకంటే వీరు, హిందువులలో దళితుల తరహాలో వెనుకబాటుతనంలో ఉంటారు.

"ముస్లింలు, షెడ్యూల్డ్ కులాల్లోనే కాదు షెడ్యూల్డ్ తెగల జాబితాలోకి కూడా రారు. హిందువులలో మీణా కులస్థులకు షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ అందుతుంది. అయితే, ముస్లింలలో అదే స్థాయిలోని మేవ్ కులస్థులను షెడ్యూల్ తెగల్లో చేర్చలేదు. వారికి ఓబీసీ హోదా ఇచ్చారు''అని అన్వర్ వివరించారు.

ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

హిందువు నుంచి ముస్లింగా మారితే రిజర్వేషన్ దక్కుతుందా?

హిందువుల్లోని షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఒక వ్యక్తి, ఇస్లాంలోకి మారితే వారికి షెడ్యూల్డ్ కులాల కింద రిజర్వేషన్లు లభించవు.

''ఏ దళితుడు కూడా స్వేచ్ఛగా తన మతాన్ని మార్చుకోలేడు. ఎందుకంటే హిందుమతంలో వారికి షెడ్యూల్ కులాల కింద రిజర్వేషన్ లభిస్తుంది. ఒకవేళ ఆయన ఇస్లాంలోకి మారితే ఓబీసీ కోటా కింద రిజర్వేషన్ పొందాల్సి ఉంటుంది'' అని తన్వీర్ ఫజల్ చెప్పుకొచ్చారు.

ఇది, మతాన్ని స్వేచ్ఛగా ఎంచుకునే హక్కును నేరుగా ఉల్లంఘించడమే అని ఫజల్ అభిప్రాయపడ్డారు.

నితీశ్ కుమార్

ఫొటో సోర్స్, BBC/NIRAJ SAHAI

ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఏర్పడింది?

భారతీయ సమాజంలో సామాజిక నిర్మాణంలో కుల వ్యవస్థ ప్రధానమైనది. ఇది అన్ని మతాలలో కనిపిస్తుంది. హిందువుల గ్రంథాలలో వర్ణ వ్యవస్థ గురించి ఉంటుంది. కానీ, ఇస్లాం మత గ్రంథాలలో ఇది లేదు.

ఇస్లాంలో వర్ణ వ్యవస్థ లేకపోయినా, భారతీయ ముస్లింల సమాజాన్ని పరిశీలిస్తే వారిలో కుల వ్యవస్థ ఏర్పడినట్లు తెలుస్తుందని తన్వీర్ ఫజల్ చెప్పారు.

ఇస్లాం మతం టర్కీ, ఇరాన్ ద్వారా భారతదేశానికి చేరుకున్నప్పుడు కొంత కుల విభజన జరిగిందని ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. హిందూ మతంలోని కుల వ్యవస్థతో కలిసి జీవనం సాగిస్తున్నప్పుడు ఇస్లాంలో ఇది మరింత బలపడిందని ఆయన వివరించారు.

ప్రొఫెసర్ తన్వీర్ ఫజల్ దీనికి మరికొన్ని కారణాలు కూడా చెప్పారు.

''మతమార్పిడి సమయంలో ప్రజలు తమ కులాలను కూడా తమ వెంట తెచ్చుకున్నారు. ఇస్లాంలోకి మారిన తర్వాత కూడా వారు కులాన్ని వదల్లేదు. ఉత్తరప్రదేశ్‌లోని రాజపుత్రులు, ముస్లిం మతాన్ని స్వీకరించినప్పటికీ వారు ఇప్పటికీ తమ పేరుతో చౌహాన్ అని రాస్తారు. రాజపుత్రుల్లాగే భావిస్తారు'' అని చెప్పారు.

భారతదేశానికి వచ్చిన మొఘలులు, అఫ్గాన్లు... పాలనా వ్యవస్థలో తమ ప్రజలకు ఉన్నత స్థానం కల్పించి ఇక్కడి ప్రజలను చిన్నచూపు చూశారు. ఇక్కడి నుంచే కుల వ్యవస్థ ప్రారంభమై ఉండొచ్చని ప్రొఫెస‌ర్ ఫ‌జ‌ల్ అంటారు.

వీడియో క్యాప్షన్, తాజ్‌మహల్‌ బేస్‌మెంట్లో మూసేసిన ఆ 22 గదుల్లో దాగిన రహస్యాలేంటి?

కుల గణన వల్ల ముస్లింలకు ఎంత ప్రయోజనం?

దేశంలో ప్రతీ పదేళ్లకు జనాభాను లెక్కిస్తారు. ఇందులో కులాల సంఖ్యకు సంబంధించిన వివరణ ఉండదు. ముస్లిం జన గణన కూడా మతం ఆధారంగానే జరుగుతుంది. కుల గణన జరిగినప్పుడు ప్రతీ మతంలో ఎన్ని కులాలు ఉన్నాయో తెలుస్తుంది.

''ప్రభుత్వం జనగణనను నిర్వహిస్తే సామాజిక, ఆర్థిక స్థితిగతులపై దృష్టి సారిస్తుంది. దీనివల్ల వెనుకబడిన ముస్లిం కులాలకు ప్రయోజనం కలుగుతుంది. వెనుకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్లు పొందడంలో వారికి సహాయపడవచ్చు'' అని తన్వీర్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఇక్కడ పాపుపుణ్యాల శాఖ అధికారులు ప్రతిరోజూ ప్రజల పాపాలు లెక్కిస్తారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)