ఇండియా, పాకిస్తాన్: 1947లో విడిపోయి పాకిస్తాన్ ముస్లిం కుటుంబంలో పెరిగిన చెల్లెలిని 75 ఏళ్ల తరువాత కలుసుకున్న అన్నలు

ఫొటో సోర్స్, BBC
- రచయిత, మహ్మద్ జుబైర్ ఖాన్
- హోదా, బీబీసీ కోసం
‘మేం ముగ్గురు సోదరులం. సోదరి కోసం మేం ఎంతో ఎదురుచూశాం. మా మావయ్య కూతుళ్లను కూడా మేం చెల్లెళ్లగానే చూసేవాళ్లం. అదృష్టవశాత్తు మా రక్తం పంచుకుని పుట్టిన చెల్లిని చాలా కాలం తరువాత కలిశాం. ఆమెకు వీలైనంత త్వరగా వీసా దొరికి భారత్‌కు వచ్చి మాతో కలిసిఉంటే చూడాలని ఉంది.’’
ఇవి పంజాబ్ పటియాలా జిల్లాలోని శాత్‌రానా గ్రామవాసి గుర్‌ముఖ్ సింగ్ మాటలు.
గుర్‌ముఖ్ సింగ్ సోదరి ముంతాజ్.. పాకిస్తాన్‌లోని షేఖుపురాలో ఉంటారు. దేశ విభజన సమయంలో ఆమె విడిపోయారు. రెండేళ్ల క్రితమే మళ్లీ ఒకరి ఆచూకీ మరొకరికి తెలిసింది. కొన్ని వారాల కిందట కర్తార్‌పుర్‌లో వీరు కలుసుకున్నారు.
‘‘మా రక్తంలో చాలా ప్రేమ ఉంది. నా సోదరులను చూడగానే నేను గుర్తుపట్టేశాను. వారితోపాటు కొన్ని రోజులు కలిసి జీవించాలని నాకు అనిపిస్తోంది. వారు నాతోపాటు మా ఇంటికి వచ్చి కొన్ని రోజులుంటే బాగుంటుంది’’ అని ముంతాజ్ బీబీ చెప్పారు.

కథ అలా మొదలైంది..
దేశ విభజన సమయంలో విడిపోయిన వీరు ఎలా కలిశారు? వీరు కలవడంలో గుర్‌ముఖ్ సింగ్ తమ్ముడి కొడుకు, 30ఏళ్ల సుఖ్‌జిందర్ సింగ్ కీలకపాత్ర పోషించారు.
వీరంతా ఎలా కలిశారో బీబీసీతో సుఖ్‌జిందర్ సింగ్ వివరించారు. ‘‘పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని షేఖుపురా జిల్లాలోని మా గ్రామమైన సెఖమ్ గురించి మా పెద్దలు చాలా చెప్పేవారు’’అని ఆయన వివరించారు.
‘‘వారు చాలా విషయాలు చెప్పారు. మన స్వగ్రామం ఆ సెఖమ్ అని, మా పూర్వీకులంతా అక్కడే ఉండేవారని వివరించేవారు’’అని ఆయన చెప్పారు.
‘‘దీంతో ఎలాగైనా సెఖమ్‌లో వారితో మాట్లాడాలని నేను భావించాను. దీని కోసం భిన్న మార్గాల్లో ప్రయత్నించాను. కరోనావైరస్ వ్యాప్తి నడుమ చాలా ఎక్కువ రోజులు నేను ఎదురుచూడాల్సి వచ్చింది’’అని ఆయన అన్నారు.
‘‘సోషల్ మీడియాలో షేఖుపురాకు చెందిన కొంతమంది కలిశాను. మరోవైపు విడిపోయిన వారిని కలిపే పంజాబీ లెహర్ ప్లాట్‌ఫామ్‌నూ సంప్రదించాను. కానీ, ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. రోజులు గడిచినప్పటికీ, నాలో ఆలోచనలు మరింత పెరిగాయి’’అని సుఖ్‌జిందర్ చెప్పారు.

‘‘నేను గూగుల్ మ్యాప్‌లో సెఖమ్ గ్రామం గురించి సెర్చ్ చేశాను. ఆ గ్రామం పక్క నుంచి ఒక వాగు వెళ్తుందని మా నాన్నమ్మ నాకు చెప్పింది. దాని ఆధారంగా ఆ గ్రామాన్ని గుర్తుపట్టాను’’అని సుఖ్‌జిందర్ చెప్పారు.
‘‘సెఖమ్‌వాసుల గురించి సోషల్ మీడియా సెర్చ్ చేసినప్పుడు అబ్దుల్లా జనరల్ స్టోర్ ఒకటి కనిపించింది. ఎలాగోలా ఆయన ఫోన్ నంబరు వెతికి పట్టుకున్నాను’’అని ఆయన వివరించారు.
‘‘నేను వాట్సాప్‌కు మెసేజ్ పంపినా స్పందన వచ్చేదికాదు. ఫోన్ చేసినా ఆయన ఎత్తేవాడు కాదు. భారత్-పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్ల కావొచ్చు.. ఆయన సరిగా స్పందించేవారు కాదు’’అని ఆయన అన్నారు.
‘‘అయితే, ఒకసారి అబ్దుల్లా జనరల్ స్టోర్ నంబరుకు ఫోన్ చేసినప్పుడు రాజా సిఖ్సే అనే వ్యక్తి ఫోన్ ఎత్తారు. నాతో మాట్లాడటంపై ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు’’అని ఆయన అన్నారు.
‘‘అయితే, రాజాకు పెద్దగా ఏమీ తెలియదు. కానీ, తమ గ్రామంలో నివసించే కొందరు పెద్దవారితో అతడు మాట్లాడించాడు. అలా మెహ్తాబ్ అనే వ్యక్తితో మాట్లాడాను. ఆయనకు మా తాత పాలా సింగ్ బాగా తెలుసు’’అని ఆయన వివరించారు.

టర్బన్లు మార్చుకునేవారు
‘‘నేను పాలా సింగ్ మనుమడినని ఆయనకు చెప్పాను. వెంటనే సెఖమ్ పాలా సింగేనా? అని ఆయన అడిగారు. వెంటనే ఆయన గట్టిగా ఏడ్చేశారు. మేం టర్బన్లను కూడా మార్చి కట్టుకునేవారిమని ఆయన చెప్పారు’’అని సుఖ్‌జిందర్ సింగ్ వివరించారు.
‘‘తమది ముస్లిం కుటుంబమని, పాలా సింగ్‌ది సిక్కుల కుటుంబమని.. కానీ మేం తలపాగాలు ఒకరిది మరొకరం మార్చి కట్టుకునేంత మిత్రులమని ఆయన వివరించారు’’అని సుఖ్‌జిందర్ చెప్పారు.
‘‘మా తాత పాలా సింగ్ చనిపోయారని చెప్పినప్పుడు ఆయన మరింత ఏడ్చాడు. కొన్ని విషయాలు ఆయనకు చాలా బాగా గుర్తున్నాయి. ముఖ్యంగా మా తాత పేరు ఆయనకు గుర్తుంది’’అని సుఖ్‌జిందర్ వివరించారు.
‘‘సెఖమ్‌లో 30 సిక్కు, 30 ముస్లిం కుటుంబాలుండేవి. కానీ, దేశ విభజన సమయంలో 29 కుటుంబాలు పాకిస్తాన్‌ను వదిలి వెళ్లిపోయాయి. ఒక కటుంబం మాత్రం ఇస్లాంకు మతం మారిపోయింది’’అని ఆయన అన్నారు.
‘‘ఆ మాటల్లోనే ఖమర్ హయత్ కుటుంబం గురించి తెలుసుకున్నాను. వారి కుటుంబం దేశ విభజనకు ముందే ఇస్లాంలోకి మతం మారింది. వారితో మాట్లాడినప్పుడు మేం చనిపోయిందని భావించిన అత్తయ్య ఇంకా బతికే ఉందని తెలిసింది’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, BBC
‘‘నాన్నమ్మ చనిపోయింది’’
ఖమర్ హయత్‌తోనూ సుఖ్‌జిందర్ మాట్లాడారు. దేశ విభజన సమయంలో మా తాత పాలా సింగ్ కుటుంబానికి ఏమైందో ఆయన కళ్లకుకట్టినట్లు వివరించారు.
‘‘దేశ విభజన జరిగినప్పుడు, మా తాత పాలా సింగ్ కుటుంబంతో కలిసి పాకిస్తాన్ వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. భారత్ వైపుగా వస్తున్నప్పుడు ఆయన కుటుంబంపై దాడి జరిగింది. ఆ సమయంలో మాతాతకు రెండేళ్ల కూతురు, ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నారు.’’
‘‘ఆ పాపను మా నాన్నమ్మ ఎత్తుకుని వచ్చింది. కానీ, కాల్పులు జరిగినప్పుడు మా నాన్నమ్మకు తూటాలు తగిలాయి. అప్పుడు తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. ఆ కల్లోలంలోనే మా నాన్నమ్మ చనిపోయింది. ఆమె కొడుకు కూడా మరణించాడు’’అని సుఖ్‌జిందర్ చెప్పారు.
‘‘ఇప్పటికీ సెఖమ్‌లో చాలా మంది మా తాతను గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఆయనకు అక్కడ చాలా భూమి ఉండేది.’’
‘‘దేశ విభజన తర్వాత మళ్లీ ఆయన పాకిస్తాన్ వెళ్లారు. అప్పుడు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఆయన మళ్లీ భారత్ వచ్చేశారు. మా నాన్నమ్మ చెల్లెలను ఆయన పెళ్లి చేసుకున్నారు’’అని సుఖ్‌జిందర్ వివరించారు.
‘‘ఆ నాన్నమ్మ కూడా గత ఏడాది మరణించింది. తన అక్కను చనిపోయేవరకు ఆమె గుర్తు చేసుకునేది. మా అక్కను చంపేశారు. కానీ ఆమె కుమార్తె బతికే ఉండి ఉంటుందని ఆమె అనేవారు.’’
‘‘మా నాన్న, చిన్నాన్న విభజన సమయం నాటి కథలు మాకు చెప్పేవారు. అప్పుడు భారత్‌లో ఉండే మా వాళ్లను కలవాలని నాకు అనిపించేది’’అని ఖమర్ హయత్ చెప్పారు.
రూ. 30,000 డబ్బు, బంగారంతో..
‘‘దేశ విభజన సమయంలో పాలా సింగ్ భార్య రూ.30,000 డబ్బు, భారీ మొత్తంలో నగదును నడుముకు కట్టుకుని బయలుదేరారు. అయితే, ఆమె దగ్గర డబ్బు, బంగారాన్ని దోచుకున్నారు. కానీ, ఆమె కుమార్తె పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు’’అని ఖమర్ హయత్ వివరించారు.
‘‘ఆ చిన్న పాపను చౌధరి ముబారక్ అలీనే వ్యక్తి దత్తత తీసుకున్నారు. అప్పటివరకు ఆయనకు పిల్లలు లేరు. దీంతో ఆమెకు ముంతాజ్ బీబీగా పేరు మార్చారు. ఆమె వచ్చిన తర్వాత ఆయనకు పిల్లలు కూడా పుట్టారు’’అని ఖమర్ హయత్ వివరించారు.
‘‘సుఖ్‌జిందర్ సింగ్‌ను కలిసిన తర్వాత.. ఆనాటి విషయాలన్నీ ఆయన గుర్తు చేశారు. దీంతో ముంతాబ్ బీబీ.. వారికి అత్తయ్య అవుతుందని మేం తేల్చాం. ఆ తర్వాత మిగతావారు కూడా ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టారు’’అని ఖమర్ హయత్ అన్నారు.
‘‘మొదట్లో ఆమె మాట్లాడటానికి ఇష్టపడలేదు. కానీ, నెమ్మదిగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వారు తమ కుటుంబీకులేనని ఆమె నమ్మడం మొదలుపెట్టారు’’అని ఆయన వివరించారు.
‘‘మొదట్లో ఈ కథ మేం నమ్మలేదు. కానీ, నిజాన్ని ఎప్పుడూ మనం దాయలేం. మేం దాన్ని అంగీకరించాం. మా మామయ్యలు ఇక్కడకు వచ్చినప్పుడు మా అమ్మ భావోద్వేగానికి గురైంది’’అని ముంతాజ్ బీబీ కుమారుడు షాబాజ్ అహ్మద్ చెప్పారు.
ఆ రక్తం మాదే..
ప్రస్తుతం షేఖుపురాలోని ముంతాజ్ బీబీ సంతోషంగా జీవిస్తున్నారు. ‘‘మీ రక్తం మాదే. మిమ్మల్ని చూడగానే నా రక్తం ఉప్పొంగింది’’అని ఆమె అన్నారని సుఖ్‌జిందర్ చెప్పారు.
‘‘నేను పాలా సింగ్ కుమార్తెనని నాకు తెలియదు. మొదట్లో అసలు దీన్ని నేను నమ్మలేదు’’అని ఆమె చెప్పినట్లు సుఖ్‌జిందర్ వివరించారు.
‘‘కర్తార్‌పూర్‌లో మేం కలిసినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాం. నా సోదరులను చూసినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎవరైనా చూస్తే వెంటనే మేం అన్నా, చెల్లెళ్లమని చెప్పేస్తారు’’అని ముంతాజ్ బీబీ చెప్పారు.
‘‘నా పిల్లలు వీసా కోసం దరఖాస్తు చేస్తున్నారు. త్వరలో నేను భారత్ వెళ్తాను. మరోవైపు నా సోదరులు కూడా సెఖమ్ గ్రామాన్ని చూసేందుకు పాకిస్తాన్ వస్తారు’’అని ఆమె అన్నారు.
‘‘మా తాతయ్య ఇల్లును మేం వీడియో కాల్‌లో చూశాం. అది పెద్దగా ఏమీ మారలేనట్లుగానే ఉంది. మా తాత చెప్పినట్లే అది కనిపించింది. పెద్దపెద్ద తలుపులు, ఎత్తైన గోడలు ఉన్నాయి’’అని సుఖ్‌జిందర్ వివరించారు.
‘‘మా అత్తయ్య త్వరగా మా దగ్గరకు రావాలని మేం కోరుకుంటున్నాం. మేం కూడా అక్కడకు వెళ్లి కొన్ని రోజులు గడపాలని ఉంది’’అని సుఖ్‌జిందర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఔరంగజేబు: 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి గురించి ఇప్పుడెందుకు చర్చ జరుగుతోంది
- మంకీపాక్స్: ఈ పాత వైరస్ కొత్తగా వ్యాపిస్తోంది.. మనం భయపడాలా? అవసరం లేదా?
- డ్రైవర్ మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని అరెస్ట్ చేస్తాం: కాకినాడ జిల్లా ఎస్పీ
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారా, బౌద్ధ ఆరామాలను కూల్చి గుడులు కట్టారా? చరిత్ర ఏం చెబుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















