జ్ఞాన్‌వాపి మసీదు: ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోంది, ఈ చట్టం కింద సర్వే ఎలా జరిగింది?

ఫొటో సోర్స్, SAMEERATMAJ MISHRA
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారిన జ్ఞాన్‌వాపి మసీదు వివాదం కొత్తదేం కాదు. చాలా కాలంగా నడుస్తున్నదే. అదిప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ వివాదాన్ని మరింత సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోందో తెలుసుకోవడం ముఖ్యం.
1991లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు చేసిన ఈ చట్టంలో ఏముంది? చూద్దాం.
చరిత్రలో ముప్ఫై ఏళ్లు వెనక్కు వెళితే, 1991లో అయోధ్యలోని రామ జన్మభూమిలో ఆలయాన్ని నిర్మించాలనే ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి.
1990లో బీజేపీ నేత ఎల్‌కే అడ్వాణీ దేశవ్యాప్తంగా రథయాత్ర చేపట్టారు. బిహార్‌లో ఆయన్ను అరెస్టు చేశారు. అదే ఏడాది కరసేవకులపై కాల్పులు జరిగాయి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి.
అటువంటి సమయంలో, 1991 సెప్టెంబర్ 18న ప్రార్థనా స్థలాల చట్టాన్ని (ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, 1991) ప్రవేశపెట్టారు. అప్పుడు కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం ఉంది. ప్రార్థనా స్థలాల చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది.
ఈ చట్ట ప్రకారం, 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో ప్రార్థనా స్థలాలు ఏ రూపంలో ఉన్నాయో, అదే రూపంలో కొనసాగుతాయి. వాటి స్థితిగతులను మార్చకూడదు.
ఇది దేశంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చి మొదలైన ప్రార్థనా స్థలాలన్నిటికీ వర్తిస్తుంది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు అయినా, మధురలోని షాహీ ఈద్గా అయినా ఈ చట్టం పరిథిలోకే వస్తుంది.
అప్పట్లో ఈ కొత్త చట్టాన్ని ఉమాభారతి సహా పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి చట్టాన్ని రూపొందించడం వలన చాలా విషయాలను విస్మరించాల్సి వస్తుందని ఆరోపించారు.
ఏ సెక్షన్‌లో ఏముంది?
1991 ప్రార్థనా స్థలాల చట్టంలోని సెక్షన్ (3) ప్రకారం, మతపరమైన లేదా అందులోని తెగలకు సంబంధించిన ప్రార్థనా స్థలాల స్వభావాన్ని లేదా స్వరూపాన్ని మార్చే హక్కు ఏ వ్యక్తికీ లేదు.
అదే చట్టంలోని సెక్షన్ 4(1) ప్రకారం, 1947 ఆగస్టు 15న నాటికి ప్రార్థనా స్థలాలు ఏ స్వరూపంలో ఉన్నాయో, అలాగే కొనసాగుతాయి.
సెక్షన్ 4(2) ప్రకారం, ప్రార్థనా స్థలాల స్వరూప, స్వభావాల విషయంలో మార్పులకు సంబంధించిన ఏ వ్యాజ్యాలు చెల్లవు. అంతకు ముందు పెండిగ్‌లో ఉన్న కేసులన్నీ రద్దవుతాయి. కొత్తగా పీటిషన్ వేసే వీలు లేదు. కోర్టు, ట్రిబ్యునల్, ప్రభుత్వ అధికారులు.. ఎవరి ముందూ ఏ దావాలూ చెల్లవు.
సెక్షన్ (5) ప్రకారం, అయోధ్య వివాదం ఈ చట్టం పరిధిలోకి రాదు. ఎందుకంటే, స్వతంత్రానికి ముందే ఈ వివాదం కోర్టులో ఉంది. మరో మినహాయింపు, పురావస్తు శాఖ సర్వే పరిధిలోకి వచ్చే ప్రార్థనా స్థలాల నిర్వహణపై పరిమితులు ఉండవు.

ఫొటో సోర్స్, ANI
1991లో జ్ఞాన్‌వాపి మసీదు సంగతేంటి?
1991 సంవత్సరానికి ముందే జ్ఞాన్‌వాపి మసీదుకు వివాదం రగులుకుంది. అంతకు ఎన్నో ఏళ్ల క్రితమే జ్ఞాన్‌వాపి మసీదు వివాదం రాజుకుంది. ముఖ్యంగా 1809 సంవత్సరంలో ఈ వివాదం కారణంగా మతపరమైన అల్లర్లు చెలరేగాయి.
అయితే, 1991లో ప్రార్థనా స్థలాల చట్టం రూపొందించిన తరువాతే, ఈ మసీదులో సర్వే కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ దాఖలు చేసిన హరిహర్ పాండేయ్ బీబీసీతో మాట్లాడుతూ, "1991లో ముగ్గురం కలిసి ఈ కేసు వేశాం. నేను, సోమనాథ్ వ్యాస్, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన రాంరంగ్ శర్మ కలిసి పిటిషన్ దాఖలు చేశాం. వాళ్లిద్దరూ ఇప్పుడు బతికి లేరు" అని చెప్పారు.
పిటిషన్ వేసినకొద్ది రోజులకే, జ్ఞాన్‌వాపి మసీదు నిర్వహణ కమిటీ ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉటంకిస్తూ సర్వే పిటిషన్‌ను రద్దు చేయాలని కోరింది. 1993లో అలహాబాద్ హైకోర్టు దీనిపై స్టే విధిస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.
ఆ తరువాత 2017లో, హరిహర్ పాండేయ్ వారణాసి సివిల్ కోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో, సుప్రీంకోర్టులోని మరొక కేసులో ఒక తీర్పు వెలువడింది.. ఎలాంటి స్టే ఆర్డరు అయినా ఆరు నెలల కంటే ఎక్కువ కాలం చెల్లదని, ఆ తరువాత స్టే ఆర్డరును రివ్యూ చేయాలని తెలిపింది.
సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా, జ్ఞాన్‌వాపి స్టే ఆర్డర్ చెల్లుబాటును హరిహర్ పాండేయ్ ప్రశ్నించారు. 2019లో వారణాసి సివిల్ కోర్టులో మరో పిటిషన్ వేశారు. మసీదు ప్రాంగణాన్ని సర్వే చేయాలనే డిమాండ్ కూడా జోడించారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. మసీదు ప్రాంగణంలో పురావస్తు సర్వే జరపాలని కోర్టు ఆదేశించింది. కానీ, మసీదు కమిటీ హైకోర్టుకు వెళ్లింది. 1991 చట్టాన్ని పేర్కొంటూ సర్వే రద్దు చేయాలని కోరింది. దాంతో, హైకోర్టు ఈ సర్వేపై స్టే విధించింది.
హరిహర్ పాండేయ్ పిటిషన్ ఇప్పటికీ అలహాబాద్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు దానిపై ఎటువంటి చట్టపరమైన నిర్ణయం తీసుకోలేదు.
2020లో ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటు గురించి ప్రశ్న
2020 అక్టోబర్‌లో, బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.
ఆయన ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు.
మొదటిది, ఇలాంటి చట్టం చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు. 'పబ్లిక్ ఆర్డర్' అంటే 'లా అండ్ ఆర్డర్' రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని ఆయన వాదించారు. నరసింహారావు ప్రభుత్వం ఎప్పుడైతే ఈ చట్టాన్ని రూపొందించిందో, అప్పుడే దేశ, రాష్ట్ర న్యాయవ్యవస్థ క్షీణించడం మొదలైందని పేర్కొన్నారు.
రెండు, 'తీర్థయాత్ర'పై చట్టాలు చేసే హక్కు కేంద్రం, రాష్ట్రం రెండిటికీ ఉందని అశ్వినీ ఉపాధ్యాయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, అంతర్జాతీయ పరిధిలోకొచ్చే స్థలాలు, కైలాశ్ మానసరోవర్ లేదా నన్‌కానా సాహిబ్ వంటి వాటిపై చట్టం చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. రాష్ట్రాల్లో మతపరమైన స్థలాలపై నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటాయని వాదించారు.
లక్నోకు చెందిన విశ్వభద్ర పూజారి పురోహిత్ మహాసంఘ్ కూడా ఇదే విధమైన పిటిషన్ దాఖలు చేసింది.
ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు వేర్వేరుగా విచారణ జరిపింది. వారి ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబివ్వాలని కోరింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కోర్టుకు సమాధానం చెప్పలేదు.
ఇప్పుడు ఈ రెండు కేసులను కలిపి విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

ఫొటో సోర్స్, UTPAL PATHAK
2021లో జ్ఞాన్‌వాపి మసీదు కేసును ఎందుకు తిరగదోడారు?
2021 ఆగస్టు 18న జ్ఞాన్‌వాపి మసీదుపై అయిదుగురు మహిళలు వారణాసి కోర్టులో విడిగా పిటిషన్ దాఖలు చేశారు. వీరిలో నలుగురు వారణాసి వాసులే. ఒకరు దిల్లీకి చెందిన రాఖీ సింగ్. ఆమె నేతృత్వంలోనే ఈ మహిళల బృందం పిటీషన్ వేసింది.
జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో శృంగార గౌరీ దేవి, వినాయకుడు, ఆంజనేయుడు మొదలైన హిందూ దేవతల విగ్రహాల దర్శనం, పూజలకు అనుమతించాలని కోరారు.
కాశీ విశ్వనాథుని ఆలయానికి ఆనుకుని ఉన్న ప్లాట్ నంబర్ 9130లో, దశాశ్వమేధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ ఈ విగ్రహాలను ధ్వంసం చేయకుండా నిరోధించాలని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం "ప్రాచీన ఆలయం" ప్రాంగణంలోని దేవతల పూజలు, దర్శనాలకు భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు.
వీటితో పాటు, దేవతల విగ్రహాల భద్రతకు ఒక అడ్వకేట్ కమిషనర్‌ని నియమించాలని ఆ అయిదుగు మహిళలు ప్రత్యేక అర్జీ పెట్టుకున్నారు.
వారి పిటిషన్‌ను సమర్థిస్తూ మొదట జిల్లా కోర్టు, తరువాత హైకోర్టు మసీదు ప్రాంగణాన్ని తనిఖీ చేసేందుకు ఆమోదించాయి.

ఫొటో సోర్స్, ARRANGED
2022లో గొడవేంటి?
2022 ఏప్రిల్ 8న, దిగువ కోర్టు ఈ మహిళల పిటిషన్‌పై స్థానిక న్యాయవాది అజయ్ కుమార్‌ను అడ్వకేట్ కమిషనర్‌గా నియమించింది. జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించింది.
అయితే, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ అడ్వకేట్ కమిషనర్ నియామకాన్ని హైకోర్టులో సవాలు చేసింది.
2022 ఏప్రిల్ 21న మసీదు కమిటీ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
మే 16, సోమవారం జ్ఞాన్‌వాపి మసీదు (ప్లాట్ నెం. 9130) సర్వే ముగిసింది.
మే 17న స్థానిక కోర్టులో సర్వే నివేదికను సమర్పించాల్సి ఉండగా, మరో రెండు రోజులు గడువు కావాలని అడ్వకేట్ కమిషనర్ కోరారు.
జ్ఞాన్‌వాపి మసీదు సర్వేను వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది.
ఇవి కూడా చదవండి:
- ‘వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇచ్చేప్పుడు జాగ్రత్త.. ఉత్తర కొరియా వాళ్లు జాబ్‌లు కొట్టేస్తున్నారు’ - ఐటీ సంస్థలకు అమెరికా హెచ్చరిక
- చేతనా రాజ్: ప్లాస్టిక్ సర్జరీ తర్వాత మరణించిన కన్నడ నటి, అసలేం జరిగింది?
- రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. చిరంజీవి ఆచార్య నిర్మాతకు, ఇద్దరు తెలంగాణ వారికి ఎంపీ పదవులు ఎందుకు ఇచ్చారంటే..
- వంటింట్లో మనకు తెలియకుండానే మనం చేసే 9 తప్పులు.. ఇవి చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు
- ఆన్లైన్ గేమ్సా... జూద క్రీడలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














