జ్ఞాన్‌వాపి, బాబ్రీ మసీదు వివాదాలను పోల్చి చూడడం కరెక్టేనా... చరిత్ర ఏం చెబుతోంది?

కాశీలో మసీదు, మందిరం, అయోధ్యలో బాబ్రీ మసీదు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాశీలో మసీదు, మందిరం, అయోధ్యలో బాబ్రీ మసీదు
    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జ్ఞాన్‌వాపి మసీదు కేసు విచారణ ఇటు వారణాసి దిగువ కోర్టులో, అటు సుప్రీంకోర్టులో నడుస్తోంది. కాగా, జ్ఞాన్‌వాపి మసీదు సర్వే చట్టవిరుద్ధమని, అయోధ్యలోని బాబ్రీ మసీదు విషయంలో చేసినట్లే ఇక్కడ కూడా చేస్తున్నారని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

దీనిపై రెండు రోజుల కిందట ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు. ట్వీట్‌కు 2019లో తాను చేసిన ఓ ప్రకటన క్లిప్‌ను కూడా ఆయన జత చేశారు. అయోధ్య పై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అప్పట్లో ఆయన ఈ ప్రకటన చేశారు.

అయోధ్యపై సుప్రీంకోర్టు నిర్ణయం దేశంలోని జ్ఞాన్‌వాపి, మధుర, ఇతర మసీదులపై కూడా ప్రభావం చూపుతుందని ఆ ప్రకటనలో ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.

భారతదేశంలో ముస్లిం తరఫున వినిపించే గొంతులలో అసదుద్దీన్ ఒవైసీ గొంతు ఒకటి. ఆయన లోక్‌సభ ఎంపీ కూడా.

ఇలాంటి పరిస్థితుల్లో జ్ఞాన్‌వాపి మసీదు కేసు కూడా బాబ్రీ మసీదు బాటలోనే సాగుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. కానీ, రెండు కేసుల పోలిక సరైనదేనా? అన్న సందేహం కూడా వస్తుంది.

ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనడానికి, ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు కేంద్రంలో రాజకీయాలను నిశితంగా పరిశీలించిన జర్నలిస్టులు, ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు అంశాన్ని కూడా పరిశీలిస్తున్న 1980-90 కాలంనాటి జర్నలిస్టులతో బీబీసీ మాట్లాడింది.

కాశీ ఆలయం ముందు కనిపించే జ్ఞాన్‌వాపి మసీదు

ఫొటో సోర్స్, SAMEERATMAJ MISHRA

ఫొటో క్యాప్షన్, కాశీ ఆలయం ముందు కనిపించే జ్ఞాన్‌వాపి మసీదు

ప్రభుత్వాల మధ్య తేడా

"అయోధ్య కాంట్రవర్సీ: ఎ జర్నలిస్ట్ డైరీ" రాసిన అరవింద్ కుమార్ సింగ్ బీబీసీ మాట్లాడిన వారిలో ఒకరు. బాబ్రీ మసీదు ఎపిసోడ్‌కు, జ్ఞాన్‌వాపీ మసీదు కేసుకు కొన్ని సారూప్యాలు, అలాగే కొన్ని తేడాలు కూడా ఉన్నాయని అరవింద్ కుమార్ అన్నారు.

1991లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉండటం ప్రధానమైన తేడా అని ఆయన అన్నారు.

ఆ సమయంలో అయోధ్య శ్రీరామ జన్మభూమిలో ఆలయాన్ని నిర్మించాలని దేశవ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా సాగింది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో మతపరమైన ఉద్రిక్తత ఉధృతంగా ఉంది.

అలాంటి సమయంలో అప్పటి ప్రధాని నరసింహారావు చొరవ తీసుకుని 1991 సెప్టెంబర్ 18న అయోధ్య వివాదం ఛాయలు ఇతర మత స్థలాలపై పడకుండా పూజా స్థలాల చట్టాన్ని రూపొందించారు.

నేడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉంది. 1991లో రూపొందించిన ప్రార్థనా స్థలం చట్టం చెల్లుబాటుపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. దీనిపై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇంకా సమాధానం ఇవ్వలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

1991లో వచ్చిన ప్రార్థనా స్థలాల చట్టం

''అయోధ్య కేసు కోర్టుకు చేరేప్పటికి 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం లేదు. ఆగస్ట్ 15, 1947 వరకు, ప్రజలు పూజించే ప్రార్థనా స్థలాల్లో ఎటువంటి మార్పులు చేయలేమంటూ 1991లో చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ కోణంలో చూస్తే జ్ఞానవాపి కేసులో ఇప్పటి వరకు ఈ చట్టం రక్షణ కవచంలా వ్యవహరిస్తోంది.1991 నాటి ప్రార్థనా స్థలం చట్టంలో స్వాతంత్య్రానికి ముందు అని పేర్కొన్నారు. అయితే, అప్పటికే అయోధ్య వివాదం కోర్టులో ఉండటంతో అది దానిస నుంచి బయటపడింది'' అని అరవింద్ కుమార్ అన్నారు.

జ్ఞానవాపి కేసు 1991లో చట్టంగా మారిన తర్వాతే కోర్టుకు చేరింది. గతంలో కూడా ఒకసారి మసీదు సర్వేను అనుమతించారు. కానీ ఈ చట్టం కారణంగా దాన్ని రద్దు చేశారు. అలా చూసినప్పుడు అయోధ్య, జ్ఞానవాపి వివాదాల మధ్య తేడా ఉంది.

1949 డిసెంబర్‌లో బాబ్రీ మసీదులో రామ్ లాలా విగ్రహాలను పెట్టారు

ఫొటో సోర్స్, RAM DUTT TRIPATHI-BBC

ఫొటో క్యాప్షన్, 1949 డిసెంబర్‌లో బాబ్రీ మసీదులో రామ్ లాలా విగ్రహాలను పెట్టారు

కాశీలో ఇప్పటికీ ఆలయం ఉంది

మూడవ ప్రధాన వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ, '' కాశీలోని జ్ఞాన్‌వాపి మసీదుకు ఆనుకుని విశ్వనాథ దేవాలయం ఉంది. కానీ, అయోధ్య పరిస్థితి అది కాదు. 1949లో బాబ్రీ మసీదులో విగ్రహాలు చేర్చారు. విగ్రహ ప్రతిష్ఠాపన వల్ల మొత్తం వ్యవహారం వివాదాస్పదంగా మారి ఆలయాన్ని నిర్మించాలని తీర్మానం పుట్టుకొచ్చిందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్మానం ఆ రోజు రుషి-సాధువుల సంఘం తీసుకున్న నిర్ణయం'' అని అరవింద్ కుమార్ అన్నారు.

1949 సంవత్సరం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్త రోజులు. రాజ్యాంగం అమలులోకి వచ్చే మధ్య సమయం. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో గోవింద్ వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

అదే సంవత్సరం, కాంగ్రెస్, సోషలిస్టుల మధ్య చీలిక కారణంగా, అయోధ్యలో ఉపఎన్నికలు జరిగాయి. అందులో హిందూ వర్గానికి చెందిన సాధువు బాబా రాఘవ్ దాస్ విజయం సాధించారు.

వీడియో క్యాప్షన్, కాశీ ఆలయం ఇప్పుడెలా ఉందో చూడండి

ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే హిందూ సమాజం ఉవ్వెత్తున ఎగసిపడింది. బాబ్రీ మసీదు కేసుపై అప్పటి వరకు న్యాయ పోరాటం సాగింది. ఈ విషయంపై అప్పటి వరకు రాజకీయాలు ప్రారంభం కాలేదు.

ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని రాఘవ్ దాస్ 1949 జూలైలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ కేహర్ సింగ్, ఈ భూమి మున్సిపాలిటీదా కాదా అని 1949 జూలై 20న ఫైజాబాద్ డిప్యూటీ కమీషనర్ కె.కె. నాయర్‌ నుంచి ముందస్తు నివేదికను కోరారు. అనుమతి ఇవ్వడానికి అప్పట్లో ఎలాంటి అడ్డంకులు ఎదురు కాలేదు.

1949 డిసెంబర్ 22 అర్ధరాత్రి దాటిన తర్వాత బాబా అభయ్ రాందాస్( బైరాగీ అభిరాం దాస్ అని కూడా అంటారు), ఆయన సహచరులు గోడలు ఎక్కి, రాముడు-జానకి, లక్ష్మణుల విగ్రహాలను మసీదు లోపల ఉంచారు. రాముడు అక్కడ వెలిశాడని, తన జన్మస్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడని ప్రకటించారు.

1992 కొందరు బాబ్రీ మసీదును కూల్చివేశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1992 కొందరు బాబ్రీ మసీదును కూల్చివేశారు

రెండు మసీదుల చరిత్ర

ఇది కాకుండా, రెండు మసీదుల చరిత్రలో స్వల్ప వ్యత్యాసం ఉంది. బాబ్రీ మసీదును మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశానుసారం అతని గవర్నర్ మీర్ బాకీ నిర్మించారు. మసీదుపై ఉన్న శాసనాలు, ప్రభుత్వ పత్రాలు దీనిని ధ్రువీకరించాయి.

కాశీ ఆలయాన్ని అక్బర్ నవరత్నాలలో ఒకరైన రాజా తోడర్‌మల్, దక్షిణ భారతదేశ పండితుడు నారాయణ్ భట్ సహాయంతో నిర్మించారని ఒక నమ్మకం ఉంది.

ఔరంగజేబు కాశీ ఆలయాన్ని ధ్వంసం చేయమని ఆదేశించిన తర్వాతే జ్ఞాన్‌వాపి మసీదు నిర్మించారని చాలామంది చరిత్రకారులు నమ్ముతారు. అయితే, ఇప్పుడు ఈ చరిత్ర పుటలను కొందరు పునర్లిఖిస్తున్నారు.

బాబ్రీ మసీదు, జ్ఞాన్‌వాపి మందిరం మధ్య ఇటువంటి వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ, కొన్ని సారూప్యాలు కూడా ఉన్నాయని అరవింద్ కుమార్ అన్నారు.

కాశీలో విశ్వనాథ ఆలయానికి వెళ్లే మార్గం

ఫొటో సోర్స్, UTPAL PATHAK

ఫొటో క్యాప్షన్, కాశీలో విశ్వనాథ ఆలయానికి వెళ్లే మార్గం

జ్ఞాన్‌వాపి పై వీహెచ్‌పీ, ఆరెస్సెస్, బీజేపీ ప్రకటనలు

బాబ్రీ వివాదం పై మొదట్లో న్యాయస్థానాల్లో పోరాటం సాగింది. తర్వాత వీహెచ్‌పీ, బీజేపీ అందులో చేరాయి.

అదే విధంగా జ్ఞాన్‌వాపి మసీదు వివాదంపై కూడా 1991 నుంచి న్యాయస్థానాల్లో పోరాటం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యాజ్యం వారణాసిలోని సివిల్ కోర్టులో, సుప్రీంకోర్టులో నడుస్తోంది.

క్రమంగా ఈ విషయంలో కూడా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్), బీజేపీ నాయకుల నుంచి ప్రకటనలు కూడా రావడం మొదలైంది.

రెండుచోట్లా మొఘల్ ఆక్రమణదారులు హిందూ సంస్థలను నిర్మూలించడానికి ప్రయత్నించారని, వాటి కోసం హిందువులు దశాబ్దాలుగా పోరాడవలసి వచ్చిందని వీహెచ్‌పీ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాల కోసం వీహెచ్‌పీ వేచి చూస్తుందని ఆయన అన్నారు.

రెండు రోజుల కిందట ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ కూడా ఒక ప్రకటన చేశారు. జ్ఞాన్‌వాపి, తాజ్‌మహల్, కృష్ణ జన్మభూమి గురించి నిజానిజాలు బయటికి రావాలని భారతదేశంలోనే కాకుండా ప్రపంచంవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఈ నిజాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా'' బుద్ధ పూర్ణిమ సందర్భంగా జ్ఞానవాపిలో బాబా మహాదేవ్ దర్శనం కావడం దేశంలోని సనాతన హిందూ సంప్రదాయానికి పౌరాణిక సందేశంలాగా ఉంది'' అంటూ మే 16న ట్వీట్ చేశారు.

ఈ ప్రకటనలను బట్టి జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారం మెల్లమెల్లగా రాజకీయ రంగు పులుముకుంటున్నట్లు భావిస్తున్నారు.

వారణాసి

ఫొటో సోర్స్, ANI

జ్ఞాన్‌వాపిలో శివలింగం, అయోధ్యలో రామ్ లాలా

జ్ఞాన్‌వాపి మసీదు సర్వే కింది కోర్టు ఆదేశాల మేరకు జరిగింది. మూడు రోజుల పాటు సాగిన ఈ సర్వేలో మసీదు ప్రాంగణం సర్వేలో శివలింగం బైటపడటం వివాదాస్పదమైంది. ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ వాదన, 1949లో అయోధ్యలో రాంలాలా విగ్రహం ఉందనే వాదనకు దగ్గరగా ఉంది.

1980 నుంచి బాబ్రీ మసీదు కూల్చివేత, రామజన్మభూమి ఉద్యమాన్ని కవర్ చేసిన జర్నలిస్ట్ నీరజా చౌధురి మొత్తం ఉద్యమంలో ఇది చాలా ముఖ్యమైన రోజు అని అభిప్రాయపడ్డారు.

''1949 ఘటనల తర్వాత,1964లో విశ్వహిందూ పరిషత్ ఏర్పాటైంది. ఆ తర్వాత 1984లో వీహెచ్‌పీ ఈ ఆందోళనను విస్తరింపజేసింది. దీంతో అది దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. ఆ తర్వాత 1989లో భారతీయ జనతా పార్టీ పాలంపూర్ సమావేశంలో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. రామజన్మ భూమిపై ఒక తీర్మానం ఆమోదించడం ద్వారా ఇది బీజేపీ చేతిలోకి వెళ్లింది'' అని నీరజా చౌధురి వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, అయోధ్య: భక్తులు పంపిన ఇటుకలను ఏం చేశారంటే..

''ఈ కోణంలో చూస్తే, జ్ఞాన్‌వాపి కూడా అయోధ్య దారిలో సాగుతున్నట్లు కనిపిస్తోంది. హిందూ, హిందూత్వ భావాలు పెరుగుతున్నాయి. రెండు రోజుల్లో ఈ విషయం కోర్టులో పరిష్కారం కావచ్చు. అలా కాకపోతే అది బాబ్రీ మసీదు సమస్యలాగే ఏళ్ల తరబడి సాగుతుంది. ఎన్నికలు జరిగే 2024 సంవత్సరం వరకు వెళ్లొచ్చు. రెండు చోట్లా మసీదులున్నాయి. రెండు చోట్లా అంతకు ముందు ఆలయం ఉందన్న వాదన ఉంది. కానీ, ఈ చరిత్ర తప్పు అనే వారు కూడా ఉన్నారు. ఆ రకంగా చూస్తే ఈ రెండింటికి పోలిక ఉందని చెప్పవచ్చు'' అని నీరజా చౌధురి అన్నారు.

సుప్రీంకోర్టులో జ్ఞాన్‌వాపి మసీదును విచారిస్తున్న ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ ఉన్నారు. ఈ ఇద్దరు అయోధ్య తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల బృందంలో ఉన్నారు.

అదే విధంగా, జ్ఞాన్‌వాపి మసీదు కేసులో పిటిషనర్‌లైన ఐదుగురు మహిళల తరఫు న్యాయవాదిగా హరిశంకర్ జైన్ వ్యవహరించారు. ఆయన బాబ్రీ మసీదు కేసులో హిందూ మహాసభకు న్యాయవాదిగా పని చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)