తలకోన: తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో అందాల జలపాతం

తలకోన
    • రచయిత, ఎన్.తులసీప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

తలకోన జలపాతం ప్రకృతి ప్రేమికులను మైమరచిపోయేలా చేసే పర్యటక కేంద్రం. ఇది శేషాచలం కొండల్లో ఉంది. తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలం నెరబైలు గ్రామం సమీపంలో తలకోన అటవీ ప్రాంతం ఉంది. ఎన్నో రకాల వన్యప్రాణులు, అరుదైన అటవీ సంపదకు ఇది నెలవు.

తిరుపతి నుంచీ బాకరాపేట మీదుగా 57 కిలోమీటర్ల దూరం వెళ్తే తలకోన వస్తుంది. తిరుపతి, పీలేరు నుంచి గంట గంటకూ ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. తలకోనలోని సిద్దేశ్వర స్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో జలపాతం ఉంటుంది.

జలపాతం వద్దకు వెళ్లాలంటే- సిద్దేశ్వర స్వామి ఆలయం నుంచీ కిలోమీటరు దూరం మట్టి రోడ్డులో వాహనంలో లేదా నడిచి వెళ్లాలి. తర్వాత దట్టమైన అడవి గుండా కిలోమీటరు దూరం రాళ్లతో నిర్మించిన మెట్లమార్గంలో వెళ్లాలి.

తలకోన
ఫొటో క్యాప్షన్, తలకోనకు తరలి వస్తున్న పర్యాటకులు

సూర్య కిరణాలు నేలకు పడనంత దట్టంగా ఉండే తలకోన అటవీ ప్రాంతంలో ఉన్న ప్రకృతి అందాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. తలకోనలో రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉన్న కొండపైన 300 అడుగుల ఎత్తు నుంచి నేలకు దూకే జలపాతాన్ని చూసి పర్యటకులు పట్టలేని సంతోషానికి లోనవుతుంటారు.

అక్కడ స్నానాలు చేస్తూ ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతారు. కోనసీమ జిల్లా అమలాపురం నుంచి స్నేహితులతో కలిసివచ్చిన త్రిపుర.. తలకోన కచ్చితంగా చూడాల్సిన ప్రదేశమని చెప్పారు.

‘ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యాను. బీటెక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిశాం. తిరుపతి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చాం. వచ్చేటప్పుడు కష్టంగా అనిపించింది. వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఫ్రెండ్స్‌తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు’ అని త్రిపుర అన్నారు.

వీడియో క్యాప్షన్, తిరుపతి పక్కన, శేషాచలం కొండల్లో అబ్బురపరిచే తలకోన అందాలు.. చూశారా..

తలకోన పేరు ఎలా వచ్చింది.?

ఈ అడవికి తలకోన అనే పేరు రావడం వెనుక పురాణాల్లో ఒక కథ కూడా ఉందని టీటీడీ చెబుతోంది. ఆదిశేషుడే శేషాచలంగా పర్వతం రూపంలో వెలిశాడని వేదాల్లో ఉన్నట్లు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక బోర్డులో రాసింది.

పద్మావతిని పెళ్లి చేసుకోడానికి కుబేరుడి నుంచి అప్పు తీసుకున్న శ్రీనివాసుడు, ఆ అప్పు తీర్చే సమయంలో ధనము కొలిచి కొలిచి అలసిపోవడంతో ఈ కొండపై తలవాల్చి నిద్రపోయారని, అందుకే ఆయన తలవాల్చిన కోన కనుక తలకోన అయ్యిందని టీటీడీ ఈ బోర్డులో వివరించింది.

తలకోన

అరుదైన జంతువులు, వృక్షాలకు నెలవు

తలకోన అడవుల్లో మద్ది, జాలారి, రక్తచందనం లాంటి అత్యంత విలువైన ఎన్నో చెట్లు ఉంటాయి. దట్టమైన అడవిలో అడవికోళ్లు, దేవాంగ పిల్లులు, నెమళ్ల లాంటి పక్షులు, బెట్టుడుతలు, ఎలుగుబంట్లు, ముచ్చుకోతులు, దుప్పులు, ఏనుగులు లాంటి జంతువులు ఉన్నాయి.

నగర వాతావరణానికి, రణగొణధ్వనులకు దూరంగా నిశ్శబ్దంగా ఉండే తలకోనలో సెలయేటి గలగలలు, వన్యప్రాణుల అరుపులు, అడవి పరిమళాలను మోసుకొచ్చే గాలులు అక్కడికి సేదతీరడానికి వచ్చే వారిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.

తలకోనలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి, అక్కడి వన్యప్రాణులను తిలకించడానికి అటవీశాఖ ప్రత్యేకంగా వాచ్ టవర్లు నిర్మించింది. వాటిపైనుంచి అడవి అందాలను ఆస్వాదించవచ్చు.

తలకోన

3,500 హెక్టార్లలో విస్తరించిన శేషాచలం కొండల్లో కొంత భాగంలో అంతర్వాహినిలా ప్రవహించే నీళ్లు జలపాతం పై భాగంలో ఉన్న గుండంలో చేరతాయని, అక్కడి నుంచి ధారలా మండు వేసవిలో కూడా కిందికి పడూతూ ఉంటాయని తిరుపతి డీఎఫ్ఓ పవన్ కుమార్ బీబీసీతో చెప్పారు.

''తలకోన ప్రాంతాన్నంతా మైక్రో క్లైమేటిక్ జోన్ అంటారు అది. బయట వాతావరణంతో పోలిస్తే అక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకటి రెండు సెంటిగ్రేడ్లు తక్కువే ఉంటుంది. తలకోన జలపాతం జలాలు శేషాచలం అడవుల్లోని మూడు లక్షల 50 వేల హెక్టార్లలో విస్తరించాయి. మనకు పైన కనిపించకపోయినా ఇవన్నీ అడవుల్లోని కొన్ని భాగాల్లో భూగర్భంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుంటాయి.

జలపాతం నీళ్లు ఎప్పుడూ పడడం వల్ల ఒక చిన్న మడుగులాగా ఏర్పడి ఆ నీళ్లు ఇంత పెద్ద కాచ్ మెంట్ ఏరియా పీల్చుకునేలా చేస్తుంది. అందుకే వేసవికాలంలో కూడా ఇక్కడ నీళ్లుంటాయి''అని పవన్ కుమార్ చెప్పారు.

తలకోన

భక్తులకు తోడు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, ఇతర రాష్ట్రాలవారూ నిత్యం తలకోనకు తరలివస్తుండడంతో ఈ ప్రాంతం ఎప్పుడూ పర్యటకులతో, భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది.

తలకోనలో ప్రకృతి సౌందర్యంగా చాలా బాగుందని, ఇక్కడకు వచ్చాక తమకు ఎంతో సంతోషంగా ఉందని ఖమ్మం నుంచి వచ్చిన నందిత బీబీసీతో చెప్పారు.

'' ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్నాం. సమ్మర్ కదా ఇప్పుడు కుదిరింది మాకు రావడానికి. చాలా చాలా చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేశాం' అని నందిత చెప్పారు.

తలకోన

ఎంట్రీ ఫీజు, బస, ఆహారం.

ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలవరకూ పర్యటకులను తలకోన జలపాతం దగ్గరకు అనుమతిస్తున్న అధికారులు, పెద్దలకు 10 రూపాయలు, పిల్లలకు 5 రూపాయల ఎంట్రీ ఫీజు నిర్ణయించారు.

కెమెరా, వీడియో కెమెరాల అనుమతించడానికి, వాహనాలకు కూడా రుసుము వసూలు చేస్తున్నారు.

తలకోనకు వచ్చి విడిది చేసేవారి కోసం ప్రయివేటు లార్జి, అటవీ శాఖ అతిథి గృహాలు, టీటీడీ నిర్మించిన గదులు, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ నిర్మించిన ఒక గెస్ట్ హౌస్, కూడా ఉన్నాయి.

తలకోన

తలకోనకు వెళ్లే పర్యటకులు తమ ఆహార ఏర్పాట్లు తామే తెచ్చుకోవాలి. వంటలు చేసుకుని లోపలకు తీసుకెళ్లడానికి అనుమతిస్తున్నారు. బయటనుంచీ వచ్చే వారికోసం ఆలయం దగ్గరున్న హోటల్ వారికి ముందే చెబితే భోజన ఏర్పాట్లు కూడా చేస్తారు.

సినిమాలు, వెబ్ సిరీస్‌ల షూటింగులతో శ్రీవారి భక్తులకు తోడు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, ఇతర రాష్ట్రాలవారూ తరలివస్తుండడంతో తలకోన ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది.

తలకోన

స్థానికుల చేతికే అటవీ రక్షణ

తలకోన జలపాతానికి వెళ్లే దారిలో సహజ ప్రకృతికి ముప్పు తలెత్తే విధంగా సిమెంట్ ఉపయోగించకుండా రిపేర్లు చేయడం, ప్రయాణికుల భద్రత కోసం రెయిలింగ్ లాంటివి నిర్మించడం లాంటికి అటవీశాఖ చేస్తుంది.

''తలకోన జలపాతం చేరుకోడానికి సిద్ధేశ్వర స్వామి ఆలయం నుంచి వెళ్లే దారిలో రాళ్లన్నీ బయటపడడంతో వాహనాలు వెళ్లడానికి ఇబ్బందులు తలెత్తాయి. ఇటీవలే ఆ రోడ్డు రిపేర్ కూడా చేశాము.

తలకోన

ఈ పనుల్లో స్థానికులకు స్థానం కల్పిస్తూ వారికి టూరిజం మేనేజ్‌మెంట్ శిక్షణ ఇస్తూ స్థానికులు స్వయం సమృద్ధి పొందేలా ఎకో టూరిజంను కూడా డెవలప్ చేసాము.

అక్కడికి వచ్చే పర్యటకులకు పరిసరాలు చూపించడం, జంతువుల గురించి వివరించడం లాంటి పనుల్లో అటవీ శాఖ ప్రమేయం తగ్గించి స్థానికులను చేర్చడం వల్ల వారికి ఉపాధి లభించడంతోపాటూ, స్మగ్లర్లు ఎవరైనా వచ్చినపుడు మాకు వెంటనే సమాచారం అందించి, వారిని పట్టుకోడానికి సహకరిస్తుండడంతో అటవీ శాఖ సిబ్బందిపై ఒత్తిడి కూడా తగ్గింది''అని పవన్ కుమార్ రావు చెప్పారు.

తలకోన
ఫొటో క్యాప్షన్, తలకోన జలపాతం

తలకోన రక్షణకు కఠిన చర్యలు

25 ఏళ్ల నుంచీ అటవీ శాఖ ఇక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టింది. బయో ఈస్తటిక్స్, వనవిహారీ స్కీం కింద వివిధ అభివృద్ధి పనులు చేస్తోంది.

తలకోనలో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నాయి. ఇక్కడి అటవీ సంపదను, వన్యప్రాణులను కాపాడేందుకు అటవీ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. అడవికి, వన్యప్రాణులకు నష్టం కలిగించే వస్తువులు, పనిముట్లు, జలపాతం దగ్గర సబ్బులు, షాంపూలు లాంటివి ఉపయోగించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తలకోన.

''అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు నిషేధించాం. ఇక్కడ పాలిథిన్ కవర్లు పడేయడం వల్ల వాటిని జంతువులు తిని, చనిపోయే ప్రమాదం ఉంటుంది.

కొందరు మందు బాటిల్స్ తీసుకురావడం వల్ల అవి ఇక్కడ పగలడం లాంటివి జరుగుతుంటాయి. దాంతో పర్యాటకులు గాయపడుతుంటారు. అటవీప్రాంతం పరిధిలో మద్యం, పొగతాగడం, అగ్గిపెట్టెలు ఉపయోగించకుండా నిషేధించాము. జంతువులు, పక్షులు బెదిరేలా, వాటికి హాని కలిగించే అన్ని రకాల చర్యలపై నిఘా పెట్టాము.

తలకోనకు వచ్చే వారందరూ ప్రకృతిని ఆస్వాదించండి. ఆహారపదార్థాలు ఎక్కడంటే అక్కడ పడేయకుండా చెత్తకుండీల్లో పడేయండి. తలకోనకు వచ్చే పర్యటకులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, అడవులను కాపాడుకోవడంతో పాటూ, వారు కూడా సురక్షితంగా తిరిగి ఇల్లు చేరచ్చు''అని పవన్ కుమార్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)