'ఈ నేషనల్ పార్క్ ప్రతి ఏడాది నాలుగు వారాల పాటు అదృశ్యమవుతుంది.. ఆ తర్వాత మళ్లీ కనిపిస్తుంది'

ఫొటో సోర్స్, Artenex/Getty Images
- రచయిత, మైక్ మాక్ ఇచరన్
- హోదా, బీబీసీ ట్రావెల్
పైనున్న ఫొటోను ఒకసారి జాగ్రత్తగా గమనించండి.
కనుచూపు మేర పచ్చదనం..
ఎత్తైన చెట్లు..
నీటి కాలువలు..
ఎంతో మనోహరంగా ఉంది కదా..
ఇది సూమా నేషనల్ పార్క్.
యూరప్‌లోని ఎస్టోనియా దేశంలో ఉంది.
ఈ పార్క్ ఎంత అందంగా ఉందో దానికి మించిన వింత ఒకటి ఇక్కడుంది.
మార్చ్ - ఏప్రిల్ మధ్య కాలంలో ఈ పార్క్ 'అదృశ్యం' అవుతుంది.
ఈ పచ్చదనం కనిపించదు.
కానీ ఈ ప్రాంతం మరింత మనోహరంగా తయారవుతుంది.
ఇదొక పెద్ద సరస్సులా మారిపోతుంది.
అంటే ఇదిగో ఇలా మారుతుంది..
పచ్చికబయళ్లు నీట మునుగుతాయి.
చెట్లు సగం వరకు నీటిలో ఉంటాయి.

ఫొటో సోర్స్, Karl Ander Adami/Visit Estonia
ఇది మీరు పైన చూసిన పచ్చటి సూమా నేషనల్ పార్కే.
నమ్మడం కష్టమే కానీ ఇది నిజం.
దాదాపు నాలుగు వారాల పాటు మాత్రమే ఇదిలా ఉంటుంది.
ఆ తర్వాత కొంతకాలానికే మళ్లీ పచ్చని చీర కట్టుకున్నట్లు ముందుచూసిన ఫొటోలో మాదిరిగా మారిపోతుంది.
ఈ నాలుగు వారాలు మాత్రం ఈ ప్రాంతం సరికొత్తగా కనిపిస్తుంది.
దీన్ని ఇక్కడ ఫిఫ్త్ సీజన్ (అయిదో సీజన్) అని పిలుస్తుంటారు.
ఈ నాలుగు వారాల సమయం కోసం కొందరు ఏడాది నుంచి ఎదురుచూస్తూనే ఉంటారు.
అలాంటి వారిలో ఒకరు ఐవర్ రూకెల్.
ఆయన ఇక్కడే ఉంటారు.
వసంత కాలం రావడానికి కొన్ని రోజుల ముందు నుంచి ఆయన ప్రతిరోజూ ఉదయం లేవగానే బెడ్రూమ్ కిటికీ తెరిచి బయటకు చూస్తారు.
ఆయనకు ఇష్టమయిన రుతువు వచ్చిందో లేదో అని ఆశగా ఎదురుచూస్తుంటారు.
అదృష్టం బాగుండి, వాతావరణం అనుకూలిస్తే ఆయన సంతోషానికి అవధులు ఉండవు.
గబగబ టిఫిన్ చేసేసి ఒకలైఫ్ జాకెట్, తెడ్డు, కర్రలతో చేసిన తెప్పను తీసుకుని ఆ నీటి దగ్గరకు వెళతారు.
రూకెల్ పడవను నడుపుతూ ఆ నీటిలో మునిగిన పచ్చిక బయళ్లను దాటుకుంటూ ముందుకు వెళతారు.
ఈ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలంటే తెల్లవారుజాము సమయం బాగుంటుంది.
"నా చిన్నప్పుడు మా నాన్నగారితో కలిసి ఇక్కడకు వచ్చిన అనుభూతులు, నీటితో నిండిన అడవులను చూడటం నేనెప్పటికీ మర్చిపోలేను" అని రూకెల్ చెప్పారు.
"వడ్రంగి పిట్టలు చెట్ల బెరడును కొరికే శబ్దాలు, నీటిపై తేలియాడే పూలు, కొత్త రుతువులో వచ్చే గాలి పరిమళం, ప్రకృతి శబ్దాలు వింటుంటే పరమానందంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Ragnis Pärnmets/Getty Images
భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబితే చాలా మంది భయపడతారు.
ఇక భారీ వరదలు వస్తాయనే మాటే వినడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు.
కానీ ఇక్కడి వాళ్లు భారీ వర్షాలు పడాలని, వరదలు రావాలని కోరుకుంటారు.
ఎందుకంటే ఇలా భారీ వరదలు వచ్చినప్పుడు ఈ సూమా నేషనల్ పార్క్ నీట మునుగుతుంది.
మోకాలి లోతు వరకో మెడ లోతు వరకో కాదు.. దాదాపు 16 - 20 అడుగుల ఎత్తు వరకు నీరు నిలుస్తుంది.
అంటే ఆరు అడుగుల ఎత్తున్న ముగ్గురు మనుషులు సులువుగా మునిగిపోతారు.
పార్కులో ఎక్కడో లోతట్టు ప్రాంతంలో ఇంత లోతు నీళ్లు నిలుస్తాయనుకుంటే పొరపాటే.
ఏటా వరదల వచ్చే సమయంలో 8 కిలోమీటర్ల మేర ఇలా నీళ్లు నిలుస్తాయి.
ఐదు నుంచి ఐదున్నర మీటర్ల ఎత్తు వరకు నీళ్లు వస్తాయి.
ఎస్టోనియాలో ప్రతి ఏడాది శీతాకాలం తర్వాత ఈ ఫిఫ్త్ సీజన్ వస్తుంది.
అయితే, ఇదెప్పుడు వస్తుందో ఎవరూ ఊహించలేరు.
కానీ, సాధారణంగా ఇది వసంతకాలానికి ముందు మార్చి - ఏప్రిల్ నెలల మధ్యలో వస్తూ ఉంటుంది.
ఈ వరదలు వచ్చినప్పుడు తీరమంతా మునిగిన ఇళ్లు, ఆపిల్ తోటలు, బురదలో పైకిలేచిన దీవులు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Mart Vares/Visit Estonia
ప్రతి సంవత్సరం కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయంటారు రూకెల్.
ఆయన గత 27 సంవత్సరాలుగా ఇక్కడ తెప్పలు నడిపే గైడ్‌గా పనిచేస్తున్నారు.
"వరదలు వచ్చినప్పడు పడవను ఎక్కడ నడపాలో జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ, చల్లని నీటిలో పడవను నడపడంలో ప్రమాదం కూడా ఉంది" అని చెప్పారు.
ఈ వరదలపై పరిశోధన చేసిన మరో వ్యక్తిని అక్కడి వారు మిస్టర్ ఫ్లడ్ అని ముద్దుగా పిలుచుకుంటారు.
ఆయన అసలు పేరు ఆల్గీస్ మార్ట్సో.
ఆయన ఫిఫ్త్ సీజన్ టూరిజానికి నాంది పలికారు.
ఆయన సూమా నేషనల్ పార్కులో నీటి మార్గాల ప్రయాణ వివరాలను రూపొందించారు.
అయితే, వరదలు తగ్గిపోగానే ఈ మార్గాలు కూడా మాయమైపోతాయి.
ఎస్టోనియాలో ఐదవ రుతువులో వచ్చే వరదల గురించి ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తారని మార్ట్సో చెప్పారు.
ఈ వరదలు 5 మీటర్ల ఎత్తు వరకు ఉన్నప్పుడు "అమెజాన్ అడవుల్లో ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ మరుక్షణంలోనే నీళ్ల అడుగున రోడ్డు చూసినప్పుడు నేల మీద వెళ్తున్నట్లు అంతా విచిత్రంగా అనిపిస్తుంది" అని ఆయన చెప్పారు.
ఈ విచిత్రమైన మార్గాన్ని ఇటీవల కాలంలో కొన్ని వేలమంది ఎస్టోనియన్లు కనుగొన్నారు.
ఫ్లడ్, రూకెల్ కలిసి సూమా.కామ్ అనే వెబ్‌సైట్ నడుపుతున్నారు.
సాహస యాత్రికుల కోసం, సొంతగా పడవలు నడపాలనుకునే వారి కోసం ఈయన దగ్గర 40 కెనడా తరహా తెప్పలు ఉన్నాయి.
రూకెల్‌కి ఈ పార్కులో ప్రతీ అంగుళము తెలుసు.
వేసవిలో రాత్రిపూట పడవను నడపడం నుంచి ఉభయచరాలు తమ ఆవాసాలను కట్టుకోవడం వరకు అన్నీ ఆయనకు తెలుసు.
ఎస్టోనియాలో ఉన్న అతిపెద్ద మట్టినేలల్లో నడవడం కూడా ఆయనకు తెలుసు.
కానీ, అకస్మాత్తుగా దిగువ మాన్‌హటన్‌ను ముంచేసేంత వరద రావడం మాత్రం ఎప్పుడూ తెలియని ఉత్సుకతను కలిగిస్తూ ఉంటుంది.
సాధారణంగా ప్రతి ఏడాది 3 మీటర్ల ఎత్తు వరకు వరద నీరు వస్తుంటుంది.
కొన్నిసార్లు ఆయన నీటమునిగిన పచ్చిక మైదానాలలో చిక్కుకుపోయిన కొంగలు, హంసలు, కుక్కలను తెప్ప ద్వారా బయటకు తీసుకొస్తారు.
ఈ వరదలు రావడానికి ముందే ఇక్కడుండే తోడేళ్ళు, ఎలుగుబంట్లు ఇక్కడ నుంచి వెళ్లిపోతాయి.

ఫొటో సోర్స్, Sven Zacek/Visit Estonia
సూమా అంటే బురద నేలల ప్రాంతం అని అర్ధం.
ఈ ప్రాంతం సకాల అప్లాండ్స్ పశ్చిమ వాలులో లోతట్టు బేసిన్‌లో ఉంది.
సూమా ప్రాంతంలోనే నావెస్టి, హల్లిస్టే , రౌడ్న, కోపు, తోరమా వంటి నదులున్నాయి.
ఇవన్నీ సూమా దగ్గరే కలుస్తాయి.
నావెస్టి ఒకటే అక్కడ నుంచి ముందుకు ప్రవహించి బాల్టిస్టిక్స్ సముద్రంలో కలుస్తుంది.
చలికాలం తర్వాత కరిగిన మంచును తట్టుకునే శక్తి ఈ నదులకు లేదు.
ఈ పరిణామం వలన ఉత్తర యూరోప్‌లో అతిపెద్ద సహజ పరీవాహక ప్రాంతంగా చెప్పే 175 చదరపు కిలోమీటర్ల మేర రీసాఫ్లడ్ జోన్ ఏర్పడింది.
సూమా నేషనల్ పార్క్ ఇలా రూపాంతరం చెందటంలో దాని భౌగోళిక స్వరూపం కూడా మరొక ముఖ్య కారణం.
12,000 సంవత్సరాల క్రితం ఐస్ఏజ్ చివరి దశలో ఇదొక పురాతన సముద్ర గర్భం. ప్రస్తుత బాల్టిక్ సముద్రం అప్పుడు గడ్డకట్టి ఉండేది. పశ్చిమ ఎస్టోనియా కూడా మంచుతో కప్పి ఉండేది.
కరిగిపోతున్న హిమానీ నదాలు, గ్రేట్ డిప్రెషన్ వల్ల ఈ ప్రాంతాలు క్రమంగా బురద నిక్షేపాలుగా మారిపోయాయి.
"వేసవిలో సూమాలో సెకనుకు సగటున 5 నుంచి 10 క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహిస్తుంది" అని ఎస్టోనియా ప్రభుత్వ విభాగంలో హైడ్రాలజీ విభాగం అధిపతిగా పనిచేస్తున్న జానా పోల్డ్‌నుర్క్ చెప్పారు.
కానీ, ఐదవ రుతువులో మాత్రం ఈ నీటి ప్రవాహం సాధారణ సమయాల్లో కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో ప్రవాహం ప్రతి సెకన్‌కి 100 క్యూబిక్ మీటర్లు ఉంటుంది.
ఆమె సూమాలో వచ్చే వరదలను చాలాసార్లు చూశారు.
ఈ పార్కు నుంచి దగ్గరగా ఉన్న హైడ్రోలాజికల్ మానిటరింగ్ స్టేషన్‌లో పనిచేసే బృందాన్ని కూడా ఈమె పర్యవేక్షిస్తూ ఉంటారు.
చారిత్రక ఆధారాల ప్రకారం గత 100 సంవత్సరాల్లో అతి భారీ వరదలు 1930 - 1950 మధ్యలో వచ్చినట్లు ఆమె చెప్పారు.
"వరదలు వచ్చినప్పుడు ఎప్పుడూ ప్రమాదకరంగానే అనిపిస్తుంది. కానీ, దానితోపాటు ఒకరకమైన ఉత్సాహం కూడా ఉంటుంది" అని ఆమె అన్నారు.
ఒకసారి తెప్పపై వెళుతున్నప్పుడు ఎటుచూసినా నీళ్లే కనిపించి నది ఎక్కడ మొదలయిందో, ఎక్కడ అంతమయిందో కూడా అర్ధం కాలేదు. అదొక విచిత్రమైన భావన అని అన్నారు.

ఫొటో సోర్స్, Seikle Vabaks/Visit Estonia
అయితే, సూమాకి దగ్గరగా నివసించే వారి అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది.
1931లో భారీ వరదలు వచ్చినప్పుడు నీళ్లు 5.53 మీటర్ల ఎత్తు వరకు వచ్చాయని స్థానిక పత్రికలు రాశాయి.
స్థానికుల ఆత్మస్థైర్యం, పశువులకు తెప్పలుకట్టిన రైతులు, కొన్ని వారాల వరకు ఆహారాన్ని నిల్వచేసుకున్న ప్రజలు.. ఇలాంటి కథలను ప్రచురించాయి.
ఈ ప్రాంతంలో వరదలు వస్తే నేటి కరోనా వైరస్ లాక్‌డౌన్‌లాగానే అక్కడ ప్రజలు కూడా లాక్‌డౌన్‌కి సిద్ధంగా ఉంటారని ఆమె చెప్పారు.
ఈ ప్రాంతంలో అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించేవాళ్లు, రైతులు కలిసి 70 మంది వరకు ఉంటారు.
వీరంతా ఈ వార్షిక వరదలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.
ఇక్కడ రహదారులన్నీ నీటమునిగి, చాలామంది కనీసం 4 వారాల వరకు ఇళ్లకే పరిమితమైపోతారు.
ఈ ఐదవ రుతువుతో అనుబంధం ఉన్న వారికే ఈ పరిణామం అర్ధమవుతుంది.
అకస్మాత్తుగా చోటుచేసుకునే వాతావరణ మార్పులు, ఊహించని వరదలు ఇక్కడ ప్రజలను మరింత కట్టిపడేస్తాయి.
గత శతాబ్దంకంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయని పోల్డ్నర్క్ అంటారు.
"భవిష్యత్తులో ఇక్కడ ఆరవ రుతువు కూడా రావచ్చు" అని ఆమె అన్నారు.
నీటితో నిండిపోయిన అడవిలో తెప్పలు నడిపేవారిని చూడటం ఇక్కడ వినూత్నమైన దృశ్యం.
"ఇది నీటికి, సమయానికి, ప్రాంతానికి జరిగిన ఒక అద్భుతమైన వివాహం" అని రూకెల్ అంటారు.
ఒక్క క్షణం ఈ ప్రాంతం మరో అసాధారణ ప్రపంచాన్ని కళ్ల ముందు చూపించింది.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- 18 ఏళ్ల క్రితం పోలీసులు తనను మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లినపుడు మమతా బెనర్జీ ఏమని శపథం చేశారు
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









