ఆర్కిటిక్‌ మంచు ఎడారిలో అద్భుతమైన ‘స్ఫటిక నేత్రం’ చెప్తున్న రహస్యమేమిటి?

పింగ్వాలూట్ క్రేటర్

ఫొటో సోర్స్, Stocktrek Images/Getty Images

ఫొటో క్యాప్షన్, పింగ్వాలూట్ క్రేటర్
    • రచయిత, ఫీబీ స్మిత్
    • హోదా, బీబీసీ

మా విమానం రన్‌వే మీద దిగేటప్పుడు విమానం కుడివైపుకు ఒరిగింది. విమానంలో అలారం మోగింది. ఎమర్జెన్సీ డోర్ల మీద లైట్లు ఎరుపు రంగులో ఫ్లాషయ్యాయి. విమానం మైళ్లి పైకి ఎగిరింది. ఇంజన్ల శబ్దం పెరిగిపోయింది.

అది మంచు ఎడారి. క్యూబెక్‌లో ఉత్తరంగా చిట్టచివరి ప్రాంతం. న్యునావిక్ ఆ ప్రాంతం పేరు. బ్రిటన్‌కన్నా రెండు రెట్లు పెద్దది. ఇలాంటిదొకటి ఉందని ఇప్పుడు చాలా మంది జనానికి తెలీదు. కానీ ఒకప్పుడు అలా కాదు.

1950లలో ఈ ప్రాంతం పేరు ప్రపంచమంతటా పత్రికల్లో పతాక శీర్షికల్లో మార్మోగింది. ప్రపంచంలో ఎనిమిదో వింత అంటూ. ఇక్కడి విశిష్టమైన భౌగోళిక లక్షణం కారణంగా. ఆ మంచు ఎడారి దగ్గర మా విమానం మరోసారి రన్‌వే మీద దిగటానికి ప్రయత్నించింది. అదే పింగ్వాలూట్ క్రేటర్.

‘‘అతి తీవ్ర చలి వల్ల చర్మం మీద వచ్చే దద్దుర్లకు ఇనూక్టిటట్ భాషలోని పేరు పింగ్వాలూట్’’ అని వివరించారు ఇసబెల్ డ్యుబోయిస్. న్యునావిక్ టూరిజం ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆమె. చలికాలంలో ఈ క్రేటర్ మంచుతో కప్పుకుపోయి ఉన్నపుడు ఆమె ఈ ప్రాంతాన్ని సందర్శించారు.

వీడియో క్యాప్షన్, చంద్రుడిపై మిస్టరీ హట్ కనిపెట్టిన చైనా.. ఈ గుడిసె ఎవరిది? అక్కడ ఎందుకు ఉంది?

మా విమానం రెండోసారి దిగటానికి ప్రయత్నిస్తుండగా దాని నుంచి ధ్యాస మళ్లించటానికి నేను కిటికిలోనుంచి బయటకు చూశాను. ఇక్కడి మంచు ఎడారి నేలలో పగుళ్లు, చీలికలు, గుంతలు ఉన్నాయి. వాటిలో నీళ్లు నిండివున్నాయి. ఆ చీలికలు, పగుళ్ల నేలలో భారీ కందకం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

దాదాపు మూడున్నర కిలోమీటర్ల అడ్డుకొలత, పది కిలోమీటర్లకు పైగా చుట్టుకొలత ఉన్న ఆ క్రేటర్.. చాలా అందంగా కనిపిస్తోంది. దాదాపు కచ్చితమైన వృత్తాకారంలో ఉంది. నీటితో నిండివుంది. ఎవరో మహాకాయుడు తన అద్దాన్ని నేల మీద పడేశాడా అనిపిస్తుంది. ఆ అద్దంలో మా చిన్ని ట్విన్ ఓటర్ విమానం ప్రతిఫలిస్తోంది. ఏదో చిన్నపాటి మరక లాగా.

కొన్ని ఎగుడుదిగుళ్లు, మరిన్ని అలారం హెచ్చరికలతో అకస్మాత్తుగా నాటకీయంగా మా విమానం ల్యాండయింది. కందకం అంచుకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో. మేం మానార్సులిక్ క్యాంప్‌లో బస చేస్తాం. సౌర విద్యుత్‌తో నడిచే ఐదు క్యాబిన్లు ఉంటాయక్కడ. దేశంలో మారుమూలనున్న జాతీయ పార్కుల్లో ఒకటైన పింగ్వాలూట్ నేషనల్ పార్కులోకి వెళ్లే వారికి అధికారిక బేస్ క్యాంప్ కూడా ఇదే.

మేం విమానంలో నుంచి సామాన్లు దించుకుని వెచ్చని కాబిన్లలో కుదురుకున్నాం. పియెర్రి ఫిల్లీతో మాటలు కలిపాను. అతడు ఫ్రెంచ్ కల్చరల్ జియోగ్రాఫర్. ఆంత్రోపాలజీలో అతడికి చాలా ఆసక్తి ఉంది. న్యూనావిక్‌లో ఉత్తరంగా చిట్టచివరి ఆవాస ప్రాంతమైన కాంగిక్సుజువాక్‌లో నివసిస్తున్నాడు. నలబై ఏళ్ల కిందట అతడిని ఈ ప్రాంతానికి ఒక అసైన్‌మెంట్ మీద పంపించారు. అలా ఇక్కడికొచ్చిన ఫిల్లీ ఈ ప్రాంతంతో, ఈ ప్రాంతంలోని ఒక మహిళతో ప్రేమలో పడ్డాడు. మరి తిరిగి వెళ్లలేదు.

Markusie Qisiiq

ఫొటో సోర్స్, Phoebe Smith

ఫొటో క్యాప్షన్, పింగ్వాలూట్ పార్క్ డైరెక్టర్ మార్కుసీ క్వీసిక్

పింగ్వాలూట్‌కు చెందిన బ్లాక్ అండ్ వైట్ ఏరియల్ ఫొటోలు కొన్నిటిని నాకు చూపాడు. 1943 జూన్ 20వ తేదీన అమెరికా సైన్యానికి చెందిన వైమానిక దళ అధికారులు తీసిన ఫొటోలవి. ఈ క్రేటర్‌ను గుర్తించింది వాళ్లే. అప్పుడు ఈ క్రేటర్ గురించి ఆ అధికారులు ఎలా ఆలోచించి ఉంటారనే తలంపు నా మదిలోకి వచ్చింది. ఫిల్లీ ఈ కందకం గురించి మరిన్ని వివరాలు చెప్పటం మొదలుపెట్టాడు.

‘‘పశ్చిమ ప్రపంచానికి మొట్టమొదటిసారిగా ఈ కందకం కనిపించింది అప్పుడే. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో. ఫైటర్ విమానం పైలట్లు దీనిని చూశారు. తమ దారి గుర్తుపెట్టుకోవటానికి దీనిని ఒక చిహ్నంగా వాడుకున్నారు. కానీ యుద్ధం ముగిసే వరకూ వాళ్లు దీని గురించి మిగతా ప్రపంచానికి చెప్పలేదు’’ అని వివరించాడు.

ఈ క్రేటర్ గురించి 1950లో వాళ్లు ప్రపంచానికి చాటారు. అలా తెలుసుకున్న వారిలో ఆంటారియోకు చెందిన ఫ్రెడ్ డబ్ల్యూ చబ్ అనే వ్యక్తి దీని సౌందర్యానికి సమ్మోహితుడయ్యాడు. ఏదో అగ్నిపర్వతం వల్ల ఈ కందకం ఏర్పడి ఉంటుందని అతడి నమ్మకం. అంటే దాని లోపల వజ్రాలు ఉండే అవకాశముంది.

అతడు అప్పటి ఆంటారియో మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ మీన్ సలహా అడిగాడు. అతడు కూడా ఈ కందకానికి ఆకర్షితుడయ్యాడు. ఇద్దరూ కలిసి ఈ కందకం గురించి పరిశోధించటానికి ఇక్కడికి వచ్చారు. అందుకే ఈ కందకాన్ని కొంత కాలం చబ్ క్రేటర్ అని పిలిచారు. కానీ ఇది అగ్నిపర్వతం వల్ల ఏర్పడిందనే సిద్ధాంతం ఈ పరిశోధనతో రద్దయింది.

‘‘ఉల్కాపాతం వల్ల ఏర్పడిన కందకం ఇదని మనకిప్పుడు తెలుసు. అందులో సందేహం లేదు’’ అన్నారు ఫిల్లీ. సూర్యుడు పింగ్వాలూట్‌కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న మానారస్సులిక్ సరస్సు మీదుగా అస్తమిస్తున్నాడు. ఈ సాయం సంధ్యపు లేత గులాబీ వెలుగులో ఈ కందకం అస్పష్టంగా మారింది.

‘‘మనం దీనిని రేపు చూద్దాం’’ అన్నాడాయన.

పింగ్వాలూట్ క్రేటర్

ఫొటో సోర్స్, Phoebe Smith

ఫొటో క్యాప్షన్, పింగ్వాలూట్ క్రేటర్

మరుసటి రోజు సూర్యోదయాన రాళ్లూరప్పలతో కూడిన ఈ మంచు ఎడారిలో వాహ్యాళికి వెళ్లాం. ఆ రాళ్లలో కొన్ని చివరి మంచు యుగంలో ఉల్కాపాతానికి విరిగిపడిన నల్లరాతి శిథిలాలని, మిగిలినవి ఆ ఉల్కాపాతం వల్ల కరిగి ఏర్పడిన రూపాలని ఫిల్లీ వివరించాడు. అవి చిక్కటి నలుపు రంగులో ఉన్నాయి. వాటి మీద చిన్న రంధ్రాలున్నాయి. ఢీకొట్టినపుడు పుట్టిన వేడికి, ఒత్తిడికి అందులోని లవణాలు ద్రవీభవించి బుడగలుగా బయటకు వచ్చాయనేందుకు అవి చిహ్నాలు.

ఈ కందకం గట్టు ఎక్కుతుండగా.. ‘’14 లక్షల సంవత్సరాల కిందట ఆ ఉల్కాపాతం జరిగింది’’ అని ఫిల్లీ ధృవీకరించాడు. ఈ కందకం పొడవు, లోతు (400 మీటర్లు) చూస్తే.. హిరోషిమా మీద వేసిన అణుబాంబు కన్నా 8,500 రెట్లు ఎక్కువ శక్తివంతమైన పేలుడు సంభవించినట్లు అంచనా వేశారు’’ అని వివరించాడు.

చివరికి పింగ్వాలూట్ గట్టు చివరికి చేరుకుని కందకం లోపలికి తొంగి చూసినపుడు.. అది చాలా గుబులు రేకెత్తించింది. సరస్సు లోపలి భాగం మంచులా ఘనీభవించి మెరుస్తోంది.

‘‘పశ్చిమ ప్రపంచ ప్రజలు వజ్రాలు వెదుక్కుంటూ ఇక్కడికి రావటానికి ముందే దీని గురించి ఇక్కడి ఇనూట్లకు తెలుసు’’ అని చెప్పారు మార్కుసీ క్వీసిక్. ఆయన పింగ్వాలూట్ పార్క్ డైరెక్టర్, గైడ్ కూడా.

‘‘దీనిని వాళ్లు న్యూనావిక్ స్ఫటిక నేత్రం అని పిలుస్తారు’’ అని తెలిపారు.

నేనున్న చోటు నుంచి చూసినపుడు.. ఈ మంచు ఎడారిలో ఎన్ని దద్దుర్లున్నాయో అన్ని మేఘాలున్న నీలి ఆకాశం కింద ఈ కందకానికి ఆ పేరే సరిగ్గా సరిపోయిందని నాకు అనిపించింది.

Phoebe Smith

ఫొటో సోర్స్, Phoebe Smith

ఈ సరస్సు చుట్టూ తిరుగుతూ ఎగుడు దిగుడుగా ఉన్న నేల మీద నడుస్తుండగా.. ఫిల్లీలో అలజడి పెరిగిపోయింది. ఈ కందకం లోపలి నీళ్లు ఎంత స్పష్టంగా ఉంటాయనే దాని గురించి ఆయన మాట్లాడాడు. కేవలం వాన నీళ్లతో మాత్రమే ఇది నిండుతుంది. ప్రపంచంలో అత్యంత స్వచ్ఛంగా పరిగణించే నీళ్లలో ఇది రెండోదని చెప్పారు. అతి స్వచ్ఛమైన నీళ్లలో మొదటి స్థానం జపాన్‌లోని మాషు సరస్సుకు ఇచ్చారు.

ఈ సరస్సులో నివసించే ఆర్కిటిక్ చార్ చేపల గురించి కూడా ఫిల్లీ చెప్పుకొచ్చారు. అవి ఇందులోకి ఎలా వచ్చాయనే దాని మీద శాస్త్రవేత్తల్లో ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. ఈ కందకం లోపలికి కానీ, బయటికి కానీ వెళ్లే ప్రవాహమేదీ లేదు. ఈ చేపలు తమ స్వీయ మనుగడ కోసం తమ జాతినే తిని ఎలా బతుకుతున్నాయో ఫిల్లీ చెప్పారు. అంతేకాదు.. ఇనూట్లే కాకుండా వారికన్నా కనీసం వెయ్యేళ్ల ముందు మరో జాతి ప్రజలు ఇక్కడ సంచరించారనటానికి గల ఆనవాళ్ల గురించి వివరించారు.

‘‘ఈ ప్రకృతి చిత్రం ఓ పుస్తకం’’ అని ఆయన నిర్ధారించారు. ‘‘దీనిని చదవటానికి మనకు సమయం ఉంటే మనం తెలుసుకోవటానికి చాలా విశేషాలున్నాయి’’ అన్నారు.

సరిగ్గా అదే పని చేయటానికి ఇటీవలి కాలంలో ఇక్కడికి చాలా మంది వస్తున్నారు.

పింగ్వాలూట్ క్రేటర్

ఫొటో సోర్స్, Phoebe Smith

ఫొటో క్యాప్షన్, పింగ్వాలూట్ క్రేటర్

2007 చలికాలంలో క్యూబెక్‌లోని లావాల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం ప్రొఫెసర్ రీన్‌హార్డ్ పీనిట్జ్ సారథ్యంలో ఇక్కడికి వచ్చింది. ఈ నీటి అడుగు నుంచి నమూనాలు సేకరించింది. ఇదొక సైంటిఫిక్ టైమ్ కాప్స్యూల్ అని పీనిట్జ్ అప్పుడు అభివర్ణించారు. గడచిన కాలంలో వాతావరణ మార్పుల ఉదంతాల గురించి, ఆ ఒత్తిళ్లలో జీవావరణాలు ఎలా రూపాంతరం చెందాయనే దాని గురించిన రహస్యాలను ఇది వెల్లడించగలదని ఆయన పేర్కొన్నారు.

నేను నీటి అంచు వరకూ నడిచాను. ఫిల్లీ ఒక రాయి తీసుకుని.. ఘనీభవించిన సరస్సు మీదకు విసిరాడు. మంచు ముక్కలు ఒకదానికొకటి తగులుతూ గాలిలోకి లేవటంతో.. అప్పటివరకూ నిశబ్దంగా ఉన్న గాలిలో శ్రావ్యమైన ఝుంకారం నిండిపోయింది.

స్వచ్ఛమైన ఈ నీటిని రుచి చూడటానికి మా వెంట తెచ్చుకున్న సీసాల్లోకి సరస్సు నీటిని నింపుకున్నాం. తిరిగి మా క్యాంపుకు చేరుకున్నాం. మధ్యలో ఒకసారి ఆగాల్సి వచ్చింది. ధృవపు జింకల భారీ మంద అటుగా వెళ్తూ ఉండటమే దానికి కారణం. అందులో లెక్కకు మిక్కిలిగా ఉన్న జింకలను అలా చూస్తుండిపోయాం.

ఇక్కడ వజ్రాలు ఉండకపోవచ్చు. కానీ ఈ కందకం లోలోతుల్లో ఎన్నో కథలు, సైన్స్ సంగతులు దాగి ఉన్నాయి. ఎప్పటికైనా వెలుగు చూడటానికి.

వీడియో క్యాప్షన్, భూమి మీదున్న నరక ద్వారాన్ని చూశారా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)